Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

ఊరిని సమీపించిన దానికి గుర్తుగా కరెంటు స్తంభాలు కనిపించసాగాయి. కాని ఎక్కడా విద్యుద్దీపాలు వెలుగుతున్న జాడలేదు. ఎందుకనో ఇళ్ళళ్ళో ఇంకా చిమ్నీ బుడ్లే వెలుగుతూ కనబడు తున్నాయి. దీపాల వేళ కావడంతో చిమ్నీ దీపాలు వెలిగించి పెట్టారు. పాలు పితికే వేళ సమీపించడంతో ఉండుండీ లేగదూడల “అంబా” రవాలు వినవస్తున్నాయి.

పెద్దపెద్ద పాలకేన్లు సైకిళ్ళకు కట్టుకుని వచ్చి పాలుపోయించుకుంటూ తిరుగుతున్నారు, సిటీలోని పెద్దపెద్ద పాలవిక్రయ కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు. రాత్రి వంటల తాలూకు ఘుమఘుమలు వీధిలోకంతా వ్యాపించి, దారేపోయీవాళ్ళకి నోరూరిస్తున్నాయి. రామాలయం లోని గంటలు మ్రోగుతూ, భగవంతునికి భక్తులను అనుసంధాన పరుస్తున్నాయి.

ఒక వీధి మలుపు దగ్గర ఆగి, "అబ్బాయిగారు! ఇక ఉంటానండి, దయుంచండి. యాజులుగారికి రంగనాధం దండాలన్నాడని, అడంగుకెళ్ళాక మర్సిపోకుండా చెప్పండేం" అంటూ మరీమరీ చెప్పి రంగనాధం సెలవు తీసుకున్నాడు. రామారావు మాత్రం రామాలయం వరకూ వచ్చాడు.

"అబ్బాయిగారు! ఇంకొక్క పదడుగులు వెళ్ళేసరికి కరణంగారి ఇల్లు వచ్చేస్తదండి. అంతదాకా వచ్చేవాణ్ణేగానండి, పిల్లాడికి ఎలా ఉందో నని గుబులుగా ఉందండి, లేపోతే వచ్చేటోణ్ణే, ఆయ్!" ఎంతో అపాలజెటిక్ గా జీవన్ కి కరణం కామేశంగారి ఇంటికి గుర్తులు చెప్పి పంపాడు రామారావు.

"ఫరవాలేదు, తిన్నగా వెళ్ళడమేగా, నేను వెళ్ళగలను" అంటూ పెట్టె అందుకుని, ఇంతవరకూ తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలియజేశాడు జీవన్.

కాని, రామారావు పదడుగుల దూరం అన్నది ఒక కిలోమీటర్ దూరంగా తేలింది. చీకటి పడకముందే గమ్యాన్ని చేరుకున్నందుకు సంతోషించాడు జీవన్.

*        *        *

కరణంగారిది, ఎత్తరుగులతో ఉన్న పెద్ద పెంకుటిల్లు. ఇంటికి ముందువైపు విశాలమైన పెరడు ఉంది. పెరటి చుట్టూ పిట్టగోడ ఆవరించి ఉంది. దానికి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక గేటువుంది. ఆవరణ లోపల ఒక ఆవు, ఒక గేదె గుంజలకు కట్టబడి ఉన్నాయి. ఆవుకు పాలు పితికి, దూడను వదిలినట్లున్నారు, తెల్లని ఇస్త్రీ మడతలా ఉన్న లేగదూడ తల్లిదగ్గర పాలు కుడుస్తూ, అంతలోనే దొడ్డంతా పరుగులు పెడుతూ ఆడుతోంది. బరువైన పొదుగుతో గేదె, తనవంతు కోసం ఎదురుచూస్తూ, రాటచుట్టూ అల్లంగం తిరుగుతూ, దూరంగా కట్టబడివున్న తన లేగదూడవైపు ప్రేమగా చూస్తూ ఆరాట పడుతోంది.

గేటుదాటి లోపలకు వచ్చిన జీవన్ ని మోర పైకెత్తి క్షణం చూసి, కొత్తమనిషని గుర్తించిన ఆవుదూడ చెంగు చెంగున గంతులు వేసుసుంటూ దూరంగా పరుగెత్తుకుని వెళ్లిపోయింది. గేదెకు పాలు పిండడానికి తప్పేలా పట్టుకుని వచ్చిన కరణంగారి భార్య సీతమ్మగారు, జీవన్ ని చూసి, ఆశ్చర్యంగా అడిగారు, "ఎవరుబాబూ మీరు? ఎవరు కావాలి మీకు?"

"మల్లెవాడ కరణం, కామేశం గారి ఇల్లు ఇదేనాండి? నన్ను యాజులుగారు పంపారు" అన్నాడు జీవన్.

అరుగుమీద లాంతరు వెలిగించి పెట్టబడి ఉంది. కరెంటు లేకపోవడంతో ఏంచెయ్యడానికీ తోచక, అరుగుమీద పడకకుర్చీలో పడుకుని ఉన్న కామేశం గారు, యాజులు పేరు విని వెంటనే లేచి, అరుగు దిగి వచ్చారు...

"నువ్వా, రా బాబూ! నిన్ను పంపుతున్నట్లు యాజులు ఎప్పుడో ఉత్తరం రాశాడు. అతడు చెప్పిన నమ్మకస్తుడైన కుర్రాడివి నువ్వేనన్న మాట! సందేహించకు, లోపలకురా. ఇక్కడ ఉన్నన్నినాళ్ళూ ఇది నీ ఇల్లే అనుకో. మొహమాటం లాంటివేం వద్దు" అంటూ అరుగు దిగివచ్చి జీవన్ ని ఆహ్వానించారు కామేశం గారు.

ఇంతలో కరెంటు రావడంతో ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. అది ఎత్తరుగుల ఇల్లు కావడంతో, ఇంట్లోకి వెళ్ళడానికి చాలా చీడీలు ఎక్కవలసి ఉంది. జీవన్ పెట్టె పట్టుకుని, మెట్లన్నీ ఎక్కి నడుస్తూ, "యాజుల తాతయ్య మీకిమ్మని ఒక ఉత్తరం ఇచ్చారు, అదీ పెట్టెలో ఉంది, తీసి ఇస్తా" అన్నాడు.

"ఇద్దువుగానిలే, తొందరేం లేదు. ప్రయాణం బాగా సాగిందా? యాజులు గారింట్లో అందరూ కుశలమేనా? ఇప్పుడిలా చెరోదారీ అయ్యింది గాని, ఇక్కడున్నప్పుడు ఇద్దరం ఒక్క ప్రాణంగా ఉండేవాళ్ళం" అన్నారు కరణంగారు.

ఇంతలో చేతిలో గుమ్మపాల గ్లాసుతో వచ్చింది సీతమ్మ గారు. "బాబు! అలా ఆ కుర్చీలో కూర్చుని ఈ గుమ్మపాలు తాగు, దూరాభారం నుండి ప్రయాణం చేసి వచ్చావు, బడలి ఉన్నావు" అంటూ ఆ పాలగ్లాసు జీవన్ చేతికి అందించింది ఆమె.

నులివెచ్చగా, తెల్లని నురగలతోనిండి ఉన్నాయి ఆ పాలు. కొద్దిసేపటికి ముందుగా పితికిన ఆవుపాలవి. వాటిని కాచకుండానే తాగుతారు. పంచదార కలిపినట్లు తియ్యగా ఉంటాయి. ఆ పాలు తాగేసరికి ప్రయాణపు బడలిక చాలావరకు తగ్గినట్లు అనిపించింది జీవన్ కి.

"అమ్మా, జాహ్నవీ! అబ్బాయి స్నానానికి వేడినీళ్ళు తొరుపు తల్లీ" అంటూ కేకపెట్టారు కరణంగారు. ఆపై, జీవన్ వైపు తిరిగి, "భోజనాలవేళ ఔతోంది, నువ్వు స్నానం చేసి వచ్చాక భోజనం చేద్దాము. ఆ తరువాత తీరిగ్గా కుర్చుని, మాటాడుకోవచ్చు" అన్నారు ఆయన. పట్టాణ వాసులలా కాకుండా, పల్లెటూరిలో ఉండేవాళ్ళు చీకటి పడకముందే భోజనాలు చేస్తుంటారు.

జీవన్ పెట్టి తెరిచి, సబ్బు, తువ్వాలు తీసుకుని, పనిలో పనిగా యాజులుగారి ఉత్తరం తీసి కరణంగారికి ఇచ్చాడు.

కరణంగారు ఆ ఉత్తరాన్ని అందుకుంటూ, "నువ్వు ఎవరి అబ్బాయివి? అక్కడ ఏం పని చేస్తూంటావు? అమ్మా, నాన్నా, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అంతా కుశలమా" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

జీవన్ ఒక వెడనవ్వు నవ్వి, తాపీగా జవాబిచ్చాడు, "నేనంత అదృష్టవంతుణ్ణేమీ కాదండి. నా జీవిత చరిత్ర అంత ఇంపైనదీ కాదు. అయినా మీరు అడిగారు కనక చెపుతాను - నా తండ్రిని నేనెరుగను. నేనింకా రెండు నెలలకు పుడతాననగా యాక్సిడెంట్ లో చనిపోయారుట! మా అమ్మ యాజులుగారి ఇంట్లో వంటమనిషిగా ఉండి నన్ను పెంచింది. నేను డిగ్రీ చదివాను. గోల్డుమెడల్ తెచ్చుకున్నంత తేలికగా నాకు ఉద్యోగం తెచ్చుకోడం కుదర లేదు! అందుకని నేను నిరుద్యోగిగా ఉన్నాను" అన్నాడు.

అంతలో ఒక నాజూకైన కంఠం వినిపించింది, "నాన్నా! నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి, స్నానానికి రావచ్చు.”

జీవన్ ని తన వెంట రమ్మని చెప్పి, కరణంగారు దొడ్డివైపుగా నడిచారు.

వేడి వేడి నీళ్ళతో స్నానం చెయ్యడంవల్ల జీవన్ కి ప్రయాణం బడలిక తగ్గి హాయిగా ఉంది. ఆతను బట్టలుమార్చుకుని వచ్చేసరికి, వెండిపూల పీటలు వాల్చి, కొసలున్న లేత అరటాకులు పరిచి, బంగారంలా మెరుస్తున్న పెద్దపెద్ద కంచుగ్లాసులతో మంచినీళ్ళు ఉంచి, చిన్న చిన్న వెండి గిన్నెలతో అప్పటికప్పుడు కాచిన, సువాసనలు వెదజల్లే కమ్మని నెయ్యి విస్తళ్ళ పక్కన ఉంచి, విస్తరి కొసలో కొద్దిగా నూరిన ఉప్పు వేసి, వడ్డించడానికి సిద్ధంగా కనిపెట్టుకుని ఉంది ఆ ఇంటి ఇల్లాలు సీతమ్మగారు.

కామేశంగారు జీవన్ ని వెంట తీసుకుని వచ్చారు. ఇద్దరూ పీటలమీద కూర్చోగానే వడ్డన మొదలుపెట్టారు సీతమ్మగారు. ప్రత్యేకమైన అతిధి మర్యాదలతో ఆమె కొసరి కొసరి వడ్డిస్తుండగా షడ్రసోపేతమైన భోజనం - గడ్డపెరుగు, చక్కెరకేళీ అరటిపండుతో సహా తృప్తిగా తిని లేచాడు జీవన్. అతిధి మనల్ని మర్చిపోయినా మనం పెట్టిన భోజనాన్ని మరచిపోకూడదన్నది, గోదావరి జిల్లాలోని పల్లెటూరి వాళ్ళ అభిమతం మరి!

చేతులు కడుక్కు వచ్చిన జీవన్ కి తువ్వాలు అందిస్తూ కరణంగారు, "ప్రయాణపు బడలికతో ఉన్నావు, పెందరాళే నిద్రపో; వ్యవహారాలు రేపు మాటాడుకోవచ్చు" అన్నారు. ఆ తరువాత ఆయన జీవన్ కి మల్లెపూవులాంటి దుప్పటి పరచి ఉన్న పడక చూపించి తను పడుకునేందుకు వెళ్ళిపోయారు.

మంచాన్ని చూడగానే జీవన్ కి ఆవులింతలు వచ్చాయి. పక్కమీద తనువు వాల్చేసరికి కనురెప్పలు బరువుగా వుంది మూతలుపడ్డాయి. మరు క్షణంలో అతడు గాఢంగా నిద్రపోయాడు.

*         *        *

మరునాడు జీవన్ నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది. అంతవరకు లేవనందుకు అతనికి సిగ్గుగా తోచింది. వెంటనే మంచం దిగి, బ్రెష్ మీద పేష్టు వేసుకుని, టంగ్ క్లీనర్ తీసుకుని, నూతిదగ్గరకు పరుగెత్తాడు.

దొడ్డి అరుగు మీద కూర్చుని, తోటకూర బాగుచేస్తున్న అమ్మాయి అతని రాక చూడగానే, చేతిలోని పని విడిచి అదాటుగా లేచి ఇంటిలోకి వెళ్ళిపోయింది.

ఆ కొద్ది వ్యవధిలోనే జీవన్, క్షణంలో సగం సేపు ఆమెను ఆశ్చర్యంగా చూశాడు...

సరైన సంరక్షణలేక చెదిరిన జుట్టుతో, తెల్లని చీరలో, ఏ అలంకరణా లేకుండా ఉంది ఆమె. మొహంలో కనిపిస్తున్న అంతులేని దైన్యంతో తన సహజమైన రూపురేఖల్ని కనిపించనీకుండా మరుగుపరుచుకుంటూ, కనిపించిన ఆ అమ్మాయి, సాక్షాత్తూ తన తల్లికి ఒక "యంగ్ వెర్షన్"లా, చిన్నవయసులో ఉన్నప్పటి తన తల్లికి ప్రతిరూపంలా కనిపించింది జీవన్ కి!

జీవన్ పళ్ళుతోముకుని వచ్చేసరికి కాఫీ గ్లాసుతో ఎదురుగా వచ్చింది సీతమ్మ గారు. అప్పటి కప్పుడు పితికిన పాలతో కలిపిన చిక్కని ఫిల్టర్ కాఫీ అది!

అక్కడేవున్న కరణంగారు, "ఏమోయ్! నువ్వింకా రెండు - మూడురోజులు తప్పనిసరిగా ఆగాల్సి ఉంటుంది అనుకుంటా! ప్రతి ఉదయం మేజర్ గారు, ఆయన జాగిలం, మన రోడ్డు వెంబడే జాగింగ్ కి వెడతారు. మధ్యలో ఆపి నువ్వు వచ్చావని చెప్పాను. ధాన్యం మిల్లుకి వేసి రెండురోజు లయ్యిందిట! కాని మొత్తం డబ్బు చేతికి రావడానికి మరో రెండు - మూడు రోజులు పట్టొచ్చు - అంటున్నారాయన. అంతవరకూ నువ్వు ఆగక తప్పదు" అన్నారు.

"మరీ అన్నాళ్ళా! మీకు ఇబ్బంది కదా ..." అంటూ నసికాడు జీవన్.

అతణ్ణి మాట పూర్తిచెయ్యనివ్వలేదు కామేశం గారు, ''వేడినీళ్ళకు ఇళ్ళు కాలవురా అబ్బాయీ! ఒక అతిధిని నాలుగు రోజులపాటు ఇంటిలో ఉంచుకోలేని గృహస్థూ ఒక గృహస్థేనా" అంటూ తెగనొచ్చుకున్నారు ఆయన.

ఏమి చెప్పాలో తోచక మాటాడకుండా ఉండిపోయాడు జీవన్.

మళ్ళీ కరణంగారే అన్నారు, "ఇదిగో బాబూ! అంత దూరం నుండి వచ్చావు, పని పూర్తి చేసుకుని గాని వెళ్ళే ప్రసక్తి లేదు. చూసి ఆనందించగల మనసే ఉండాలిగాని, పట్నంలో ఎంత వెతికినా కనిపించని విశేషాలెన్నో ఈ పల్లెల్లో కనిపిస్తాయి. మన పాలేరు మల్లేశు తోడొస్తాడు, ఊరంతా తిరిగి చూడు, నీకు మంచి కాలక్షేపంగా ఉంటుంది. మళ్ళీ ఇటువైపు ఎప్పుడొస్తావో!"

రెండు మూడు రోజులు ఉండాల్సివచ్చినా కూడా, ఉండి పని పూర్తిచేసుకు మరీ రావాలి సుమీ - అన్న యాజులుగారి మాటలు గుర్తొచ్చాయి జీవన్కి. ఇంతలో లోపలి గదిలోనుండి గుక్కపట్టి ఏడుస్తున్న పసిపిల్ల ఏడుపు వినిపించింది, పాపం! పక్క తడుపుకుందో ఏమో...

వెంటనే, "ఇప్పుడే వస్తాను" అంటూ కరణం గారు, లోపలకు వెళ్ళారు. తిరిగివస్తూ ఆరు నెలల పసిపాపను ఎత్తుకుని వచ్చారు.

పిల్ల చాలా ముద్దుగా ఉంది. పండిన జామిపండురంగులో ఉన్న పాల బుగ్గలు, కాంతివంతమైన పెద్ద పెద్ద కళ్ళు, చిన్ని లక్కచిట్టి లాంటి తీరైన నోరు, చిరునవ్వుతో విచ్చుకునే గులాబీ రంగు పెదవులు, చంద్ర బింబాన్ని ఆవరించిన చిరుమేఘాల్లాంటి ముంగురులు పాప ముఖమంతా పరుచుకుని ఉన్నాయి. చూసినకొద్దీ చూడాలనిపించే ముద్దులు మూటకట్టే రూపం పాపది!

"ఇక నా కాలక్షేపానికి లోటేం ఉండదు, ఈ పాపతో ఆడుకుంటే చాలు" అనుకున్నాడు జీవన్, పాపను అందుకోడానికి చేతులు ముందుకు చాపుతూ.

చాపి ఉన్న చేతుల్లోకి కొత్త తెలియని ఆ పాపను అందిస్తూ, "నా మనుమరాలు బాబూ! అదో పెద్ద కథ!" అన్నారు కరణంగారు. అలా అంటున్నప్పుడు ఆయన కళ్ళలో కదిలిన బాధా వీచిక జీవన్ దృష్టి నుండి తప్పించుకు పోలేదు.

పై గుడ్డతో కళ్ళూ మొహం నొక్కి తుడుచుకుని కామేశంగారు చెప్పసాగారు, "నాతల్లి జాహ్నవి! ముగ్గురు కొడుకుల తరవాత, ఇంక పిల్లలు పుట్టరు - అనుకునే తరుణంలో అపురూపంగా పుట్టిన ఒక్కగానొక్క కూతురు. అవతలి వాళ్ళ అబద్ధపు మాటలు నమ్మి, అన్నివిధాలా మంచి సంబంధమని భ్రాంతి పడి, జాహ్నవి, "అప్పుడే నాకు పెళ్లి వద్దు నాన్నా! చదువుకుంటా"నని ఏడుస్తున్నా పట్టించుకోకుండా, బలవంతంగా దాని మెడలువంచి మరీ పెళ్లి చేశాము. వాళ్ళ భోగ భాగ్యాలన్నీ ఉట్టి మేడిపండు వాటమని తరవాత తెలిసింది. ఆస్తికి మించిన అప్పులున్నాయి. ఉంటే ఉన్నాయి పోనీ - అని సరిపెట్టుకుందామన్నా, అతని బుద్ధైనా మంచిది అయ్యింది కాదు! ఆ అబ్బాయికి లేని వ్యసనాలు లేవు. ఒకసారి, రాత్రిపూట బైక్ మీద క్లబ్బునుండి ఇంటికి వస్తూ, పూటుగా తాగివుండడం వల్ల యాక్సిడెంటు చేసి అక్కడి కక్కడే ప్రాణాలు విడిచిపెట్టాడు. మా అమ్మాయి అప్పటికి గర్భవతి అయ్యి వుండకపోయినట్లైతే, "పీడాపోయింద"ని సరిపెట్టుకుని ఉండే వాళ్ళ మేమో! ఆ కొద్ది రోజులలోనే మా ప్రాణం అంత విసికిపోయిందంటే నమ్ము! అదక్కడితో అయ్యిందా - అంటే, అదీలేదు... కరువులో అధిక మాసంలా కవలలు పుట్టారు. ఒకబ్బాయి, ఒక అమ్మాయి! ఏం చెయ్యగలము చెప్పు, ఏడవడం తప్ప! అంతా మా కర్మ, దాని తలరాత - అనుకొని అనుభవించడమే మా వంతు అయింది." అంటూ తలమీద చేత్తో టపటపా కొట్టుకున్నారు కరణంగారు.

తన తల్లి తలపుకి రావడంతో, జాహ్నవి దుఃస్థితికి జీవన్ మనసు ద్రవించింది. వెంటనే అతని మనసులోకి ఒక ఉదాత్తమైన ఆలోచన వచ్చింది ...

అందరి ఆడవాళ్ళలాగే తన తల్లి కూడా సుమంగళిగా జీవించాలనే కోరిక తనకి ఉన్నా, తన తల్లికి మాత్రం జీవితాన్ని మార్చుకోడం అన్నది సుతలాం నచ్చదు. పెద్దలు చూపిన దారినే పోతాననీ, ఏ సంస్కరణకీ ఒప్పుకోననీ తెగేసి చెప్పేసింది కూడా! ఆ తల్లికి బిడ్డయిన తాను, కనీసం - తన తల్లి బ్రతుకులాగ అగచాట్లమారి బ్రతుకు కాకుండా, బాల వితంతువైన మరే అమ్మాయికైనా సాయపడితే బాగుంటుందికదా - అని ఎప్పుడో అనిపించింది జీవన్ కి. ఇప్పుడు, జాహ్నవికి మంచి జీవితం దొరకాలంటే, ఆమెకు తాను తనకి చేతనైన సాయం తప్పక చెయ్యాలి - అనుకున్నాడు అప్పటికప్పుడే. కాని ఇప్పుడు తను నిరుద్యోగి, అన్నివిధాలా అసమర్థుడు! మనసులోని మాట పైకి అనగల సమర్ధత తన కిప్పుడు ఏమాత్రం లేదు. కోపంలో అన్నా తన తల్లి నిజమే చెప్పింది, "తా దూర కంత లేదు, మెడకో డోలుట! ఈ స్థితిలో తనది సబబైన ఆలోచనకాదు. అది కుదిరేపని కాదు. ఇప్పుడు తనున్న స్థితిలో తాను నోరు మెదపకుండా ఉండడమే మంచిది” అనుకున్నాడు."

ముందుగానే లేనిపోని ఆదర్శాలు వెళ్ళబోసి, అపహాస్యాల పాలవ్వడం కన్న, కిరణ్ చెప్పినట్లు, తగిన సమయం కోసం ఎదురు చూడడమే తనకు మంచిది - అనే నిర్ణయానికి వచ్చిన జీవన్ మనసు కుదుట పరుచుకున్నాడు.

కాని, అలాగని మరీ ఊరుకోలేకపోయాడు. "అమ్మాయిగారిది మరీ చిన్నవయసుకదా, మళ్ళీ వివాహం చెయ్యడమో, లేదంటే చదివించడమో బాగుంటుంది కదండీ!" అన్నాడు భయం భయంగానే.

కామేశంగారు, జీవన్ అనుకున్నట్లుగా కోపగించుకోలేదు. తన మనోవేదన వెల్లడించే గొప్ప అవకాశం ఇన్నాళ్ళకు తనకు దక్కిందన్నట్లుగా మనసులోమాట జీవన్ తో చెప్పసాగారు...

****సశేషం****

Posted in April 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!