Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-127 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-127

వీక్షణం-127 వ సాహితీ సమావేశం మార్చి 11, 2023 న  ఆన్ లైనులో జూమ్ సమావేశంగా ఆద్యంతం వేడుకగా జరిగింది. ఇందులో అమెరికా, భారతదేశాల నుంచి అతిథులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి ప్రారంభోపన్యాసం చేసి, సభలోని వారందరికీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో రెండు ముఖ్యమైన ప్రధాన విశేషాలున్నాయి. మొదటిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాగా, రెండవది ఉగాది వేడుక. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ కొండపల్లి నీహారిణి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెచ్చెలి ప్రచురణల "అపరాజిత" గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వ సంకలన పరిచయం చేసారు. సభను మృత్యుంజయుడు తాటిపాముల గారు నిర్వహించారు.

నీహారిణి గారు స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న'అపరాజిత' అంటూ ఉపన్యాసాన్ని ప్రారంభించి "కవిత్వం ఎమోషన్స్ ను, ఇమేజేనేషన్ ను, థాట్స్ ను అంతర్భాగంగా కలిసి ఉండడంతో పాఠకులలో భావోత్ప్తేరణ కలిగించడంలో సఫలీకృతం కావాలి. అదే గొప్ప కవిత్వం అవుతుంది. గొప్ప కవిత్వం అంటే ఆ కవిత చెప్పే సంవేదన ఏమిటి ? పాఠకులకు వస్తువు విశేషాలను సరిగ్గా చేరవేయడం అనేది ముఖ్యమైనటువంటి విషయం. 'అపరాజిత' కవితా సంపుటిలో స్త్రీల సంవేదన అక్షరాక్షరంలో కనిపిస్తుంది. డాక్టర్ కె. గీత 'అపరాజిత' కవితల సంకలనాన్ని ప్రతిష్టాత్మకంగా ముద్రించి, ఆవిష్కరణ సభ నిర్వహించి సాహిత్య రంగంలో ఒక అలజడిని సృష్టించింది. ఒక హల్చల్ ని చేసింది. యస్! కచ్చితంగా ఇది అలజడే, కచ్చితంగా ఇది హల్చలే! స్త్రీవాదం ఎక్కడుంది పత్తా లేకుండా పోయింది అని ఒక అణచివేత స్వరంతో మాట్లాడిన వాళ్ళకి ఒక ధిక్కార స్వరం వినిపించింది.

స్త్రీవాదం అనగానే రకరకాల అభిప్రాయాలను రకరకాల అనుమానాలను రేకెత్తించి ఆ మాట ఎత్తడానికే భయపడేలా సాహిత్య విమర్శకులు కొందరు చేయడం వలన కవయిత్రులు కూడా అదే నిజమో ఏమో అని నమ్మే ఒక ఆపదలో పడిపోయారు. కానీ కవయిత్రులంతా కూడా సందర్భం వచ్చినప్పుడల్లా తమ గొంతుకను వినిపిస్తూనే ఉన్నారు! వాళ్ళు రాసే కవిత్వంలో ఉన్న తమ బాధనే స్త్రీవాద కవిత్వం అని అనుకోలేదు, అలా అనుకోకుండా చేశారు సాహిత్య విమర్శకులు! ఘాటైన పదాలతో రాస్తేనే స్త్రీవాదమేమో అనుకుని, పురుష అహంకారాన్ని, పితృస్వామ్యాన్ని చిన్న చిన్న భావాలలోఎత్తి చూపే కవిత్వమంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేదు.తాను కోల్పోతున్న జీవితంలోని అంశాలను చూపేదంతా స్త్రీవాద కవిత్వమే అని అనుకోలేని పరిస్థితిలో పడిపోయారు.

అపరాజిత సంకలనంలో చిత్రించిన కవిత్వం అంతా స్త్రీ జీవితమే! పాఠకులను తప్పకుండా ఆలోచనలో పడేసే కవిత్వమే. 1993 నుండి 2022 వరకు ఉన్న స్త్రీల కవిత్వం ఇందులో ఉన్నది. 93 మంది కవయిత్రులు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ సంకలనానికి తన అభిప్రాయాన్ని రాస్తూ, గీత "మౌనాన్ని బద్దలు కొట్టే అపరాజిత" అని అనడం ఎంతో సబబైన మాట!

శిలాలోలిత తన అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేస్తూ, "అపజయం ఎరుగని అవిశ్రాంత గీతం" అనడం సత్య దూరమైంది కాదు. మానవ జీవన సౌందర్యాన్ని ఒడిసి పట్టుకున్న పిడికిళ్ల  సమూహం ఇది అని శిలాలోలిత చెప్పడం లో సామాజిక కోణమే కనిపిస్తుంది. స్త్రీవాదమంటే పురుష ద్వేషం కలిగించడం అని కాదు అనీ, ఒక సమయోచిత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రాశారు. ఈ అపరాజితలో కవితలన్నీ అలాగే ఉన్నాయి.

ఇంకా స్త్రీవాదం గురించి చెప్పాల్సి వస్తోంది రాయాల్సిస్తోంది అని ఒక ఆలోచనలో పడేసే సందర్భంలో ఉన్నాం మనం. మానవత్వం మంట కలిసిపోతున్న రోజులు కదా తప్పదు! కాత్యాయని విద్మహే గారు అపరాజిత కవితా సంకలనానికి ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశారు. ఈ పుస్తకానికి చివరలో ఉన్న "స్త్రీవాద కవిత్వ అడుగుజాడలు" అనే ఈ ఆర్టికల్ ఒక్కటి చాలు ఎక్కడెక్కడ ఏఏ రూపాలలో స్త్రీలు వివక్షకు గురి అవుతున్నారు ఎక్కడెక్కడ వివక్షలను కవయిత్రులు ఎండగట్టారు అనేది తెలుస్తుందని. దేశాలు జాతులు స్వతంత్రం అవుతున్న స్త్రీలు ఎందుకు స్వతంత్రులు కాలేరు అన్న ప్రశ్నతో అందుకు అవరోధంగా ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక కారణాల శోధనలో పితృస్వామ్యం ఒక బలమైన శక్తిగా అర్థమైన చోట స్త్రీవాదం పుట్టింది" అంటూ,"కుటుంబం కులం మతం రాజ్యం మొదలైన వ్యవస్థల ద్వారా స్త్రీ శరీరాన్ని చైతన్యాన్ని జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది." అంటూ "నాకు తెలిసినంతవరకు స్త్రీలందరి జీవితాలలో అడుగడుగునా ముళ్ళు సంకెళ్లే" అని చెప్పిన గీత, స్త్రీవాదం పని అయిపోలేదని కొత్త అస్త్రాన్ని ధరించి పోరాటంలో ముందుకు సాగుతూనే ఉందని తెలియజేయడానికి అపరాజిత ముందుకు వచ్చిందని అనడం వందకు వంద శాతం నిజం. తనదైన ధిక్కర స్వరంతో ఈ 'అపరాజిత' చరిత్రను సృష్టించింది అనడం అతిశయోక్తి కాదు. స్త్రీవాద గొంతుకను బలంగా వినిపిస్తున్న ఈ అపరాజిత స్త్రీ అస్తిత్వ గ్రంథం." అంటూ ఉధృత ప్రవాహంలా ప్రసంగించి, ముగించారు.

ఆ తరువాత డా. మీరా సుబ్రహ్మణ్యం, ఇంద్రాణి పాలపర్తి, వసుధారాణి అపరాజిత పై ఆత్మీయవాక్యాలు తెలియజేసారు.

తరువాత డా కె.గీత వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా ఫిబ్రవరి నెలలో గెలుపొందిన కవి ప్రసాదరావు రామాయణం గారిని అభినందించి, అవార్డుని అందజేశారు.

ఆ తరువాత రావు తల్లాప్రగడ గారి అధ్యక్షతలో జరిగిన ఉగాది కవిసమ్మేళనంలో సీతారామరాజు, డా. మీరా సుబ్రహ్మణ్యం, ఇంద్రాణి పాలపర్తి, వసుధారాణి, డా. నీహారిణి కొండపల్లి, డా.కె.గీత, దాలిరాజు వైశ్యరాజు, ప్రసాదరావు రామాయణం, రాజేంద్ర ప్రసాద్ గుండ్లపల్లి, డా. అరుణ కోదాటి, కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, మారుతి తన్నీరు, తాటిపర్తి బాలకృష్ణారెడ్డి, లలితావర్మ, సూర్యకుమారి మానుకొండ, డా. కందేపి రాణీ ప్రసాద్, బంతికట్ల నాగేశ్వరరావు, భవాని ముప్పల, ఆచార్య అయల సోమయాజుల ప్రసాద్, శాస్త్రి కన్నేపల్లి, కుడికాల వంశీధర్, చీదెళ్ల సీతాలక్ష్మి, శారద కాశీవఝల, రాజశేఖర్ తదితరులు పాల్గొని తమ కవితల్ని  వినిపించారు. ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in April 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!