Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్
Thiruvalluvar
Kmm.azzam, CC BY-SA 3.0, via Wikimedia Commons

అలాగే ఆయన నిందను స్తుతిని ఏకంగా భావించే సమ దర్శనాన్ని కలిగినవాడే నిజమైన పండితుడని గీతోపదేశం లా వర్ణించారు. బ్రాహ్మణులంటే ఎవరు? ఇతరులను హింసించకుండా ధార్మిక ప్రవృత్తి తో సంచరించే వాడే బ్రాహ్మణత్వాన్ని కలిగిన మనుష్యుడు అంటున్నారు తిరువళ్ళువర్.

అందణర్ ఎ ణ్బోర్ అరవోర్ మట్ట్రెంబుయుర్ర్కుం
సెందణ్మై ఎండొలు గళాన్ -౩౦

అదేలా జ్ఞాని యొక్క ఉపదేశాన్ని చూడు, ప్రతిభను చూడు జాతిని కాదు అన్నారు.

విశ్వమంతటా వున్న విలువైన తత్వం (అణ్ బు)  ప్రేమ మాత్రమె అని చెబుతూ వళ్ళువర్  “ప్రేమ చాలా పవిత్రమైనదని, అది లేని వారు ఎముకల గూడు తో కూడిన శరీరం కలవారు, అంటే ప్రేమ భావన లేకుండా సంచరించే మనుష్యుడు ఎముకల గూడు తో నిండిన మాంసంతో తిరిగే అస్థిపంజరం అని చెప్పారు. ప్రేమ ద్వారానే మనిషి తమ కోమల భావాలను శబ్దాలతో వెల్లడిస్తాడని చెప్పారు. ఆయన కురల్ 70 నుండి 80 వరకు పవిత్రమైన ప్రేమను గూర్చి ప్రస్తావించారు . మరి మన తెలుగు కవి వేమన దీని గురించి చెప్తూ

ప్రియము లేని విందు పిండివంటలు చేటు
భక్తి లేని పూజ పత్రి చేటు ....అన్నారు .అంతేకాదు

‘ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల’ అన్న పద్యంలో మనసును నిర్మలంగా ఉంచుకుని ఉండమని పదే పదే చెప్పారు.

సత్యాన్ని తపస్సుతో పోలుస్తూ రాసిన పద్యాలు భారతీయ సాహిత్యంలో కోకొల్లలు. తిరువళ్ళువర్ సత్యాన్ని వాచిక తపస్సుతో పోల్చారు.

(తులన : అనుద్వేగకరం వాక్యం ,సత్యం ప్రియ హితం .. గీత).

నోటి నుండి వెలువడే ప్రతీ మంచి మాట వాచిక తపస్సుతో సమానము .అందుకే సత్యాన్ని మాత్రమే మాట్లాడాలని ముగ్గురూ చెప్తున్నారు. వళ్ళువర్ సత్యాని గొప్ప వాచిక తపస్సుగా భావించారు. ఈ జగత్తులో వున్న అన్ని కాంతి పుంజాలకంటే, అంటే ప్రకాశాన్ని కాంతిని ఎగజిమ్ముతున్న వాటికంటే, సత్యవాది యొక్క సత్యం సూర్యుడి కంటే చంద్రుని కంటే ప్రకాశావంతమైనదని నొక్కి చెప్పారు.

ఎల్లా విళక్కుం విళక్కల్ల సాంరోరుక్కు
పొయ్యా విళక్కే విళ క్కు -౨౯౯
(తులన :కబీరు - “సాంచ్ బరాబర్ తప్ నహి ,ఝూట్ బరాబర్ పాప్
జాకే హిరదే సాంచ్ హై,తాకే హిరదే ఆప్”

(సత్యానికి మించిన తపస్సు లేదు అసత్యానికి మించిన పాపము లేదు. సత్యం ఎవరైతే పలుకుతారో, వారి అంతరంగంలో ఆ దేవదేవుడు పరమాత్మ కొలువై ఉన్నాడు).

తిరువళ్ళువర్ గొప్ప అహింసా వాది. అందుకే ఆయన సమస్త ప్రాణులలో ఉన్న పరమేశ్వరుని గుర్తించిన మహోన్నత వ్యక్తి. సకల చరాచరoలో నిండి ఉన్న కరుణామయుడైన ప్రేమ స్వరూపి అయిన భగవంతుని దర్శించిన మహానుభావుడు.

ఒక జీవిని హింసిస్తే ఆ భగవంతుణ్ణి హింసించినట్లే అని చాటిచెప్పారు. పశువులను జంతువులను చంపి వాటి కొవ్వుతో తన శరీర కండరాల కొవ్వును పెంచు కొనే మాంసాహారుల కొరకు “పులాల్ మరుత్తల్” అనే అధ్యాయాన్ని రాశారు. మాంసాహారాన్ని వీడమని పదే పదే చెప్పారు. జీవిని చంపేవాడికి ఎప్పుడూ మోక్షము దొరకదు జీవిని చంపి, దాన్ని భక్షించి తమ శరీరంలో కొవ్వును పెంచుకోవడం ఎంత అవివేకం! అని అంటున్నారు. నోరులేని ప్రాణులను ప్రేమించాలే తప్ప వాటిని తినడం ఎంత పాపం!

ఇలాంటి వారిని యమధర్మరాజు ఖచ్చితంగా శిక్షిస్తాడు అంటున్నారు. వళ్ళువర్ అహింసా ప్రియుడు. మానవులను ప్రేమించే వ్యక్తిత్వం కలవాడు.

మాంసాహార నిషేధానికి తిరువళ్ళువర్ పులాల్ మరుత్తల్ అనే అధికారంలో మాంసాహారాన్ని ఖచ్చితంగా  నిషేధించాలని చెబుతూ సకల ప్రాణులను ప్రేమించాలని బోధించారు. కురళ్  321 నుండి 330 వరకు అహింసా తత్వాన్ని ప్రతిపాదించారు. తన శరీరంలో కొవ్వును పెంపొందించుకోవడానికై ఇతర ప్రాణులను చంపి తినేవాడికి పరలోకంలో మోక్షం వుండదు అన్నారు. శత్రువును కూడా ప్రేమతో చూడమని చెప్పే కరుణ పూరిత హృదయం కల దయార్ద హృదయం గల కవి దైవ పులవర్ వళ్ళువర్. ఒక వేళ చంప దగినట్టి శత్రువు చేతికి దొరికినా కీడు చేయవద్దు అని మన వేమన అంటే, వళ్ళువర్ “నీకెవరైనా అపకారం చేస్తే అందుకు బదులుగా వాళ్లకు నీవు ఉపకారం చేయి, దానివల్ల వారి మనస్సు సిగ్గుతో తలవంచుకుంటుంది అంటున్నారు.

“ఇన్నా సేయ్దారై ఒరుత్తల్ అవర్ నాణ
అవర్ నాణ నన్ణ్యం సేయ్దు విడేల్”-౩౪౭

ఇది శత్రువులను సైతం సిగ్గుతో తల వంచుకునేలా చేస్తుంది.

అగ్రకులాల ఆధిపత్యం వున్న తమిళనాడులో సామాన్య ప్రజలు ఆయన పద్యాలను వేద సూక్తులుగా గౌరవించారు.

ఆయన రచనలో ఆనాటి సమాజపు సాంఘీక పరిస్థితులు, నీటి సిద్ధాంతాలు ప్రతిబింబిస్తున్నాయి. వళ్ళువర్ రచనలో విప్లవం లేదు. ఇది చెయ్యాలి, ఇది చెయ్య గూడదు, తప్పు అని నొక్కి చెప్పారు. ఆయన రచన సాత్వికతో గూడిన చక్కెర గుళిక. పంచమ వేదం. ఆ రచన చదివితే జీవితంలో చేసిన చిన్న చిన్న తప్పులు కూడా గుర్తుకు వచ్చి క్షమాయాచన చేయాలనిపిస్తుంది.

వళ్ళువర్ కూడా తనకు ఉపమానము లేనివాడు జగత్తు అంతా నిండి వున్న భగవంతుడు అన్నారు. ఏ మతానికి చెందిన దేవుల పేర్లను ప్రయోగించలేదు. ఆయనను నిర్గుణ వాదిగా అభివర్ణించినా ఆయన రచనలో రెండు మూడు చోట్ల శ్రీ కృష్ణుని గురించి మహా విష్ణువు గురించి చర్చించి వున్నారు. అందుకే ఆయన షీలా విభూతితో శైవుడిలా దర్శన మిస్తుంది. ఈనాడు రాజకీయ వేత్తల కుత్సిత బుద్ధితో ఆయనను హిందువు లాగా కాక వేరే విధంగా చిత్రిస్తున్నారు.

శాకాహారపు మహిమ, అహింసను, సత్యాన్ని ఆయన స్వీకరించారు. పిసిని గొట్టులను, మూర్ఖుల స్వభావాలను విమర్శించేటప్పుడు ఆయన శైలి వ్యంగ్య పూరిత హాస్యరస పదాలతో నిండి వుంటుంది.

****సశేషం****

Posted in April 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!