Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

ప్రాచీన తెలుగు సాహిత్యం

ప్రాచీన తెలుగు సాహిత్యమంటే ఆధునిక తెలుగు సాహిత్య యుగానికి పూర్వం ఉద్భవించిన తెలుగు సాహిత్యమని కాదు ఉద్దేశం. చారిత్రకంగా ప్రాచీన యుగంగా వర్గీకరించబడ్డ కాలంలో ఏమైనా తెలుగు సాహిత్యం ఉన్నదా అని పరిశీలించడమే ఈ వ్యాసం యొక్క లక్ష్యం.

సామాన్య శకానికి కొన్ని వందల ఏండ్ల నుండీ తెలుగు స్వతంత్ర భాషగా ఉనికిలో ఉన్నప్పటికీ పదకొండొవ శతాబ్దంలో నన్నయ నుండే తెలుగు సాహిత్యం లభ్యమవుతుండడం తెలుగు వారి దురదృష్టం. ప్రాచీన కాలంలో వెలసిన తెలుగు సాహిత్యపు శకలాలే గానీ శిథిలాలు సైతం మిగలకపోవడం శోచనీయం. మిగిలిన ఈ శకలాలను పరిశీలించడం సహితం బహు ఆసక్తిదాయకం.

నన్నెచోడుడు అనే చోళరాజు కుమార సంభవము అనే కావ్యము రాశారు. వీరు పదకొండొవ శతాబ్దం ద్వితీయార్ధంలో ఉండిరని పరిశోధకుల అభిప్రాయము. నన్నెచోడుడు దేశీయ కవిత్వాన్ని తెలుగులో తొలిగా వెలయించినవారు చాళుక్య రాజులని తన కావ్యములో తెలిపినారు.

"మును మార్గకవిత లోకంబున
వెలయఁగ దేశి కవిత బుట్టించి తెనుఁగున
నిలిపి రంధ్ర విషయంబున
జన చాళుక్య రాజు మొదలుగ బలువుర్"

నన్నయకు కొన్ని వందల ఏండ్ల పూర్వమే తెలుగు ఛందస్సు రూపుదిద్దుకున్నదనడానికి ఆధారం సామాన్య శకం ఐదవ శతాబ్దానికి చెందిన విష్ణుకుండిన రాజు నాల్గవ మాధవవర్మ కాలంలో వెలువడిన 'జనాశ్రయ ఛందోవిచ్చితి" అనే గ్రంథము. ఈ గ్రంథములో తెలుగు కవితకు సంబంధించిన గణయతి ప్రాసలను వివరించు అధ్యాయములు, జాతి ఛందస్సుకు చెందిన సీసము, ద్విపద, త్రిపదలున్నవి. శీర్షిక అన్న ఛందస్సే సీసక - సీస పద్యముగా రూపు దిద్దుకున్నదట.

నన్నెచోడుడు చెప్పిన దేశీయ కవితను పుట్టించిన చాళుక్య రాజు గుణగ విజయాదిత్యుడు. వీరు పన్నెండు బోయ కొట్టాలను జయించిన తన సేనాని పండరంగడిని ప్రస్తుతిస్తూ సామాన్య శకం 848లో వేయించిన అద్దంకి శాసనం తరువోజ ఛందస్సులో ఉంది.

“పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
బలగర్వ మొప్పగ బైలేచి సేన
పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
బంచిన సామంత పదువతో బోయ
కొట్టము ల్వండ్రెండు గొని వేంగి నాటి
గొఱల్చియు త్రిభువనాంకుశ బాణనిల్చి
కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
కందుకూర్బెజవాడ గవించె మెచ్చి”

ఈ కాలమునకు చెందిన కందుకూరు ధర్మవర శాసనములో సీసపద్యములున్నవి. సామాన్య శకం 934 కి చెందిన యుద్ధమల్లుని బెజవాడ శాసనములో ఐదు మధ్యాక్కరలున్నవి.

మల్లియ రేచన రచించిన కవిజనాశ్రయం తెలుగు భాషలో విరచితమైన తొలి గ్రంథం. అదీనూ తొలి తెలుగు ఛందో కావ్యం. కరీంనగర్ జిల్లా వేములవాడ వాస్తవ్యులైన భీమన, మల్లమ దంపతుల జ్యేష్ఠ పుత్రుడు రేచన. పంపకవి, అతని తమ్ముడు జిన వల్లభుని సమకాలీనుడు మల్లియ రేచన. సంస్కృతంలో ఆర్యా ఛందస్సుకు, ప్రాకృత గాథాసప్తశతిలోని గాథా ఛందస్సుకు సన్నిహితమైనదే తెలుగు కంద పద్యం. 'కవి జనాశ్రయం' కంద పద్యాల్లోనే విరచితమైంది.

పంపడు వేములవాడ రాజధానిగా పరిపాలించిన చాళుక్య రాజు అరికేసరి ఆస్థాన కవి. పంపడు విక్రమార్జున విజయ, ఆది పురాణ కావ్యాలు కన్నడలో రచించి కన్నడ 'రత్నత్రయ' కవుల్లో ఆదికవిగా పేరొందాడు. జిన వల్లభుడు కరీంనగర్ జిల్లా కూర్మాలలోని బొమ్మల గుట్టలో సామాన్య శకం 946 లో మూడు భాషలతో కూడిన (మూడు సంస్కృత శ్లోకాలు, ఆరు కన్నడ వృత్త పద్యాలు,మూడు తెలుగు కంద పద్యాలు) శాసనాన్ని రచించాడు. పంపడు తెలుగులో 'జినేంద్ర పురాణం' అనే కావ్యాన్ని రాశాడు. అది ఇప్పుడు అలభ్యం. కానీ ఇందులో ఒక సీస పద్యాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి తన ప్రబంధ రత్నావళిలో ఉటంకించారు.

జినేంద్ర పురాణంలోని సీస పద్యం:-

"హరి నిలయంబును హరి నిలయంబును - మురు కలన కులంబు నురు కలన కులంబు - ప్రధితమై యెప్పు మందర పర్వతంబు"

దేశ భాషలందు రాసెదనని గుణాఢ్యుడు శపథం చేసి ఉంటే ఎంత బావుండేదో!

గుణాఢ్య పండితుడు శాతవాహన రాజు హాలుని మంత్రి. ఆయనకు శర్వవర్మ అను మరొక మంత్రి ఉండేవాడు.

రాజు వారిరువురినీ "ఎంత కాలము కృషి చేసిన నేను సంస్కృత భాషలో పండితుడునగుద"నని ప్రశ్నించగా, గుణాఢ్యుడు ద్వాదశ వర్షములు అనగా, శర్వవర్మ 'ఆరు మాసములు' అనినాడు. అటుల జేసిన తాను సంస్కృత, ప్రాకృత, దేశ భాషలను త్యజింతునని గుణాఢ్యుడు పలికెను. శర్వవర్మ తాను చెప్పినట్లే జేసెను. దాంతో గుణాఢ్యుడు అడవికేగి పిశాచ భాష నభ్యసించి బృహత్కథ అను గ్రంథమును రచించాడు. ఆ గ్రంథమును రాజుకు అర్పించబోగా, రాజు నిరాకరించాడు. దాంతో గుణాఢ్యుడు ఆ పొత్తాన్ని తగులబెట్టగా, విషయం తెలిసిన రాజు అడవికేగి దహనాన్ని ఆపాడు. ఆరు లంబకములలో ఒక లంబకము మాత్రమే మిగిలింది. సోమదేవుడు దానినే 'కథా సరిత్సాగరము' గా సంస్కృతంలో రచించాడు.

పైన పేర్కొన్న ఇతివృత్తంలో దేశ భాష అంటే ఏ భాష అన్నది తేల్చుటకు రెండు ప్రమాణాలను తీసుకోవచ్చు...

ఒకటి శాతవాహనులు కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతాన్ని పరిపాలించారు. వారి కాలంలో రాజభాష మహారాష్ట్రీ ప్రాకృతం. ఈ ప్రాంతంలో దేశ భాష అంటే తెలుగే అన్నది సుష్పష్టం. కారణాలు అప్పటికి తెలుగు మూల ద్రావిడ భాష నుండి విడివడి ఉండటం,శాతవాహనుల రాజధానులుగా కోటి లింగాల, అమరావతులు ఉండటం.

రెండు మనం ఏ తెలుగు నుడిగంటును పరిశీలించినా, ఉదాహరణకు శబ్ద రత్నాకరము, పదాలు మూడు రకాలుగా విభజితమై ఉంటాయి.సం. సంస్కృత సమము, వై. వైకృతము అనగా ప్రాకృత సమము సంస్కృత ప్రాకృత భవమునైన పదము, దే. అనగా దేశ్యములు. అవి అచ్చ తెలుగు పదాలు. అచ్చ తెలుగు పదాలలో సంయుక్తాక్షరములు ఉండవు.

గుణాఢ్యుడు గనుక బృహత్కథను దేశభాషలో రచించి ఉంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే తెలుగులో కథా సాహిత్యం పురుడుపోసుకుని ఉండేది.

మూల ద్రావిడ భాషా కుటుంబం నుండి తొట్ట తొలిగా స్వతంత్ర భాషగా ఉనికిలోకి వచ్చిన తెలుగుకు ప్రాచీన సాహిత్యం లేకపోవడానికి కారణాలలో ప్రధానమైనది రాజకీయ పరిస్థితులు.

కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో విలసిల్లిన మహా సామ్రాజ్యాలలో ఏది కూడా తెలుగును అధికార భాషగా స్వీకరించలేదు. శాతవాహనులు మహారాష్ట్రీ ప్రాకృతాన్ని, విష్ణుకుండినులు, కాకతీయులు సంస్కృతాన్ని, విజయనగర సామ్రాజ్యం కన్నడాన్ని అధికార భాషగా స్వీకరించాయి. రెండవది తెలుగుదేశంలో పండితులకున్నటువంటి సంస్కృత వ్యామోహం. సాహిత్యానికి సామాన్య ప్రజలు వాడే దేశ భాష పనికి రాదన్న భావం.

ఏది ఏమైనప్పటికీ అత్యంత ప్రాచీన భాష అయివుండి కూడా తెలుగుకు ప్రాచీన సాహిత్యం లేకపోవడం శోచనీయం. తెలుగు జాతి దురదృష్టం.

- ఓం తత్ సత్ -

Posted in April 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!