Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

"నాటు నాటు"

వెనకటికి నా మిత్రుడొకడు పదే పదే వాడిన ఒక సామెత .. గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన! ఏంటీ, ఈ నెల చర్చ "గాడిద" తో మొదలు పెట్టాడు ఈయన, ఇంకే సామెత దొరకలేదా అని అనుకొంటున్నారా? అక్కడికే వస్తున్నా! గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడవెడైననేమి ఖరము పాలు.. అంటూ వేమన కవి భక్తిసారాన్ని వివరించే క్రమంలో తన పద్యాలలో మనకు బోధిస్తారు. ఖరము (గాడిద) పాలు నిరుపయోగమనే అర్థం ఇక్కడ, అయితే ఇది ఒక్కప్పటి మాట. గాడిద కదా అని తీసిపారెయ్యకండి! హైదరాబాద్ తో సహా పలు నగరాలు ఇప్పుడు గాడిద పాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా మారుతున్నాయి. ఆవు లేదా గేదె పాలు పట్టణంలో లీటరు 100-200 రూపాయలకు మించవు, కానీ లీటరు గాడిద పాలను రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. గాడిద పాల వాడకం మూలంగా చక్కెర వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి కలిగే ఉపశమనాన్ని గుర్తించి, కర్ణాటకలో, 42 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ తన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, భారతదేశంలోనే తొలిసారిగా గాడిద పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాడు అని మీడియా లో ఈ మధ్య ఆసక్తికరమైన ఒక వార్తా కథనం వచ్చింది. కాబట్టి ఎవరైనా మనల్ని కాస్త కోప్పడి "వెళ్లి గాడిదలు కాసుకోమ్మని" చెబితే అది తిట్టు కాదు "దీవెన" అని అనుకునే రోజులు వచ్చేసాయి. మొదలు పెట్టిన సామెత వద్దకు వస్తాను. 2023 మార్చిలో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానం కు ముందు పలు విభాగాలలో పోటీ కి జరిగిన   నామినేషన్ క్రతువు సందర్భంగా సోషల్ మీడియాలో, వివిధ ఛానల్స్ లో జరిగిన RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా నామినేషన్ హడావుడి చూసి నాకు ఏమనిపించింది అంటే "హాలీవుడ్ కేమి తెలుసు తెలుగు సినిమాల సుగంధం వాసన" అని. అయితే, తరువాత ఆదివారం మార్చి 12, 2023 సాయంత్రం హాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని "నాటు నాటు" పాట కు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంలో "హాలీవుడ్ కు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది తెలుగు సినిమాల సుగంధం వాసన" అని సవరణ చేయాలనిపించింది. కార్తికీ గోన్సాల్వేస్‌ దర్శకత్వంలో రూపొందిన మరో భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ఆస్కార్‌ అవార్డు సొంతం చేసుకోవడం మరో విశేషం. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్యన ఉండే ఆత్మీయ అనుబంధాన్ని ఎంతో చక్కగా తెలియచెప్పిన డాక్యుమెంటరీ చిత్రం ఇది. "నాటు నాటు" విషయానికి వద్దాం, ఈ నెల రచ్చబండ చర్చ "నాటు నాటు" మీదే!

"నాటు" అంటే భాషా పరంగా చాలా మందికి మొదట స్ఫురణకు వచ్చే అర్థం "మోటు", లేదా "మొరటు" అని. కానీ "నాటు" అంటే "స్వాభావికమైన", "సహజమైన", స్థానికమైన", "జాతిపరమైన", "గ్రామీణ పరమైన", "పల్లె పరమైన", "స్వచ్ఛమైన" వంటి చక్కటి అర్థాలు కూడా వస్తాయి. కాసింత అనుభూతి (ఫీల్) జోడిస్తే "నాటు" కు ఏ పర్యాయపదం విన్నా చక్కని ఉపశమనం కలుగుతుంది కదా? తెలుగు భాష గొప్పదనం అటువంటిది! ఈ ఏడాది ఆస్కార్‌ బరిలోకి "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" విభాగంలో ఎనభై పాటలు అడుగుపెడితే, చివరకు ఐదుపాటలు పోటీలో నిలిచాయి. లేడిగాగా, రిహాన్నా, టేలర్‌ స్విఫ్ట్‌ వంటి ఇత్యాది ప్రపంచస్థాయి గాయకుల పాటలను వెనక్కునెట్టి, "నాటు నాటు" తెలుగుపాట ఆస్కార్‌ వేదిక మీద సగౌరవంగా నిలిచింది, ఆకట్టుకుంది, అద్భుతంగా గెలిచింది. అణువణువునా మట్టివాసన ఉన్న మన నాలుగు కాళ్ళ (ఇద్దరు ప్రధాన నృత్యకారులు చేసింది కాబట్టి) నాటు నాటు పాట పాశ్చాత్య దేశాల బీటు పాటలను అవలీలగా అధికమించింది, ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును స్వంతం చేసుకుంది.

ఇప్పటివరకూ ఏ భారత  పాటకూ దక్కనన్ని ప్రపంచస్థాయి పురస్కారాలు, గుర్తింపులు..ఉదాహరణకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు, క్రిటిక్స్ అవార్డు వంటివి మన నాటు పాట కు వచ్చినప్పుడే మన పాట ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న విషయం అవగతమయింది, కానీ మనసులో ఒక గిలి...ముందుగానే చెప్పాను కదా "గాడిద కేమి తెలుసు గంధం చెక్కల వాసన!" అని. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు, ఆస్కార్ అవార్డు సాధనతో మన RRR "అటు ఇంట ఇటు బయట" రెండు చోట్ల బ్లాక్ బస్టర్ విజయం సంపూర్ణం అయింది అనిపించింది.

RRR లో 'నాటు నాటు' నృత్యం ఎన్ని సార్లు చూసినప్పటికీ పరిపూర్ణమైన ఆ నృత్య ప్రయత్నాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేదన్న విషయం ఒకటి మాత్రం నాకు చివరికి పూర్తిగా అర్థం అయింది. అపార్థం చేసుకోవద్దు, ఎన్నిసార్లు ఆ పాటను విన్నా, చూసినా ఇంకా అర్థం చేసుకోవడానికి మిగిలి ఉన్నదని అర్థం. 'నాటు నాటు' గూర్చి ఒక దిగ్గజ భారతీయ తెలుగు దర్శకుడు SS రాజమౌళి నైపుణ్యం, "RRR" జట్టు గొప్పతనం మరియు వారి అందుకున్న ఆస్కార్ అవార్డు కీర్తి గురించి ఒక అయిదు నిమిషాలు మాట్లాడితే పని పూర్తయిందని మీరు అనుకున్నారా? ఇక్కడే మీరు అంటే మనందరం... పప్పులో కాలు వేశామన్నమాట. "RRR", 'నాటు నాటు' గురించి మాట్లాడటం మొదలుపెడితే ఆ చర్చను మనం ఒక వారంలో కూడా పూర్తి చేయలేము. ఎందుకంటే చెప్పుకోవడానికి అంత ఉంది ఆ సినిమాలో, ఆ పాటలో కూడా!

పులితో ముఖాముఖి యుద్ధం, హృదయ విదారక ఫ్లాష్‌బ్యాక్‌లు, నమ్మశక్యం కాని పోరాటాలతో పాటు, ఉత్తమ సంగీత నృత్య సన్నివేశాల మేళవింపులతో పాటు "నాటు నాటు" పాట కూడా జతపడి RRR సినిమాను ఒక ఎత్తుకు తీసుకువెళ్లాయి. చంద్రబోస్ సాహిత్యంతో MM కీరవాణి "నాటు నాటు" పాట ను అద్భుతంగా స్వరపరిచారు మరియు దీనిని ఇద్దరు యువ తెలుగు సినీ గాయకులు రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ భావయుక్తంగా పాడారు. "RRR"లో అల్లూరి సీతారామ రాజు పాత్రధారి (రామ్ చరణ్) మరియు కొమరం భీమ్ పాత్రధారి (NT రామారావు జూనియర్) ఒక వేడుక సందర్భంగా సంపన్నులైన బ్రిటిష్ వారు సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఈ పాట ఒక కీలకమైన సన్నివేశంలో కనిపిస్తుంది. సినిమాలో రామ్ మరియు భీమ్ చేసింది ఒక నృత్య యుద్ధం అంటే బాగుంటుందేమో? నృత్యంలో అందరూ కింద పడిపోగా రామ్ మరియు భీమ్ ద్వయం ఒకరినొకరు ఎదుర్కోవడంతో సినిమాలో నృత్య క్లైమాక్స్ పతాక స్థాయికి  చేరుతుంది.  ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫ్ చేసిన "నాటు నాటు" నృత్యం ప్రపంచవ్యాప్తంగా వైరల్ టిక్‌టాక్ డ్యాన్స్ ఛాలెంజ్‌లను ప్రేరేపించింది, ఉదాహరణకు "డేర్ టు డాన్స్" ఛాలెంజ్‌లు వంటివి. కాళ్ళు నొప్పి పుట్టి అందరూ కింద పడి - కేవలం ఒక్కరు మిగిలి ఉన్నంతవరకు చేసే డ్యాన్స్ ఛాలెంజ్‌లు మాటలు కాదు మరి!

"నాటు నాటు" ఊరికే విజయవంతం అవలా! అదెలాగో తెలుసుకుందాం. నవరసాల ఆధునిక కలయిక - RRR సినిమా ఒక కళాత్మక వ్యక్తీకరణ - తొమ్మిది భావోద్వేగాలు శృంగార రస (ప్రేమ), హాస్య రస (నవ్వు), రౌద్ర రస (కోపం), కరుణ రస (కరుణ), బీభత్స రస (అసహ్యం), భయానక రస (భయం), వీర రస (ధైర్య), అద్భుత రస (అద్భుతం), శాంత రస (శాంతి) లను జక్కన్నఈ సినిమాలో నేర్పుగా పండించారు. ఇక నాటు నాటు పాటలో రామ్-భీమ్ ల భావోద్వేగాలు, వారి నిర్దిష్ట ముఖ కవళికలు, నియంత్రణ, దృష్టి మరియు అభ్యాసం, ఖచ్చితమైన కాలు కదలికలు, వారి నృత్య భంగిమల గురించి ఎంత చెప్పినా తక్కువే! భారత్ లో 2021లో వర్షాల మూలంగా ఈ పాట చిత్రీకరణ స్వదేశంలో కష్టసాధ్యం కావడంతో, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ ను ఈ పాత చిత్రీకరణకు RRR టీమ్ ఎంపిక చేసుకుంది. మన స్వాతంత్య్ర పూర్వ పరిస్థితులకు అనుగుణంగా చేసిన సెట్టింగులు, దుస్తులతో 15 రోజులపాటు అక్కడ జరిగిన "నాటు నాటు" పాట చిత్రీకరణ ఆ పాటను RRR సినిమా లో అద్భుత దృశ్య కావ్యంగా నిలబెట్టింది. 90 శాతం పాటను సగం రోజులోనే చంద్ర బోస్ రాశారు, కానీ మిగతా 10 శాతం పాటను పూర్తిచేయడానికి దాదాపు 19 నెలలు పట్టింది అని ఆయనే పలు ఇంటర్వ్యూ లలో చెప్పారు.

"RRR" చూడని వారికి ఇప్పుడు "నాటు నాటు" ద్వారా ఆ సినిమాను పునః పరిచయం చేసే అవకాశం నాకు దొరికింది. ప్రపంచం నలుమూలల నుండి ముఖ్యంగా భారత్ నుండి కోట్ల మంది ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా కోట్లమందికి ఆస్కార్ అంటే తెలియని వారికి కూడా ఒక్క రోజులో అదంటే ఏమిటో "నాటు నాటు" తెలియజేసింది. ఘనత వహించిన తెలుగు జాతి సంస్కృతిని  ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాకమైన వీక్షకులకు మన "నాటు నాటు" పాట పరిచయం చేసింది. ఆస్కార్‌ బరిలోకి ఎనభైపాటలు అడుగుపెడితే, చివరకు ఐదుపాటలు పోటీలో నిలిస్తే, ఆ ఐదులో "నాటు నాటు" ఆస్కార్ పురస్కారానికి ఎంపిక కావడం మనకు గర్వకారణం.

"నాటు నాటు" కు ఆస్కార్ అంతర్జాతీయ పురస్కారం దక్కినందుకు ముఖ్యంగా తెలుగుభాషా ప్రేమికులు సంబరపడుతున్నారు, అదెందుకో తెలుగుకుందాం. ఈ పాట మొదటి లైను నుండి "పొలం గట్టు దుమ్ములోన..", చివర లైను "నకర, నకర, నకర, నకర" వరకు ఇత్యాది పలు అచ్చ తెలుగు పల్లెటూరి పదాలతో రచయిత చంద్ర బోస్ ఈ పాటను రంగరించారు. పల్లెటూరి నేపధ్యం, యాసతో కూడిన  తెలుగుదనాన్ని, వీరత్వాన్ని పచ్చి మిరప, మిరప తొక్కు తో ఈ పాటలో ఆయన దట్టించారు. మరి ఇన్ని విషయాలు ఉన్నమన "నాటు నాటు" పాట ఆస్కార్ కమిటీలో బ్రహ్మాండంగా పేలకుండా ఎలా ఉంటుంది? ఆస్కార్ వేదికను "నకర, నకర, నకర, నకర" లాడించకుండా ఉంటుందా? ప్రేమ, త్యాగం, నృత్య కళ, సంగీతం, సెట్టింగ్‌లు, కాస్ట్యూమ్స్ మరియు కథతో బలమైన అనుసంధానం తదితర ముఖ్యాంశాలు ఈ పాటకు ప్రాణం పోశాయి అని నాకు అనిపించింది. "నాటు నాటు" కు ఆస్కార్ పురస్కారం ప్రకటన వినగానే నాకు ఉత్సాహంతో ఎగిరి గంతేసినట్లయింది, ఈ విజయాన్ని పదాలు వర్ణించలేవు. ఈ విజయం కేవలం పాట పాడిన వారిది కాదు, సినిమా తీసిన వారిది కాదు, మనందరిది, భారతదేశ నేపధ్యం ఉన్న ప్రతి ఒక్కరిదీ అని నేను ఆ క్షణాన భావించాను. ఇంతకు మునుపు ఆస్కార్ అవార్డులు భారతీయులకు, వారి చిత్రాలకు, హిందీ పాట "జయహో" కు వచ్చినా కూడా ఇప్పుడు పూర్తి స్వదేశీ తయారీ చిత్రంలోని అదీ ఒక తెలుగు జానపద దేశవాళీ పాటకు అవార్డు రావడం మన తెలుగు వారు మరింత గర్వించదగ్గ సందర్భం. రచయిత చంద్ర బోస్ కోరుకుంది ఒకే ఒక జాతీయ అవార్డు ఆయన పాటకు, అది రాలేదు, దాని కోసం ఎదురుచూస్తుంటే ఏకంగా ఆయనకు "నాటు నాటు" ఆస్కార్ తో సహా 4 ప్రపంచ అవార్డులు దక్కడం విశేషం. ఆయన పాటలో చెప్పినట్టు "వీర నాటు" అంటే ఇదేనేమో!

నాటు నాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దాదాపు 41 సినిమాలకు స్వర సహకారం అందించారు, అనేక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. 19 నెలలు ఎంఎం కీరవాణి ఈ పాటకు పనిచేసాడంటే పరిపూర్ణత కోసం ఆయన ఎంత తపించాడో అర్థం అవుతుంది. 3600 పైచిలుకు పాటలు రాసిన చంద్రబోస్ కలం కదిపాడంటే తెలుగు అక్షరాలు తేనె పలుకుల వలె నింగి నుండి వర్షంలా కురవాల్సిందే.  ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ మరియు కాల భైరవ యువ గాయకులు. సినిమా దర్శకుడు SS రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి  మరియు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌లతో కలిసి ఈ కాంబినేషన్ చాలా బాగా పనిచేసింది. RRR లో ఈ పాటకు డ్యాన్స్ ని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చేసారు. దాదాపు 19 రోజులు కేవలం ఈ పాట చిత్రీకరణ కోసం RRR టీమ్ పనిచేసినట్లు ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌ పలు ఇంటర్వ్యూ లలో చెప్పారు. ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 150 మిలియన్లకు పైగా వీక్షణల సంఖ్యను దాటింది, ఇప్పుడు ఆస్కార్ అవార్డుతో యూట్యూబ్‌లో ఈ పాటకు మరి కొన్ని మిలియన్ల వీక్షణలు జమపడతాయని అని నేను అనుకొంటున్నాను. ఆస్కార్ డాల్బీ థియేటర్ వేదికపై బిల్లీ ముస్తఫా (కెనడా), జేసన్ గ్లోవర్ (కాలిఫోర్నియా) అనే ఇద్దరు యువ నృత్యకళాకారులు మరియు వారి బృందం "నాటు నాటు" పాటకు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసింది. బిల్లీ ముస్తఫా గురించి కెనడా మీడియా ప్రముఖంగా రాసింది. కెనడాలోని అల్బ్రెట రాష్ట్రానికి చెందిన కాల్ గ్రే నగరవాసి బిల్లీ ముస్తఫా అనే యువకుడు ఏకంగా ఆస్కార్ అవార్డు ప్రధాన వేదికపై "నాటు నాటు" పాటకు డాన్స్ వేసాడని, అలాగే RRR గూర్చి కూడా పలు కెనడా మీడియా వార్తా సంస్థలు ప్రస్తావించాయి. అమెరికా మీడియా అయితే స్థానిక కాలిఫోర్నియా వాసి జేసన్ గ్లోవర్ గురించే పెద్దగా రాయనేలేదు, ఇంకా బిల్లీ ముస్తఫా గురించి ఏం రాస్తుంది? కానీ "నాటు నాటు" కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం అయితే మాత్రం ప్రముఖంగా రాసింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా రాజధాని నగరమైన శాక్రమెంటో లో ఉన్న స్థానిక ఏబీసీ 10 అనే వార్తా సంస్థ కు "నాటు నాటు" కు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా అదృష్టవశాత్తు ఒక మినీ ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం అయితే నాకు వచ్చింది. సదరు వార్తా సంస్థ నుండి ఆస్కార్ వేడుకలు - "నాటు నాటు" కథనాన్ని మీరు ఇక్కడ చదవవచ్చు: https://tinyurl.com/ABC10NaaTu

"నాటు నాటు" నృత్య ప్రదర్శన ఆస్కార్ వేదిక పై పూర్తి అయిన తరువాత ఆ నృత్య బృందం బిల్లీ ముస్తఫా, జేసన్ గ్లోవర్, లారెన్ గొట్టిలిబ్ ఆహూతులందరికీ భారతీయ సంప్రదాయంలో చేతులు జోడించి నమస్కారం చేసింది. ఇక ఆస్కార్ దాల్బీ థియేటర్ లో ఆసీనులై ఉన్న 3400 ఆహుతులు అయితే తమ సీట్లనుండి లేచి నుంచోని కరతాళ ధ్వనులతో నాటు నాటు నృత్య బృందం వారికి ప్రశంసలు తెలియజేసారు. లేడీ గాగా అమెరికాలో ఒక ప్రఖ్యాత గాయకురాలు, ప్రపంచవ్యాప్తంగా ఆమెకు కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట కూడా "నాటు నాటు" పోటీ పడుతున్న విభాగంలోనే ఉంది. అయితే "నాటు నాటు" కి ఆస్కార్ అవార్డు ప్రకటన వినగానే ఆమె ఉత్సాహంగా లేచి చప్పట్లు కొట్టింది, తన సహృదయాన్ని చాటుకుంది. అమెరికా కు చెందిన మరో ప్రముఖ గాయని రెహానా అయితే "నాటు నాటు" పాడిన రాహుల్ సిప్లిగంజ్ బృందం మొహమాటం పడుతున్నదని గుర్తించి తానే స్వయంగా వారి వద్దకు వెళ్లి వారిని అభినందించి వారితో ఫోటోలు దిగిన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతకు మునుపు ఆస్కార్ డాల్బీ థియేటర్  వేదికపై ప్రధాన కార్యక్రమ వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్ "నాటు నాటు" బృందం నృత్య ప్రదర్శన ఉంటుంది అని ప్రకటన చేస్తున్న సమయంలోనే సదరు నృత్య బృందం వేదికపై హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి "నాటు నాటు" స్టెప్స్ వేస్తూ వ్యాఖ్యాత జిమ్మీ ని చుట్టుముట్టి వేదికపై నుండి బయటకు సరదాగా ఆయనను నెట్టుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంది. ఆ సరదా సన్నివేశం, ఆస్కార్ వేదిక పై "నాటు నాటు' నృత్య ప్రదర్శన వీడియో లంకె మీకోసం ఇక్కడ ఇస్తున్నాను: https://tinyurl.com/NaaTuOscar

సందట్లో సడేమియా అన్నట్లు కొంతమంది పని లేని సోషల్ మీడియా రాయుళ్లు ఆస్కార్ అవార్డు వేదికపై "నాటు నాటు" పాట ప్రదర్శించిన బృందం లో భారతీయులు లేరనే వాదనకు తెర తీశారు. ‘పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు’ సామెత వీరికి సరిపోతుందేమో? సదరు పాటను ఆస్కార్ అవార్డు వేదికపై ప్రత్యక్షంగా పాడిన బృందంలో కాల భైరవ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు కాదా! మరి వీరు భారతీయులు కాదా?

"నాటు నాటు" కు ఆస్కార్ అవార్డు ప్రకటన రాగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భారతీయులు భావోద్వేగానికి లోనయ్యారు, భారత పతాక ఆస్కార్ వేదికపై రెపరెపలాడింది అని గర్వపడ్డారు. "నాటు నాటు" కు అవార్డు ప్రదానం ద్వారా ఆస్కార్ కీర్తి మరో మెట్టు పైకి చేరుకుందని ఒక భావన. "నాటు నాటు" పాట ఆస్కార్ ద‌క్కించుకోవ‌డం వెనుక రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్ర‌మోష‌నల్ స్ట్రాట‌జీ చాలానే ఉంది. అందుకే ఆస్కార్ వేదికపై కార్తీకేయకు కీరవాణి ధన్యవాదాలు తెలియజేశాడు. దాదాపు 2-3 నెలలు కార్తికేయ అమెరికాలో మకాం వేసి తనకు అప్పగించిన పని నిర్విఘ్నంగా పూర్తిచేసాడు. దాదాపు 80 కోట్ల రూపాయలు వరకు RRR ప్ర‌మోష‌నల్ స్ట్రాట‌జీ కోసం రాజమౌళి ఖర్చు చేసిఉంటాడని మీడియాలో ఒక వర్గం ఆరోపణ. అయితే కేవలం డబ్బులు కుమ్మరిస్తే ఆస్కార్ అవార్డు రాదు అనడానికి "నాటు నాటు" ఒక ఉదాహరణ, ఎందుకంటే ఆ విభాగంలో పోటీ పడి తమ పాటలు సమర్పించినవారిలో లేడీ గాగా, రిహానా వంటి తదితర హేమాహేమీలు ఉన్నారు. పాటకు మిలియన్ డాలర్ల పై చిలుకు పారితోషికం తీసుకునే వీరికి  80 కోట్ల రూపాయలు లెక్కే కాదు, అవసరమైతే 160 కోట్లు కూడా వారు కుమ్మరించగలరు, కాబట్టి "నాటు నాటు" ప్ర‌మోష‌న్ కు ఖర్చుపెట్టిన డబ్బు గురించి మాట్లాడుకోవడం ఉచితం కాదని నా అభిప్రాయం. చివరికి కార్తికేయ కేవలం 8.5 కోట్లు మాత్రమే RRR ప్ర‌మోష‌నల్ స్ట్రాట‌జీ కి ఖర్చు చేయడం జరిగిందని చెప్పాడు. మరి ఈ పనికి 80 కోట్ల రూపాయలు అనవసర ఖర్చు చేశారని మీడియా సాక్షిగా మాట్లాడిన మహానుభావులు ఇప్పుడు సమాధానం చెప్పాలి. మరి కొంతమంది "నాటు నాటు" తాతల వంటి పాటలు తెలుగులో అనేకం ఉన్నాయని, వాటికి ఆస్కార్ అవార్డు రాలేదని, వాటిముందు "నాటు నాటు" ఎంత అని మెటికలు విరుస్తున్నారు. మనకు విస్తరిలో వడ్డించిన వంటకాలలో దేని రుచి బాగుందో అడిగితే ఇదంతా చెత్త - ఇంతకు ముందెప్పుడో 10 ఏండ్ల క్రితం తిన్న వంటకాల రుచి బాగుందని చెబితే ఎంత అసహజంగా ఉంటుందో ఇదీ అంతే కదా? పురుషుల జావెలిన్ త్రోలో 2020 ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు నీరజ్ చోప్రా కంటే మన ఇంటి పక్కనున్న పుల్లయ్య సూపర్ అని చెబితే అది అసహజంగా ఉంటుంది. ఎందుకంటే, మరి ఇంటి పక్కనున్న పుల్లయ్య పురుషుల జావెలిన్ త్రో అర్హతా పరీక్షల్లో ముందు నెగ్గాలి, తరువాత ఒలింపిక్ క్రీడల్లో దేశం నుండి నామినేట్ కావాలి, అసలు ఒలింపిక్ క్రీడల్లో ఉత్తమ ప్రదర్శనతో నీరజ్ చోప్రా తో పాటు మిగతా క్రీడాకారులను పుల్లయ్య అధికమించాలి - చాలా తతంగం ఉంది. అప్పుడే కదా పుల్లయ్య సూపర్? "నాటు నాటు" పాట కంటే ఇంకా సూపర్ పాటలు తెలుగులో, ఇతర భారతీయ భాషల్లో ఉన్నాయి, వాటికి ఆస్కార్ రాలేదు అని వాదించేవారు ఈ విషయాన్ని కాస్త ఓపిక చేసుకొని పరిశీలించాలి అని నా మనవి.

ఇటీవల ప్రముఖ నృత్యదర్శకుడు ప్రభుదేవా కూడా 100 మందికి పైగా డాన్సర్ల తో కలిసి నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసి, ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ లో ఉన్న ప్రేమ్ రక్షిత్‌కు, రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో వీటన్నింటిని మించిపోయే సన్నివేశం ఆవిష్కృతమైంది. పెద్ద పార్కింగ్ లాట్ లో మన తెలుగు వారు దాదాపు 150 టెస్లా కార్లను ఒక్కచోట RRR అక్షరాల వలె అమర్చి నాటు నాటు పాట వినిపించారు. ఆ పాటకు అనుగుణంగా టెస్లా కార్ల లైట్లు వెలుగుతూ.. పాటకు తగ్గట్టుగా విన్యాసాలు చేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెస్లా కార్ల తో నాటు నాటు ప్రదర్శన తరువాత ఈ లైట్ షోపై ట్విట్టర్ సీఈవో, టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ కూడా స్పందించడం గమనార్హం. రెండు లవ్ సింబల్స్ ను ఆయన ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అనేక మంది యూ ట్యూబర్లు రంగంలో దిగి వారు డాన్స్ వేసిన లేదా చిత్రించిన నాటు నాటు పాటను యూ ట్యూబ్ లో పెట్టారు, ఇంకా కొంతమంది ఔత్సాహిక యూ ట్యూబర్లు ఒరిజినల్ నాటు నాటు పాట లేదా ఆస్కార్ అవార్డు ప్రదానం సన్నివేశం సగం స్క్రీను పై ప్లే అవుతుండగా, వారి వారి ముఖ స్పందనలు, వ్యాఖ్యలు మిగతా సగం స్క్రీను పై రికార్డు చేసి ఆ వీడియోలను యూ ట్యూబ్ లో పెడుతున్నారు. ఇదిలా ఉండగా గూగుల్ అంచనా ప్రకారం నాటు నాటు గురించి అంతర్జాలంలో వెతికిన వారు ఆస్కార్స్ అవార్డు మునుపుకంటే ఇప్పుడు 1150 శాతం పెరిగారు అని మనకు తెలుస్తుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఢిల్లీ లో దక్షిణ కొరియా, జర్మనీ ఎంబసీ సిబ్బంది సైతం ఢిల్లీలో పాటకు కాళ్లు కదిపారు. నాటు నాటు రీసౌండ్ మామ్మూలుగా లేదుగా! అయితే "నాటు నాటు" విజయం తో మనం పండుగ చేసున్నంతనే అయిపోలేదు, ఈ పురస్కారం స్పూర్తితో ఘనత వహించిన తెలుగు చిత్రరంగం మరింత ఉన్నతస్థానానికి వెళ్తుందని, భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు పలు విభాగాలలో ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలని, అలాగే బహుమతులు సాధించాలని మనం ఆశిద్దాం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చూస్తే "నాటు నాటు" నృత్య ప్రదర్శననే, అలాగే RRR సినిమా, ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌" సినిమాలనే చూడాలి! అంతే కదా! చివరిగా ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర బృందానికి, మరో భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ బృందానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా నేను గుర్తు చేయవలసినది ఏంటంటే... సిరిమల్లె పాఠకులు చేయవలసిన  రెండు పనులు మిగిలి ఉన్నాయి అని...పెద్దగా కష్టమైనవి కావు అవి  : మొదటిది  - మీకు "నాటు నాటు" ఏ మేరకు తెలుసునో మీరు తెలుసుకోవడానికి ఒక 10 నిమిషాల సరదా ఛాలెంజ్ క్విజ్ మీ కోసం - ఈ క్విజ్ తీసుకోవడానికి ఈ  లంకె ను నొక్కండి: https://tinyurl.com/NaaTuQuiz. క్విజ్ తీసుకున్న తరువాత జవాబులు ఈ లంకె నొక్కి సరిచూసుకొనగలరు :https://tinyurl.com/NaatuQuizAnswers. రెండవది - యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం, ఈలోపు మీ స్పందను కింది కామెంట్ బాక్స్ లో రాయడం మరచిపోవద్దు సుమా !

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in April 2023, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!