Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

సాయంత్రం ఏ బొటానికల్ గార్డెన్ కో తీసుకువెళ్లి బోలెడు కబుర్లు చెప్తాడని ఆశించిన స్మరణకి నిలువునా నీరసం ఆవరించింది. తీవ్రమైన ఆశాభంగం కలిగి కళ్ళు చెమర్చి రెప్పలు తడిసాయి. ఇన్నేళ్ళ విరహం తరవాత తొలి సమావేశం ఇలాగా ముగిసేది. ఈ మనిషికి పని, వృత్తి ధర్మం తప్ప మరేమీ పట్టదా! ఇల్లాంటి వ్యక్తితో జీవితం ఎలా ఉంటుంది? తను అనవసరమైన ఆశలతో ఇన్నేళ్ళు వృధా చేసిందా..

ఆఫీస్ అసిస్టంట్ వచ్చి కారు రెడీ గా ఉంది అని చెప్పాడు మీనన్ కి.

మీనన్ ఆమె చెవిలో నెమ్మదిగా అన్నాడు “రూమ్ కి వెళ్ళిపోదామా”

ఆమె మీనన్ మొహంలోకి అభావంగా చూసింది.

“ఆఫీస్ టైం అయిపొయింది అందరూ వెళ్ళిపోతున్నారు.. పద మనలను డ్రాప్ చేసి డ్రైవర్ వెళ్ళిపోతాడు” అన్నాడు.

స్మరణ మౌనంగా అతన్ని అనుసరించింది.

“ఈ మనిషికి అసలు హృదయం ఉందా... ఆ ప్లేస్ లో ఏదన్నా బండో, ఐరన్ రాడో ఉందా!” అనిపించింది. వాట్స్ అప్ ఓపెన్ చేసింది... తన మెసేజ్ అతను చూడలేదు ఇంకా.

ఒక్కసారిగా మండుతున్న అగ్నిలో ఆజ్యం పోసినట్టు భగ్గుమంది హృదయం..

“మొబైల్ ఎక్కడ పారేశావు?” అని మళ్ళి ఒక మెసేజ్ పెట్టింది.

“ఏంటి స్మరణా... మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నావు... ఏం జరిగింది?” మృదువుగా అడిగాడు మీనన్. స్మరణ మాట్లాడలేదు.

ఆమె మాధవన్ మనస్తత్వం అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నేళ్ళ తరవాత కలిసిన సందర్భం అది స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు ఎంత అపురూపమైనది! ఈ సందర్భాన్ని ఎంత అద్భుతంగా సెలెబ్రేట్ చేసుకోవాలి! అలాంటిది ఆ మనిషికి ఎలాంటి ఫీలింగ్ లేదా! చాలా మామూలుగా పలకరించాడు.. ఒక ప్రొఫెషనల్ లాగా... కొంతకాలం ఎక్కడికో ట్రైనింగ్ కోసం వెళ్లి తిరిగి వచ్చిన వాడిలా, యాంత్రికంగా.. ఎక్కడ మునిగావు ఇక్కడ తేలావు.. అయినా అదేం పలకరింపు అసహ్యంగా!

ఒక్కసారిగా శరీరం మొత్తం చచ్చుపదినట్టు అయింది. బీటలు వారిన భూమి రాలిన తొలకరి చినుకుని ఒడిసిపట్టుకుని ఆప్యాయంగా గుండెలకి అదుముకుని ఆ స్పర్శలో తాదాత్మ్యం చెందేలోగా ఆ చినుకు ఆవిరి అయినట్టుగా అనిపిస్తోంది. కలిసిన కళ్ళు రెప్పలార్పుకునే లోపలే కరిగిపోయింది కాలం. ఆ తరవాత క్షణం కూడా తన ఆ చూపులు తన వైపు ప్రసరించికపోవడం అన్యాయం.. దారుణం!

తన ఆనందాన్ని తాతయ్యతో, బదరీతో పంచుకునే లోపలే ఆనందం ఎగిరిపోయింది.. ఆ స్థానంలో ఆవేదన.. “తాతయ్యా ఇదుగో నా మధు కనిపించాడు... నా కల నేరవేరింది.. ఒక్కసారి మాట్లాడు” అని చెప్పి తాతయ్యతో ఫోన్ లో మాట్లాడించాలనుకుంది. ఆమెలో నెమ్మదిగా రగులుతున్న అసహనం, కోపంలా మారి క్షణక్షణానికి తీవ్రం అవసాగింది..

ఏం మనిషి! ప్రేయసిని ఎలా పలకరించాలో తెలియనివాళ్ళు కూడా ఉంటారా ఈ భూమ్మీద..

మధు కనిపిస్తే తను ఎలా స్పందించాలో ఆమె ఎప్పుడూ ఊహించలేదు... కలవాలి.... కలవాలి అనుకుంది... పేస్ బుక్ లో పలకరిస్తాడా. ట్విట్టర్ లో కనిపిస్తాడా అని వెతికింది. కనిపిస్తే ఏం చేయాలి? పలకరిస్తే ఎలా రియాక్ట్ అవాలి అని ఆలోచించలేదు. అందుకేనా ఈ కలయిక ఇంత  చప్పగా యాంత్రికంగా జరిగింది.. ఎంతో రొమాంటిక్ గా మిగిలిపోవాల్సిన మొదటి కలయిక ఇలాగా... చెలరేగుతున్న ఒక్కో ఆలోచన ఒక్కో సమిధలా మారుతూ క్షణక్షణానికి ఆగ్రహాగ్ని జ్వాలలు పైకి ఎగసిపడుతున్నాయి.

“హలో మేడం... కొంచెం మా ప్రపంచంలోకి వస్తారా!” హాస్యంగా అంటున్న మీనన్ మాటలకి దీర్ఘంగా శ్వాస తీసుకుని అతని వైపు చూసి పల్చగా నవ్వి ఏమి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది.

“ఏమి లేకపోవడం ఏంటి? బాస్ ని చూడగానే అలా అయ్యావెందుకు? నీకు ఆయన ముందే తెలుసా!”

స్మరణ విండో లోంచి రోడ్డు మీదకి చూస్తూ అంది “తెలుసు”

“ఎలా? మీ రిలేటివ్?”

ఏమని చెప్పాలో అర్థం కాలేదు.. “నా చిన్నప్పటి ఫ్రెండ్” అంది.

మీనన్ ఆశ్చర్యంగా అన్నాడు.. “ఈ జిట్? మరి?.....”

అతని వైపు మొహం తిప్పి నవ్వింది "అలా అనిపించలేదు కదూ... నాకూ అనిపించలేదు. అందుకే ఆలోచిస్తున్నాను మా రిలేషన్ గురించి..”

“కమాన్ స్మరణా... సరిగా చెప్పు...ప్లీజ్...”

“ఏమని చెప్పను... మేము చిన్నప్పుడు సుమారు ఏడాదిన్నర ఒకే దగ్గర కలిసి పెరిగాము.. కలిసి చదువుకున్నాము... కలిసి ఉన్నాము.. . ఆ తరవాత అతను వెళ్ళిపోయాడు.. మళ్ళీ ఇప్పుడే కలిసాము. ఇన్ ఫాక్ట్  నేను అప్పటి నుంచీ మళ్ళి మేము కలుస్తామని, కలవాలని ఆశిస్తూ ఎదురుచూస్తూనే ఉన్నాను.

“డూ యూ లవ్ హిమ్”

ఆలోచిస్తూ అంది “అనే అనుకుంటున్నా”

“అంటే! వన్ వే...”

“తెలియదు... “

“ఓ మై గాడ్ స్మరణా...సరిగా చెప్పు తల్లి నీ మూగప్రేమ కథ ..”

“నాకు తెలియదు మీనన్... తను నన్ను లవ్ చేస్తున్నాడా లేదా నాకు తెలియదు.. అప్పుడు తెలుసుకోడానికి వయసు లేదు... ఇప్పుడు తెలుసుకోడానికి అతని మనసు నాకు తెలియదు.. నేను దాదాపు తనని చూడగానే ఫెయింట్ అయానా... చీమ కుట్టినట్టు లేదు తనకి... నన్నేదో రెస్ట్ రూమ్కి పంపించి, కాసేపయాక వచ్చి ఎక్కడ మునిగావు? ఇక్కడ తేలావు అని అడిగాడు... నిజం చెప్పు అదేనా సుదీర్ఘమైన విరహం తరవాత కలుసుకున్న ప్రేమికులు మాట్లాడుకునే విధానం... నయం ఇంకా... నీ వయసెంత? ఇంతకు ముందు ఎవరినన్నా ప్రేమించావా... నా మీద నీ ప్రేమకి ఎన్నేళ్ళ అనుభవం అని ప్రొఫెషనల్ క్వేశ్చన్స్ అడగలేదు..  అదికూడా కనీసం అరగంట కూడా మాట్లాడలేదు.. నెక్స్ట్ మినిట్ మీటింగ్ అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఈవెనింగ్ మీటింగ్ అయ్యాక నాతొ మాట్లాడాడా ... నువ్వే చూసావుగా చాలా ఆఫీషియల్ గా అందరి దగ్గర తీసుకున్నట్టే నా దగ్గరా సెలవు తీసుకున్నాడు. అలాగేనా ప్రవర్తించేది నువ్వు చెప్పు. అదే నీ గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్విలాగే బిహేవ్ చేస్తావా. ఇప్పుడు నేను తనని ఏమని అర్థం చేసుకోను... చూడు మెసేజ్ పెట్టి ఎంతసేపు అయింది ఇంతవరకు చూడలేదు... ఇలాంటి కాలికులేటేడ్ మనిషిని ప్రేమిస్తున్నానని తలచుకుంటే తల గోడకేసి కొట్టుకోవాలని అనిపిస్తోంది.”

చిన్నపిల్లలా అమ్మ మీద అలిగి పితూరీలు చెబుతున్నట్టు చెబ్తున్న స్మరణని చూస్తుంటే మీనన్ కి నవ్వాగలేదు.. అతని నవ్వు చూసి రోషంగా అడిగింది స్మరణ “నీక్కూడా జోక్ లా ఉందా..”

“జోక్ కాదు స్మరణా... నీ కోపం చూస్తుంటే ఐస్ క్రీం కొనివ్వకపోతే మారాం చేసే పిల్లలు గుర్తొస్తున్నారు... ఎనీవే లెట్ మీ కంగ్రాచ్యులేట్ యు.”

“ఎందుకు?”

“ఎందుకేంటి ... మాధవన్ అనే ఈ వ్యక్తి సామాన్యుడు కాదు.. చాలా గొప్పవాడు.. అంత గొప్పవాడు నీ ఫ్రెండ్... మే బీ నీ ఉడ్ బీ....”

“నా బొంద.... ముందసలు అతనికి నా మీద ప్రేమ ఉందో లేదో తేలలేదు... ఉడ్ బీ .. హు” విసురుగా అంది.

అస్తమయ సూర్యకిరణాలు పడి కెంపు రంగులో మెరుస్తున్న ఆమె చెక్కిళ్ళు చూస్తూ అమ్మాయిలు కోపంలో కూడా ఎంత అందంగా ఉంటారో అనుకున్నాడు మీనన్. నవ్వుతూ “పిచ్చి స్మరణా! నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే మీటింగ్ ముగిసిన కొన్ని సెకండ్స్ లోనే నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. అంతటి వ్యక్తి అలా వచ్చాడంటే ఈజీగా తీసుకుంటే ఎలా? ఎంత బిజీ ఆయన! నువ్వు ఆయన షెడ్యులు చూడలేదు.. నేను చూసాను. మినిట్ టు మినిట్ ... సో మెనీ ఎంగేజ్మెంట్స్... ఎప్పుడు నిద్రలేస్తాడో, ఎప్పుడు పడుకుంటాడో... నిరంతరం పని చేస్తూనే ఉంటాడుట.. వెరీ రేర్ పర్సనాలిటీ..”

తన మనిషి గురించి మీనన్ అలా చెబుతోంటే ఆమె మనసంతా బంతిపూల మడిలా మారింది..అయినా తనని ఇగ్నోర్ చేసినందుకు ఆ మడి చుట్టూ పరిభ్రమిస్తున్న సీతాకోక చిలుకల గుంపులా కోపం, రోషం, అసహనం రొదచేస్తూన్నాయి.

ఇంతలో హోటల్ చేరడంతో కారు దిగి రిసెప్షన్ వైపు నడిచి తాళం చెవి తీసుకుని మీనన్ కి గుడ్ నైట్ చెప్పి తన గదికి వెళ్ళిపోయింది. ఫోన్, బ్యాగ్ టేబుల్ మీద పెట్టి, కిటికీ కర్టెన్ జరిపి వెన్నెల నదిలో జలకాలాడుతున్నట్టున్న హోటల్ వెనక భాగంలో ఉన్న గార్డెన్ లోకి చూస్తూ “మధూ! నా హృదయపు వాకిలికి ఎన్ని జ్ఞాపకాల తోరణాలు వేళ్ళాడుతున్నాయో నీకు కనిపించలేదా.. ఒక్కో తోరణం ఒక్కో కథ నీకు చెప్పడానికి ఎంతగా వేచి చూస్తోందో తెలుసుకోవా... కనీసం ఒక్క కథన్నా వినే సమయం నీకు లేకపోతె ఇన్ని కథలు ఎప్పుడు వింటావు.. అయినా ఇదంతా వృత్తిపట్ల ఉన్న అంకిత భావం అనుకోవాలా... సంపాదన పట్ల ఆరాటం అనుకోవాలా... రెండోది నిజమైతే ఆ నిజం నాకు జీర్ణం అవదు... మొదటిది నిజం అయితే ఆ నిజం నేను హర్షిస్తాను.. ఏది ఏమైనా మన తొలి కలయికను ఇలా మాత్రం ఊహించలేదు.. ఎలా ఊహించానో గుర్తులేదు.. అమృతకలశం లభించాకే కదా దాన్ని ఉపయోగించే మార్గం కనుగొన్నారు.. అసలు లభిస్తుందా లేదా అనే ఆత్రుత తప్ప లభించాక ఏం చేయాలి అని నేనూ ఆలోచించలేదు... ఇప్పుడు మాత్రం ఎన్నో చేయాలని కలలు... కోరికలు... ఊహలు... వెన్నెల నదిలో వికసించిన కమలం వెన్నెల కరిగిపోగానే ముకుళించుకు పోయినట్టు... నువ్వు కనుమరుగు కాగానే ఇలా ముకుళించుకు పోతున్నానేం.. ఎందుకింత ఇన్ సెక్యూరిటీ నాకు!

నీతో నా జీవితం ఎలా ఉంటుంది? నిన్ను ప్రేమించడంలో నేనేదన్నా పొరపాటు చేస్తున్నానా.. నేను భావుకురాలిని... నువ్వు మెటీరియలిస్ట్ ... నీకూ, నాకూ పొసగుతుందా!”

ఫోన్ మోగింది. ఆమె హృదయం పురివిప్పిన నెమలి అయింది... గబుక్కున ఫోన్ అందుకుని ఆన్సర్ బటన్ నొక్కింది..

కొద్దిగా విడివడిన పెదవుల నుంచి ఒక కల కూజితంలా వినిపించింది “హలో”

“ఏం చేస్తున్నావు? రూమ్ కి వెళ్ళావా!”

బుస్సుమంది కోపం .... “లేదు... రోడ్డు మీద నిలబడి నీ కోసం ఎదురు చూస్తున్నా..”

అవతల నుంచి నవ్వు వినిపించింది...

“సిగ్గులేదూ నవ్వడానికి.. నన్నొదిలి అలాగేనా వెళ్ళేది.”

“ఎలా వెళ్ళాలి? నీ చేయి పట్టుకుని పాట పాడుకుంటూ వెళ్ళాలా! నాకు సినిమాటిక్ లవ్ తెలియదు..”

“నీకంత సీన్ లేదని నాకు తెలుసులే... అసలు నీకు ప్రేమంటే తెలుసా...”

“లేదు.. రేపు ఉదయం ఏడున్నరకల్లా రెడీగా ఉండు.. మా ఇంటికి తీసుకుని వెళ్లి నీ ప్రేమ లెక్చర్ వింటాను.. సరేనా... మంచి డిన్నర్ చేయి... హాయిగా నిద్రపో... సి యూ ఇన్ ద మార్నింగ్. గుడ్ నైట్.. పార్టీ వస్తున్నాడు... మీటింగ్ మొదలవుతుంది... బై” ఆమె ఏదో అనే లోపలే ఫోన్ డిస్ కనెక్ట్ అయింది. “షిట్” కసిగా మొబైల్ మంచం మీదకు విసిరేసి బోర్లా పడుకుంది స్మరణ..

“సి ఇ వో .... చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ .. ఇతను ప్రేమకు అర్హుడేనా...”

ఈ ప్రశ్నకి సమాధానం ఒకరే చెప్పగలరు... గబుక్కున ఫోన్ తీసుకుని ఆంజనేయులు నెంబర్ డయల్  చేయసాగింది.

ఆంజనేయులు ఫోన్ కలవలేదు.. సిగ్నల్స్ రీచ్ అవడం లేదు అని మెసేజ్ వస్తోంది. సంధ్యకి చేసింది.. రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయలేదు. తండ్రికి చేసింది నో సిగ్నల్స్ అని మెసేజ్.. విసుగ్గా ఫోన్ పక్కన పడేసింది.

చికాగ్గా, అస్థిమితంగా ఉంది.. పదేళ్ళ వియోగానంతరం తొలి కలయిక ఇలా ఉందేంటి.. నిస్సారంగా, నీరసంగా... “ఇంతకీ రేపు ఉదయం ఇంటికి తీసుకు వెళ్తాను రెడీగా ఉండు” అన్నాడు.. ఎందుకు? వాళ్ళమ్మని కలిపించడానికా! తన అకామడేషన్ మార్చేస్తాడా.. వాళ్ళ ఇంట్లో ఉండమంటాడా! ఆవిడ ఒప్పుకుంటుందా! అసలు ఆవిడ తనని గుర్తు పడుతుందా? ఎన్నాళ్ళు తను ఇక్కడ ఉండాలి.. ఇక్కడే పోస్టింగ్ ఇస్తే వేరే ఫ్లాట్ తీసుకోవాలి కదా! ఒంటరిగా...దగ్గరైన మధుకి దూరంగా...ఎలా? నో..ఇంక ఈ దూరం భరించలేదు.. దగ్గరవాలి.. బాగా దగ్గరగా... ఇద్దరూ ఒకరయేలా.. అవుతారా.. ఏంటో! రోజూ కలుసుకుంటూ ఉండేవాళ్ళలాగా చాలా కాజువల్ గా జరిగిన సమాగమం ఆనందాన్ని ఇవ్వడం సంగతి ఎలా ఉన్నా ఎక్కడ లేని టెన్షన్ తెచ్చిపెట్టింది.. తనే ఎక్కువగా ఆలోచిస్తోందా! ఇంతకీ తన ప్రెజంటేషన్ ఎప్పుడు? స్మరణ మెదడంతా ఆలోచనలతో గందరగోళంగా తయారైంది.

ఎన్నో మాట్లాడాలి అనుకుంది.. అతను కనిపించగానే మల్లెపందిరిలా అల్లెసుకోవాలి అనుకుంది.. ఇన్నేళ్ళ తపన, అతని కోసం పడిన ఆరాటం, పరితాపం గుండె విప్పి చెప్పాలనుకుంది. ఏది ఆ అవకాశమే ఇవ్వలేదు. ఇంత అఫీషియల్ గానా కలిసేది..

ఇన్నేళ్ళు తన ఫీలింగ్స్ ఏంటో ఒక్కటన్నా చెప్పాడా.. నిజంగా తనకోసం అతను పరితపించి ఉంటె ఆ పరితాపం అక్షరాల్లో వర్ణిస్తే వినడానికి ఎంత మధురంగా ఉంటుంది.. ఆనందం ఆర్ణవం అవడం అంటే అదేగా..

స్మరణ ఒక్కసారి తల విదిల్చి ఆలోచనలనుంచి బయటపడడానికి ప్రయత్నించింది.

మొబైల్ తీసుకుని మీనన్ నెంబర్ డయల్ చేసింది.

అతను వెంటనే లిఫ్ట్ చేసాడు. “హాయ్ మీనన్.. ఏం చేస్తున్నావు.. డిన్నర్ అయిందా?” అడిగింది.

“లేదు... ఇప్పుడు చేయాలి... నువ్వు చేసావా!”

“లేదు... రెస్టారెంట్ కి వెళ్దామా?”

“ఓకే రానా...”

“ఎస్... అక్కడ మాట్లాడుకుందాం” ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

డ్రెస్ మార్చుకుని రెస్టారెంట్ కి బయలుదేరింది. లిఫ్ట్ లో మీనన్ కలిసాడు. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నాక చెప్పింది “మధు ఫోన్ చేసాడు.”

నవ్వాడు మీనన్..

****సశేషం****

Posted in April 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!