Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

అభినవ పోతన "వానమామలై వరదాచార్యులు"

Vanamalai Varadaacharyulu

మహాకవి మరియు సహజ కవి పోతన అయితే, ఆయన చరిత్ర వ్రాసిన మరో మహాకవి ‘శ్రీ వానమామలై వరదాచార్యులు’ గారు. ఒక మహాకవి చరిత్రను మరో మహాకవి వ్రాస్తే, అది ఎంత సుమధురంగా ఉంటుందో ఈ కావ్యము రుజువు చేస్తుంది. సహజకవి అయిన పోతనను గురించి అతి సహజంగా ఆయన చరిత్రను కవితాత్మకంగా వ్రాసిన కవి వరదాచార్యులు గారు.

రామాయణాన్ని గురించి అనేక మంది కవులు కావ్యాలు వ్రాసారు. కానీ వాల్మీకిని గురించి వ్రాసిన వారు లేరు. భాగవతాన్ని తెలుగు ప్రజలకు అందచేస్తూ, పోతన గారు తన పూర్వ కవులైన నన్నయ్య తిక్కనాదులకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే వారు భాగవతాన్ని తెనిగించకుండా తన కోసమే వదిలినందుకు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, శ్రీ వానమామలై వరదాచార్యులు గారు దాదాపుగా సమవయస్కులు. ఒకరు తెలంగాణాను తెలుగు మాగాణిగా చేస్తే, మరొకరు ఆంధ్రావనిని పునీతం చేసారు.

వరదాచార్యులు గారు వరంగల్ జిల్లా, హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో ఆగష్టు 16, 1912, పరీధావి సంవత్సర 'శ్రావణ బహుళ ఏకాదశి' నాడు జన్మించాడు. తండ్రి బక్కయ్య శాస్త్రి ఆంధ్ర సంస్కృత భాషలలో ఉద్ధండ పండితుడు. తల్లి పేరు సీతమ్మ. వైష్ణవ మతావలంబి. రైతు కుటుంబములో జన్మించిన వరదాచార్యులు ఏడవ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ సంస్కృతాంధ్ర సాహిత్యం, తార్కికం, వేదాంతం, వ్యాకరణాలను అభ్యసించాడు. సంస్కృతం, తెలుగు, ఉర్దూ, హిందీ, ద్రవిడం, మరాఠీ, ఇంగ్లీషు భాషలలో పట్టు సాధించాడు. హరికథాగానంలో ప్రావీణ్యతను సంతరించుకున్నాడు. తన 18వ యేట మేనమామ కొదుమగోళ్ల జగన్నాథాచార్య ఏకైక కూతురు వైదేహితో వివాహం జరిగింది. ఈయన అన్నలైన వానమామలై వేంకటాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు కూడా సాహిత్యకారులే.

ఈయన  తన 13వయేటనే పద్యరచన ప్రారంభించాడు. 64పైగా రచనలు చేశాడు. పోతనలాగా మధురంగా పద్యం చెప్పడమే కాకుండా ‘పోతన చరిత్రము’ అనే బృహత్‌ కావ్యరచన చేసిన వానమామలై వరదాచార్యులకు అలనాడే మహాకవులు దాశరథి, సి.నారాయణరెడ్డి అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న తెలంగాణ రచయితల సంఘం ”అభినవ పోతన” బిరుదునిచ్చి సత్కరించింది. వరదాచార్యులు గారి సహజపాండిత్యాన్ని గుర్తించిన అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకుడిగా నియమించాడు. ఆ తర్వాత వరదాచార్యులుగారు ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పుచ్చుకున్నాడు. విశారద పూర్తయ్యాక చెన్నూర్‌ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యి 13 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశాడు. చెన్నూరులో వేదపాఠశాల నెలకొల్పాడు. ఈయన ప్రతిభను గుర్తించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి.నరసింహారావు ఈయనను 1972లో శాసనమండలికి నామినేట్ చేశాడు. 1978 వరకు శాసనమండలి సభ్యుడిగా కొనసాగాడు.

పోతన చరిత్రము గ్రంథ రచనాకాలంలోనే వరదాచార్యులు క్షయవ్యాధి పీడితులై మైసూరులో మూడేండ్లు (1949-1953) ఉండి చికిత్స పొందారు. వీరి ఊపిరి తిత్తులకు పది పర్యాయాలు శస్త్ర్రచికిత్స చేశారు. ఏక శ్వాసకోశంతోనే వీరు చికిత్సానంతరం జీవించారు. ఒక సందర్భంలో వరదాచార్యులు పరమపదించారని విని తెలంగాణ రచయితల సంఘం, ఆచార్యుల వారి సంతాపసభ కూడా పెట్టింది. మృత్యుముఖం నుంచి బయటపడి వరదాచార్యులు హైదరాబాద్‌ తిరిగివచ్చాక ఆయనతో మహాకవి దాశరథి ‘నాకు జీవితంలో ఆనందాన్నిచ్చిన వార్తలు రెండే రెండు. ఒకటి నిజాంపై పోలీసుచర్య. రెండు నీకు జబ్బు నయమై బతకడం అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో వరదాచార్యులను చూసిన అభిమానులు ‘మీరు పోయారనుకున్నాం’ అంటే దీనికి ఆచార్యులవారు ‘నేను పోతనా’ అన్నారని అంటారు . ‘నేను పోతనా’ అంటే ‘నేను పోతనా, పోను’ అనే అర్థమే కాకుండా తానే పోతన అన్నట్టు ధ్వనించారు.

వరదాచార్యులు గారు ‘పోతన చరిత్రము’ కాకుండా మరో ఏభై దాకా గ్రంథాలు రచించారు. ఆయన రచించిన మణిమాల గ్రంథాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తు వారి ఆంధ్ర విశారద పరీక్షకు పాఠ్యాంశంగా ఉంచారు. చిత్రం ఏమిటంటే వరదాచార్యులు గారు ఈ పరీక్షకు తాను వ్రాసిన గ్రంథాన్నే పాఠంగా చదువుకున్నాడు. విప్రలబ్ధ కావ్యం నుండి వర్షాలు అనే పద్యభాగాన్ని నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.
ఆరవ తరగతి తెలుగువాచకంలో ఇతడు వ్రాసిన కుసుమోపదేశము అనే పాఠం చేర్చబడింది. పోతన చరిత్రములోని ఒక ఘట్టం భోగినీ లాస్యమును యువభారతి కోసం వ్యాఖ్యాన సహితంగా (తన రచనపై తానే వ్యాఖ్యానించి) అందించాడు.

ముచ్చటైన మూడు తెలుగు ప్రాంతాల రూపు రేఖల్ని వానమామలై గారు ఒక పద్యములో చక్కగా వివరించారు.

‘‘ప్రాచ్యదేశాంధ్ర ‘శ్రీమహాభారతమ్ము’
భవ్య తెలంగాణ ‘శ్రీ మహాభాగవతమ్ము’
మహిత రాయలసీమ ‘రామాయణమ్ము’
ఘన త్రివేణీ సమాగమాకారమూనె’’

శ్రీ వానమామలై వరదాచార్యులుగారు, తనకన్నా అయిదు శతాబ్దాల ముందు నివసించిన పోతనను గురించి 'పోతన చరిత్రం' అనే పద్య కావ్యాన్ని వ్రాసారు. ఈ కావ్యంలో రమారమి మూడువేల రెండువందల పద్యాలున్నాయి. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, వచనకవిత్వం లాంటి ఎన్నో నూతన సాహిత్య ప్రయోగాలాతో వర్ధిల్లుతున్న కాలంలో, ప్రాచీన కవితారీతులతో ప్రజలను మెప్పించిన కవి శ్రీ వానమామలై. ఆయన వ్రాసిన కావ్యాల్లో 'మణిమాల' చాలా ప్రసిద్ధి చెందింది. చెళ్ళపిళ్ళ, విశ్వనాధ వంటి వార్ల చేత ప్రశంసించబడ్డ కావ్యమది. వరదాచార్యులు గారికి పోతన జీవితమే ఆదర్శం. పోతనలాగే వీరు కూడా 'పోతన చరిత్రం' ను శ్రీ రామచంద్రమూర్తికే అంకితమిచ్చారు. పోతనగారి లాగే వీరూ అతి సాత్వికులు, నిరాడంబరులు. 'పోతన చరిత్రం' వ్రాయటానికి దాదాపు పది సంవత్సరాలకు పైగా పట్టింది. అటువంటి గొప్ప కావ్యమైన 'పోతన చరిత్రం' ను ముద్రించటానికి ఎవరూ ముందుకు రాలేదు. 1966 లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్యగారి సహకారం వల్ల ఈ కావ్యం వెలుగుచూసింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు తమ బహుమతితో ఈ కావ్యాన్ని, వరదాచార్యులు గారిని సత్కరించారు.

********

Posted in June 2023, వ్యాసాలు

1 Comment

  1. Ch. Trimurthulu

    వానమామలై గారి పోతన చరిత్ర పై విశ్లేషణ ఇస్తే సంతోషిస్తాం. అలాగే సినీ మా పాట సంగీత వివరణ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!