Menu Close
Page Title

అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి

శ్రీ మత్వదీయ చరితామృత మన్నయార్య,  పీత్వాపినైవ సుహితా మనుజాభవేయుహు |
త్వం వెంకటాచలపతేరివ భక్తిసారాం, శ్రీ తాళ్ళపాక గురుదేవో నమో నమస్తే.....||

సంగీతానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని మనకందరికీ తెలుసు. సాహిత్యం, సంగీతాన్ని  పువ్వుని ఆశ్రయించి ముదాన్ని సమకూర్చే తావి లాంటిది. ఏ కీర్తనకైనా, గీతానికైనా సాహిత్యపు సొబగులు లేకపోతే భావకుడైన శ్రోతకు రసానుభూతి కలగదు. భక్తి రసమైనా, శృంగార భావమైనా, ఆధ్యాత్మికతో కూడిన వైరాగ్య స్ఫురణైనా, ఆనందానుభూతైనా, సంగీతంలోని రాగమొక్కటే సాహిత్య ఆలంబన లేనిదే శ్రోతలో రసానుభావాన్ని తారా స్థాయికి చేర్చలేదు. ఆ శ్రోతకు తన్మయత్వం సిద్ధించదు. ఆ ప్రక్రియలో ఆద్యుడైన 'పదకవితా పితామహుడు' గా ఆరాధించబడే అన్నమయ్య అగ్రగణ్యుడు. అయన ‘పద’ వల్లరులకి  ప్రధమంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పైగల భక్తి ప్రపత్తులే కారణమే అయినా, ఆ దైవమే ధ్యేయం గా లౌకిక, శృంగార,  వైరాగ్య భావాలు కూడా రెమ్మలు వేసుకుని శ్రోతల మనోవీధులలో భక్తి గంధంతో మిళితమై వికసించి వివిధ రసానుభావాల్ని చిప్పిలిస్తాయి.

22 మే నెల 1408 లో శ్రీ వేంకటేశ్వరుని ‘నందక’ మే (కత్తియే) మానవ అవతారంగా దాల్చి లక్కమాంబ నారాయణ సూరి లకు తాళ్లపాకలో అన్నమయ్య జన్మించెనని అనేకుల నమ్మకము. అన్నమయ్య వ్రాసిన 32000 సంకీర్తనలలో (ప్రస్తుతం సుమారు 12000  కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నా)  శ్రీ మహా విష్ణువుని ధ్యానించి, ఆరాధించి, సంగీత బద్దతతో, తన తంబుర నాదంతో 'దాసోహ' మంటూ భావోద్రేకాన్ని రసోస్పాదనని పెంపొందించగా  సంకీర్తనా పుష్పాలతో శ్రీ మహాలక్ష్మి, శ్రీమహావిష్ణుల ప్రతిరూపమైన అలమేలు మంగ, శ్రీ వేంకటేశ్వరుల అలరించి సంకీర్తనాచార్యునిగా పేరొందాడు. పద కవితలో ఆద్యుడుగా ఆరాధ్యుడై 'ఆంధ్ర పద కవితా పితామహ' గా పేరొందిన అతడు తన పదునారవయేటనే సంకీర్తనలని పాడుకుంటూ లిఖించడము ఆరంభించాడట. అనేక కీర్తనలలో తన భక్తిని, సామాజిక నైతిక స్పృహని పెంపొందిదిస్తూ, అసమానత్వాన్ని చెండాడుతూ, ఆ భగవంతుని ముందు అందరు సమానులే అంటూ ప్రబోధ చేసాడు అన్నమయ్య.  తన నైతిక, ధార్మిక, సామాజిక భావాలను ప్రబోధనలను కూడా కీర్తనల ద్వారా మానవ హృదయాల్ని స్పృశిస్తూ  ఆలపించాడు. అసామాన్యరీతిలో తన ఆరాధ్య దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి మ్రొక్కుతూ లిఖించిన కీర్తనా శ్రేణిలో ఇమిడిన ఉత్కృష్ట వేదాంత ధోరణులు అందరినీ ఆలోచనా కడలిలో ముంచి దైవ సాన్నిధ్యాని చేరుస్తాయి.

ముందుగా తిరుమల కొండని గాంచి పరవశుడై అతడు అల్లిన పదం:

ప|| కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ | తెట్టలాయ మహిమలే తిరుమలకొండ

||చ|| వేదములే శిలలై వెలసినది కొండ | యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ |
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ | శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ ||

చ|| సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ | నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ |
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ | పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ ||

చ|| వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ | పరగు లక్ష్మీకాంతుసోబనపు గొండ |
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ | విరివైన దదివో శ్రీవేంకటపు గొండ ||

మరియు

Annamacharya
తాళ్లపాకలోని అన్నమాచార్య విగ్రహం

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడువాడుకుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడుఅచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించినవాడు

మానవాళికే మకుటాయమానంగా సులభ శైలిలో నీతి, వేదాంత, భక్తి తత్వాలని తన కీర్తనలద్వారా అందించాడు, అన్నమయ్య.

సర్వము హరియే అంటూ కీర్తించిన రీతి:

(పల్లవి) - అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
(చరణం) 1 - కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
2- తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
3- పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే..

యింకా ఈవిధంగా భక్తి భావాన్ని ప్రకటిస్తూ:

ఇతడొకడే సర్వేశ్వరుడు
సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు ||పరమ యోగులకు భావ నిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము
సిరులొసగేయీ శ్రీ వేంకటేశుడు ||కలికి యశోదకు కన్న మాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అల ద్రౌపదికిని ఆపద్బంధుడు
చెలరేగిన యీ శ్రీ వేంకటేశుడు ||

తగిలిన మునులకు తపము సత్ఫలము
ముగురు వేల్పులకు మూలమీతడే
వొగినలమేల్మంగ కొనరిన పతియితడు
జిగిమించిన యీ శ్రీవేంకటేశుడు ||

ఆతడి భక్తి తాదాత్మ్యకి నిదర్శనంగా  --

అందరికాధారమైన ఆది పురుషుడీతడు
విందై మున్నారగించె విదురునికడ నీతడుసనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు
వనజ భవాదులకును దైవంబై నతడీతడు
ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు
మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన //సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు
ధరనావుల మందలలో తగ జరించె నీతడు
సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు
ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన //

పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు
సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు
తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు
వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన //

శ్రీ వేంకటేశ్వరుడు, ఆదివిష్ణువు, శ్రీ కృష్ణుడే అందరు ఒక్కటే కాని వేరు కాదని కీర్తిస్తూ :

ఆదివిష్ణు వీతడే యటరమ్మ
ఆదిగొని భూభార మణచీనోయమ్మాచందురునుదయవేళా సవరేతిరికాడ
కందువ దేవకి బిడ్డగనెనమ్మా
పొందుగ బ్రహ్మాదులు పురుటింటివాకిటను
చెంది బాలుని నుతులు సేసేరోయమ్మావసుదేవుని యెదుట వైకుంఠనాథుడు
సిసువై యవతరించీ చెలగీ నమ్మా
ముసిముసినవ్వులతో మునులకు ఋషులకు
యిసుమంతవాడభయమిచ్చీనమ్మా

కన్నతల్లిదండ్రులకు కర్మపాశము లూడిచి
అన్నిటా రాకాసిమూక లణచీనమ్మా
వున్నతి శ్రీవేంకటాద్రినుండి లక్ష్మీదేవితోడ
పన్ని నిచ్చకల్యాణాల బరగీనమ్మా

ఇంకా ఆ దేవుని సంపూర్తిగా తెలియుట సులభ సాధ్యం కాదంటూ -----

అందరి వసమా హరినెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు // పల్లవి //లలితపు పదిగోట్లనొకఁడుగాని
కలుగఁడు శ్రీహరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని // అందరి //శ్రుతి చదివిన భూసురకోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతిఘనులట్టి మహాత్మకోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని // అందరి //

తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకఁడు తలఁపున హరిని
గుదిగొను హరిభక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీవేంకటపతిని // అందరి //

మళ్ళీ అందరికి ఆశ్రిత సులభుడై వారందరిలో అంతరాత్మ యైయున్నవాడు ఆ వేంకటపతియే అంటూ ప్రకటించాడు ఆ అసమాన భక్తుడు, అన్నమయ్య:

అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు
యిందునే శేషగిరిని యిరవై విష్ణుడుయోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర -
సాగరశాయియైన సర్వేశుడు
భాగవతాధీనుడైన పరమపురుషుడు
ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడువైకుంఠమందునున్న వనజనాభుడు పర-
మాకారమందునున్న ఆదిమూరితి
ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి
దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము

నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు
దండివేదంతములు వెదకే ధనము
పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి
అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు

ఆ వేంకటేశ్వరుని కథా మహిమలు చెప్పనలవికాదు..

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథవదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ.

గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ.

ఆ సులభ సాధ్యుడైన శ్రీ వేంకటేశ్వరుని శరణు వెడితే దయామయుడై ఎంతగా అనుగ్రహిస్తాడో ఉదాహరణలతో వివరిస్తూ:

అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి
ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షివేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి
మోసపోకుమీ జన్మమా ముమ్చినయనుమానములను
సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి // అతి సులభం బిదె //తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి
అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి
భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి // అతి సులభం బిదె //

మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు
అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి // అతి సులభం బిదె //

--తదుపరి భాగం వచ్చే సంచికలో--

Posted in June 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!