Menu Close
పంచపది – నూతన చిరు కవితా ప్రక్రియ
-- దినవహి సత్యవతి --

బాల పంచపది

సరళమైన పదములతో బాలలు అర్థం చేసుకునే అంశాలతో నియమాలను అనుసరిస్తూ వ్రాసేది బాల పంచపది. ఇవి బాణీ కట్టి పాడుకోవడానికి, బాలల చేత పాడించడానికి కూడా అనువుగా ఉంటాయి. బాల పంచపదుల నియమాలు......

  • పాదానికి 8 నుండి 12 అక్షరాలు వుండాలి.
  • లయ-తాళ-స్వర రాగయుక్తంగా వుండాలి.
  • 4 పాదాలు అంత్యానుప్రాస కలిగి వుండాలి.
  • 5వ పాదం లో (కవి నామం కాకుండా) 12 అక్షరాలు ఉండాలి.
  • 5 వ పాదం చివర కవి నామం ఉండాలి.
  • అలతి అలతి-లలితమైన పదాలతో, భావ సమన్వయం ఉండాలి.

బాలపంచపదులు:

  1. బాలలు
    చిన్నారి పొన్నారి బాలలు
    బాలలు ఇంటి వెలుగులు,
    భవితకు రథ సారథులు,
    రేపటి ఉత్తమ పౌరులు,
    బాలలతోనే ఇంట సందడి సత్య!
  2. అమ్మ
    అమ్మ మాట వింటాము,
    చక్కగ బడికి వెళతాము,
    టీచరు చెప్పింది వింటాము,
    బుద్ధిగా చదువుకుంటాము,
    బాలలము మేము బాలలము సత్యా !
  3. వర్షం
    చిటపట చినుకులు కురిసెను,
    ఎండ వేడిమి తగ్గించెను,
    బాలల మనసులు మురిసెను,
    అందరికి ఆనందం కలిగెను,
    వర్షం చల్లదనము తెస్తుంది సత్య!
  4. సీతాకోకచిలుక
    ఎన్నెన్నో సీతాకోకచిలుకలు,
    సీతాకోకచిలుకల రంగులు,
    తోటకు తెచ్చెను అందాలు,
    చూసి మురిసిరి బాలలు,
    సీతాకోకచిలుకంటే ఇష్టం సత్య!
  5. ఇంద్రధనుస్సు
    నింగిలో రంగుల హారము,
    ప్రకృతి చేసే చమత్కారము,
    భూదేవికి మణిహారము,
    ప్రజలకది సప్త వరము,
    ఇంద్రధనుస్సు అందమైనది సత్య!
  6. హిమాలయాలు
    తెల్లని మంచు శిఖరాలు,
    దేశ ఉత్తర సరి హద్దులు,
    మునుల తపోవనాలు,
    ప్రకృతి సౌందర్య నిలయాలు,
    హిమాలయాలు చూడాలి సత్య!
  7. ప్రకృతి
    భూమికి వర ప్రసాదము,
    మనిషికి విలువైన వరము,
    సౌందర్యాలకు నిలయము,
    సహజ వనరుల భండారము,
    ప్రకృతిని ఆస్వాదించాలి సత్య!
  8. జాతీయ పక్షి-నెమలి
    వాన కురియ మురియును,
    పురి విప్పి నాట్యమాడును,
    అందాలు కురిపించును,
    మనసులను మురిపించును,
    నెమలి మన జాతీయ పక్షి సత్య!
  9. గులాబీ / రోజా పువ్వు
    అందాలు విరజిమ్ముతుంది,
    స్త్రీ సిగలో గుబాళిస్తుంది,
    దేవుని పూజలో అలరిస్తుంది,
    గులాబీ అందరినీ మురిపిస్తుంది,
    సుగంధాన్ని వెదజల్లుతుంది సత్య!

క్రింద ఇవ్వబడిన పదములకు బాలపంచపదులు వ్రాసి సమీక్షలో పొందుపరచగలరు...

గురువు, ఆప్తమిత్రుడు, సమయపాలన, జవానులు, విలువలు.

వచ్చే నెల మరొక క్రొత్త పంచపది ప్రక్రియతో కలుద్దామా!

*** సశేషం ***

Posted in June 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!