Menu Close
గోదావరి (పెద్ద కథ)
-- వెంపటి హేమ --

నేను సివిల్ ఇంజనీర్ గా ట్రాన్సుఫర్ మీద ధవళేశ్వరం వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలయ్యింది. నా ఎరుకలో ఎప్పుడూలేనంత ఎక్కువగా ఈ సంవత్సరం గోదావరికి వరద వచ్చింది. నీటి మట్టం క్షణక్షణానికీ హెచ్చుతూ వరద అంతకంతకూ ఉధృతమౌతోంది. గోదావరి మహావేగంతో, సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. "సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్" కి ఇన్ చార్జిగా ఉన్న నేను, వెంటనే “పది ఫ్లడ్గేట్లు” ఎత్తేయమని ఆర్డర్ వేశాను. తక్షణం స్టాఫ్ ఆ పనిమీద బయలుదేరారు. ఆ రోజు దగ్గరుండి ఆ పనిని పూర్తిచేయించి, ఆపై గోదావరిమీద నడిపే పడవల్ని, లాంచీల్ని అప్పటికప్పుడే, ఎక్కడివక్కడే ఆపెయ్యమని రేవుకి కబురుపెట్టి, నేను ఇంటి ముఖం పట్టాను.

ఇకనుండి గోదావరికి అడ్డంపడి పడవలమీద వెళ్ళాలంటే కుదరదు, అది ప్రమాదాన్ని కోరి తెచ్చుకోడమే ఔతుంది. గోదావరిని దాటవలసి ఉంటే చుట్టు తిరిగి వంతెన మీదుగా వెళ్ళాల్సిందే, మరోదారి లేదు. అంతగా తప్పనిసరి అయితే “డరోతీ”ని పిలిపించాల్సిందే.

ఉధృతంగా ఉన్న గోదావరి నాలో ఎన్నో జ్ఞాపకాలను రేపింది. ఒకప్పుడు డెల్టా ప్రాంతానికి దుఃఖదాయినిగా ఉన్న వరద గోదావరిని అదుపుచేసి, అమృతవర్షిణిగా మార్చినది "సర్ ఆర్థర్ కాటన్" అనే, ఇంగ్లాoడు నుండి వచ్చిన ఒక ఇర్రిగేషన్ ఇంజనీరు. సామాన్య ప్రజలకు ఆయన చేసిన అనన్య సామాన్యమైన సాయం అకస్మాత్తుగా నా తలపుకి వచ్చింది . . .

రాజమహేంద్రవరం దగ్గర గోదావరి నది పైనున్న పాత రైలువంతెన కాటన్ ప్రతిభకు ఒక గొప్ప నిదర్శనం. ఇప్పటిలా ఘనమైన సాంకేతిక సహకారముగాని, సరైన పసగల సిమెంటుగాని లేని ఆ కాలంలోకూడా అంత పటిష్టమైన నిర్మాణాలు ఆయన ఎలా చేయగలిగాడన్నది ఈ కాలపు సివిల్ ఇంజనీర్లకు, ఎంత ఆలోచించినా అర్థమవ్వదు. అంతేకాదు నాలాంటి వాళ్ళకది ఎప్పటికీ ఒక “రిడిల్” గానే ఉండిపోయింది. అదేమి పాపమో గాని ఆంధ్రప్రదేశ్ కి ఒక సంవత్సరంలో అతివృష్టి! మరోసంవత్సరంలో అనావృష్టి! చీటికీమాటికీ గాలివానలు! మనుష్యులకు లాగే ప్రకృతికి కూడా క్రమశిక్షణ అంటే ఇష్టం ఉండదు కాబోలు.

మా బామ్మకనక బ్రతికి ఉన్నట్లైతే, వణికే కంఠంతో, “ఇదేమైనా రామరాజ్యమా ఏమిట్రా అబ్బాయీ, లెక్కపెట్టి నెలకి మూడువానలు మాత్రమే కురవడానికి! రోజురోజుకీ కలికాలం బలుస్తోందిరా నాయనా! చూస్తూండగా పాపం పెరిగిపోతోoది! “యధా రాజా తధా ప్రజా" అన్నారు! ఇక ప్రకృతి ఇలాకాక ఇంకేలా ఉంటుందిట! అప్పుడే ఏమి చూశావులే, ముందుంది ముసళ్ల పండుగ! ఇది ఇంకా కలియుగంలో మొదటిపాదమే! మరో మూడు పాదాలున్నాయి ఆవల. ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో ...” అని బోసి నోటితో, బుగ్గలు తాటించుకుంటూ వాపోయి ఉండేది.

నా ఊహకు నాకే నవ్వు తెప్పించింది. పొడికళ్ళు పడిపోడంతో, ఎంతకీ నిద్ర రావడం లేదు. నా మనసులోకి ఏవేవో ఎడతెగని ఆలోచనలు పుంఖానుపుంఖాలుగా వస్తూ, నన్ను నిద్రకు దూరం చేస్తున్నాయి. దేశం మొత్తంమీద ఈ సంవత్సరం వానలు ఎక్కువేనుట! అంటే వరదలూ ఎక్కువేనన్నమాట! ప్రతి ఏటా నైరుతీ ఋతుపవనాలు ముందుగా పడమటి కొండల్ని తాకుతాయి. అప్పుడు ఆ కొండలపై కురిసిన వాననీరంతా అక్కడ పుట్టిన నదులకు చేరుతుంది. ఆ నీరే వరదై దిగువకు వెల్లువెత్తుతుంది. అదే ఎక్కువనుకుంటూంటే, నాల్గురోజులుగా ఇక్కడ కూడా ఒకటే వాన! అది పగలూ రాత్రి అన్న తేడా లేకుండా ఏకవరసని కుండపోతగా కురుస్తూనేవుంది. పుష్కల, ఆవర్తక మేఘాలు రెండూ ఆంధ్రభూమిపై కినుకతో ఎడతెగకుండా తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి కాబోలు - అనుకున్నా నిరీహతో.

ఈదురుగాలి జోరుగా వీస్తూoడడంతో చలి ఒణుకు పుట్టిస్తోంది. హోటల్లో భోజనం చేసి, నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. నా భార్య బ్రహ్మణి (సరస్వతి), పిల్లల్ని వెంటతీసుకుని శ్రావణమాసపు నోములు నోచుకోడానికి పుట్టింటికి వెళ్ళింది. ఒంటరిగా ఉన్నాను నేను. మంచం మీద పడుకుని, ఎముకలు కొరికేస్తున్న చలికి తాళలేక రగ్గుతీసి కప్పుకున్నా. వెచ్చగావుంది, కాని నిద్ర మాత్రం రావడం లేదు ఎంతకీ. తలనిండా ఏవేవో జ్ఞాపకాలు సుడులు తిరగడం మొదలుపెట్టాయి. ఎంత వద్దనుకుంటే అంత ఎక్కువగా వరద గోదావరే నా ఆలోచనల్లోకి వస్తోంది. మా తాతయ్య నా చిన్నప్పుడు చెప్పిన ఒక కథ - నిజానికి అది కల్పిత కథ కాదుట, ఒక యదార్థ గాధట - గుర్తొచ్చింది అకస్మాత్తుగా నాకు. దాన్నే మననం చేసుకుంటూ పడుకున్నాను ...

మా తాతయ్య పోయి అప్పుడే పదేళ్ళయిపోయింది. ఆయనతో అప్పట్లో నాకు చాలా చేరిక వుండేది.

మా తాతయ్య పేరు నా పేరు ఒకటే. ఆయనదికూడా ఆయన తాతయ్య పేరేనుట! మా తాతయ్యకి ముత్తాతగారి తండ్రి పేరు రమాపతి ఐతే, మా తాత తాతపేరు రమాపతి శర్మ. మళ్ళీ మా తాతయ్యపేరు రమాపతి రావు. మరి నా పేరు! కాలానుగుణంగా కొద్దిగా మార్పు చేసి రమాకాంత్ – అని పెట్టారు నాకు పేరు మా అమ్మా నాన్నాను. పెద్దవాళ్ళు జీవించి ఉన్నా, లేకున్నాకూడా మొదటపుట్టిన ఆడపిల్లకు బామ్మ పేరు, మగపిల్లాడికి తాతయ్యపేరు పెట్టడం ఒక సాంప్రదాయం ఉభయ గోదావరీ జిల్లాల్లో వాళ్లకి. మా పెద్ద చెల్లాయిపేరు కనకం – అది మా బామ్మపేరు. బ్రతికున్న వాళ్లై తే తనపేరు గల ఆ పసిబిడ్డకు ఏదో ఒక ఘనమైన బహుమతి కూడా ఇస్తారు. అక్కడ అదికూడా ఒక సంప్రదాయంగానే మారింది. తు - చ తప్పకుండా శ్రద్ధగా సాంప్రదాయాలను పాటించే రోజుల్లో మాటది. ఈ రోజులకు అది అన్వయించకపోవచ్చు.

చిన్నప్పటినుండి నాకు మా తాతయ్యదగ్గర చనువు ఎక్కువ. ప్రతిరోజూ రాత్రులు భోజనం చేసి, విశ్రమించగానే, నేను ఆయన పక్కలో చేరి ఎన్నెన్నో కథలు, గాధలు వింటూ అలాగే నిద్రలోకి జారుకునే వాడినిట! తను పడుకునేముందు, మా నాన్న ప్రతిరోజూ, మా తాతయ్య పక్కన మంచి నిద్రలోవున్న నన్ను తన చేతుల్లోకి తీసుకుని వెళ్ళి, నా మంచం మీద పడుకోబెట్టే వాడుట! ఏ రోజైనా ఇదే మాకు దినచర్యగా ఉండేదిట, నాకు పదేళ్లు నిండేవరకూ.

అలా, నాకు పదేళ్ళ వయసు ఉన్నప్పుడు ఒకరోజు మా తాతయ్య చెప్పిన కథల్లో ఒక వాస్తవ గాధ కూడా ఉంది. అది మా తాతయ్యకు పదేళ్ళ వయసున్నప్పుడు వాళ్ళ తాతయ్య ఆయనకు చెప్పిన యధార్థ గాధట! ఆయన చిన్నప్పుడు నిజంగానే అదంతా తన కళ్ళ ఎదుటనే జరిగినదనీ దానికి తానుకూడా ఒక ప్రత్యక్ష సాక్షిననీ చెప్పారుట మాతాతయ్యకి వాళ్ళ తాతయ్య. ఆ రోజు తన తాతయ్య ద్వారా తను విన్న ఆ కథని నాకు చెప్పడం మొదలు పెట్టాడు మా తాతయ్య. అప్పుడు విన్నదంతా ఎందుకనో ఇప్పుడు నాకు చటుక్కున గుర్తుకు వచ్చి, మనసంతా ఒకవిధమైన ఉద్వేగంతో నిండిపోయింది . . .

&&&&

పడమటి కనుమల్లోని నాసికా త్రయంబకం దగ్గర, కొండలలోని రాతి గుట్టలమధ్య ఒక నీటి ఊటగా పుట్టిన నది గోదావరి. ఆ నది మిట్టలనీ, గుట్టలనీ, పుట్టలనీ, చెట్టు చేమలనీ దాటుకుంటూ తూరుపువైపుగా, “నీరు పల్లమెరుగు” అన్నదానికి నిదర్శనంగా, అడుగడుగునా పల్లాన్ని వెతుక్కుంటూ తన పయనాన్ని కొనసాగించింది. మధ్యదారిలో గోదావరికి ఉపనదులుగా మరెన్నో నదులు వచ్చి కలిశాయి. అంతేకాదు, తాను  ప్రవహించి వస్తున్న దారిలో మరికొన్ని సెలయేర్లను, వాగులను, వంకలనూ, కొండకాలువలనూ కూడా తనలో కలుపుకుంటూ, ముందు ముందుకు కదులుతూ, “ఇంతింతై వటు డంతయ్యి“ అన్నట్లుగా, మహానదియై, జీవనదియై; జన్మభూమియైన మహారాష్ట్రనుండి తరలివచ్చి తెలుగునాట ప్రవేశించింది గోదావరి. కొంత దూరమలా పయనించి ఆపై ఆగ్నేయంగా ఒంపు తిరిగి, ముందుకు సాగింది. అక్కడ కూడా తూరుపు కనుమలలో పుట్టిన మరికొన్ని సెలయేరులు, వాగులు, వంకలూ వచ్చి గోదావరిలో కలిశాయి. ఆపై తూరుపు కనుమలైన పాపికొండల్ని చేధించుకుని వచ్చి రాజమహేంద్రవరం దగ్గర అఖండ గౌతమిగా పేరొంది, సమీపంలోనే ఉన్న ధవళేశ్వరం దగ్గర ఏడు పాయలుగా విడిపోయి సముద్ర తీరమైదానంలోకి ప్రవేశించి, తీరం పొడుగునా తూరుపు సముద్రమైన బంగాళాఖాతంలో ఏడుచోటుల్లో సంగమించింది గోదావరి.

కాలక్రమంలో గోదావరికున్న ఏడుపాయలలో కొన్ని లుప్తమైపోగా మిగిలి ఉన్న వాటిలో పెద్దవైన “వృద్ధగౌతమి” లేదా గౌతమి అన్న పేరున్న నదీపాయ వెళ్ళి యానాం దగ్గర తూరుపు సముద్రంలో కలిసింది. మరో పెద్ద గోదావరిపాయ “వశిష్ఠ". అది వెళ్ళి పుణ్యక్షేత్రమైన అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో విలీనమయ్యింది. ఈ వశిష్ఠ గోదావరినుండి లంకలగన్నవరం సమీపంలో మరోపాయ విడిపోయి “వైనతేయం” అన్న పేరుతో తరలివెళ్ళి నత్తారామేశ్వరం దగ్గర అది సముద్రాన్ని చేరుకుంది. వృద్ధగౌతమినుండి కూడా “నీల్రేవు” అని పిలువబడే చిన్న పాయ ఒకటి విడిపోయి వెళ్ళి తూర్పు సముద్రంలో కలిసిపోయింది. ఈ నీల్రేవు వలన అక్కడ ఐలెండ్ పోలవరం అనే కోనసీమలో భాగమైన చిన్న లంక ఒకటి ఏర్పడింది.

కొన్ని గోదావరి పాయలు ఎండిపోవడంతో నామమాత్రా వశిష్టాలయ్యాయి. నదుల చరిత్రలో ఇది కొత్తేమీ కాదు. కొన్ని నదులు కాలక్రమంలో దారిమార్చి వేరే వైపుకు ప్రవహించితే, మరికొన్నినదులు నీరులేక ఎండిపోయి తమ ఉనికినే కోల్పోతూ ఉంటాయి. అప్పుడప్పుడూ ఒక నదిలో మరొకనది కలవడమూ వింతకాదు. అంతేకాదు, మనుష్యులు కాలువలు తవ్వేటప్పుడు సౌకర్యం కోసం, చిన్న చిన్న నదీపాయలను కాలువలలో చేర్చడం కూడా జరుగుతూ, కర్మరణా నదులను నామరూప రహితాలుగా చెయ్యడమూ సర్వ సాధారణమే!

గోదావరి పాయలలో ఒకటైన తుల్యభాగ, కాకినాడ సమీపంలోని చొల్లంగి అన్న చోట సముద్రంలో కలిసిందని కొన్ని పాతకాలపు గాధలు మనకు చెపుతున్నాయి. కాని ఆ నది ఇప్పుడు మనకు అక్కడే కాదు, మరెక్కడాకూడా కనిపించదు. అయినా కొంతమంది జనం దానిని ఇంకా మర్చిపోలేక - ఎలాగైతే ప్రయాగను నదులైన గంగా యమునా సరస్వతులు కలిసిన చోటుగా, త్రివేణీ సంగమ పుణ్య క్షేత్రంగా చెపుతున్నారో - అలాగే తుల్యభాగను కూడా అంతర్వాహినిగా వచ్చి చొల్లంగి దగ్గర సముద్రంలో కలుస్తోందని, చొల్లంగి దగ్గరున్న సముద్రాన్ని తుల్యభాగా సాగరసంగమ క్షేత్రంగా భావించి, ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య నాడు చాలామంది జనం అక్కడ సముద్రస్నానాలు చేస్తూంటారు. ఆ సమయంలో ఆ తీర్థంలో పెద్ద తిరణాల కూడా జరుగుతుంది. అందుకే పుష్యమాసంలో వచ్చిన అమావాస్యను చొల్లంగి అమావాస్య - అంటారు.

నిన్న మొన్నటివరకు గోదావరికి, “కౌశిక” అనబడే మరో సన్నని పాయ కూడా ఒకటి ఉండేది. అది ఒకప్పుడు, ఇప్పటి అమలాపురం, కొత్తపేట తాలూకాలను చుట్టిచుట్టి ప్రవహించింది. ఆ తరువాత కోణసీమ (డెల్టా) (త్రికోణాకారపు నేల) లో కాలువలు ఏర్పడినప్పుడు, కౌశికని ఆ కాలువలలో కలిపెయ్యడంతో, చాలావరకు కౌశిక తన ఉనికిని పోగొట్టుకుంది. ఏడు పాయల్లో మిగిలిన మూడు ఆత్రేయ, భరద్వాజ, గౌతమి అన్నవి. వృద్ధ గౌతమిలో గౌతమి విలీనమవ్వగా, మిగిలినవి రెండూ ఎండిపోవడంతో కాలక్రమంలో అవి కేవలం  జ్ఞాపకావశిష్టాలయ్యాయి. అయినా మనవాళ్ళు వాటిని మర్చిపోలేదు. కొందరు “సప్తసాగర యాత్ర” అనే పేరుతో తరలి వెళ్లి ఈ ఏడు పాయలు ఎక్కడెక్కడ తూర్పుసముద్రంలో కలిశాయో గుర్తుచేసుకుని, ఆయా చోటుల్లోని సముద్రంలో స్నానాలు చేసి, గోదావరివైన ఏడుపాయల యొక్క సాగరసంగమ క్షేత్రాల్లో మునకలిడిన ఆనందాన్ని పొంది పునీతులౌతున్నారు.

సముద్రతీరమైదానంలో ప్రవేశించిన గోదావరి పాయలైన వృద్ధగౌతమి ఒకపక్క, వశిష్ఠ మరొకపక్క, మూడవవైపు తూరుపు సముద్రమైన బంగాళాఖాతం ఎల్లలుగాగల త్రికోణాకారపు (ట్రయాంగ్యులర్) భూభాగాన్ని పందొమ్మిదవ శతాబ్దంలో సగంరోజులకు పైవరకు జనమంతా “కోణసీమ” (త్రికోణాకారపు భూ భాగం) అనే అన్వర్థనామంతోనే పిలిచే వారు. కోణసీమని రెండుగా విభజిస్తూ ప్రవహిస్తూవుంది, వశిష్ఠ గోదావరికి పాయయైన వైనతేయం. మొదట్లో ఆ రెండు భాగాలు రాజోలు, అమలాపురం తాలూకాలుగా చెప్పబడ్డాయి. కానీ తరవాత కొంతకాలానికి, కోణసీమ కోనసీమగా మారాక, జనాభా బాగా పెరగడంతో, అమలాపురం తాలూకాను పాలనా సౌకర్యంకోసం రెండుగా విభజించారు. ఇప్పుడు ఆ ప్రదేశం రాజోలు, అమలాపురం, కొత్తపేట అనే మూడు తాలూకాలుగా ఉంది.

చుట్టూ ఎంతో నీరు ప్రవహిస్తూన్నాకూడా పందొమ్మిదవ శతాబ్దంలోని సగం రోజులు దాటేవరకూ కోణసీమలో వాళ్లకు దాహం తీర్చుకోడానికి సరైన నీరు ఉండేదికాదు. ఆ ప్రదేశంలో, జీవుల దాహార్తిని తీర్చగల తాగునీరు దొరకకపోడంతో జనం చాలా ఇబ్బంది పడేవారు. “కొబ్బరినీళ్ళయినా తేలికగా దొరుకుతాయి గాని, దాహంతీరా తాగడానికి మాత్రం మనకు గుక్కెడు మంచినీళ్ళు పుట్టవు కదా” అని బాధగా అనుకునేవారు అక్కడి వాళ్లు.

దగ్గరలోనే ఉన్న సముద్రపుటలల ఆటు పోటులవల్ల ఆ ప్రదేశంలోని నదీ జలాలు మాత్రమే కాకుండా, అక్కడి భూగర్భజలాలుకూడా ఉప్పగానో, చప్పగానో ఉండి, అక్కడి జనం యొక్క అవసరాలను తీర్చేందుకు పనికివచ్చేవి కావు. మంచినీటికి కోణసీమ వాసులకు ఎంతో కటకటగా ఉండేది. ఊరూరా చెరువులు ఉండేవి. ఆ చెరువులు వరదలు వచ్చినప్పుడూ, ఎడతెగని వానలు కురిసినప్పుడూ నీటితో నిండేవి. సంవత్సరం పొడవునా ఆ నిలవనీరే వారికి జీవనాధారంగా ఉండేది. ఆ నీటిని బిందెలతోనూ, కడవలతోనూ ముంచి తెచ్చుకుని తమ తమ అవసరాలకు వాడుకునే వారు అక్కడ నివసించేవారు. ఇండుప గింజలను సానపై అరగదీసి, ఆ గంధాన్ని తాము ఇంటికి తెచ్చుకున్న చెరువు నీటిలో కలిపేవారు. దాని వలన నీటిలోని మట్టి మొత్తం బిందె అడుగుకి చేరి, పైన స్వచ్ఛమైన నీరు తేరేది. ఇండుప గంధంలో ఉన్న ఔషధ గుణాలవల్ల పరిశుభ్రపడిన ఆ నీరు తాగేవారు అక్కడి వారు. ఏడాది పొడుగునా ఆ చెరువులలోని నిలవ నీరే గతి అయ్యేది వాళ్లకు. నూతులు తవ్వితే ఎక్కువ లోతుకి వెళ్లకుండానే జల పడేదిగాని ఆనీరు తాగడానికి యోగ్యంగా ఉండేది కాదు. ఆ నూతినీరు మరీ ఉప్పగా లేకపతే వాటిని ఇతర అవసరాలకు వాడేవారు. అయితే తాగడానికి చెరువు నీరే ఆధారం.

తాగునీరే కాదు, సాగునీరుకూడా కరువే అక్కడి వారికి. తగినంత సాగునీరు దొరకని కారణంగా ఆ రోజుల్లో ఆ ప్రదేశంలోని వారు తిండి గింజలకోసం జొన్న, సజ్జ, కొర్ర లాంటి చిరుధాన్యాలు, తదితర వర్షాధారపు పంటలు మాత్రమే పండించగలిగేవారు. కోణసీమలో ఉప్పునీటిని ఆశించే కొబ్బరి చెట్లు, ఏమీ ఎక్కువగా ఆశించని తాడిచెట్లు మాత్రం విస్తారంగా పెరిగేవి.

ఇవి ఇలా ఉండగా “ఉన్నకర్మకి ఉపాకర్మ కూడా తోడయ్యింది” అన్నట్లుగా - ప్రతియేటా గోదావరికి వరద రాగానే పల్లపునేల కావడంతో, కోణసీమలోని చాలా ఊళ్లు ఆ వరదముంపుకి గురయ్యేవి. వరద ఉధృతమై ఊళ్ళను ముంచినప్పుడు అక్కడి వాళ్లు అటకలమీద, ఇంటి పైకప్పుల మీద వరద తగ్గేవరకూ కాపురం ఉండవలసివచ్చేది. పుట్టలలోని పాములు కొన్ని చెట్లమీద చేరి ప్రాణాలు దక్కించుకొనేవి. ఎన్నో జీవులు వరదనీటి వడిలో పడి, సముద్రంలోకి కొట్టుకుపోయి నశించిపోయేవి. రోజుల తరబడి వరద నీటిలో మునిగివున్న పంట పొలాలు సరైన ఫలసాయాన్ని ఇచ్చేవి కావు. ఏటా ఏటా వచ్చే వరదనీరుతో పాటుగా కొట్టుకొచ్చిన ఒండ్రు మట్టివల్ల భూసారం బాగా పెరుగుతూ ఉండేదిగాని, ఏమి లాభం! వరదల మూలంగా ఏటా చక్కగా పెరుగుతున్న పంటపొలాలు నీట మునిగిపోవడం వల్ల పంట నాశనమవ్వడంతో ఎల్లవేళలా కోణసీమలో కరువురక్కసి విలయతాండవము చేస్తూ ఉండేది. రెండు పూటలా నాలుగు వేళ్ళూ నోట్లోకి పోయిన అదృష్టవంతులు అక్కడ బహు కొద్దిమంది మాత్రమే ఉండేవారు ఆ రోజుల్లో. రెండు సాగరసంగమ ప్రదేశాలకు మధ్యలో, మరీ సాగరతీర సమీపంలో ఉందేమో, వరద సమయంలో రాజోలు తాలూకాకు ముంపుబాధ చాలా ఎక్కువగా ఉండేది అప్పట్లో. అదిచాలదన్నట్లు "సైక్లోనిక్ జోన్"లో ఉండడం వలన తరచూ  గాలివానలు వచ్చేవి. అంతేకాకుండా సముద్రతీర ప్రాంతం కావడంతో అడపా తడపా వచ్చే ఉప్పెనల బెడదకూడా ఉంది కొన్ని ప్రాంతాలలోని కోణసీమ వాసులకి. ఇది పంతొమ్మిదవ శతాబ్దం సగం రోజులవరకు ఉన్న కోణసీమ వాసుల పరిస్థితి.

****కథ ఇంకా ఉంది****

Posted in June 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!