Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
శ్రీరాముఁడు

శ్లో.   స్మరామి శ్రీలక్షణలక్షితాస్యం
      భజామి భక్తాభయదానహస్తమ్
      నమామి శాపాపహపాదపద్మం
      వదామి మంత్రద్వయమూలవర్ణమ్II                                        57

కం.  శ్రీరామ యని తలంచినఁ
      గారుణ్యముతోడఁ ద్వరగఁ గాన్పించి వెతల్
      దీరిచి ప్రోచెడి సీతా
      మారుతిలక్ష్మణసమేతు మది భావింతున్ 58

చం.  అవనిసుతామనోఽoబుధిసుధాంశువు లాప్తశరణ్యముల్ సురారికై
      రవమదకుంజరంబులును రాతిని నాతిగఁజేసి మించి పా
      ర్థివమకుటాగ్రరత్నఘృణిదీప్తములై విలసిల్లునట్టి యా
      పవనసుతుండు పట్టు పదపంకజముల్ మముఁ బ్రోచుఁగావుతన్           59

రథోద్ధతము

     ఆంజనేయహృదయాబ్జమందిరా!
     మంజుభాష! సుకుమార! సుం దరా!
     రంజితార్యజన! రామభూవరా!
     కంజనేత్ర! మముఁ గావు శ్రీకరా!                                               60

సీ.   దశరథప్రభునకుఁ దానె సర్వంబయి
           ధరణీప్రజలఁ గన్నతండ్రి యగుచు
     మౌనీశ్వరాళికి మాన్యచరిత్రుఁడై
           ప్రబలతాపసమఖత్రాత యగుచు
     సీతాంబుజాక్షికిఁ జిత్తాభిరాముఁడై
           యా యహల్యాశాపహర్త యగుచు
     చండప్రచండరాక్షసపాళిరుద్రుఁడై
           ధర్మసంస్థాపనాదక్షుఁ డగుచు

తే.గీ. ఆర్తులకుఁ బుణ్యమూర్తియై యార్తిఁ బాపి
      భక్తజనులకు వేవేగ వరము లిచ్చు
      రఘుకులాంబుధిచంద్రుఁడు రామవిభుఁడు
      మన్మనస్సీమ సతతంబు మసలుఁగాక!                                            61

లయగ్రాహి

     శ్రీరఘుకులేశవరు ఘోరదురితాగమకు
          ఠారు నసురాంబుదసమీరుని గభీరున్
     వీరు క్షితిజాహృదయచోరు నతభక్తజన
          వారు మునిమానసవిహారు భవదూరున్
     వారినిధిదుర్మదవిదారు శితికంఠనుత
          సారగుణవారు రణధీరుని వినీలా
     కారు ఘనసమ్యగవతారుని ద్విషత్తిమిర
          సూరు భజియించెద నపారచిదగారున్                                         62

సీ.   నరపాలమకుటరత్నప్రభాభాసిత
          చరణ! పాతకభవజలధితరణ!
     శరణాగతాళిదుష్కరణవిస్మరణ! భూ
          భరణ! వజ్రాంచితాభరణకిరణ!
     శరధరశ్యామలకరణ! శ్రీకంఠసం
          స్మరణ! వేదాంతసంచరణ! శరణ!
     ధర్మోద్ధరణ! దుష్టదైత్యాధినాథసం
          హరణ! భూపుత్రీమనోఽపహరణ!

తే.గీ. ప్రథితసత్యాచరణ! సురవరమునీంద్ర
      నుతతనుద్యుతివిస్ఫారజితసహస్ర
      కిరణ! దిఙ్మండలవ్యాప్తకీర్తికిరణ!
      భక్తమానసవిహరణ! భవ్యశరణ!                                                  63

తే.గీ. పరమునందున నీ పదసరసిజముల
      చెంత నిలువంగ నిచ్చినఁ జిద్విలాస!
      ఎల్లవేళల ననవద్యహృద్యపద్య
      గద్యవిద్యాసుమంబులఁ గాన్కనిత్తు                                                64

కం.  పాపాపహతాపాపహ
      శాపాపహపాదసరసిజాతద్వయసే
      వాపారభాగ్య మితర
      వ్యాపారప్రాప్త మగునె? భద్రగిరీశా!                                                 65
Posted in June 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!