Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

రామలింగ అడిగలార్ (వళ్ళలార్) - 1823

Ramalinga Adigalar
Photo Credit: My Dattatreya

వళ్ళలార్ ఆధునిక తమిళ సాహిత్య వినీలాకాశంలో ప్రసిద్ధ శివభక్తునిగా, సుబ్రహ్మణ్య స్వామి భక్తునిగా, తత్వజ్ఞానిగా, సంఘసంస్కర్తగా ప్రకృతి ప్రియునిగా పేరుగాంచిన మహానుభావులు. తమిళనాడుకు చెందిన చిదంబరం దగ్గర గల మరుదూర్ గ్రామపు నివాసి అయిన రామయ్య పిళ్లై, చిన్నమ్మ దంపతులకు క్రీస్తు శకం 1823 అక్టోబర్ 5వ తేదీన ఈయన జన్మించారు. ఈయన అసలు పేరు రామలింగం పిళ్లై. చిన్నప్పటి నుంచి తన అన్న సభాపతి పిళ్లై దగ్గర, తర్వాత కాంచీపురం లోని మహా పండిత సభాపతి మొదలియార్ దగ్గర ఈయన అధ్యయనం చేశారు. విద్యాభ్యాసం చేయడానికి స్కూలుకు పంపినప్పటికీ ఆయన మనసు అందులో రుచించలేదు ఎందుకంటే ఆయన కారణ జన్ములు పూర్ణజ్ఞాని అయిన వ్యక్తి.  చిన్నప్పటినుండి ఆయన అన్న పేరుతో కొలువబడుతున్న సుబ్రహ్మణ్యస్వామి పైన ఆయన తన మనసును అంకితమిచ్చేశారు. 9వ వయసులో పూర్ణ రూపంగా ఆయనపై సుబ్రహ్మణ్యస్వామి భక్తి ప్రభావం పడింది. ఈయన తన పద్యాల్లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకున్నారు “ఎన్నై ఆండ ఆర్మూండిల్ ఆట్ కొండ కడవుళే” అని చెప్పారు. తన 12వ వయసులో ఈయన ఆధ్యాత్మిక యాత్రను మొదలుపెట్టారు. శైవ సాహితీకారులు మరియు శైవ భక్తులను తమిళంలో నాయన్మారులు అంటారు. వీరి సంఖ్య 63 అందులో ఒక స్త్రీ కారైక్కాల్ అమ్మైయార్ కూడా ఉంది. వీరిలో నలుగురు భక్తులు చాలా ప్రసిద్ధి పొందిన వారు అప్పర్, సుందర్, మాణిక్య వాచకర్, తిరుజ్ఞాన సంబంధర్. సంబంధర్, మాణిక్య వాచగర్ గార్ల భక్తి ప్రభావం రామలింగంపై పడింది. అదేలాగా శైవపవిత్ర గ్రంథమైన తిరువాచకం ఆయన ఎప్పుడూ చదివేవారు. ఈయన రచనలు 37 అని చెప్పబడుతున్నది. మనుమురై కండవాచకం, తొండ మండల శతకం, శివ నేసన్ వె ణ్బా మహాదేవన్ మాలై, ఇంగిదమాలై మొదలగునవి ప్రసిద్ధి చెందినవి. ఈ రచనలను వేలాయుధ మొదలియార్గారు నాణ్గు తిరుమురై (నాల్గు వేదములు) అని సంకలనం చేసి తిరువరుట్పా (దివ్య కృప గీతాలు) అని పేరు పెట్టారు. ఇది 1867లో ముద్రింపబడింది.

ఈయన వివాహము బంధువుల ద్వారా మామ కూతురైన ధనమ్మాళ్ అనే యువతితో బలవంతంగా జరిపించబడింది. వివాహపు తొలి రాత్రి ఈయన శైవ గ్రంథం తిరువాచకాన్ని పట్టుకొని చదువుతూ గడిపారని మరుసటి రోజు గ్రహ త్యాగం చేశారని చెప్పబడుతున్నది. తమిళంలో దయాగుణంతో నిండిన దాన గుణం గలవాళ్లను వళ్ళలార్ అంటారు. సమస్త జీవరాశులను కరుణతో చూసి ప్రేమను వర్షించే హృదయం గల రామలింగ అడిగళ్ ను జనులు వళ్ళలార్ అని ప్రేమతో పిలవసాగారు. ఆయన ప్రేమ మానవులకే కాక పశుపక్షాది సమస్త జీవరాశులకు చెట్లకు కూడా సొంతమైనది. “వాడిన పైరై కండ బోదెల్లాం వాడినేన్” అని చెప్తున్నారు (ఎక్కడంతా మొక్కలు వాడిపోయి నీళ్లులేక కనిపిస్తుందో అప్పుడంతా నా మనస్సు శుష్క- మవుతున్నది అన్నారు. ఆయన కొన్ని వేల మొక్కలను ప్రతిదినం రోడ్డుకి ఇరు ప్రక్కల నాటింప చేసి హరిత విప్లవానికి నాయకులయ్యారు. ఆయన ఒక సిద్ధ పురుషుడు కూడా. ఆయన తన రచన ‘తిరు వరుట్ పా’ లో మరణం లేని అమృత జీవనాన్ని గురించి రాశారు. ఆయన శివ భక్తిలో మునిగి “ఎవరైతే మరణాన్ని చూసి భయపడరో వారిని చూసి మరణ దేవత భయపడుతుంద”ని నొక్కి చెప్పారు. “సాగా అరుళ ముదం నాన్ అరిందిన ఎనక్కు శివణే కధ వై తిరవాయ్” అన్నారు. “పరమేశ్వరా! మహాదేవ నా శివుడా! నీ వరం అనబడే అమృతాన్ని నాకు ప్రసాదించు, ఆ అక్షయ వరంతో మరణ రహితమైన ద్వారాన్ని నాకు తెరిపించు, అమరత్వాన్ని పొంది నేను మృత్యురహితుడై కాలాన్ని జయించి నీ కృపపాత్రుడవుతాను” అన్నాడు తిరువరుట్ ప్పా -పద్యం 3831.

ఆధ్యాత్మిక చింతనము జీవ కారుణ్య భావనలతో ఆయన మనస్సు ఎప్పుడూ నిండి ఉండేది. జాతులపేరిట, భక్తిపేరిట, మతాల పేరున నెలకొని ఉన్న అంధవిశ్వాసాలను మూఢ నమ్మకాలను ఆయన ఖండించారు.  మన సమాజంలో జాతి పేరిట, మతం పేరిట ఉన్న మూడవిశ్వాసాలను కర్మకాండాలను మూఢనమ్మకాలను మనము తొలగించకపోతే మన జీవితం అంధకారం అయిపోతుంది అన్నారు. శాస్త్రముల పేరిట ఆచారాల పేరిట జాతిని మతాన్ని భక్తిని పక్కన ఉంచుకొని అంధవిశ్వాసాలు మన హిందూ సమాజంలో పేరుకుపోయాయి. వాటి ద్వారా మనుషులపైనే జరిగే అత్యాచారాలను కుప్ప తొట్లలో విసిరి వేయండి.  సన్మార్గమ అనే మార్గంలో పయనించండి అని ఆయన చెప్పారు. ఆయన రచనలు ఎన్నో ఆయుర్వేద మొక్కలను గురించి, చికిత్స పద్ధతులు గురించిన వివరాలతో ఉన్నాయి. ఆయనకు అరుళ్ సిద్దర్ అని ఇంకో పేరు కూడా సమాజంలో ఉంది. అంటే ఈశ్వర అనుగ్రహాన్ని పొందిన మహా సిద్ధ కవి అని అర్థము. నీతి బోధలకు భక్తికి ఆయన సిద్ధాంతాలు పెట్టిన పేరు. ఆయన మూడు ప్రకారాలైన సంస్థను స్థాపించారు.

  1. సన్మార్గ సత్య జ్ఞాన సభ: ఇందులో అన్ని జాతుల, మతాల, కులాల వారు ఎలాంటి భేదభావం లేకుండా కలిసిమెలిసి కూర్చుని ధ్యానం మరియు ప్రార్థనలు చేయవచ్చు.
  2. సత్య ధర్మ మార్గ సభ: ఇక్కడ పేదవాడు, షావుకారు, ఆడ మగ, అగ్ర వర్ణం, నిమ్న వర్ణం అన్న భేధభావం లేకుండా అన్ని జాతుల మతాలవారు ఒకే చోట ఒకే పంక్తిలో కూర్చుని భోజనం చేస్తారు. ఇప్పుడు కూడా ఆయన నిత్య అన్నదాన పథకం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంది. అక్కడ పెద్ద పెద్ద హుండీలలో డబ్బులు వేయకుండా అక్కడ వచ్చే భక్తులందరూ బియ్యము వివిధ రకాలైన పప్పుదినుసులు, కందిపప్పు, మినపప్పు ఆవాలులాంటిని ఆ హుండీలో సమర్పిస్తారు. ఆయన ద్వారా వెలిగించబడిన అన్నదాన జ్యోతి ఈనాటి వరకు ఆరకుండా వెలుగుతూనే ఉంది, 24x7అక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆ అన్నదానాన్ని ఈ వ్యాసకర్త (లక్ష్మి అయ్యర్) కూడా భుజించి ఆయన దీవెనలకు నోచుకున్నారు.
  3. సత్య వేద పాఠశాల: ఇక్కడ యోగ్యులైన పండితుల ద్వారా అందరికీ సన్మార్గ సిద్ధాంతము మానవతా సిద్ధాంతము బోధించబడుచున్నది. వళ్ళళార్ గారు ఆనాటి సమాజపు అంధ విశ్వాసాలతో మూఢాచారాలతో కూడిన కట్టుబాట్లను పెకిలించి తీసిన పెద్ద సంఘసంస్కర్త. ఆ కాలంలో కొంతమంది అగ్రవర్ణులు ఆగ్రహించి ఆయనకు ఎదురుగా కోర్టుకు కూడా వెళ్లినట్లు చెప్పబడుచున్నది. కానీ ఆయన దేన్నీ పట్టించుకోకుండా మానవ సేవ చేసిన మహోన్నత సంఘసంస్కర్త ఈనాడు కూడా తమిళనాడులోని వడలూరు లో ఆయన మహిమలు కొనియాడబడుతున్నవి. ఆయన పద్యాలలోని రెండు వాక్యాలను గర్వంగా జనులు చెప్పుకుంటారు.

“అరుట్ పెరుంజ్యోతి” అని ఆయనను సంబోధిస్తారు. దానికి అర్థము ‘కృపామయమైన మహాజ్యోతి స్వరూపుడా! కృపామయుడైన మహాజ్యోతి స్వరూపుడా విశిష్ట కారుణ్యంతో కూడిన దయా స్వరూపుడా’

ఆయన గొప్ప శివ భక్తుడు. శంకరుని అఖండ తేజోజ్యోతి స్వరూపాన్ని దర్శించి తన్మయత్వంతో, భక్తితో, జీవ కారుణ్య తత్వంతో, దయతో నిండిన హృదయంతో, కరుణాపూరిత నేత్రాలతో, ప్రజలకు ఎంతో నిస్వార్థ సేవ చేశారు. మరణము లేని కాల జయ దివ్య జీవనాన్ని పొందాలంటే మనము బ్రహ్మాండంలో ఉన్న సమస్త జీవరాశులకు అధిపతి అయిన పరమాత్మ జ్యోతి దర్శనాన్ని ప్రతి జీవిలో చూడాలి. ఆ పరబ్రహ్మ స్వరూపమైన జ్యోతి స్వరూపుడైన భగవంతుడు ఇంద్రియనిగ్రహం తో ఉన్న ఆత్మలో దర్శనమిస్తాడని ఈయన భావన. ఆ పరమానంద స్థితిలో మరణాన్ని పిలిచే, పిలుపునిచ్చే ధైర్యం కూడా ఆత్మకు వస్తుంది. ఆయన అలాంటి స్థితికి వచ్చిన మహానుభావుడు. ధ్యానస్థితికి వెళ్లి రెండు గంటల ముందే తన ఆత్మ జ్యోతితో కలుస్తుందని చెప్పాడు. అంతేకాదు తనకు చావు లేదు తను ఎప్పుడైనా ఈ లోకానికి తిరిగి వస్తాను, విదేశాల్లో కూడా నేను సంచరిస్తాను దానికంతా కారణం జ్యోతి స్వరూపమైన నా శివుడే అంటూ తన ధ్యాన మందిరంలో వెళ్లి తలుపు వేసుకొని జ్యోతిలో లీనమైపోయాడు. బ్రిటిష్ వారు ఎంక్వయిరీ పెట్టి తలుపు తెరిచి చూస్తే ఒక్క దీపం మాత్రమే వెలుగుతూ కనిపించింది. అందుకే ఆయన మరణ రహితమైన జ్యోతి స్వరూపుడని కొనియాడబడ్డాడు. నవ్వుతూ నవ్వుతూ భగవంతుని స్మరిస్తూ మనము మరణాన్ని ఆహ్వానిస్తే మృత్యుదేవత మన ముందు తన ఓటమిని స్వీకరిస్తుంది. ఇదే సిద్ధాంతం వళ్ళళార్ ద్వారా స్థాపించబడ్డ సమరస శుద్ధ సన్మార్గపు లక్ష్యము. ఆయన భక్తి మార్గము పూర్ణ రూపంగా నిర్గుణ మార్గము. ఎల్లలు లేని కరుణ ప్రేమతో కూడిన అఖండ జ్యోతి స్వరూపమైన శివుడు అంతటా నిండి ఉన్నాడు కానీ ఆయనను దర్శించాలంటే దానికి మనము నైతిక విలువలను పాటించాలని ఆయన నమ్మకము. సత్యము అహింస కరుణ ప్రేమ ఇతరులను వంచిoపకుండడం సత్యాన్ని పలకడం, ఉన్నంతవరకు శరీరాన్ని రోజుకు రెండు పూటలా స్నానం చేసి శుభ్రంగా ఉంచుకోవడం, మత్తు పదార్థాల నిషేధం, శాకాహార సేవనం, ఇలాంటివన్నీ ఆయన స్థాపించిన సంస్థ యొక్క సిద్ధాంతాలు. వళ్ళలార్ స్వామిని చూస్తేనే స్వచ్ఛత నిండి ఉంటుంది. తల నుండి మోకాలు వరకు శాంతికి చిహ్నమైన శ్వేత వస్త్రాన్ని ధరించి ఉంటారు. ఎప్పుడూ ఆయన దగ్గర ఉండేవి రెండే రెండు పంచలు మాత్రమే అని అందరూ చెప్తుంటారు. తనకు ధనవంతులు ఇచ్చిన దానాన్ని పేదలకై పంచి పెట్టిన మహా దాత. ఆయన కళ్ళు కరుణతో నిండిన ఆర్దనేత్రాలు మనసు సాత్విక గుణాలతో నిండిన భాండాగారం. ఆయన ముఖ దర్శనం చూస్తేనే జన్మ సార్థకం అవుతుంది అంటుంటారు. ఆయన భక్తుడు, సాధువు, తత్వజ్ఞాని, సంఘసంస్కర్త అన్నింటికీ మించి నైతిక విలువలతో కూడిన సాహిత్య కారుడు. ఆయన సిద్ధాంతాలు పామరజనులే కాక రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తలు, విప్లవంతో కూడిన నేతలు, ఆయుర్వేద వైద్యులు అన్ని వర్గాల వారు స్వీకరిస్తారు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలు మానవ మనుగడ వికాసానికి మంచి నడవడికకు నైతిక మూల్యాలకు తార్కాణాలు. “ఇలా బతికాం అలా పోయాం” అన్నది మాట కాదు, మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మన పేరు మన కార్యాలు జనులకు ఉపయోగపడాలని నమ్మే వ్యక్తి. ఆయన భక్తి మార్గాన్ని అనుసరిస్తే ఈనాడు విశ్వమంతా, దేశమంతా ఆయన ద్వారా కోరుకున్నసర్వ జీవ సమాన  సమాజం సర్వ సమానత్వంతో కూడిన సమాజము మనకు కనపడుతుంది. విశ్వమంతా నిండి ఉన్న జనులు జాతి మతము లింగ వర్గ భేదాలన్నింటినీ మరిచి సర్వసమానత్వంతో ఆత్మీయతతో ఒకటిగా మెలిగి జీవనం సాగించాలని ఆయన కోరుకున్నారు.

****సశేషం****

Posted in June 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!