Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 10
సత్యం మందపాటి

స్పందన

విజయవాడలో నా కళ్ళెదురుగా జరిగిన రెండు దుర్ఘటనలు కలిపి నేను వ్రాసిన నాకెంతో ప్రియమైన కథ ఇది. ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడి ఈ జూన్ నెలకి సరిగ్గా యాభై సంవత్సరాలయింది. అంటే నేనెంతో ఇష్టపడేకాక, కష్టపడి వ్రాసిన ఈ కథకి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. ఈ కథని ఇంకా గుర్తుపెట్టుకుని ఇప్పటికీ కొంతమంది నాకు ఫోన్ చేసి చర్చిస్తున్నారంటే నాకే ఆశ్చర్యంగా వుంది. అంతగా పాఠకుల హృదయాల్లో నిలచిపోయిందీ “నాలుగో కోతి”. అంతేకాదు యూట్యూబులో ఎంతోమంది రచయితల కథలు చదువుతున్న ఒక కథా కళాకారిణి, ఒక సంవత్సరం క్రితం తనంతట తనే మైల్ పంపించి, ఈ కథ తన మనసులో ఏనాటినించో ముద్ర వేసిందనీ, ఇది చదవటానికి నా అంగీకారం కావాలనీ అడిగారు. వెంటనే ఆవిడకు ‘తప్పకుండా చదవమని, ఇలాటి కథలు చదవటానికి నా అంగీకారం అనవసరమనీ, చదువుతున్నట్టు చెబితే చాలు అని చెప్పాను. ఇప్పుడు అదే కథతో ఈ ‘అనగనగా ఆనాటి కథ’ శీర్షికలో ‘సిరిమల్లె’ పాఠకుల దగ్గరకు వస్తున్నాను. ఈ కథకు స్వర్ణోత్సవ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ, స్వీకరించండి. మీ అభిప్రాయం కూడా చెబుతే, అంతకన్నా ఆనందం ఏముంటుంది.

నాలుగో కోతి!

(ఈ కథ ‘ఆంధ్ర సచిత్ర వారపత్రిక’, జూన్ 22, 1973 సంచికలో ప్రచురింపబడింది)

Nalugo Kothi Story Image

నేను ఆఫీసులోకి ప్రవేశించేసరికి బ్రేక్ ఇన్స్పెక్టర్ భూపతి సిగరెట్ త్రాగుతూ ఏదో ఫైల్ చూసుకుంటున్నాడు. నన్ను గమనించలేదో గమనించీ చూడనట్లు ఊరుకున్నాడో అర్ధంకాలేదు. కానీ తలెత్తకుండా ఏదో వ్రాసుకుంటున్నాడు.

రెండు నిమిషాలు అలాగే నుంచుని చిన్నగా దగ్గాను.

ఆయన తల ఎత్తాడు.

“గుడ్ మార్నింగ్ సార్” అన్నాను.

“గుడ్ మార్నింగ్. కూర్చోండి” అంటూనే తను చూస్తున్న ఫైలులో ముణిగిపోయాడు.

కాసేపాగి “మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. క్షమించాలి!” అన్నాను.

ఆయన మళ్ళీ తలెత్తాడు.

“నేను క్రొత్తగా ఒక లారీ కొన్నాను. రిజిస్ట్రేషన్ చేయించి, ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుందామని వచ్చాను. కాగితాలు ఇచ్చి నాలుగు రోజులయింది. మీరు కొంచెం దయవుంచి త్వరగా పని పూర్తి చేస్తే… “

ఆయన కొంచెం విసుగ్గా చూశాడు. “కాగితాలు ఇచ్చారుగదా. తొందరపడతారేం. ఆఫీసు ప్రొసీజర్ ప్రకారం కొంచెం ఆలస్యం అవుతుంది మరి. రెండు రోజులు ఆగి రండి” అన్నాడు.

“అదికాదు సార్. అంత డబ్బు ఖర్చుపెట్టి కొన్న లారీ నడవకపోవటం వల్ల రోజూ ఎంతో డబ్బు నష్టపోతున్నాను. మొన్నే లారీని చూసి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారనుకున్నాను. ఆరోజు చూడలేదు. నిన్న చూస్తానన్నారు. చూడలేదు. కనీసం ఇవాళయినా…”

ఇంతలో స్వింగ్ డోర్స్ తెరుచుకుని పొడుగ్గా, బలంగా, చామనచాయగా వున్నాయన హుందాగా లోపలకు అడుగుపెట్టాడు. వస్తూనే నవ్వుతూ, “నమస్తే భూపతిగారూ” అన్నాడు. అంటూనే కుర్చీ ముందుకు లాక్కుని కూర్చున్నాడు.

ఆయనెవరో నాకు బాగా తెలుసు. దాదాపు పది బస్సులకు, నాలుగైదు లారీలకు అధిపతి. పట్టణంలో వున్న గొప్పవాళ్ళల్లో ఒకడు. పేరు అంకినీడు.

“ఊరకరారు మహానుభావులు. ఏదో పెద్ద పని మీదే వచ్చినట్టున్నారే అంకినీడుగారు” అన్నాడు భూపతి నవ్వుతూ.

“మీతో మాకు వేరే పనేముంటుంది సార్!” అంటూ ఆయనా నవ్వాడు.

భూపతి బల్ల మీద మూడు కోతుల బొమ్మ వుంది. దాని ‘మీద చెడు వినకు, చెడు చూడకు, చెడు చెప్పకు’ అని వ్రాసి వుంది.

అది చూస్తూ అన్నాడు అంకినీడు. “కొత్తగా గాంధీగారి బొమ్మ పెట్టారే. ఐనా అవేం నీతుల్లెండి ఈ కాలంలో” అదోరకంగా నవ్వాడు.

భూపతి అన్నాడు, “ప్రజలదేం తప్పు లేదంటాను. చెడు వినవద్దు, చూడవద్దు, చెప్పవద్దు అనే మూడు కోతులు చెబుతున్నాయిగానీ, చెడు చేయవద్దు అని చెప్పే నాలుగో కోతి ఏది? అందుకే అందరూ చెడ్డ పనులు చేస్తున్నారు. బాగుపడుతున్నారు”

అంకినీడు ఆయన హాస్యానికి పెద్దగా నవ్వాడు.

భూపతి తన ముందున్న సిగరెట్ పెట్టెను అంకినీడుకి అందించాడు.

అంకినీడు సిగరెట్ వెలిగించి, నిర్లక్ష్యంగా పొగ వదులుతూ అన్నాడు. “ఒక చిన్న పని తగిలింది సార్. మన నైంటీన్ ట్వంటీటూ లేదూ, దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలి!”

భూపతి పెద్దగా నవ్వాడు.

“ఫిట్నెస్సా… ఆ డొక్కు సిటీ బస్సుకా! ఏమన్నా బాగుచేయించారా, ఇంకా అలాగే నడుస్తున్నదా?”

అంకినీడు కూడా చిన్నగా నవ్వాడు.

“రిపేరా? భలేవాళ్ళు సార్ మీరు. దానికి రిపేర్ మొదలుపెడితే మంగళగిరి పానకాలస్వామిలా తాగేస్తుంది. ఆఁ ఏదో రోడ్డు మీద నడుస్తున్నదిగదా. నడవనీయండి. ఇప్పుడు నేనంత డబ్బు ఎక్కడ తేగలను?”

“మరయితే నేను ఫిట్నెస్ ఎలా ఇస్తాననుకున్నారు?” అన్నాడు భూపతి.

అంకినీడు మళ్ళీ నవ్వాడు.

ఈలోగా భూపతి నాకేసి తిరిగి, “మీ లారీ బయట వున్నదా?” అడిగాడు.

లేచి నిలబడి “ఉంది సార్. చూస్తారా?” అడిగాను.

“బయట ఉండండి. కాసేపట్లో వస్తాను” అన్నాడు భూపతి.

ఒక నమస్కారం పారేసి బయటకు వచ్చాను.

అక్కడంతా హడావిడిగా వుంది. ఎంతోమంది చేతుల్లో రిజిస్ట్రేషన్ పుస్తకాలతోనూ, టోకెన్సుతోనూ హడావిడిగా తిరుగుతున్నారు. ఒక గంట గడిచింది. నా ఎదురుగానే అంకినీడు కారెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత అరగంటకి భూపతి బయటకు వచ్చాడు. బయట వున్న కొన్ని వెహికిల్స్ అసలు చూడనే లేదు. ప్రక్కనే వున్న డ్రైవర్లతో “ఫిట్నెస్ అయిపోయింది. బండి తీసుకుపోవచ్చు” అన్నాడు. అంటే బండి చూడకుండానే ఫిట్నెస్ సర్టిఫికేట్ తయారైంది అన్నమాట. కొన్ని బళ్ళకు ఏవో వంకలు పెట్టాడు.

“మీ లారీ ఏది?” అడిగాడు బ్రేక్ ఇన్స్పెక్టర్.

చూపించాను. ఎక్కి స్టార్టు చేశాడు. కొంచెం ముందుకీ వెనక్కీ రెండు మూడుసార్లు నడిపాడు. సడన్గా బ్రేక్ కొట్టాడు. ఠక్కున ఆగింది. క్రిందకు దిగి నెంబర్ ప్లేట్లు రెండూ చెక్ చేశాడు. నన్ను పిలిచి, స్టాప్ సైన్ బోర్డు సరిగ్గా వ్రాయించలేదన్నాడు. బ్రేకు గట్టిగా పట్టుకుంటున్నదిట. అది బాగుచేయించాలన్నాడు. రియర్ వ్యూ అద్దం మరీ చిన్నదయింది, సరిగ్గా కనపడటం లేదన్నాడు. పెద్దది వేయించమన్నాడు.

అన్నిటికీ సరేనన్నాను.

“అన్నీ బాగుచేయించి, రేపూ ఎల్లుండి శెలవు కనుక సోమవారం తీసుకురండి. అప్పుడు చూద్దాం. ఇటువంటి బళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలని ప్రాణం తీస్తారు!” సణుగుతూ లోపలికి వెళ్ళిపోయాడాయన.

అది సరికొత్త బండి. అయినా ఈయన వంకలు పెడుతున్నాడు. నాకేం చేయాలో తెలియలేదు.

చుట్ట కాలుస్తూ అక్కడే నుంచున్న ప్యూన్ నన్ను చూసి అదోలా నవ్వాడు. చుట్ట పారేసి నా దగ్గరకు వచ్చాడు.

“ఏం సార్, పనయిందా? అయ్యగారు ఏమన్నారు? మీ ముఖం చూడగానే తెలుస్తున్నది సార్ పనవలేదని. మీరు నేను చెబితే వినరు సార్. మీరు ఊఁ అనండి. ఐదు నిమిషాల్లో మీ పని పూర్తవకపోతే నన్నడగండి. ఇప్పుడే వెళ్ళిన అంకినీడుగారిని చూడండి. ఆయన ఆ డొక్కు బస్సుని ఇక్కడకు తేకుండనే, అయ్యగారు బండి చూడకుండానే సర్టిఫికేటుతో ఇంటికి వెళ్ళిపోయారు. చూశారా. ఆయన వచ్చారంటే వెంటనే పని చేయించుకుని వెళ్ళిపోతారు. మాకూ, ఆయనకూ, అందరికీ హాయి. మీరు ఇన్నాళ్ళనించీ తిరుగుతూ…”

అతని మాటలు వినకుండా ముందుకు నడిచాను. అక్కడ వెంటనే పని అవాలంటే ఏం చేయాలో కూడా తెలుసు. అంత అమాయకుడినేమీ కాదు. కానీ నా ఆశయాలకు అది విరుధ్ధం.

ఇన్ని రోజులనుండీ నా లారీ రోడ్డు మీద నడవకపోవటం వల్ల నష్టం నా మదిలో మెదిలింది. ‘ఏం, కొంత డబ్బు పారేస్తే త్వరగా అవుతుంది కదా’ అని అడుగుతున్నాడు నాలోని సామాన్యుడు. మళ్ళీ ప్రిన్సిపల్ అడ్డం వచ్చింది.

అందుకే ప్యూనుతో ఏమీ అనకుండా బయటికి వచ్చాను. అతను వెనకనించే సణగటం వినిపిస్తూనే వుంది.

మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిన ‘రిపేర్లు’ అన్నీ చేయించి మళ్ళీ వచ్చాను.

అదేం ఖర్మమో, నేను భూపతి దగ్గరకు వెళ్ళిన మరుక్షణంలోనే లోపలకు హడావిడిగా వచ్చాడు అంకినీడు.

కుర్చీ లాక్కుని కూర్చుని, దీక్షగా చూశాడు భూపతిని.

భూపతి అతన్ని వింతగా చూశాడు.

“కొంపలంటుకున్నాయి సార్. మా బస్సుకి పెద్ద ప్రమాదం జరిగింది” నుదుటికి పట్టిన చెమటను చేతి రుమాలుతో తుడుచుకుంటున్నాడు.

భూపతి ఆసక్తిగా చూశాడు, “ఏ బస్సుకి?” అడిగాడు.

“మొన్న మీరు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిందే. నైన్టీన్ ట్వంటీటూ”

భూపతి కూడా కొంచెం కలవరపడ్డట్టు కనిపించాడు. మెల్లగా అడిగాడు, ఏక్సిడెంట్ ఎలా అయిందని.

అంకినీడు ఎండిన పెదవులు నాలికతో ఒకసారి తడి చేసుకుని అన్నాడు. “ఏం లేదు సార్. మైన్ రోడ్డులో మా బస్ వెడుతున్నదిట. రూల్స్ ప్రకారం ఎడమ పక్కనే వెడుతున్నాడుట. హఠాత్తుగా ఒక గేదె అడ్డం వచ్చిందిట. బ్రేక్ వేస్తే పడలేదు. గేదె మీదకు బస్సు ఎక్కుతుందేమోనని, చటుక్కున పక్కకి తిప్పాడుట బస్సుని. ఆ స్పీడుకి అలా తిప్పటంతో కంట్రోల్ తప్పి, పక్కన వున్న స్సిటీ బస్ స్టాపులోకి దూసుకుపోయిందట. అక్కడా మళ్ళీ బ్రేక్ కొట్టినా పడలేదు. బస్టాపులో బస్సు కోసం నుంచున్న నలుగురు స్కూలుకి వెళ్ళే అమ్మాయిల మీద ఎక్కి, తర్వాత గోడకి గుద్దుకుని ఆగిందిట” అంకినీడు ఆగాడు.

“ఆ నలుగురు చిన్న పిల్లలకూ దెబ్బలు తగల్లేదు కదా” భూపతి అడిగాడు కంగారుగా.

అంకినీడు ఒక్క క్షణం మాట్లాడలేదు. కాసేపటికి అన్నాడు, “అంత వేగంగా వెడుతున్న అంత పెద్ద బస్సు పసి పిల్లల మీద ఎక్కితే, దెబ్బలు తగిలాయా అని అడుగుతారేమిటి సార్. ఆ నలుగురు అమ్మాయిలూ బస్సు క్రిందపడి నలిగిపోయారు. వెంటనే ప్రాణాలు పోయాయి”

నాకు నోట మాట రాలేదు. హృదయంలో కలుక్కుమంది.

“మరి పోలీసులు కేస్ బుక్ చేయలేదా?” అడిగాడు భూపతి.

“చేశారు. కాని మా బావమరిది ఈపాటికి ట్రాఫిక్ ఇన్స్పెక్టరుని కలుసుకునే వుంటాడు. ఎంత అడిగినా ఇచ్చేయమని చెప్పాను. అతను మేనేజ్ చేయగలడు సార్. అక్కడేం ఫరవాలేదు”

భూపతి ఏం మాట్లాడలేదు.

“వాళ్ళ రిపోర్టుతో పాటు బ్రేకులు పని చేస్తున్నాయనీ, బస్సు కండిషన్లోనే ఉందనీ, మీరు వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలిట. మొన్న నాకు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కాపీ మీరు వాళ్ళకి ఇస్తే, మొత్తం కేసుని డ్రైవర్ మీదకి నెట్టేసి ఈ కేసుని పక్కదారికి మళ్ళించవచ్చు. దయచేసి మీరు…”

వాళ్ళ మాటలు వినపడుతున్నా నాకు మనసులో ఏదో భారంగా ఉంది. మా అమ్మాయి స్కూలుకి వెళ్ళే సమయం అదే. కొంపదీసి ఈ బస్సు పొట్టన పెట్టుకున్న నలుగురు పాపలలో మా అమ్మాయి వుందా? ఏదో వణుకు ప్రారంభమైంది. ఠక్కున లేచి, చకచకా మైన్ రోడ్డు సెంటర్ వేపు బయల్దేరాను.

నడుస్తున్నానేగాని, నా ఆలోచనలు చాల వెర్రిగా, పిచ్చి పిచ్చిగా వున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి.

సెంటర్లో చాలమంది జనం గుంపుగా వున్నారు. పోలీసులు కూడా చాలమంది వున్నారు. నా కంగారును అణుచుకుంటూ, జనాన్ని పక్కకు త్రోసి లోపలికి వెళ్ళాను. గుండె వేగంగా కొట్టుకుంటున్నది.

ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను. కళ్ళు మూసుకున్నాను. ఒక పక్క ఆ చనిపోయిన వారిలో మా అమ్మాయి లేదన్న ఆనందం ఉన్నా, ఆ హృదయ విదారక దృశ్యం చూసి మనసంతా వికలమైపోయింది. కళ్ళల్లోనించీ నీళ్ళు ధారగా కారుతున్నాయి. ఒక్క క్షణం ఆగి కళ్ళు తెరిచాను.

బస్సు ముందు చక్రాల క్రింద నలుగురు పసిపాపలూ నలిగిపోయారు. ముఖాలు కొంచెం గుర్తు తెలుస్తున్నా ఆ లేత శరీరాలు పచ్చడై పోయాయి. నెత్తురు మడుగులో నిశ్చలంగా పడివున్నారు. ఆ నలుగురూ పది సంవత్సరాల లోపు వారే. పదేళ్ళ లోపునే వాళ్ళకి నూరేళ్ళు నిండిపోయాయి. మృత్యువు వాళ్ళని కబళించింది. అంతకన్నా అమాయకులు దొరకలేదేమో!

ఇంతలో హఠాత్తుగా గుర్తుకొచ్చింది, ఆ అమాయకపు పసిపిల్లల చావుకి కారణమెవరో.

ఈ లోపల అంకినీడు భూపతికి ఎన్నో పచ్చ కాగితాలు ఇచ్చే ఉంటాడు. ఆయన బస్సు బహుబాగుందని సర్టిఫికేట్ ఇచ్చే ఉంటాడు. అతని బావమరిది అక్కడ ‘మేనేజ్’ చేసేవుంటాడు. అందరూ కలిసి తనదేమీ తప్పు లేని ఆ అమాయకుడు బస్సు డ్రైవరుని జైల్లో తోసేస్తారు. అంతటితో అంకినీడు చేతికి ఏమీ అంటదు. ఒకసారి జేబు తడుముకుని హాయిగా ఊపిరి పీల్చుకుంటాడు. భూపతి ఆదాయం మరికొంత పెరుగుతుంది. అతను ఆ డబ్బుని ఆనందంగా ఖర్చు పెట్టుకుంటాడు. కానీ అతను ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ నాలుగు పసి ప్రాణాలను జమ కట్టుకుంటాడు. ఇంతమంది అమాయకపు ప్రాణాలను బలి చేస్తున్నారంతా కలిసి. దేని కోసం?

మనిషిని మనిషిగా బ్రతకనీయని ఆ డబ్బు కోసం. కేవలం ఈ మనిషే కనిపెట్టిన ఆ పాపిష్టి డబ్బు కోసం!

నా ఆలోచనలకు అంతరాయం కలిగింది, కారు హారన్ వినగానే.

అంకినీడూ, భూపతీ గబగబా వచ్చారు.

అంకినేడు భూపతికి చూపించాడు ఆ ప్రమాదం జరిగిన దృశ్యాన్ని.

భూపతి బస్సు పక్కకి వాలిపోయి నుంచున్న తీరునీ, ఆ పసిపాపల్నీ చూశాడు. ఉలిక్కిపడి మళ్ళీ చూశాడా పాపల్ని. కొయ్యబారిపోయాడు.

అంకినీడు ఏదో అంటున్నా అతనికి వినపడటం లేదు. ఒక్క క్షణం తేరుకుని గబగబా ముందుకు వెళ్ళాడు. ఆ నలుగురు పాపల్లోనూ మధ్యన, బస్సు క్రింద పడి ప్రాణాలను పోగొట్టుకుని, రక్తంతో ఎర్రగా తడిసిపోయిన ఆ అందమైన చిన్నారి తల మీద చేయి వేశాడు. ప్రేమగా చూశాడు. ఒక్కసారిగా, ‘సుజాతా’ అని పెద్దగా అరచి, ఆ పాప మీద పడి విలపించాడు బ్రేక్ ఇన్స్పెక్టర్ భూపతి.

నాకేమీ అర్ధం కాలేదు.

అక్కడే ఎవరో అంటున్నారు, “ఆ పాప బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి అమ్మాయా? అరే… పాపం. ఆయనకు ఒక్కత్తే కూతురుట. కాన్పు కష్టమై, ఏదో పెద్ద ఆపరేషనే చేసి ఆ అమ్మాయిని బయటకు తీశారుట. ఆయన భార్యకి ఇక మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం లేనందున, పాపం ఈ పిల్లని చాల అపురూపంగా, ఎంతో గారాబంగా, కంటికి రెప్పలా….”

నాకు తర్వాత మాటలు వినపడలేదు. బయటకు వచ్చేశాను.

అక్కడ వున్న వేపచెట్టు మీద నాలుగు కోతులు గంతులు వేస్తున్నాయి!

Posted in June 2023, కథలు

25 Comments

  1. Sreenivasa Rao Iruvanti

    చాలా బాగుంది సత్యం గారు. ఇప్పటికీ చెడు చేయవద్దు అని చెప్పే నాలుగో కోతి ఎక్కడో కానీ మనకి కనబడదు. 50 సంవత్సరాల తర్వాత కూడా, ఇది ఇప్పటి కథ లానే వుంది.

  2. కర్రి మోహన్ నాయుడు

    కాలం మారినా ఆ నాలుగోకోతి విచ్చలవిడిగా తన పని తాను చేస్తున్నది.మనిషిలో డబ్బు దాహం పోనంతవరకు ఇంతే.

    • సత్యం మందపాటి

      అవునండి. మీరు చెప్పింది అక్షరాల నిజం. మీ స్పందనకు ధన్యవాదాలు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు నాయుడుగారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

  3. సత్యం

    ధన్యవాదాలు మహాశయా! మీకు ఈ కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  4. పన్నాల సత్యనారాయణ మూర్తి

    కాలాలు మామూలుగా భూత, వర్తమాన, భవిష్యత్ అని 3 రకాలుగా చెప్పుకొంటాం నాలుగో కోతిలాగా నాలుగో కాలం “తధర్మ కాలం” అంటే మార్పు ఉండనిది నిరంతరంగా వుండేది ఉదాహరణకు ” సూర్యుడు తూర్పున ఉదయించటం”. 50 ఏళ్ళ క్రితం రాసిన నాలుగోకోతి కూడా తధర్మానికి ప్రతీక. అందుకే నిన్నటి నేటి, రేపటి కథగా నిలిచిపోయింది. అభినందనలు

    • సత్య మందపాటి

      ధన్యవాదాలు మూర్తిగారు. బాగా చెప్పారు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు మూర్తిగారు . మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

  5. Anil అట్లూరి

    లేనిపోని వర్ణనలు లేకుండా సూటిగా చెప్పారు కథని. బాగుంది. రెండు పదాలు ఈ నాటి పాఠకులు గుర్తిస్తారా? ఒకటి: వ్రాసుకుంటున్నాడు లో ‘వ్రా’ 2 – ముణిగిపోయాడు. లో ‘ణి’

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు మిత్రమా. నాకు ఎందుకో ఆ పాత అసలు తెలుగు అక్షరాలే ఇష్టం. మీ స్పందనకు ఎన్నో ధన్యవాదాలు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు అనిల్ గారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

  6. అయినాపురపు శ్రీనివాసరావు.

    వాస్తవాన్ని కనులకు కట్టినట్లు చెప్పారు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు శ్రీనివాసరావుగారు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు శ్రీనివాసరావుగారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

  7. కుమారి సామినేని

    నేను ఇంతకు మునుపు ఆస్టిన్ కు వచ్చిన క్రొత్తలో చదివాను ఈ కథ. మళ్లీ చదువుతుంటే నా మది మీ కథను నా కళ్ళ ముందట చూపించింది! ఆక్సిడ్ంట్ ఉదంతంలో కళ్ళ నీళ్ళు అడ్డు వచ్చాయి. గుండె బరువుతో కొన సాగించాను…చివర ఏమి జరుగతుందో ముందే తెలిసినా! కళ్ళు నీటి ప్రవాహం ఆపడంలేదు! ఆకలితో వున్నా, అన్నం తిన బుధ్ధి వేయడంలేదు!

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు కుమారిగారు. ఈ కథ మిమ్మల్ని కదిలించినందుకు చాల సంతోషమండి.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు కుమారి గారు. మీకు నచ్చినందుకు సంతోషం.

  8. శాయి రాచకొండ

    మంచి కథ. యాభై ఏళ్ళ క్రితం లంచాలు తీసుకుని వెహికిల్స్ చూడకుండానే సర్టిఫికేట్లు ఇచ్చే అధికార్లను చూసి ఒక యువ రచయిత గుండెల్లో రగిలిన బాధకు ప్రతిరూపం ఈ కథ. అయితే కథలో చెప్పినట్లు నిజ జీవితంలో ఫలితాలు అంత వెంటవెంటనే ఉండవు. అందుకే నాలుగో కోతి ఉన్నా లేనట్లే అవుతుంది. అది అంత సులభంగా కనబడదు.

    • సత్యం మందపాటి

      ధన్యోస్మి శాయిగారు. అవును. “వాతావరణంలో పెద్ద మార్పు లేదు”. మరి ఇచ్చేవారికీ, తీసుకునే వారికీ లాభాలున్నప్పుడు, మార్పు ఎందుకు ఉంటుంది!

  9. Annapurna

    Ee katha eppatiki patabadadu! i lanti ghoraalu
    vokataa velaki velu jarugu toone vunnaie.
    Gundeku hattukune katha .

    • సత్యం

      ధన్యవాదాలు అన్నపూర్ణగారు. గుండెలకు హత్తుకున్న కథ కనుకే ఇన్నాళ్ళు నిలుబడి ఉన్నట్టుంది. త్వరలో మార్పు వస్తుందని అనుకోను.

  10. Pappu venkata Bhoga Rao

    చాలా బాగుంది కథ. తన అవినీతి తననే మింగేసింది. చాలా పట్టుగా వుంది. 50 సంవత్సరాలు గడచినా మూడు కోతులూ అలాగే వున్నాయి. నాలుగో కోతి మాత్రం తన పని తను చేసుకుంటూ పోతోంది ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా!!!

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు భోగారావుగారు. మీకీ కథ నచ్చినందుకు సంతోషం.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!