Menu Close
VSRao
అశోక మౌర్య
డా. వల్లూరుపల్లి శివాజీరావు

బిందుసార మౌర్య

బిందుసార (జననం క్రీ.పూ. 320; పాలన క్రీ.పూ. 298-272) మౌర్య సామ్రాజ్య స్థాపకుడయిన చంద్రగుప్త చంద్రగుప్తుడి పుత్రుడు. ఈయనకు ‘అమిత్ర ఘాత’ (Amithra-ghaatha: శత్రువులను వధించేవాడు) అనే పేరు కూడా కలదు. ఈయన ఇతర నామాలు: ‘వరిసార’, ‘నాదసార’, ‘సింహసేన’. ఈయనకు ‘దేవనామ ప్రియ’ అనే బిరుదు కూడా ఉంది. ఈ బిరుదు అశోక మౌర్యకు కూడా ఉంది.

బిందుసార జన్మ వృతాంతం, సామ్రాజ్య విస్తరణ

క్రీ.పూ. 321 లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత చంద్రగుప్తకు అనేకమంది శత్రువులు తయారయ్యారు. వీరిలో కొంతమంది రాజు అంతఃపురంలోనే ఉన్నారు. వీరి బారినుంచి తన రాజు చంద్రగుప్త ను రక్షించుకోటానికి ప్రధాన మంత్రి చాణక్య భోజనంలో అతి చిన్న మోతాదులలో విషాన్ని కలిపి రాజు తినేటట్లు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా విష ప్రయోగం ద్వారా శత్రువుల వ్యూహాలను భగ్నం చేశాడు. ఇది తెలియని చంద్రగుప్త క్రీ.పూ. 320 లో ఒక రోజు విషం కలిపిన ఆహారాన్ని గర్భిణి అయిన తన భార్య, పట్టపు రాణి దుర్ధర తో కలిసి భుజించాడు. ఆ సమయంలో రాణి ప్రసవానికి ఏడు (7) రోజులు దూరంలో ఉంది.

వీరి భోజనం తదుపరి చాణక్య ఆ గదిలోకి  ప్రవేశించటం జరిగింది. ప్రవేశించిన క్షణంలో రాణి దుర్ధర స్పృహ తప్పి ఉంది. తక్షణమే శిశువును రక్షించటానికి చాణక్య రాణి గర్భాశయాన్ని కోసి శిశువును బయటకు తీశాడు. అప్పటికే శిశువు నుదురుకు విష బిందువు అంటి ఉంది. అందువల్ల చాణక్య ఆ శిశువుకు ‘బిందుసార’ అని నామకరణం చేశాడు.  దీనికి అర్ధం “బిందు(వు) బలం (శక్)”.

చంద్రగుప్త క్రీ.పూ. 298లో తన సింహాసనాన్ని, సామ్రాజ్యాన్ని త్యజించి జైన సన్యాసిగా మారి కరువు బారిన పడిన కర్ణాటక ప్రజలకు సేవచేయాలనే ఆలోచనతో ఇతర జైన సన్యాసులతో కలసి ‘శ్రావణ బెళగొళ’ లో స్థిరపడ్డాడు. ఫలితంగా బిందుసార క్రీ.పూ. 297 లో మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించటం జరిగింది.

తండ్రి చంద్రగుప్త సామ్రాజ్యాన్ని చాణక్య సహాయంతో బిందుసార అనేక చోట్ల తిరుగుబాటు దారులను అణచి వేసి రాజ్యాన్ని స్థిరపరచటం జరిగింది. దక్షిణాదిన కేరళ లోని ‘చేర’ (Chera), ‘సత్య పుత్ర’ (Satyaputra) రాజ్యాలను, తమిళనాడు లోని ‘చోళ’ (Chola) రాజ్యాన్ని బిందుసార ఓడించి తనకు సామంతులుగా చేసుకోవటం జరిగింది. మధ్య-తూర్పు తీరాన ఉన్న కళింగ సామ్రాజ్యాన్ని మాత్రం ఈ రెండవ మౌర్య రాజు తన ఆధీనంలోకి తీసుకురాలేకపోయాడు.

బిందుసార గ్రీకులతో సత్సంబంధాలు ఉన్నాయి. తన తండ్రి చంద్రగుప్త చివరి కాలంలో గ్రీకు రాజు సెల్యూకస్ నికేటర్ (Seleucos Nikator) ను ఓడించినప్పుడు సంధి ఒడంబడికలో భాగంగా ఈ గ్రీకు వీరుడు తన కుమార్తె ‘హెలెనా’ (Helena) ను మౌర్య చక్రవర్తితో వివాహం జరిపించాడు. ఈ విధంగా ఈమె బిందుసారకు సవతి తల్లి అయింది, సెల్యూకస్ మారుటి తాత అవటం జరిగింది. ఈ బంధుత్వం కారణంగా ఈ రెండవ మౌర్య చక్రవర్తికి గ్రీకులతో మంచి సంబంధాలు ఉండేవి. ఈయన కాలంలో గ్రీసు రాజు (బిందుసారకు మారుటి-మేనమామ) ‘ఒకటవ ఆంటియో’ (Antiochus 1) తర పున ‘ప్లాటీయా’ (Plateia) గ్రీకు రాయభారిగా ఉండటం జరిగింది. ఈయన బిందుసారకు తీయటి ద్రాక్ష సారాయి, ఎండిన అత్తి పండ్లు (figs), గ్రీకు పండితుడిని (sophist) పంపించటం జరిగింది. మౌర్య రాజుకు ఈ గ్రీకు పండితుడు ద్వారా గ్రీకు తత్వశాస్త్రం నేర్చుకోవాలనే అభిలాష కలిగింది.

అలాగే బిందుసారకు ఈజిప్టు రాజులతో సత్సంబంధాలను ఉన్నాయి. ఈజిప్టు రాజు ‘Philadelphus’ తన రాయబారిగా ‘డైయోనిసియస్’ (Dionysius) ను పాటలీపుత్రకు పంపించాడు.

బిందుసార కు 16 మంది భార్యలుండేవారు. వీరేగాక అయన అంతఃపుర జనానాలో ఇతర స్త్రీలు కూడా ఉండేవారు. వీరిలో ‘శుభద్రాంగి’ అతి ముఖ్యమైన భార్య. ఈమెకు చాల చరిత్ర ఉంది.

శుభద్రాంగి, అశోక

ఆనాటి మౌర్య సామ్రాజ్యంలో ‘చంప’ (Champa) ఒక ప్రముఖ నగరం. ఈ ‘చంపాపురం’ మహాభారత కాలంలో కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యానికి రాజధాని. ఇప్పటి బీహార్ రాష్ట్రంలో దక్షిణ గంగానది తీరాన ఉన్న చంప ఈనాడు ఒక గ్రామంగా మారింది. ఇది భాగల్పూరు జిల్లాలో ఉంది. మౌర్య కాలపు ఈ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో శుభద్రాంగి జన్మించింది.

శుభద్రాంగి తండ్రికి ఒక జ్యోతిష శాస్త్రవేత్త ఈమె బిందుసారను వివాహమాడితే వీరికి ఇద్దరు వజ్రాలులాంటి పుత్రులు జన్మిస్తారు; వీరిలో ఒకడు అప్పటి నాలుగు ఖండాలలో నాలుగోవంతు భూమిని పరిపాలిస్తాడు, రెండవ పుత్రుడు సన్యాసం స్వీకరించి దేశం అంతా సంచరిస్తాడు అని భవిష్యత్తును వివరించాడు.

ఈ భాష్యవాణితో ఉత్తేజితుడైన బ్రాహ్మణుడు తన పుత్రికను పాటలీపుత్ర కు తీసుకువెళ్లి బిందుసారను కలిసి తన పుత్రికను వివాహమాడమని రాజును అభ్యర్ధించాడు. రాజుకు అప్పటికే పెద్ద అంతఃపుర జనావాసమే ఉంది. అందువల్ల రాజుకు ఈమెను వివాహమాడనవసరంలేదు. ఒకవేళ ఈమెను భార్యగా చేసుకున్నా, ఈమెకు జన్మించే పుత్రుడు బిందుసారకు న్యాయపరమైన ఉత్తరాధికారి అవుతాడనే నమ్మకం లేదు. అప్పటికే బిందుసారకు ఒక పుత్రుడు (జ్యేష్ఠ పుత్రుడు), వారసుడు ‘శుసిమ’ (Susima) జన్మించాడు.

బిందుసార ద్వారా ఈమెకు పుత్రుడు కలగాలంటే ఓర్పు, నేర్పరితనం, వంచన తప్పనిసరి. బ్రాహ్మణుడి కోరిక మేరకు రాజు శుభద్రాంగిని భార్యగా స్వీకరించి ఆమెను అంతఃపురంలో ఉంచాడు. ఈమె అందానికి అంతఃపురంలో ఉన్న ఇతర భార్యలు అసూయపడి శుభద్రాంగి బిందుసారతో కలిసే అవకాశం ఇవ్వలేదు.

కాని ఈ రాజు భార్యలు శుభద్రాంగికి ఒక మంచి క్షురక (barber) శిక్షణ ఇప్పించారు. ఈ నైపుణ్యాన్ని ఉపయోగించి శుభద్రాంగి బిందుసారకు తరచు క్షవరం, గండం గీయటం అతి సమర్ధవంతంగా చేస్తూ ఉంది. ఈమె నైపుణ్యం వల్ల రాజు చాల సౌఖ్యం అనుభవించి, కొంతసేపు నిద్రలోకి జారటం కూడా జరిగింది. ఈ క్షురక నైపుణ్యం బిందుసారకు ఎంత ఆనందం, ఆహ్లాదం కలిగించిందంటే శుభద్రాంగికి ఒక కోరిక నెరవేర్చటానికి సమ్మతించాడు. అప్పుడు ఈ యువతి తనతో ఒక రోజు సంభోగించాలనే కోరిక వెల్లడించింది.

క్షత్రియుడైన బిందుసార తన కుల నిబంధలను అలోచించి ఈ యువతి కోరికను మన్నించే ముందు చాలా తటపటాయించాడు. ఆమె చూపించిన ప్రావీణ్యాన్ని శుభద్రాంగి ఒక క్రిందిస్థాయి క్షురక కుటుంబానికి చెందిన స్త్రీ అని భావించాడు.

ఆమె ఒక బ్రాహ్మణుడి పుత్రిక అని తెలుసుకుని వెంటనే మౌర్య రాజు ఆమె కోరికను మన్నించటం జరిగింది. ఆమె ఉత్సుకతను, తెలివిని, విజ్ఞతను గమనించి బిందుసార శుభద్రాంగి ని పట్టపు రాణిగా చేశాడు.

పైన నుడివినట్లు బిందుసారకు అప్పటికే అనేక మంది భార్యలున్నారు. ఈమెకు పట్టమహిషి హోదా ఇచ్చిన తరువాత ఇతర భార్యలను మరచిపోయాడు. క్షురకురాలిగా తన దగ్గరకు వచ్చిన శుభద్రాంగిని అమితంగా ప్రేమించి తాను వృధా చేసుకున్న కాలాన్ని భర్తీచేశాడు. వీరిద్దరి మధ్య సరసం, పరస్పర భోగం, సుఖానుభవం కలిగింది. ప(ఫ)లితంగా శుభద్రాంగి గర్భం ధరించి కొన్నాళ్ళకు ఒక పుత్రునికి జన్మనిచ్చింది. అతని పేరు ‘అశోక’.

ఆ విధంగా చంపాపురపు బ్రాహ్మణ యువతి గురించి జ్యోతిష్కుడు చెప్పిన కాలజ్ఞానం ఈడేరింది. జన్మించిన బాలుడికి నామకరణం చేయాలన్నప్పుడు శుభద్రాంగి తనకు ఎటువంటి శోకం, దుఃఖం, విచారం లేదు కాబట్టి ‘అశోక’ (అ-శోక: without sorrow) అనే పేరు సూచించింది.

ఈ నామం శుభద్రాంగిని ఎంతగా ఆకర్షించిందంటే ఆమెకు జన్మించిన రెండవ పుత్రుడికి (అశోక తమ్ముడికి) ‘విష్టశోక’ (Vista-shoka: విగత-శోక: ‘sorrow-ceased’). అంటే ఈ రెండవ పుత్రుడి జన్మతో ఆమె శోకం నశించింది.

బిందుసార ఉత్తరాదికారి ఎవరు? 

బిందుసార మొదట బ్రాహ్మణిజం (Brahmanism) అంటే ‘సనాతన ధర్మం’ పాటించి దానిని చాలా ప్రోత్సహించాడు. చివరి కాలంలో తన తండ్రి చంద్రగుప్త వలె జైన మతాన్ని స్వీకరించాడు. కాని బౌద్ధ మతాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాడు.

గౌతమ బుద్ధ, 24 వ జైన తీర్థంకరుడు ‘మహావీర’ సమకాలికుడు ‘మక్ఖలి గోసల’ (Makkhali Gosala) క్రీ.పూ. 6వ శతాబ్దంలో ‘అజీవక’ (Ajivaka) సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రోత్సహించటం జరిగింది. ఈయన బ్రతుకుతెరువుకు కొన్ని ప్రత్యేక నియమాలను నిర్దేశించాడు. ఈ సిద్ధాతం ప్రకారం అతి సామాన్యమైన జీవనం మోక్షానికి సోపానం అవుతుంది. వీరిని సంస్కృత, పాలీ గ్రంధాలు ‘యాచక సన్యాసులు’ (religious mendicants) అని వ్యాఖ్యానించాయి.

ఒక ప్రముఖ అజీవక ‘పింగళవత్స-జీవ’ ను బిందుసార తన ఆస్థానానికి పిలిపించి తన పుత్రులను పరీక్షించి, పరిశోధించి వీరిలో ఎవరు తన మరణం తరువాత రాజు కాగలడో అని చెప్పమని ఆజ్ఞాపించాడు. వీరిలో ముఖ్యులు జ్యేష్ఠ పుత్రుడు ‘శుసిమ’ (Susima), అశోక, విష్టశోక. బిందుసారకు అందరికంటే అతి ప్రీతిపాత్రుడు, తనకు ఉత్తరాధికారి అవ్వాలని కోరుకొన్న పుత్రుడు ‘శుసిమ’.

ఇది తెలుసుకున్న అశోక తనను పరీక్షించటం ఇష్టంలేదు. తనంటే తన తండ్రికి అయిష్టం, అసహ్యం అని తెలుసు. దీనికి కారణం అతని రూపం ఆకర్షణీయంగా ఉండదు, కొంచెం వికృతంగా ఉంటుంది. బిందుసార వ్యక్తపరచిన దానిని బట్టి “అశోక చేతులు, అవయవం పట్టుకుంటే గరుకుగా, మోటుగా ఉంటాయి; ముట్టుకోటానికి అసహ్యంగానూ ఉంటాయి.” అందువల్లే బిందుసారకు అశోకుడు అంటే అయిష్టం.

తల్లి శుభద్రాంగి మాత్రం పరీక్షను వ్యతిరేకించవద్దని అశోకకు సూచించింది. చివరకు అశోకుడి తో పాటు ఇతర రాజకుమారులను పింగళవత్స-జీవ తేరి పార జూచి తీక్షణంగా పరీక్షించాడు. వెంటనే ఆయనకు అశోక బిందుసారకు ఉత్తరాధికారి కాగలడని స్పష్టంగా విశదమైంది. కాని ఈ అజీవక సన్యాసి తన ఆలోచనను రాజుకు తెలియజేయటం వివేకం కాదని భావించాడు. ఎందుకంటే బిందుసారకు అశోక అంటే అయిష్టం అని తెలుసు. ఇది రాజుకు తిన్నగా చెప్పకుండా “ఎవరికి మంచి స్వారీ, పీఠం, పానీయం, పాత్ర, ఆహారం ఉంటాయో అతను చక్రవర్తి అవుతాడు” అని వెల్లడించాడు.

ఈ వ్యాఖ్యను విన్న అశోక తన తల్లితో కొంత కాలం తరువాత ఇలా వ్యాఖ్యానించాడు: “గజం (ఏనుగు) వీపు నా స్వారీ, భూమి నా పీఠం, బంకమన్ను (clay) నా పాత్ర, పెరుగుతో కలిపిన అన్నం నా ఆహారం, నీరు నా పానీయం; అందువల్ల నేను చక్రవర్తిని అవుతాను.”

రాజుతో సంభాషణ ముగిసిన తరువాత పింగళవత్స-జీవ శుభద్రాంగిని దర్శించినప్పుడు అశోక బిందుసారకు ఉత్తరాధికారి కాగలడని ఘంటా పదంగా చెప్పాడు. అది విని ఆమె ఈయనను అతి త్వరగా రాజ్యాన్ని విడిచి వెళ్ళమని సలహా ఇచ్చింది. లేకపోతే బిందుసార బలవంతంగా ఈ అజీవక నుంచి సమాధానం విన్న తరువాత ఈయన ఆపదలోపడవచ్చు. పింగళవత్స-జీవ వెంటనే రాజ్యం విడిచి వెళ్ళాడు. బిందుసార మరణం తరువాతే ఈయన తిరిగి మగధ రాజ్యానికి రావటం జరిగింది.

బిందుసారకు ఎంతమంది పుత్రులు ఉన్నారో ఇదమిద్దంగా తెలియదు. ఈయనకు 16 మంది భార్యలేగాక అనేకమంది ప్రియురాళ్లు కూడా ఉన్నారు. చాలా గ్రంధాలు ఈయనకు 101 మంది పుత్రులున్నారని వ్రాశాయి.

సాధారణంగా రాజ కుటుంబాలలో సంతానం విషయంలో పుత్రులకే ప్రాధాన్యమిస్తారు, పుత్రికలకు కాదు. బిందుసార కుటుంబం విషయంలో కూడా అదే జరిగింది. ఆయనకు ఎంతమంది పుత్రికలు కలిగారో తెలియదు.

ఒక రాణి తన భర్త జ్యేష్ఠ పుత్రుడికి బదులు తన పుత్రుడు రాజు కాగలడన్న రహస్యం తనలోనే దాచుకుంటుంది. బహు భార్యత్వం ఉన్న రాజ కుటుంబాలలో ఇతర రాణులు ఎవరికి వారు తమ పుత్రుడు రాజు అవ్వాలనే కోరిక ఉండటం సహజం. కాని రాణులు తమ కోరికలను బహిర్గతం చేయరు.

చాణక్య మరణం

చంద్రగుప్త తరువాత బిందుసార మౌర్య సామ్రాజ్యాధీశ్వరుడు అయిన తదుపరి కూడా చాణక్య ప్రధాన మంత్త్రి పదవిలో ఉంటూ రాజుకు ఉపదేశకుడు, ప్రధాన సలహాదారుగా ఉండటం జరిగింది. ఆ సమయంలో వీరిరువురి మధ్య విశేషమైన బంధం ఏర్పడింది. తన రాజాస్థానంలో అందరికంటే చాణక్యకు బిందుసార అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు. వీరిద్దరిమధ్య ఉన్న సామరస్య బంధం రాజ్యంలో చాలా మందికి మింగుడుపడలేదు, నచ్చలేదు. వీరిద్దరి బంధం విడదీయటానికి కొంతమంది ఒక కుయుక్తి పన్నారు. వీరికి నాయకుడు బిందుసార మంత్రులలో ఒకడైన ‘సుబంధు’.

సుబంధు బిందుసారతో రాజు తల్లి దుర్ధర గర్భంతో ఉన్నప్పుడు చాణక్య ఆమెను అతి క్రూరంగా హత్యచేశాడని చెప్పి నమ్మించాడు. ఈ నమ్మకం వల్ల చాణక్య అంటే బిందుసారకు తిరస్కారం, తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది. దీనితో చాణక్య తీవ్రంగా బాధపడటం మొదలయింది. బిందుసార ఒక రోజు చాణక్యను “నీవు నా రాజ్యంలో ఎందుకు ఉండాలి” అని ప్రశ్నించాడు.

ఈ అవమానం భరించలేక చాణక్య వెంటనే రాజ్యాన్ని వదలి అడవిలోకి వెళ్లి మరణించేంత వరకు తన ఆహారాన్ని విసర్జించటం ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న బిందుసార జన్మించిన సమయంలో దుర్ధరకు పరిచారికగా ఉన్న ఒక వృద్ధ స్త్రీ ఈ రాజుకు నిజం ఈ విధంగా వెల్లడించింది.

“మహారాజా, మీ తండ్రి చంద్రగుప్త మహారాజు పరిపాలిస్తున్నప్పుడు ఆయనకు అంతఃపురం లోనే అనేక మంది శత్రువులు ఉన్నారు. వారు సర్పాలు, మూలికలను ఉపయోగించి విషప్రయోగం చేసి, మీ తండ్రిని హత్య చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ప్రధాన మంత్రి చాణక్య ఇది తెలుసుకుని రహస్యంగా అతి చిన్న మోతాదులలో విషం కలపబడిన భోజనాన్ని మీ తండ్రి తినేటట్లుగా ఏర్పాటు చేశాడు.

“ఈ భోజనం తీసుకుంటూ ఉంటే కొన్నాళ్లకు చంద్రగుప్త మహారాజు శరీరానికి విషాన్ని పెద్ద మోతాదులో ఇచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది. దీనివల్ల అంతఃపుర శత్రువులు, కుట్రదారులు మహారాజుకు అపకారం చేయలేరు. ఈవిషయం తెలియని పట్టపు రాణి, మీ తల్లి దుర్ధర రాజుకు దాచి పెట్టిన, వడ్డించవలసిన భోజన పదార్ధాలు భక్షించింది. ఆ సమయంలో మీరు మీ తల్లి గర్భంలో ఉన్నారు. భోజనంలో ఉన్న విషం భరించలేని మీ తల్లి స్పృహ తప్పి ప్రాణం పోయే స్థితిలో ఉంది.”

“ఇది తెలుసుకున్న చాణక్య తల్లి గర్భంలో ఉన్న మిమ్ములను రక్షించాలని సదుద్దేశంతో మహా రాణి గర్భాన్ని కోసి శిశువుగా ఉన్న మిమ్ములను బయటకు తీశారు. మీ నుదుటికి విషంతో ఉన్న రక్త బిందువు అంటి ఉన్న కారణంగా ఆయనే మీకు ‘బిందుసార’ అని నామకరణం చేయటం జరిగింది. మిమ్ములను బయటకు తీసిన కొంతసేపటికే మీ తల్లి దుర్ధర మరణించింది.”

తన తల్లి పరిచారిక నుంచి ఈ విషయం విన్న బిందుసార తాను పెద్ద తప్పుచేశానని తెలుసుకుని, పరితపించి చాణక్య ఉద్దేశ్యాన్ని అనుమానించినందుకు, ఆయనను ప్రశ్నించి తూలనాడినందుకు పశ్చాతాప పడి అమితంగా విచారించాడు. అప్పటికే రాజ్యాన్ని విడిచి వెళ్లిన చాణక్యను తిరిగి తన రాజ్యానికి రమ్మని ఎంతగానో ప్రాధేయ పడినా ఆ మహా మంత్రి ఆస్థానానికి తిరిగి రాలేదు. మౌన దీక్షల్లో ఉన్న 75 ఏళ్ల చాణక్య, చంద్రగుప్తను తీర్చిదిద్దిన గురువు, మౌర్య రాజ్య స్థాపనకు మూలకారకుడు, భారత చరిత్రను మార్చిన మహనీయుడు, తత్త్వవేత్త, అర్ధ, నీతి శాస్త్రజ్ఞుడు, అతి గొప్ప మనీషి, చివరికి ఆకలితోనే క్షీణించి క్రీ.పూ. 275లో మరణించటం జరిగించింది.

ఆ తరువాత బిందుసార చాణక్య మరణానికి కారణమైన సుబంధుకు మరణ దండన విధించటం జరిగింది.

బిందుసార మరణం

చాణిక్య (కౌటిల్య) మరణం తరువాత మూడు ఏళ్లకే, అనగా క్రీ.పూ. 272 లో, ఈ రెండవ మౌర్య రాజు కూడా వేరే లోకానికి వెళ్ళటం జరిగింది. ఈయన తండ్రి ఇచ్చిన మౌర్య సామ్రాజ్యాన్ని చాణక్య సహాయంతో ఒడుదుడుకులు లేకుండా 26 ఏళ్ళు పరిపాలించాడు.

అంతగా ఘనాపాఠి కాని ఈ బిందుసారను చరిత్ర “ఈయన మౌర్య స్థాపకుడు, ఘన కీర్తిని స్వంతం చేసుకున్న చంద్రగుప్తుడికి పుత్రుడయితే, ఒక మహాచక్రవర్తి, జగత్తుచే కీర్తించబడిన, మూడవ వంతు భూభాగాన్ని పరిపాలించిన అశోకుడికి తండ్రి” గా అభివర్ణించింది. ఇద్దరు మహా చక్రవర్తుల మధ్య బిందుసార ఒక వారధిగా భారత చరిత్రలో నిలిచాడు!

Silver-Coins-Bindusara
బిందుసార మౌర్య కాలపు రెండు వెండి నాణాలు
Photo Credit: Wikimedia Commons

వచ్చే సంచికనుంచి అనేక సంచికల ద్వారా అశోకుడి జీవితం, అనేక ఇతర విషయాల గురించి తెలుసుకుందాము.

****సశేషం****

Posted in June 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!