Menu Close
SirikonaKavithalu_pagetitle

ఇంటాబయటా నిశ్శబ్దం
ఇనకిరణాలు కూడా చచ్చుబడ్డంత నిశ్శబ్దం
నిత్యం శబ్దప్రపంచంలో మునిగితేలే వాణ్ణి
ఏ సిద్ధుడో ఆకుపసరు ఇచ్చాడుకదాని
ఎగురుకుంటూ వచ్చేశాను గాలిలో గాలిగా
వచ్చాక తెలిసింది ఇక్కడ శబ్దం కూడా గడ్డకట్టిందని!
మాట మంచుకొండగా మారిందని
శబ్దం తన ఉనికిని, అర్థాన్ని, రూపాన్ని మార్చుకొందని
విద్యుదుద్వేగ ప్రపంచంలో మెరుపుతీగగా మారిందని...
నా ప్రియమైన శబ్దం,నేను ప్రేమించిన శబ్దం
నన్ను నడిపించిన శబ్దం, నన్ను వెలిగించే శబ్దం,
తల్లిలా ఒళ్ళోకి తీసుకొని లాలించే శబ్దం,
ఇల్లాలిలా సేదదీర్చి పునర్జన్మనిచ్చే శబ్దం, జీవితానికి భాష్యం చెప్పి బ్రతికించే శబ్దం
ఇప్పుడు నాకు పరాయిదై పోయింది
ఈ శుద్ధ శ్వేత హిమవద్గిరిలో నన్నో ఒంటరిపక్షిని చేసింది
హిమవంతపు టేకాంతం ఎంత కాంతివంతమైతైనేం,
మాటల్లో పంచుకోడానికి మనిషి తోడు లేనప్పుడు...
నిశ్శబ్దం ఎంత మహాయోగ భోగమైతేనేం
నీకు నువ్వు ప్రియంగా అనుభవించ లేనప్పుడు
నీకు నీవు దూరమవుతున్నప్పుడు..
శబ్ద ప్రపంచాన్ని ప్రేమించేవారికి
శబ్దాలతో ప్రపంచానికి వన్నెలద్దేవారికి
నిశ్శబ్దమే కదా ద్వీపాంతర ప్రవాసం...
కంటిచూపు ఆనినంత మేర ఆహా! కనువిందు చేసే వరూధినీ ప్రాకృతిక సౌందర్యం
గాలివాటున వీచి మైమరపించే పరీమళం
పలుకరించబోతే చిరునవ్వే సమాధానంగా
తన త్రోవమ్మట తాను తప్పుకుపోతుంది
నేను తోవ తప్పినది చెప్పకనే చెబుతుంది
ఏ నిలింపులు ఎదురుపడ్డా కళ్ళల్లోకి చూడరు
తమ కంటిచూపు మనుష్యులకు పంచరు
వారి ప్రపంచం వారిది, అదో అప్సరాంగన విహార విలాస వీధి
చెవి తీగల్లో మరోలోక మార్మిక సందేశాలు, మాధురీ సంగీతాలు
ఆకాశానికీ భూమికీ మధ్య సంచార సంకేత తరంగాలు
వారినందుకోటానికి ఈ అస్థిమాంస పంజారాలకెక్కడ సాధ్యం
ఎలా లభిస్తుంది నా అస్తిత్వానికి అర్థం చెప్పే శబ్ద కైలాసం
ఎలా ప్రాప్తిస్తుంది నా నిత్య ప్రపంచంలోకి పునఃప్రవేశం
అది కాలుష్య భరితమై ఉంటేనేం,
పురాకర్మ ఫల సంప్రాప్తమౌతుంటేనేం
అక్కడే కదా నా ఆత్మ సుఖావాసం
శబ్దమే కదా స్వారాజ్య చైతన్య విలాసం
శబ్దానికి దూరమైన క్షణం ఆత్మకు స్వచ్ఛందమరణం
ఎంత అమరపురీ సౌభాగమైనా
నిశ్శబ్దం ఓ నిర్జీవాప్సరశుష్కాలింగనం
నాలో నిలిచి ఉన్న చిరాగ్నీ! రగులు, రగిలించు
నా గుండెల్లో కాదు, గొంతులో, చూపుల్లో పలుకు, పలికించు
నిన్ను గడ్డ కట్టించే రుగ్మతా నిర్బంధతల నుంచి నన్నావలకు నడిపించు
నా లోకానికి నీ చేతననిచ్చి బ్రతికించు
పలుకు నా స్వర్గమవనీ!
అలికిడి నీ సహవాసం కానీ!!
నన్ను సగటు మనిషిగా బ్రతకనీ!!!

అందరూ పొగిడారు కనుక
నేను కవినయ్యాను
పది సన్మానాలు జరిగాక
మహాకవినయ్యాను

వృత్తాల నెంచుకుని గిరికీలు కొడితేను
*సంప్రదాయకవుల* సరస నిలిపేరు
ప్రాచీనకావ్యాలననుకరింపగనేను
*పునర్నవప్రాచీనకవివాది* వన్నారు ।।అందరూ।।

బాధలను మరిపించి తేలింప నూహలను
*కాల్పనికకవినవని* తలపాగ చుట్టారు
బడుగు జీవుల పొగిడి ధనికులను తిడితేను
*వాస్తవిక వైప్లవిక కవి* వంచు పిలిచేరు ।।అందరూ।।

కృతక భావన లేని సహజతను పొగిడేను
*స్వాభావికకవివి* లెస్స లెస్సన్నారు
ఉన్మత్తశబ్దాల వింతగా పలికేను
*డాడాకవి* వటంచు డప్పు కొట్టేరు ।।అందరూ।।

స్వేచ్ఛగా పదగతుల వడిచూపి నడిపేను
*ఫ్యూచరిస్టు* వనుచు ముద్ర వేసేరు
అంతరంగమథిత స్వప్నాల చూపేను
*అధివాస్తవికుడ* వని కలిసి పాడేరు ।।అందరూ।।

జడముల చేతనకు మూర్తిత్వమిచ్చేను
*అభివ్యక్తకవి* గ జగతి ప్రకటించేరు
సత్యముల రూపాంతరముల చూపితి నేను
*ప్రతీకాత్మకకవి* గ చాటి పలికేరు ।।అందరూ।।

అనుభూతులకు నిండ ఊపిరులనూదేను
*భావకవి* వని నన్ను సన్నుతించేరు
పదము పదమునందు చిత్రముల మలిచేను
*భావచిత్రకవి* వనుచు ప్రకటించారు ।।అందరూ।।

సాహిత్య లోకాన శిశువు నై పారాడు
నన్ను కవివన్నారు పలు పేర్ల పిలిచేరు
వాదవల్మీకాలభేదించి భువి నిల్చి
కవన హృదయమునెరిగి కవినెప్పుడౌతాను?

కళలన్ పొంగిన నాటి నీ స్వరమునన్ 
      గాంధర్వ లోకమ్మెదో 
 కలలో గాంచిన యట్లు తోచెడు వివి 
      క్త ప్రాణకుల్యా సము 
 జ్జ్వలపoచేద్రియమంత్రమోయన చిగి 
      ర్చన్ దారువుల్ బృంద వీ 
 థుల పొంగెత్తగ రమ్ము రాగమయ చే 
      తోగమ్య గీతాంబుధుల్!!  (84)

Posted in June 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!