Menu Close
SirikonaKavithalu_pagetitle

అమ్మ నా భూమి
ఆకాశం నా తండ్రి
ఆయన సూరీడో తెలియదు
సెందురూడో తెలియదు
ఇద్దర్నీ కళ్ళు చేసుకొని నన్ను కాపాడుతున్నాడు
నాతల్లినీ, నన్నూ పైన్నుంచి ఏపూటా ఎడబాయకున్నాడు
మమ్మల్ని సముద్రంలా పొదివి పట్టుకున్నాడు
తంపునిస్తున్నాడు, తనివి తీరుస్తున్నాడు
ముక్కారులా ఇంటి పంటై కొలువుంటున్నాడు
ఆయనకు కోపమొస్తే తుఫాను
అనుగ్రహమొస్తే పూలవాన
అంతే, ఆయన ఉనికి మాకు తెలిసింది
నా అడుగడుగులో ఆయనను చూసుకొంటుంది
మా అమ్మ భూదేవి,
ఇన్ని పర్వతాలు మోస్తూ ఆయనకోసం అలానే ఎదురుచూస్తుంటుంది
సమాంతరంగా మనుగడకర్థం అన్వేషిస్తుంటుంది
ఎప్పుడో భారమనిపిస్తే తానూ ఆయన వద్దకు వెళ్ళిపోతానంటుంది
అప్పుడు ఈ నిసుగు గతేo కాను?
ఆ మాటా ఆయనే ఊరడించి చెబుతూ అమ్మనిలా నిలుపుతున్నాడు
ఎంతకాలమో ఏమో, చెప్పకున్నాడు!

విఛ్ఛిన్నశిల్పం
తునకలు తునకలుగా
చెల్లాచెదరై ఉంది
ఏరడం ఎలా కుదురుతుంది
మళ్లీ తీర్చడం ఎలా పొసగుతుంది
విశ్వం పుట్టుక లాగే
విసిరి వేయ బడ్డ శకలాల్లా
ఇసుకమెరుపులైంది సంస్కృతి
నాగరికత ఒడ్డు కిపుడు నదీ జలాల పరుగు
మనుష్యుల మనస్సుల విస్ఫోటనం
బాంబులను భయపెట్టేంత
ఇప్పటి కాళ్లు నడువవు
చేతులు కదలవు
పరుగంతా మెదళ్లదే
గూగూళ్ల నిండా నైతికాల పొంగులు
మట్టిగూళ్లలో మృగాలు జడుసుకునే మొగనాడులు
పసిమెుగ్గలు ముదివగ్గులు అని చూడని
వైతరణి వారసులు
నింగిన ఎగిరే ప్రపంచ దేశాల జెండాల ఎజండాల వెనుక దాగిన
అణ్వస్త్రాల చౌకబారు నేలబారు అంగడి బజారు
ప్రజలూ ప్రభుత్వాల పరస్పర అనైతిక సహకారం
నోటు కరచిన ఓటు ప్రజాస్వామ్యానికి పాముకాటు
అదో ఎడ తెగని డెబ్బయి ఏళ్ల టీవీ సీరియల్
తీసేవారు జెణకరుచూసేవారు ఉలకరు
తిట్టిన వాడు గిట్టనివాడై ఊచల వెనుక
ఉరుమౌతాడు
చిల్లుల గొడుగులు మతాలు
కుళ్లిన శవాలు కులాలు
ఓటి కుండలు పలాయనవాద ప్రవచనాలు
మానవత్వానికి కరువొచ్చిపడింది
అందుకే ఆ కళేబరాలు ఓగిరాలు
మృగతృష్ణ లాంటి సౌఖ్యం
మదపిచ్చి లాంటి స్వార్థం
మనిషికి  పరుగుపందాలు పెట్టింది
వాడు నిలబడి నీళ్లు తాగడు
పరుగాపి పాలుతాగడు
ఆలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు ఇనుపపెట్టెల లయలు
వత్తాసుల వృత్రాసురుల రాజకీయాల హొయలు
చినిగిన జీన్స్ ఫాషనొక్కటి చాలు మచ్చుకి
దిగజారిన నాగరికతకు
పొగచూరిన ఆకాశం కన్నీరు చాలు
మనిషి పిచ్చి వేషాల పరాకాష్ఠలకు
ఎన్నడో ఎప్పుడో విసుగెత్తిన జనరేషన్
దిసమొలలతో అడవుల్లోకి పరుగులు తీయకపోరు
అదేమిటో
నిందించటానికి నాకు ఎప్పుడూ నువ్వే కనిపిస్తావు
నన్ను నేను చూసుకునే కన్నులు నా కింకా మొలువలేదు
మొలిచే అవకాశాలు కనుచూపుల మేర లేవు..................
ఇవీ అర్ధరాత్రి మనసుబీడులో మొలిచిన
అసంగత సంగతులు

•••1•••
నేను
పుట్టాను
   చరమాంకాన కబళించే మృత్యువు
   నా పుట్టుకకు సాక్షిసంతకమైంది
   కడదాకా నాతో ఉంటానన్న ఒడంబడికతో.
   నా దేహాన్ని పలకరించి పరవశింపచేసింది
   ప్రాణంగా, జీవంగా, ఆత్మ తోడుగా.
••
నేను
   జీవిస్తున్నాను
      మనసు మార్గాన ... మృత్యు నీడన.
   గెలుస్తున్నాను
      ఆత్మ పథాన ... మృత్యు నేత్రాన.
   జ్వలిస్తున్నాను
      జీవన వలయాన ... మృత్యు క్షేత్రాన.
•••2•••
నేను
జీవన ప్రస్థానాన్ని
స్నేహించిన మృత్యు సంతకాన్ని
   సజీవ కిరణ మృత్యురేఖని
   నవజీవ కణ మనోఙ్ఞరచనని
   ఇహ పర చెరగని సంతకాన్ని
   దిగంతాల మృత్యుగరిమని.
••
నేను
పాంచభౌతిక విదేహాన్ని
పర విశ్రాంతికి ఇహ చిరునామాని
   అశాశ్వత అస్తిత్త్వాల వ్యామోహ వైభవాన్ని
   ఐహికం మెరుపున చీకటి ఉరుముని
   కారుమబ్బున కరగని అంధకారాన్ని
   శ్వాసక్రియన దాగిన మృత్యుచేతనని.
•••3•••
నేను 
ఇరుశ్వాసల విలాసాన్ని
మార్మికనేత్ర శాసన పర్వాన్ని   
   కాలాతీత విలయ ప్రాభవాన్ని
   భూగోళ మృణ్మయపాత్రని
   ఖగోళ కాంతివాహికని
   సృష్టిని పొదువుకున్న పరత్వాన్ని
   సరిరాని సరిలేని మృత్యుకుహరాన్ని
   అనంతతత్వ పరమానందక్షేత్రాన్ని.
••
నేను
జీవన కలశాన 
ఒదిగిన మృత్యు కౌశలాన్ని
   మానవ కుండలినిన
   నిద్రాణమైన నిర్మోహ శక్తిని
   దైనందిన మధురిమన 
   కరగని అవిభక్త చేతనని
   తిరస్కార పదకోశంలో తొలిపదాన్ని
   తొందరపడి అడుగేయని పథాన్ని.

Posted in July 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!