Menu Close
GSS-Kalyani
జ్ఞానానందమయం
శ్రీ శేష కళ్యాణి గుండమరాజు

పేరు ప్రతిష్టలు

ప్రతిరోజూ బడినుండి ఇంటికి వచ్చాక, ఫలహారం తిని, బళ్ళో నేర్పిన పాఠాలు చదువుకుని, ఆ తర్వాత ఊళ్లోని పిల్లలందరితో కాసేపు ఆడుకుంటూ ఉండేవాడు కృష్ణానంద. ఒకరోజు అలా ఆడుకుని ఇంటికివచ్చిన కృష్ణానంద, ప్రసూనాంబ పక్కన కూర్చున్నాడు.

"ఏమిట్రా? అయ్యాయా నీ ఆటలూ?", కృష్ణానందను ముద్దు చేస్తూ అడిగింది ప్రసూనాంబ.

"ఓ! అయ్యాయి బామ్మా! అయితే బామ్మా, నాకొక సందేహం!", అన్నాడు కృష్ణానంద.

"ఏమిటదీ?", అడిగింది ప్రసూనాంబ చిరునవ్వుతో.

"నాతోపాటూ ఆడే బుజ్జిగాడు లేడూ? వాళ్ళ నాన్న మన ఊళ్ళో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారట. అందుకని ఆయన బుజ్జిగాడితో కలిసి దిగిన ఫోటోలు పెద్దవి చేయించి ఊరంతా పెట్టించారు! మన ఊళ్ళో అందరికీ బుజ్జిగాడి గురించి తెలిసిపోయింది. వాడికి బోలెడు పేరొచ్చింది. నాక్కూడా అలా పేరు తెచ్చుకోవాలని ఉంది. నా గురించి మన ఊళ్ళో అందరికీ తెలియాలి బామ్మా. నాన్నను కూడా నా ఫోటోలు అలా పెట్టించమని చెప్పు!", మారాం చేస్తున్నట్లు ప్రసూనాంబను అడిగాడు కృష్ణానంద.

ప్రసూనాంబ చిన్నగా నవ్వి, "చూద్దాంలేరా! మీ నాన్నును ఆఫీసునుండీ రానీ. అప్పుడు మాట్లాడతాను", అని వంటింట్లోకి వెళ్ళిపోయింది.

ఆరోజు సదాశివ ఆఫీసునుండీ ఇంటికి రావడం ఆలస్యమయింది. దాంతో ఆ సమయానికి కృష్ణానంద నిద్రపోయాడు. ప్రసూనాంబ వేరే పనుల్లో ఉండటంవల్ల సదాశివతో ఏమీ మాట్లాడలేదు. మర్నాడు కృష్ణానంద కూడా బడికివెళ్ళి రావడం, చదువుకోవడం, ఆటలవంటి ఇతర పనులలోపడి, బుజ్జిగాడి విషయం మర్చిపోయాడు. రెండ్రోజులు గడిచాయి.

ఆ తరువాతి రోజు ఉదయం ప్రసూనాంబ గుడినుంచీ ఇంటికి రాగానే కృష్ణానందను పిలిచి, "ఒరేయ్ ఆనందూ! మళ్ళీ ఏవో పాటల పోటీలున్నాయట. నువ్వు పాల్గొందువుగాని!", అని చెప్పింది.

కృష్ణానందకు సహజంగా పాటలంటే ప్రాణంకనక, ప్రసూనాంబ చెప్పినదానికి మహదానందంగా ఒప్పుకున్నాడు కృష్ణానంద. ప్రసూనాంబ పాటల పోటీకి కృష్ణానందను సిద్ధం చేసింది. కృష్ణానంద తమ ఊళ్ళో జరిగిన పాటల పోటీల్లో గెలిచి, ఆ తర్వాత జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా గెలిచి, దేశవ్యాప్తంగా జరిగిన పాటల పోటీలో చక్కటి ప్రతిభను కనబరచి, అందరి మన్ననలూ పొందాడు. కృష్ణానంద పేరు ఊరూ-వాడా మార్మోగిపోయింది! వార్తాపత్రికల్లోనూ, టీ.వీ.లలోనూ కూడా కృష్ణానంద గురించి వార్తలొచ్చాయి. కృష్ణానందవల్ల సుందరం ఇంటిల్లుపాదికీ బోలెడు సంతోషం కలిగింది.

కొద్దిరోజుల తర్వాత బడినుండి ఇంటికి వచ్చిన కృష్ణానంద ప్రసూనాంబ దగ్గరకు వెళ్లి, "బామ్మా! బామ్మా! నీకొక విషయం తెలుసా? నాతోపాటు ఆడుకునే బుజ్జిగాడి గురించి కొద్దిరోజుల క్రితం నీకు చెప్పాను కదా?! వాళ్ళ నాన్న మన ఊళ్ళో జరిగిన ఎన్నికల్లో గెలవలేదట. దాంతో బుజ్జిగాడు మా అందరినీ కలవడానికి సిగ్గుపడి బడికి రావడం మానేశాడు! ఇవాళ మా మాష్టారు స్వయంగా బుజ్జిగాడి ఇంటికివెళ్ళి వాడిని బతిమలాడి బడికి తీసుకొచ్చారు. వాడు రోజంతా బిక్క ముఖం పెట్టుకుని కూర్చున్నాడు!", అన్నాడు.

"చూశావా కృష్ణా?! మనకు ఎలాగైనా పెద్ద పేరు రావాలన్న తాపత్రయంతో పనులు చేస్తే, ఆ వచ్చే పేరు ఎక్కువ కాలం నిలవదు సరికదా, మనకు లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెడుతుంది! అదే నిజంగా కష్టపడి పనిచేసో లేక అసలైన ప్రతిభతోనో పేరు తెచ్చుకుంటే, అది ఎక్కువకాలం నిలుస్తుంది! ఇవాళ మధ్యాహ్నం ప్రభాకరంగారు ఫోను చేసి వచ్చే ఏడాది జరగబోయే త్యాగరాజ ఉత్సవాలలో నీ చేత ఒక కీర్తన పాడిస్తానని అన్నారు. ఎందరో సంగీత విద్వాంసులు ఆ ఉత్సవాలలో ఒక్కసారైనా పాడాలని కలలు కంటూ ఉంటారు. ఆ అవకాశం నీకు ఇంత చిన్న వయసులో రావడం నీ అదృష్టం! నువ్వు బడినుండి రాగానే తన దగ్గరకు పంపితే కొత్త కీర్తన నేర్పడం వెంటనే మొదలుపెడతానన్నారు ప్రభాకరంగారు", అంది ప్రసూనాంబ కృష్ణానంద బుగ్గను సన్నగా గిల్లుతూ.

అది విన్న కృష్ణానంద, "అవునా?! సంగీత త్రయంలో ఒకరైన శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తనలంటే నాక్కూడా చాలా ఇష్టం బామ్మా. నేను బట్టలు మార్చుకుని, తయారయ్యి, సంగీతం మాష్టారుగారి దగ్గరకు వెడతా!", అన్నాడు ఉత్సాహంగా.

****సశేషం****

Posted in July 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!