Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

భారత్ లో బ్రిటీషు వాడి పాలన ఎలా ఉందంటే... ఆవు పొదుగు కోసి పాలు త్రాగినట్లు ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందుకు ఉదాహరణ "అల్లూరి సీతారామరాజు" చరిత్ర. ఆనాటి 1882 మద్రాసు ఫారెస్ట్ యాక్ట్ గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకోకుండా నిషేధించింది. దానికి వ్యతిరేకంగానే సీతారామరాజు అప్పుడు తీవ్రంగా ఉద్యమించాడు.  స్వ‌తంత్ర సమర చరిత్ర పై అగ్ని శిఖతో చేసిన రక్త సంతకం – అల్లూరి సీతారామరాజు. సన్యసించి పిదప విప్లవకారులుగా మారిన వారు ఇద్దరే ఇద్దరు యోధులు భారతీయ స్వాతంత్య్ర సమరంలో కనిపిస్తారు. అందులో ఒకరు అరవింద్‌ ఘోష్‌ అయితే, మరొకరు విప్లవ జ్యోతి మన అల్లూరి సీతారామరాజు. అమాయకులైన ఆదివాసీలపై బ్రిటిష్‌ ప్రభుత్వ అధికారులు చేస్తున్న దోపిడీ అల్లూరి ని కదిలించింది. ఇల్లు వదలి సన్యాసి గా మారి దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి బ్రిటిష్‌ వారి దోపిడీకి వ్యతిరేకంగా మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం.

దివంగత త్రిపురనేని రామస్వామి గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర సమర యోధుడు మరియూ కవి సీతారామరాజు. ఆయన ప్రసిద్ధ గేయంలోని ఒక భాగం ఇక్కడ నేను ప్రస్తావిస్తాను...

వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో

రామస్వామి పూలదండలు వేయాలంటే, వీరగంధం తెచ్చి పూయాలంటే తెలుగునాట మొదట అల్లూరి సీతారామరాజు తో ఆయన మొదలు పెట్టాలని నిస్సందేహంగా చెప్పవచ్చు. తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు గురించి, పెద్దగా తెలియని కొన్ని విషయాలను రచ్చబండ సాక్షిగా చర్చించుకుందాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని టేలర్‌ హైస్కూల్‌ పేరు వింటే..170 ఏళ్ల చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 1852లో స్థాపించబడిన ఈ హైస్కూల్‌ లోనే చదువుకున్నారు. తునిలో ఉన్నప్పుడు సీతారామరాజు అక్కడి ధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కొంత కాలం తపస్సు చేసారు. ఆ సమయంలో కొన్ని అడవి జంతువులు అక్కడికి రాగా, ఆయనవాటిని భగవత్ స్వరూపాలుగా భావించి వాటిమీద ఆశువుగా పద్యాలు చెప్పాడట. తర్వాత వాటినే తన సోదరునికి చెప్పగా ఆయనకు గుర్తున్న వరకూ ఆ పద్యాలలో ఒకపద్యం:

సీ|| భక్తితో ॥
శ్రీ వశిష్టుని కడ చిఱుతప్రాయము నాడె
నేర్చి విద్యలనెల్ల నేర్పుతోడ
తన సతి కూడుక వనమున వసియించి
మునులనెల్లర జూచి మ్రొక్కి వారి
దీవనల బదసి మర్ధించి శత్రులనెల్ల
వీలుగా మనదేశమేల దలిచె

శ్రీరామ సీతారామరాజు తెలుగు, సంస్కృత గ్రంథాలను విస్తృతంగా చదివేవాడు. ఈయన తనపేరు దేవనాగరి లిపిలో."శ్రీమన్మహారాజ రాజాధిరాజ శ్రీ అల్లూరి శ్రీరామసీతారామరాజు. శ్రీరామ విజయనగరం" అని వ్రాసుకున్న ఆధారాలు దొరికాయి. ఈయన కేవలం సాహసి మాత్రమే కాదు, సాహిత్యాభిమాని కూడా. మనకు అందుబాటులో ఉన్న రెండు మూడు పద్యాలను బట్టి చూస్తే, ఈయన మంచి కవి కూడా అయ్యుండవచ్చని తెలుస్తున్నది. 17-18 సంవత్సరాల బాల తాపసి శ్రీరామసీతారామరాజు హరిద్వారమునుండి ఋషీకేశ్, బదరీనాథ్ కేదారనాథము, గంగోత్రి, యమునోత్రి, బ్రహ్మకపాలము కీకారణ్యముల ద్వారా రానుపోను 400 మైళ్ళు పర్యటించుట సామాన్యమైన విషయము కాదు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా బ్రహ్మకపాల యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన శ్రీరామసీతారామరాజు దీక్ష, సామర్థ్యమును మనము ఊహించుకొన వచ్చును. ఈ పర్యటనానుభవము తరువాత అడవులలో తిరుగుటకు, బ్రిటీషు వారిపై పోరాటానికి  ఆయనకు ఉపయోగపడింది.

భీమవరం పట్టణానికి సమీపంలోని పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం సీతారామరాజు తండ్రి వెంకటరామ సీతారామరాజు స్వస్థలం. సీతారామరాజు 1897 జూలై 4న విశాఖ జిల్లా పాండ్రంగిలో తల్లి సూర్యనారాయణమ్మ పుట్టింట జన్మించారు. ఆయన బాల్యం భీమవరం పరిసర ప్రాంతాల్లోనే సాగింది. సీతారామరాజు తండ్రి వెంకటరామసీతారామరాజు, సీతారామరాజు పుట్టాక 1902లో ఆయన తండ్రి రాజమహేంద్రవరంలో స్టూడియో ప్రారంభించారు. ఆయన పలు ప్రాంతాలు తిరగడంతో సీతారామరాజు బాల్యం, చదువు కూడా ఆయా గ్రామాల్లోనే సాగాయి. అనంతరం రాజమహేంద్రవరం వెళ్లి అక్కడి స్కూల్లో తిరిగి ఫస్ట్‌ ఫారంలో చేరారు. అక్కడే యోగాభ్యాసంపై దృష్టి సారించి హఠయోగం, పతంజలి యోగం, వేదాంతం వంటి వాటిని అభ్యసించారు. చదువుపై కన్నా ఆయనకు సన్యాసం, ప్రజాసేవ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందుకే పినతండ్రి మందలించాడు. దీంతో ఆయన ఇల్లు వదలి వెళ్లిపోయాడు. పలువురిని ఆశ్రయించి జ్యోతిషం, వాస్తు శాస్త్రం అభ్యసించాడు. సంస్కృత భాషపై పట్టు సాధించాడు. ఇచ్ఛాపురం నుండి కాలినడకన కలకత్తా చేరాడు. కలకత్తా వీధుల్లో వెళుతుండగా అప్పటి అగ్ర స్వాతంత్య్ర సమర యోధుల్లో ఒకరు సురేంద్రనాథ్‌ బెనర్జీ నిత్యార్చన చేసి, తనతో సహపంక్తి భోజనం చేసే ఒక అతిథి కొరకు ఇంటి బయటికి వచ్చి వెతుకుతుండగా ఎదురుగా సీతారామరాజు కనిపించాడు. ఈ విధంగా ఒక స్వతంత్ర సమార యోధునితో సీతారామరాజు కు పరిచయం జరిగింది. సన్యాసి జీవితం గడుపుతున్న సీతారామరాజు, క్రమేణా తన స్వీయ ముక్తి కంటే, అణగారిన ప్రజల సాంఘిక, ఆర్థిక విముక్తికి కృషి చేయ డమే తన విద్యుక్త ధర్మమని భావించాడు.

ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఉత్సాహం చూపించిన సుమారు 200 మంది యువకులను 1922 ఆగస్టు 15న శరభన్నపాలెంలో సమావేశపరచి వారిచే ప్రమాణం చేయించాడు. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మొదటిసారి దాడి చేశారు. దాడికి ముందే నర్సీపట్నం వైపు వెళ్తున్న ఎస్సై లంబసింగి వద్ద అల్లూరికి ఎదురుపడగా.. ‘ఆయుధాల కోసం మీ స్టేషన్‌కే వెళ్తున్నాను’ అని రామసీతారామరాజు చెప్పారని, అతడు మారు మాట్లాడక తప్పుకున్నట్టు చెబుతారు. ఈ దాడిలో 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, ఐదు కత్తులు, 14 బాయ్‌నెట్లను తీసుకెళుతున్నట్టు పోలీస్‌స్టేషన్‌ డైరీలో రాసి.. అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు.  ఆగస్టు 23న కృష్ణదేవీపేట, 24న తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, ఆ తర్వాత వరుసగా అడ్డతీగల, రంపచోడవరం పోలీస్‌స్టేషన్లపైనా దాడులు కొనసాగాయి. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడితో ప్రారంభమైన విప్లవం 1924 మే నెల వరకు అనేక విజయాలతో, బహుకొద్ది ఆటంకాలతో కొనసాగింది. ప్రభుత్వం 20 మంది యూరోపియన్‌ ఉన్నతాధికారులను, 1,500 మంది పైగా ఈస్ట్‌ కోస్ట్‌ స్పెషల్‌ పోలీసు, మలబారు స్పెషల్‌ పోలీసులను నియ మించి ఉద్యమాన్ని అణచే ప్రయత్నం చేసింది.  చింతపల్లి దాడికి వందేళ్లు సమీపిస్తున్న సందర్భంగా తపాలా శాఖ స్మారక స్టాంపును ఆవిష్కరించింది.

ఏజెన్సీ కమిషనర్‌ స్టీవర్ట్‌ 1922 అక్టోబర్‌ 24న మద్రాస్‌కు తంతి పంపుతూ, ‘‘సీతారామరాజు గూఢచర్య చర్యలు అమోఘం. మన దళం బయలుదేరిన వెంటనే ఆ సమాచారం అతనికి చేరుతోంది. మనకు అందే సమాచారమంతా మనల్ని తప్పుదోవ పట్టించడానికి సీతారామరాజు పంపుతున్న వార్తలే’’ అని పేర్కొన్నాడు. దీన్ని బట్టి సీతారామరాజు సామర్ధ్యం, అనుచరవర్గం పై ఆయనకున్న పట్టు మనకు అవగతం అవుతుంది.

శ్రీరామ సీతారామరాజు కేవలం యుద్ధ వీరుడే కాదు. ఒక నిజమైన నాయకుడు కూడాను. మన్యం ప్రాంతంలో ప్రజల దురలవాట్లైన కల్లు, మద్యం లాంటివి మాన్పించటానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించాడు. అక్కడ ఇంచుమించు ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపాడు. పంచాయితీలు నిర్వహించి తీర్పులు చెప్పేవాడు. దానితో అక్కడి ప్రజలు పోలీసు స్టేషన్, కోర్టులకు వెళ్ళకుండా ఈ పంచాయితీలకే వచ్చేవారు. ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉన్న యోధుడు, ప్రజల నాయకుడు, కవి, పండితుడు,యోగి, వేదాంతి, మూలికా వైద్యుడు అయిన అల్లూరి సీతారామరాజు గారిని మన కవులు కీర్తించ దగినంతగా కీర్తించారా అని ఒక అనుమానం చాలామంది తెలుగు చరిత్రకారులలో ఉంది. ముఖ్యంగా, తెలుగు పౌరుషం, గురించి వ్రాసిన విశ్వనాథ ఈయన గురించి ఒక చిన్న ఖండకావ్యమైనా వ్రాసినట్టులేదు అని కొంత మంది చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ, ఝాన్సీ రాణుల మీద కావ్యాలల్లిన ఈ "ఆంధ్ర పౌరుష" గ్రంథ కర్త తన కళ్ళెదుటే గడ్డ దేరిన తరతరాల ఆంధ్రపౌరుషానికి నిలువెత్తు ఆకారమైన అల్లూరిని విస్మరించటం విస్మయానికి గురి చేస్తున్నది. సీతారామరాజు గురించి ఓ ప్రస్తావనలో టంగుటూరి ప్రకాశం గారు 'హి ఈజ్ ఎ డెకాయిట్' (అతను ఒక దోపిడీ దొంగ) అని అభివర్ణించారంటారు కొందరు. అల్లూరి సీతారామరాజు మీద బ్రిటీషు వారు తెలివిగా పెట్టిన కేసులన్నీ దొంగతనం, దోపిడీల క్రిందే కాని కుట్ర రాజద్రోహం లాంటి కేసులు ఎక్కడా పెట్టలేదు, బహుశా సీతారామరాజుని ఎన్ కౌంటర్ చెయ్యడానికి దొంగతనం, దోపిడీ కేసులైతే బాగుంటాయని, రాజద్రోహం లాంటి కేసులు అయితే గాంధీ, నెహ్రూ లవలె అల్లూరి ని జైల్లో పెట్టి పోషించాలని బ్రిటీషు వాడు తెలివిగా ఆలోచించివుంటాడు. వారి బుట్టలో టంగుటూరి ప్రకాశం పడడం విచారకరం. సీతారామరాజు పట్ల నేతాజీ చూపిన గౌరవం సాటి తెలుగు వారు విశ్వనాథ, టంగుటూరి ప్రకాశం పంతులు ఆనాడు ఎందుకు చూపలేదో చరిత్రకారులు పరిశోధించాలి. బహుశా కాంగ్రెస్ మార్గంలో కాకుండా సాయుధ పోరాటం ద్వారా బ్రిటిష్ వారిని ఎదిరించాలని సీతారామరాజు ఎంచుకున్న మార్గం ఒక కారణం కావచ్చు.

అప్పటి కృష్ణదేవిపేట మండలం తహశీల్దార్‌ బాస్టియన్‌, అతని దుబాసి సంతానం పిళ్లై స్థానిక గిరిజనులపై అనేక అరాచకాలు చేసేవారు. దీనితో అల్లూరి సీతారామరాజు బాస్టియన్‌కు వ్యతిరేకంగా గ్రామాలలో పంచాయతీలు నిర్వహించాడు. అటవీ ఉత్పత్తులను కొల్లగొడుతూ.. గిరిజనులకు తగిన కూలీ ఇవ్వకపోవడంపై అల్లూరి నిలదీశారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న బాస్టియన్‌ అల్లూరి సీతారామరాజును అరెస్ట్‌ చేయించి అడ్డతీగల దగ్గర గల పైడిపుట్టి అనే గ్రామానికి తరలించాడు. 1921లో అల్లూరి సీతారామరాజు నేపాల్‌లోని హిమాలయాలలో తపస్సు చేయడానికి వెళ్తున్నానని పేర్కోని పైడిపుట్ట గ్రామాన్ని వదలి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌కు వెళ్లాడు. అక్కడ బెంగాల్‌ విప్లవ వీరుడు అయిన 'పృథ్వీసింగ్'ను కలసుకొని గెరిల్లా యుద్ధవిద్యలు నేర్చుకున్నాడు. అల్లూరి సీతారామరాజు చిట్టగాంగ్‌ నుండి మన్యంనకు బయలుదేరి మార్గంమధ్యలో 'పర్లాకిమిడి'లోని సవరజాతి వారిని బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా ఏకం చేసాడు. అల్లూరి సీతారామరాజు మన్యంలో అనేక మంది అనుచరులను ఏర్పరచుకొన్నాడు. అల్లూరి అనుచరుల్లో ఐదుగురు ప్రముఖులు...

1) గంటం దొర, 2) మల్లు దొర, 3) వీరయ్య దొర, 4) అగ్గి సీతారామరాజు (పేరిచర్ల సూర్యనారాయణసీతారామరాజు) 5) ఎండుపడాలు.

మన్యం పోరాటంలో అల్లూరిని అనుసరించిన 17 మంది ముఖ్య అనుచరుల్లో కొందరిని బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ చేసి అండమాన్‌ సహా వివిధ జైళ్లలో బంధించింది. 1922 ఆగష్టు 22న అల్లూరి సీతారామరాజు మొట్టమొదటగా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి ఆయుధాలను తీసుకొనిపోయాడు.

ఈ దాడుల యొక్క విశిష్టత ఏమంటే, అల్లూరి చేసిన ప్రతి దాడి తర్వాత, అతను స్టేషన్ల డైరీలో స్టేషన్ నుండి దోచుకున్న వివరాలను దాడి చేసిన తేదీ సమయాన్ని ఒక లేఖపై వ్రాసి సంతకం చేసేవాడు, తర్వాత పోలీస్ స్టేషన్ లపై తను చేయబోయే దాడుల గురించి వివరాలు కూడా ముందస్తు గా రాసి, పోలీసులు చేతనైతే తనను ఆపడానికి ధైర్యం చేయవచ్చని సవాలు చేసేవాడు. రూథర్‌ఫర్డ్‌ మరియు మేజర్‌ గుడాల్, ‌సీతారామరాజును పట్టుకొనుటకు అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. దీనితో వీరు అందుబాటులో ఉన్న మన్యం ప్రజలపై అనేక అకృత్యాలు చేయసాగారు. అతను సీతారామరాజుకు సహాయం చేస్తున్న వారిని అనుమానించి 58 మంది గ్రామ మునసబులనూ, ముఠాదారులనూ అరెస్టు చేసి రుషికొండ జైలులో బంధించాడు. సీతారామరాజు ఆచూకీ తెలపండని స్త్రీలను, పిల్లలను చిత్రహింసలు పెట్టించాడు. బ్రిటిష్ వారి పాలన ఆవు పొదుగు కోసి పాలు త్రాగినట్లు ఉంటుందని ముందు చెప్పానుకదా, ఇందుకే! దీనితో తీవ్ర వేదన చెంది అల్లూరి సీతారామరాజు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.

మన్యంలో 'పంపా' అనే నదీ తీరాన “కంచు మీనన్‌” అనే అధికారి అల్లూరి సీతారామరాజును 1924 మే 7వ తేదీన అరెస్ట్‌ చేశారు. అదే రోజు అల్లూరి సీతారామరాజు “ఉయ్యూర్‌” శిబిరంనకు తరలించబడ్డాడు. అచట మేజర్ గుడాల్‌ మే 7వ తేదీ సాయంత్రం సీతారామరాజును కాల్చి చంపాడు. మే 8న సీతారామరాజు విశాఖపట్నంలో కృష్ణదేవిపేటలో సమాధి చేయబడ్డాడు. జూన్‌ నెలలో సీతారామరాజు యొక్క ప్రధాన అనుచరులు అయిన గంటం దొర, వీరయ్య దొర మొదలగువారు పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు. దీనితో రంపా తిరుగుబాటు పూర్తిగా అంతమయింది. అల్లూరి తన దృఢ సంకల్పంలో చురుకు అని, ప్రజల కోసం అతని అసమానమైన ధైర్యం మరియు త్యాగం అతనికి చరిత్రలో గౌరవనీయమైన స్థానం కల్పిస్తాయని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. భౌతికంగా సీతారామరాజు మన మధ్య   లేకున్నా ప్రజల గుండెల్లో నేటికీ విప్లవీరుడుగానే నిలిచిపోయూరు.

సీతారామరాజు అనుచరుడు మల్లుదొర 1938లో జైలు నుండి విడుదల అయ్యాడు. ఈయన విశాఖలో గిరిజన సేవ కొరకు తన శేష జీవితాన్ని అంకితం చేశాడు. స్వతంత్రానంతరం 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో సీతారామరాజు బృందం సభ్యుడు "మల్లు దొర" స్వతంత్ర అభ్యర్థిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యాడు. ఆధునిక తెలుగు వారిలో చాలా మందికి ఈ విషయం తెలియదు.

అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం ఆయుధాలతో స్వాతంత్య్ర సమర ప్రారంభం చేసిన యోధుడు, విప్లవకారుడు. బ్రిటిష్ వాళ్ల గుండెల్లో బాణాలతో అగ్గి రాజేసిన విప్లవ కణిక. క్షత్రియ పౌరుషంతో తెల్ల దొరల తుపాకులతో, విల్లంబులతో  పోరాడి, వాళ్లకి నిదురలేకుండా చేసిన అగ్గి బరాటా. అటువంటి స్ఫూర్తి ప్రస్తుత పరిస్థితిలో ఈరోజు తెలుగు రాష్ట్రాల యువతకు చాలా అవసరం. భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాకరంగా జరుపుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా గుర్తింపుకు నోచుకోని స్వతంత్ర వీరులను గౌరవిస్తున్న సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు సేవలను భారత ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఆలోచనలో భాగంగా, స్పూర్తి ప్రదాత సీతారామరాజు 125 జయంతి సందర్భంగా భీమవరంలో మన్యం వీరుని 30 అడుగుల కాంస్య విగ్రహం ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జూలై 4, 2022న జరిగింది. 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరు ప్రధాన కార్యాలయంగా పూర్వపు విశాఖపట్నం జిల్లా నుండి అల్లూరి పేరు మీద కొత్త జిల్లాను ఏర్పాటు చేసింది.

ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే దేశానికి స్వతంత్రం వచ్చింది! ఆ తిరుగుబాటులో అసువులు బాసిన వీరులలో .... అల్లూరి సీతారామరాజు ముందు వరుసలో ఉంటారు. వారి అనుచరులు గంటం దొర, మల్లు దొర వీరత్వం గురించి మాటల్లో చెప్పలేం..! స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ఆ మహనీయుల్ని ఏ జయంతికో, వర్ధంతికో గుర్తుచేసుకుంటుంటాం. కానీ నేటి యువత సీతారామరాజు ని రోజూ స్ఫూర్తిగా తీసుకునే సందేశాన్ని సీతారామరాజు మనకు ఇచ్చారు - "విజయానికి ధైర్యమే ఆయుధం" ఇదే తన పోరాటాల ద్వారా సీతారామరాజు మన యువతకు ఇచ్చిన బలమైన సందేశం. కాగా, అల్లూరి సీతారామరాజు విగ్రహం పార్లిమెంట్ లో ప్రతిష్టించాలని, విశాఖపట్నం లో రానున్న కొత్త అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు  పెట్టాలని, భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన రీతిలో  తెలుగు గడ్డపై జరిగిన మన్యం తిరుగుబాటు ను దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాల తరగతుల్లో  పాఠ్యాంశంగా చేయాలని సీతారామరాజు 124 జయంతి సందర్భంగా పలువురు ప్రధాని మోదీని కోరారు. త్వరలో ఈ కోరికలు నెరవేరుతాయని ఆశిద్దాం!

జూలై 4, 2023 అనగానే ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ముందు గుర్తుకు వచ్చేది "అమెరికా స్వతంత్ర దినం" అని. అయితే మన తెలుగు వారికి అంతకంటే గుర్తుపెట్టుకుని సందర్భం మరొకటి ఉంది, ఆరోజు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినం. హైదరాబాదు గచ్చి బౌలి ఇండోర్ స్టేడియం లో సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా.. సిరిమల్లె పాఠకులు తెలుగు తేజమైన అల్లూరిని స్మరించుకుంటారని, ఆయన పోరాటాల చరిత్ర స్పూర్తితో ఉత్తేజితులవుతారని  ఆశిస్తూ...  యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in July 2023, వ్యాసాలు

4 Comments

  1. పూర్ణానందం

    మిత్రులు వెంకట్ నాగం గారు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా చక్కగా వివరించారు. వారికి అనేక
    ధన్యవాదములు. నేను కూడా వారి గురించి మంచి పాట రచన చేశాను.
    భారత మాతకు జై.. భరతమాత ముద్దుబిడ్డ
    శ్రీఅల్లూరిసాతారామ రాజుకు జై.
    8328665515
    మీ
    పూర్ణానందం. బి.

    • వెంకట్ నాగం

      మిత్రులు పూర్ణానందం గారికి ధన్యవాదాలు! శ్రీ అల్లూరి సీతారామరాజు పై మీరు పాట రాసారనే మంచి వార్త చెప్పారు. మీ పాట ను వీలయితే సిరిమల్లె పాఠకుల కొరకు కామెంట్ బాక్స్ లో పొందుపరచండి. ధన్యవాదాలు!
      –వెంకట్ నాగం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!