Menu Close
Lakshmi-Iyer
సనాతన భారతీయం
ఆచార్య లక్ష్మి అయ్యర్

రామలింగ అడిగలార్ (వళ్ళలార్) - 1823

Ramalinga-Adigalar2

గత సంచిక తరువాయి »

ఒక సర్వ సభ్య సమాన సమాజపు వికాసము అక్కడ జీవించే వ్యక్తుల మీదే ఆధారపడి ఉంటుంది అని చెబుతూ, జీవ హింస చేయబడకూడదు, శాఖాహారంతో నిండి మంచి భావాలతో అంధ విశ్వాసాలు లేని సమానత్వంతో మెలిగే మనుష్యులతో నిండి ఉన్న సమాజాన్ని తన పద్యాలలో ఉదహరించారు. పద్యము 482 లో “గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు, అగ్రజులు చిన్న కులస్తులు, షావుకారు పేదవాళ్లు, ఆడ మగ అన్న బేధ భావం లేక అందరూ భగవంతుని  సంతానమని ఆయన అభిప్రాయపడ్డారు.  ఉయిర్ నేయం  అనే సిద్ధాంతంలో “సమస్త ప్రాణులందరూ ప్రేమతో ముడివడి ఉండాలని చెప్పారు. మనుషులను రెండు తత్వాలు విభిన్నపరుస్తాయి. మనుష్య సమాజంలో వ్యక్తి ఎన్నో విధాలుగా విభజింపబడ్డాడు. ఒకటి జాతిగా మరొకటి మతపరంగా విభేదింపబడ్డాడు. భారతదేశంలో జాతి భేదాలు ఎక్కువగా ఉన్నాయి.  ఈ రెండు బేధాలను చూసి వాటిపై తన నిరసన వ్యక్తం చేసిన వళ్ళలార్ “పరిపూర్ణ మానవ ప్రేమికులు మానవ జాతికి చెందిన వాళ్ళు. మతం అనేది ప్రేమతో మెలిగే మానవ మతం. ఆయన ఈ విషయాన్ని తన రచనలలో చక్కగా అభివర్ణించారు.  తన సన్మార్గ సభ ద్వారా గురువు గా వ్యవహరించే  రామలింగం గారు ధార్మిక పద్ధతులను అంధవిశ్వాసాలను వర్ణాశ్రమ ధర్మాలను మాయ అని చెప్పి తూలనాడి అవహేళన చేశారు. మన అందరి శరీర ఆకృతి 96 అంగుళం మాత్రమే దీనిలో ఎందుకు జాతి పరమైన మతపరమైన భేదభావాలు అని ప్రశ్నించారు. ప్రతీ జీవి తమ తమ చేతితో శరీరాన్ని కొలుస్తే 8 జాణెలు మాత్రమే అని అన్నారు. “సమాజంలో రగులుతున్న జాతుల మతాల విభేదాలను చెత్త కుండీలో పారవేయి, దానిమీద మన్ను పోసి పాతి పెట్టేసేయ్. ఆ కార్యం వల్ల కనీసము మనకు ఎరువైన మిగులుతుంది” అని చెప్పారు. ఆయన ఈశ్వరుడైన శంకరుని అరుళ్ జ్యోతి అని సంబోధించేవారు.  దానికి అర్థము కృపా పూర్ణ దివ్యజ్యోతి అని అర్థము. “సమస్యలను చూసి ఎప్పుడూ మనం భయపడకూడదు. ఆత్మ విశ్వాసంతో ధైర్యంగా భక్తితో దాన్ని వేరుతో సహా పీకి పారవేయాలి” అన్నారు. శాఖాహారాన్ని సమర్థించే సమపంక్తి భోజన సిద్ధాంతములో బ్రాహ్మణులు, హరిజనులు ఇతర మతాల వారు కూడా ఉన్నారు. సుసంస్కృత సభ్య సమాజం అంటే జాతి మత లింగ భేదాలు, అంధ విశ్వాసాలనబడే గోడలు లేని సమాజమని ఆయన నమ్మారు. సృష్టిలో రెండే జాతులు కలవు ఒకటి స్త్రీ జాతి ఒకటి పురుష జాతి. ఇది ప్రకృతి సిద్ధంగా ఇవ్వబడిన సకల జీవరాశులలో కనిపించే జాతులు. ఇవి రెండూ ఎప్పుడూ సర్వసమానము. ప్రతి కార్యానికి ఇద్దరికీ సమాన అవకాశాలు సమాన అధికారాలు ఇవ్వాలి. స్త్రీ పురుష బేధ భావాలు సమాజంలో చూపితే అది పాపము. భార్య  చనిపోతే భర్త ఎలా రెండవ వివాహం చేసుకుంటాడో అదే లాగా విధవ గా సమాజంలోని ఈటె లాంటి సూటి పోటి మాటలకు బలి అవుతున్న మన భారత స్త్రీలకు కూడా రెండో వివాహం చేసుకునే అర్హత ఉంది అని వక్కాణించి చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త వళ్లలార్ గారు. స్త్రీని భర్త  చనిపోయిన వెంటనే  ఆమె వేసుకున్న మంగళసూత్రాలు బొట్టు కట్టు పసుపు కుంకుమ గాజులు తీసివేసి విధవరాలుగా చేయడం మహాపాపం. బొట్టు పెట్టుకోడం గాజులు వేసుకోవడం ఇలాంటివి ఆవిడ వదిలి వెయ్యకూడదు, ఎందుకంటే స్త్రీ పుట్టుకతోనే మంగళంతో కనబడే ఆదిశక్తి స్వరూపురాలు. అందుకే ఆడ పిల్లలకు గాజులు వేసి బొట్టు పెట్టి అలంకరించి మురిసి పోతుంటాం. ఆ కాలపు భారత సమాజం లో భర్తను వదిలి వేసిన భార్యకు, బిడ్డలు లేని స్త్రీలను కించ పరచే విధంగా ఎన్నో శబ్దాలు వాడుకలో వుండేవి . విధవ ,పెళ్లి కానిది, భర్తను పోగొట్టుకున్నది భర్తతో జీవించలేనిది అయిన స్త్రీలకు  వివిధ ప్రకాలైన పేర్లు భారతీయ సమాజంలో పెట్టి ఉన్నారు. ఇవన్నీ కూడా జీవహింసకు సమానమే, ఇలా స్త్రీని కించ పరచే సమాజం ఎప్పుడూ అభివృద్ది చెందదు . స్త్రీలను గౌరవిస్తే సమాజానికి చెందిన సమస్యలన్నీ దూరమవుతాయి అని అన్నారు .

Ramalinga-Adigalar3ఆనాటి తమిళ సమాజంలో భర్త చనిపోతే తాళి అరుత్తల్ (తాళి తెంచడం) అనే సంప్రదాయం పెట్టి స్త్రీ యొక్క తాళి బొట్టును తీసివేసి గాజులను పగలు కొట్టేవారు. దీనికి నిరసనగా ఆయన పిలుపునిచ్చారు. స్త్రీని విధవ గా గొడ్రాలుగా, పెళ్లి కాని  అమ్మాయిలను విభిన్న పేర్లతో పిలిచి చులకనగా చూసే సమాజానికి ఆయన ఎదురు తిరిగారు. భర్తతో తెగ తెంపులు చేసుకొన్న వదిలి వచ్చిన స్త్రీని వాషా వెట్టి (vazha vetti- అంటే జీవితాన్ని చంపిన వ్యక్తి అని శాబ్దిక అర్థం) అని పిలిచి ఆమెను మానసిక హింసలు చేసే వారు. వాటినన్నింటిని ఈయన ఎదిరించారు. తల్లిని గౌరవించేవాడు ప్రతి స్త్రీని గౌరవిస్తాడని ఈయన అన్నారు. పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు స్త్రీ ఎప్పుడూ ప్రకృతి ద్వారా మంగళ రూపంతో తిరిగే శక్తి మూర్తి అని అభిప్రాయపడ్డారు. తన జీవ కారుణ్య సిద్ధాంతముతో ఆయన ఆకలి నిర్మూలనకై మాంసాహార నిషేధానికై పాటుపడ్డారు. ఆయన సిద్ధాంతాలు కొన్ని ఇక్కడ వివరింపబడ్డాయి.

జీవకారుణ్య ప్రవర్తనే దేవుని పూజ: లోకంలోని మనుషులు ఈ జన్మలో చేసిన మంచిని ఈ జన్మలోనే పొందవలెను. అది ప్రతి వ్యక్తి పై సకల చరాచర ప్రాణులయందు కరుణతో  నిండిన ప్రేమను చూపడమే. సుఖంగా జీవనం సాగాలి అనుకుంటే అది ఆ దేవుని యొక్క ఆశీస్సులతోనే జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టికి మూల కారకుడు ఆ సర్వాంతర్యామి భగవంతుడు. కబీరుదాసు అన్నట్లు ఈయన కూడా భగవంతుని ప్రేమను ఇలా వర్ణిస్తున్నారు “ఈ లోకంలో వున్న బంధుత్వం అంతా శ్మశానంలో శరీరం మండేవరకే, కానీ ఆ దేవుని బంధుత్వం జన్మ జన్మలకు ఇహ పర లోక బంధం ఎలా దూడ తన తల్లి ఆవును వెదుకుతూ వెళ్ళి పాలు తాగుతుందో అలాగే మనం ఆ భగవంతుని నమ్మాలి.” ఈయన పరమ శివుని చిదంబరం లోని శ్రీ నటరాజ స్వామి వారి పరమ భక్తుడు. తమిళ స్వామి మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) పై కందర్ కోట్టం చెన్నై లో కోవెల కట్టించి ఉపాసించిన సిద్ద యోగి. ఈయనకు రస వాదం ఆయుర్వేదం బాగా తెలుసు. ఆయన పెక్కు రచనలు ఈ విషయాన్ని ప్రతిపాదిస్తున్నాయి. కానీ విచారించ దగ్గ విషయం ఏమంటే అది భారతీయులకే  తెలియదు. ఈయనపై పలు పరిశోధనలు జరిగి ఈ మహానుభావుని మహిమలను బయట ప్రపంచానికి తెలియజేయాలి. దేవుని యొక్క ఆశీస్సులతోనే జీవకారుణ్య సిద్ధాంతమును పొందవలెను. దేవుని యొక్క ఆశీస్సులను జీవకారుణ్య సిద్ధాంతం తోనే పొందాలి అది ఎలాగంటే అన్నీ జీవరాశులను కరుణతో  ప్రేమతో చూడాలి. ప్రేమించే హృదయం వుంటేనే ఆ హృదయం కోవెలకు సమానం. ఆ ప్రేమలోనే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడు నివసిస్తాడు. వాళ్లలార్ గారు అనేక ప్రకారాలైన మొక్కలతో వేర్లతో ప్రాకృతిక ఔషధాలను వాటి చికిత్సల గురించిన చాలా వివరణలు తన రచనలలో ఇచ్చి ఉన్నారు. రసవాద సిద్ధాంతములో కూడా ఆయన ఆరితేరి  ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఇనుము, రాగి వాటిని బంగారంగా మార్చే ప్రక్రియ ఈయన చేశారని ఇప్పుడు కూడా గుడి చుట్టూ వున్న ఇనుప సంకెళ్ళు లో ఆయన బంగారాన్ని పొందు పరచారని, పేద వాళ్ళకు ఆకలి తీరక పోతే కరువు కాటకం వస్తే ఆయనే స్వయంగా వస్తారని ఈయన గురించి మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామిలాగా చాలామంది అనేక విధాలుగా చెప్పుకుంటారు. ఒకరోజు ఈయనను చూడడానికై  చెన్నై నుండి ఒక పేద క్రైస్తవుడు వడలూరు వచ్చి తన బీదరికాన్ని గురించి చెప్పి ఏడ్చాడని ఆయన అప్పుడు అతనికి ప్రతిరోజు రెండు నాణములను వెండిగా మార్చే మంత్రాన్ని రస తంత్రాన్ని నేర్పించారని ఆ క్రైస్తవుడు చాలా ఆశపడి ఆ విద్యను మితిమీరి లోభిగా మారి ఆ విద్యను ప్రయోగించి ఒక పెద్ద వెండి కంబాన్ని తయారు చేసుకుని ఈయన దగ్గరికి వచ్చాడని దాన్ని చూపిస్తే  గురువు అయిన వళ్లలార్ దాన్ని తీసుకొని అందరి ముందు బంగారంగా చేసి చూపించి తర్వాత ధర్మశాల వెనకాల ఉన్న బావిలో విసిరి వేసి అతన్ని తిరిగి చెన్నై వెళ్ళిపొమ్మని చెప్పారని తర్వాత ఆ విద్య అతనికి పనిచేయలేదని చెప్పబడుతున్నది. వీటన్నిటికీ గ్రంథాలు సాక్ష్యాలు. ఈయన రచనలు దాదాపు 48. వీటిలో పద్యాలు, కావ్యం, కవితలు, పాటలు, తత్వాలు వున్నాయి. ఆయన రచన తిరు అరుట్ పా లో (దివ్య అనుగ్రహ పాటలు) ఎన్నో ప్రకారాలైన ఆయుర్వేద చికిత్సలు చెప్పబడ్డాయి. ఈయన యుగము తమిళ సాహితి లోక స్వర్ణ యుగంగా వర్ణింపబడి ఉన్నది. ఆయన తన చుట్టూ ప్రక్కల వున్న ప్రాంతాల వారందరికీ కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు. ఎందరో షావుకార్లు జమీందార్ల విరాళాలను పేదలకు పంచి పెట్టేవారు. ఆయన కంటూ రెండు పంచెలు తప్ప ఏమీ లేదని తెలుసుకొని  వైష్ణవులు శైవులు ఎంతోమంది ఆయన శిష్యులుగా మారారు. ఓ సారి ఈయన శివునిపై కవితలు అల్లుతుంటే  వీరి వదిన గారు ఓ చిన్న చెంబులో నీళ్ళు ఓ చిన్న చెంబులో నూనె ఆయన రాసేటప్పుడు వెలిగే దీపానికి వుంచే వారంట. ఆవిడ ఒక సారి నూనె వుంచడం మరచి పోయి నీళ్ళు మాత్రమే పెట్టి వెళ్ళిందంట. బయటకు పోయి నాలుగైదు గంటల తర్వాత వచ్చి ఆమె చూసిన దృశ్యం ఊరంతా చెప్పిందని అక్కడి మొదలియార్ రాశారు. ఆ నీటిని నూనెలాగా పోసి భక్తవ అని ఆయన రాసుకుంటూ పోయారని నీటితో నూనెదీపాన్ని వెలిగించిన భక్త కవియని చెప్పబడింది. భగవంతుని హృదయంనందు నెలకొల్పుకొని ఆయన తన మనసుని సంబోధించుకుని రాసిన పాటలు ఎన్నో ఉన్నాయి (పాటలు 2004, 42 నుండి 44, 26251) ఆయన తనను ఎప్పుడూ గొప్పవాడని చెప్పుకోలేదు దీన బంధువు సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని ముందు మోకరిల్లి “నేను పాపులలో అగ్రణి  జాతి మత కుల సమస్యల మధ్యలో ఇరుక్కుని బతుకుతున్నాను నన్ను కాపాడు” అని ప్రార్థించే గీతాలు కోకొల్లలు. ఈయన అనేక గీతాల్లో తమిళ సామెతలు కనబడతాయి. ఈయన సిద్ధాంతాల్లో ప్రముఖమైనవి  “చిన్న చిన్న దేవీ  దేవతలను కొలవకండి, వాళ్ల పేర్లపై జంతు బలి ఇవ్వకండి. జంతువుల బలి సమాజంలో నిషేధము. మాంసాహారాన్నీ, మత్తు పదార్థాలను సేవించకండి. జగత్తులోని ప్రతి ప్రాణిని ప్రేమించండి. సమస్త జీవుల్లోని ప్రాణాలను తమ తమ ప్రాణాలుగా భావించండి.  పేద ప్రజల దీనుల దుఃఖాలను దూరం చేయండి.  ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టి కడుపు నింపండి. జాతి కులం పేరుతో మానవులను విడదీయకండి. మనిషి మనసులో ఉన్న క్రోధము, స్త్రీలపై వ్యామోహము, ఇతరుల ఇల్లాళ్ళ పై వ్యామోహపడడం, ఇతరుల వస్తువులను పొందాలని ఆశ పడడం, ద్రోహం చేయడము, అబద్ధాలు చెప్పడము, లంచం తీసుకోవడం, దయ లేకుండా ఉండడం సోమరిగా తిరగడం ఇవన్నీ మనిషి రూపంలో ఉన్న రాక్షసులు చేసే పని. వీటన్నింటి నుండి బయటపడాలంటే సన్మార్గ సిద్ధాంతాన్ని అనుసరించాలి. మంచి వాళ్లతో కలిస్తే మంచి గుణాలు వస్తాయి. చెడ్డ వాళ్లతో కలిస్తే చెడ్డ అలవాట్లతో జీవితం నాశనం అవుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ, కరుణ మన మాటల ద్వారా వ్యక్తం అవ్వాలి. జాలి గుండెలోనే ఆ పరమ శివుడు నివసిస్తాడు. కఠిన శబ్దాలతో కూడిన పలుకులను వీడండి. ప్రేమతో మెత్తగా వీనులకింపయిన శబ్దాలను ప్రయోగించండి.”

Ramalinga-Adigalar4సమాజ ఉపయోగానికై ఆయన చేసిన సేవలు ఆయన నిర్మించిన సంస్థలు పర్యావరణానికి సంబంధించిన ఆయన ఆలోచనలు బోధనలు ఇప్పుడు కూడా ఆధునిక సమాజపు హరిత క్రాంతికి దోహద పడుతున్నది. ఈరోజు కూడా తమిళనాడులోని వడలూరులో ఆయన స్థాపించిన సంస్థ ద్వారా 24 గంటలు అన్నదానం జరుగుతూనే  ఉన్నది.  అక్కడ వున్న హుండీలలో డబ్బులకు బదులుగా పప్పు దినుసులు, బియ్యం చింతపండు, చక్కెర, బెల్లం, నూనె ప్రజలు తమకు తోచిన విధంగా వేస్తారు. ఆయన మండించిన పొయ్యి ఆరకుండా ఇప్పటివరకూ వెలుగుతూనే వుంది.

తన 51వ ఏట ఆయన తన ఇష్ట ప్రకారము స్వేచ్ఛ సమాధిని స్వీకరించారు. 1874 జనవరి 30 శుక్రవారం అర్ధరాత్రి ఆయన తాను తన శరీరాన్ని వదిలిపెడతానని ముందే చెప్పారు. తను శివుని సన్నిధికి వెళ్తున్నానని  ఆ జ్యోతి స్వరూపమైన ఆ భగవంతుని వల్ల తనకు చావు లేదని తను ఎక్కడన్నా ఏ దేశంలోనన్నా   కనబడుతానని  చెప్పి అందరి ముందు శివుని స్తుతించి ఆయనకు హారతి ఇచ్చి ఆయన తన ధ్యాన గదిలో  వెళ్లి తలుపు మూసేసుకున్నారు. తర్వాత  తలుపులు తెరిచి చూస్తే ఒక దీపం మాత్రమే అక్కడ వెలుగుతున్నది. ఆయన మృత్యువు తర్వాత ఆయన శరీరం ఎక్కడా  దొరకలేదు. 45 రోజుల తర్వాత తనిఖీ పూర్తి చేసిన బ్రిటిష్ అధికారులు “హిందూ సాధువు మాయమయ్యాడని మిస్టర్ జి హెచ్ గార్స్టిన్ (అప్పటి సౌత్ ఆర్కాట్ కలెక్టరు) ఆయన గ్రామానికి మేటుకుప్పo వెళ్లి ఆయన ఉన్న ఇల్లు ఆయన సమాధి చెందిన చోట వడలూర్ లో అన్నీ చోట్ల గాలించి తనిఖీ చేశారు. ఎక్కడ కూడా ఆయన శరీరం సంబంధించిన సూచనలు దొరకలేదు. మదరాసు  గవర్నమెంట్ గెజెట్ 1878 పేజీ నెంబర్ 316, 317లో ఇలా రాసి ఉన్నది “18వ శతాబ్ది చెందిన హిందూ సాధువు గది లోకి వెళ్లి సమాధి చెందినట్లు సమాచారం అందిన వెంటనే మేము వెళ్లి ఎన్నో తనిఖీలు చేశాము. కానీ ఆయన మాకు mystic saint మర్మ జ్ఞాని గా మిగిలిపోయారు. ఆ తత్వ జ్ఞాని మహిమలను జనాలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు”.

Ramalinga-Adigalar5రామలింగ స్వాముల వారు ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేశారు. దుఃఖ్ఖితులకు, దీనులకు అన్నం పెట్టిన దాత. ఆయన గురించి మేడమ్ Balenskev theosophical సొసైటీ ప్రెసిడెంట్ తన కాన్ఫిడెన్షియల్ నోట్స్ లో ఇలా రాశారు “నిస్సందేహంగా రామలింగపిళ్లై వళ్ళలార్  అనబడే ఈ భారత  సాధువు ఒక పెద్ద గొప్ప మంచి ఆత్మ, సంఘసంస్కర్త. ఈ ప్రపంచానికి భాతృత్వాన్ని పంచిపెట్టిన, మానవత్వాన్ని మేలుకొలిపిన ఒక ఆధ్యాత్మిక గురువు ( thesis -గణపతి బుక్ 1980, పుట 328) ఈ ప్రమాణాలన్నీ ఇప్పుడు ఆయన మందిరములో మనకు కనబడతాయి.

ఇలా భారతావనిలో ఎందరో మహానుభావులు  వెలసి మనందరికీ మార్గదర్శకులయ్యారు.

****సశేషం****

Posted in July 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!