Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం-130 వ సమావేశం
-- కె వి యస్ గౌరీపతి శాస్త్రి(వీరవతి) --

వీక్షణం-130 వ సాహితీ సమావేశం 11 జూన్ 2013 న  ఆన్ లైనులో జూమ్ సమావేశం అత్యంత ఆహ్లాదకరముగా, ఆద్యంతం ఆసక్తికరముగా జరిగింది. ఇందులో భారతదేశం నుంచి విశేష సంఖ్యలో అతిథులు/కవులు/సాహితీవేత్తలు పాల్గొన్నారు. ముందుగా వీక్షణం సంస్థాపక అధ్యక్షులు డా.కె.గీతామాధవి సభలోని వారందరికీ స్వాగతం పలికారు. ఈ సభకు విశిష్ట అతిథిగా విచ్చేసిన, సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ, ఇటీవలే పరమపదించిన  ఆచార్య కేతు విశ్వనాధ రెడ్డి గారి కథలను గూర్చి, వారితో గల అనుబంధాన్ని వివరిస్తూ ప్రసంగించమని ఆహ్వానించడం జరిగింది. తదనంతరం స్వర్గీయ కేతు విశ్వనాధ రెడ్డి గారి స్మృత్యర్ధం నివాళి అర్పించి, వారి రచనా వైశిష్ట్యాన్ని గూర్చి ఆచార్య చంద్రశేఖర రెడ్డి గారిని వివరించమని కోరుతూ, ప్రసంగం అనంతరం శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహింపబడుతుందని తెలియజేశారు.

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారిని పరిచయం చేస్తూ, "చంద్రశేఖరరెడ్డి గారు 1948 అక్టోబర్ 16 వ తేదీన తిరుపరి దగ్గర కల కుంట్రపాకం గ్రామంలో మంగమ్మ, రామిరెడ్డి దంపతులకు జన్మించారు. 1967-77 సంవత్సరాల మధ్య శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం లో బి.ఏ., ఎం.ఏ (తెలుగు), పి.హెచ్.డి చేశారు. 1977 ఆగస్టు - 2008 అక్టోబర్ మధ్య 31 ఏళ్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి, 2008 అక్టోబర్ లో పదవీ విరమణ అనంతరం కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం లో 07 సంవత్సరములు ఆచార్యులు గా పనిచేశారు. ఆ సమయం లోనే 4 సంవత్సరములు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఆచార్య చంద్రశేఖర రెడ్డి గారు ఇప్పటి వరకు 30 సాహిత్య విమర్శనా గ్రంథాలు రచించారు. 04 కవితా సంపుటాలు, 10 అనువాద గ్రంధాలు ప్రచురించారు. సుమారు 30 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.  కనీసం 300 తెలుగు గ్రంధాలకు పీఠికలు రచించారు. వీరు రచించిన "ప్రాచీనాంధ్ర కవులు సాహిత్యాభిప్రాయాలు" అనే గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వ్రాతపతి పురస్కారం, "చర్చ" అనే గ్రంథానికి ఉత్తమ విమర్శ గ్రంథం పురస్కారం అందించింది. "మన నవలలు - మన కథానికలు" అనే విమర్శనా గ్రంథానికి 2014 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇటీవలనే వారు వైయస్సార్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ పురస్కారం అందుకున్నారు. వీరు ప్రజాశక్తి బుక్ హౌస్ 2017లో వేమన, 2019 కర్నూల్లో పోతులూరి వీరబ్రహ్మం గార్ల మీద సదస్సులు నిర్వహించినపుడు అనేకమందితో వ్యాసాలు వ్రాయించి సంకలనాలుగా తీసుకురావడానికి కృషి చేశారు.  వీరి రచనలు "దీపధారి గురజాడ", "జాషువా స్వప్నం - సందేశం", "విశ్వనరుడు గుర్రం జాషువా" ,"ఎన్. గోపి సాహిత్యానుశీలనం", "సాహిత్య విమర్శ - సైద్ధాంతిక వ్యాసాలు". ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు జనవిజ్ఞాన వేదికకు మూడు పర్యాయములు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, ప్రజాశక్తి బుక్ హౌస్ గౌరవ సంపాదకులుగా, నేషనల్ బుక్ ట్రస్ట్ మరియు కేంద్ర సాహిత్య అకాడమీలకు తెలుగు సలహామండలి సభ్యులుగా పనిచేశారు. వీరి పర్యవేక్షణ లో 20 మంది విద్యార్ధులు ఎం.ఫిల్, 25 మంది విద్యార్ధులు పి.హెచ్.డి. చేశారు." అని వివరించారు గీతగారు.

ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు తనని ఈ సమావేశానికి ఆహ్వానించి ఆచార్య కేతు విశ్వనాధ రెడ్డి గారి గురించి వారి రచనలు గూర్చి ప్రసంగించుటకు అవకాశమిచ్చినందులకు ధన్యవాదాలు తెలియ జేస్తూ తమ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆచార్య కేతు విశ్వనాధ రెడ్డి గారు మే 22 వ తేదీన 84 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఒంగోలు నగరంలో హఠాత్తుగా మరణించారని, వారికి నివాళిగా వారి కధా రచనలు కొన్నిటిని గూర్చి ఈ రోజు చర్చించుకుందామని తెలియజేశారు. తాను తిరుపతిలో పరిశోధక విద్యార్ధిగా ఉన్న సమయంలో 1975 సంవత్సరంలో శ్రీ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి ద్వారా స్వర్గీయ కేతు విశ్వనాధ రెడ్డి గారి ఇంటివద్ద పరిచయం జరిగిందని, అప్పట్నుంచి తనని ఒక తమ్ముడుగా "చంద్ర" అని పిలచి ఆదరించేవారని తెలియజేశారు. వారి మరణంతో సాహితీ లోకం దిగ్బ్రాంతికి గురి అయినదని అన్నారు. ఆయన సి.పి. బ్రౌన్ గ్రంధాలయములో తాను నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలకి ఆతిధిగా హాజరై ఎంతగానో ప్రోత్సహించేవారని చెప్పారు.

ఆచార్యకేతు విశ్వనాధ రెడ్డి గారు "ప్రముఖ కథా రచయిత, కల్పనా సాహిత్య రచయిత" అంటూ వారి కధా సాహిత్యంలో ఆర్ధిక మూలాలు ఎలా ప్రతిబింబంబింపజేశారో వివరించారు. ఆచార్య కేతువిశ్వనాధ రెడ్డి గారు భారతీయ అభ్యుదయ కల్పనా సాహిత్య రచయితలలో చెప్పుకోదగినవారు. తెలుగు అభ్యుదయ కల్పనా సాహిత్య రచయితల్లో ముందు వరుసలో ఉన్నవారు. అంతేకాకుండా రాయలసీమ అభ్యుదయ కల్పనా సాహిత్య రచయితలకు తలమానికం అని చెప్పవచ్చు. ఇంతకీ ఈయన కథా సాహిత్య విశేషం ఎమిటంటే, ప్రముఖ రష్యన్ సౌందర్య శాస్త్ర వేత్త Uni Bodev, "Esthetics" అనే గ్రంధంలో పేర్కొన్న విధంగా "Art is the heart of esthetic human activity" అంటే "మానవుని సౌందర్యాత్మక కార్య కలాపాలకు గుండె వంటిది కళ" అన్నారు. విశ్వనాధ రెడ్డి గారి కథలన్నీ కూడా అటువంటి కళా రూపాలు. తెలుగు కథానికను చాలా ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళినవారు విశ్వనాథ రెడ్డి గారు.

తెలుగులో కథా సాహిత్యంలో ఏది మొదటి కథ అనే చర్చ గత 10, 20 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఐతే 1910లో గురజాడ అప్పారావు గారి 'దిద్దుబాటు' అనేది మొదటి కథ అనుకుంటూ వచ్చాము. తదుపరి స్త్రీ వాద సాహిత్యం మొదలైన తరువాత స్త్రీలు అనేక పరిశోధనలు చేసి గురజాడ కాదు, బండారు అచ్చమాంబ తొలి తెలుగు కథా రచయిత అనే ఒక సిద్ధాంతాన్ని  స్థాపించారు. వివిన మూర్తి గారు "దిద్దుబాటలు" అనే పుస్తకంలో 1879 నుంచి ఆధునిక తెలుగు కథ పుట్టే ప్రయత్నం చేసింది రుజువు చేశారు. నిజానికి 1812 నుంచి మహా కావ్యం నుంచి కథ విడిపోయి వచనంగా రూపం తీసుకుంటూ వచ్చింది. ఆ వచనం, అనువాదాలనుంచి, అనుకరణలనుంచి, అనుసృజనలనుంచి మౌలిక రూపాన్ని తీసుకోవడానికి 1870 దాకా ప్రయత్నం చేసింది. ఆ తరువాత ఆధునిక కధారూపం తీసుకువచ్చింది. అలా చూసినపుడు 1879 నుంచి నేటి వరకు తెలుగు కధానికకు 140 సంవత్సరాల చరిత్ర ఉందని లక్షణకారులు అంచనా వేశారు. ఇందులో కేతు విశ్వనాధరెడ్డి గారు ఒక కేంద్ర బిందువుగా నిలుస్తారు.

ఈ 140 సంవత్సరాలలో తెలుగు కథ అనేక ఉద్యమాలకు, అనేక భావ జాలాలకు, అనేక రకాలైన భాషలకు, జీవన విధానాలకు, సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మొదట కోస్తా ప్రాంతపు మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల దగ్గర మొదలై, క్రమ క్రమంగా తెలుగునాట అనేక స్థాయిలలో పోరాటాల దగ్గరికి తల్లి వేరును వెతుక్కొంటూ ప్రవహిస్తూన్నది. భారతదేశంలో కథానిక చాలా సీరియస్ ఆర్ట్ ఫార్మ్ గానే కొనసాగుతున్నది. ఒక దశలో చరిత్రకారుల అంచనా ప్రకారం, ముఖ్యంగా తెలుగులో ఇప్పటివరకు 2 లక్షల కథలు వచ్చి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా మాస్టర్ పీస్ లేమి కావు, అందులో 90 శాతం వరకు కాలక్షేపం కథలే. 10 శాతం మాత్రమే సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలుగా నిలిచాయని అంచనా వేశారు. ఈ 10 శాతం సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలుగా నిలచిన కథల రచయితల్లో నిస్సందేహంగా కేతు విశ్వనాధరెడ్డి గారు ముఖ్యులు. కథానిక వీర గ్రాంధిక భాషతో మొదలై, ఇవాళ వీర మాండలిక, వీర ప్రాదేశిక భాష దగ్గరకు చేరుకుంది.

తెలుగు కథానిక సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తూ, తనను తాను విస్తరించుకొంటూ, విశాలమైన రూపం తీసుకుంటూ వుంది. ఈ విశాల రూపం తెలుగుకథకు తీసుకు రావడంలో  విశ్వనాధరెడ్డి గారు తనవంతు కృషి చేశారు. 140 సంవత్సరాల తెలుగు కథలను తరాలుగా విభజిస్తే, విశ్వనాధరెడ్డి గారు 3వ తరానికి చెందిన వారుగా నిలుస్తారు. అలాగే స్వాతంత్ర్య అనంతరం వచ్చిన తెలుగు కథా రచయితల్లో విశ్వనాధరెడ్డి గారు తొలి తరానికి చెందిన వారు. రాయలసీమ కథా రచయితల్లో ఇతను తొలి తరానికి, రెండవ తరానికి మధ్యలో నిలబడతారు. 140 సంవత్సరాల తెలుగు కథా చరిత్రలో గాని, రాయలసీమ తెలుగు కథా రచయితల్లో గాని, తెలుగు అభ్యుదయ కథా రచయితల్లో గాని విశ్వనాధరెడ్డి గారిని విస్మరించలేము. అటువంటి విశ్వనాధరెడ్డి గారి అభ్యుదయ తెలుగు కథా రచన 1963 నుండి 2003 వరకు కొనసాగింది. స్వాతంత్ర్యానంతర భారత ఆర్ధిక, సామాజిక, రాజకీయ పరిణామాలను ఆయన తన కథలకు వస్తువుగా తీసికొన్నారు. స్వాతంత్ర్యానంతరం, 1963 నాటికి భారతదేశంలో ఒక నయా సంపన్న వర్గం ఆవిర్భవిస్తూ ఉన్నది. అది స్వాతంత్ర్య ఫలాలను అందిపుచ్చుకొని  తమ గుప్పెట్లో పెట్టుకొని సమాజాన్ని శాసించడానికి ప్రయత్నిస్తూ ఉంది. వ్యాపార సాహిత్యం, పత్రికలు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజుల్లో ఇతను అనేకమంది అభ్యుదయ రచయితలు వాసిరెడ్డి సీతాదేవి, రంగనాయకమ్మ, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, తిలక్  మొదలగు వారితో కలసి తన కథా రచనలను ప్రారంభించి, వ్యాపార సాహిత్యాన్ని ప్రక్కన పెట్టడానికి తనవంతు కృషి చేశారు. వాస్తవికత కథా సాహిత్యానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కడప, కర్నూలు మొదలైన ప్రాంతాలలో ముఠా కక్షలు బాగా చెలరేగుతున్నాయి, అదే సమయంలోతెలుగు సినిమాలు అతిశయోక్తిగా లేని హింసనంతా చూపిస్తున్నాయి. ఈ ముఠా కక్షల్లో నలిగిపోయిన కుటుంబం విశ్వనాధరెడ్డి గారిది.

అభ్యుదయ సాహిత్యం 1963 నాటికి  రచనా ఒక విధమైన స్తబ్దతకు లోనై, తిరిగి పునరుజ్జీవనం పొందుతూ ఉంది. ఆ సమయంలో విశ్వనాధరెడ్డి గారు తన కథా రచన ప్రారంభించారు. ఆ తరువాత విప్లవ సాహిత్యం, అస్తిత్వ వాదాలు వచ్చాయి. ముఖ్యంగా స్త్రీ వాదము, దళిత వాదము, బుహుజన వాదము, ముస్లిం వాదము, ప్రాంతీయ అస్థిత్వ వాదము మొదలగునవి వచ్చాయి. వీటన్నికి కూడా చాలా పాజిటివ్ గా స్పందించి కథలు వ్రాశారు. అందువలన ఈయన స్వాతంత్ర్యానంతర భారత సమగ్ర రచయిత అనుకోవచ్చు. అభ్యుదయ రచయితకి సృజనాత్మక శక్తి, విమర్శనా దృష్టి వీటికి తోడు శాస్త్రీయ దృక్పథం, చిత్తశుద్ధి ఉంటేగాని వాస్తవిక వాద సాహిత్య సృష్ఠి చేయడం అసాధ్యం అని, ఇవి అభ్యుదయ అప్రోచివ్ లిటరేచర్ కి సరిపోతాయని విశ్వనాధరెడ్డి గారి అభిప్రాయం. ఆయన కథా సాహిత్యం కూడా అదే సూత్రం మీద ఆధారపడి ఉంది. ఈయన రచనలు అన్నీ కూడా పొడి నిజాలు (కఠిన సత్యాలు).

విశ్వనాధరెడ్డి గారు వృత్తిరీత్యా అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీ విమర్శకులు, కథా, నవలికా రచయిత, విద్యావేత్త మరియు స్వభావరీత్యా అభ్యుదయ సాహిత్య ఉద్యమ కారుడు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులుగా పని చేశారు. మరణించే వరకు ఆ సంఘంలో అధ్యక్ష వర్గ సభ్యులుగా ఉన్నారు. తెలుగు అభ్యుదయ సాహిత్యాన్ని రాయలసీమ నుంచి సుసంపన్నం చేసిన రచయిత. ఈయన  వైయస్సార్ కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, రంగశాయిపురం లో 1939, జూలై 10 వ తేదీన జన్మించారు. 2023, మే 22 వ తేదీన మరణించారు. నాగమ్మ, వెంకటరెడ్డి లు వీరి తల్లిదండ్రులు. వీరి అవ్వ, తాతలు  సంపూర్ణమ్మ, పెద్ద భూమారెడ్డి పెంచి పెద్ద చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు లలో వీరి ప్రాధమిక విధ్యాభ్యాసం.  కడపలో డిగ్రీ వరకు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు), పి.హెచ్.డి. పూర్తిచేశారు. కడప, కందుకూరు, కాళహస్తి లలో ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసి, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకులై, అక్కడ్నుంచి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వ విధ్యాలయం లో ప్రొఫెసర్ గా, డీన్ గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ (తెలుగు) శాఖలో మొదటి బ్యాచ్ విద్యార్ధి. ఈయన కడప జిల్లాలో గల గ్రామాల ఊరిపేర్ల మీద పరిశోధన చేశారు. ఆంధ్రరత్న అనే పత్రికకి ఉప సంపాదకులుగా పని చేశారు. హైదరాబాద్ చేరిన తరువాత ఈనాడు, ఆంధ్రభూమి పత్రికలలో చాలా శీర్షికలు నిర్వహించి, జర్నలిస్టులకు శిక్షణ కూడా ఇచ్చేవారు. ఈభూమి అనే పత్రికా సంపాదకులుగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీలో సెంట్రల్ సభ్యులుగా 5 ఏండ్ల కాలం సేవలు అందించారు. నేషనల్ తెలుగు బుక్ ట్రస్ట్ సలహామండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన దాదాపు 100 కథలు వ్రాశారు కానీ ఇందులో కేతు విశ్వనాధ రెడ్డి కథలు అనే పేరుతో 82 కథలు మాత్రమే వచ్చాయి.1994 లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి, భారతీయ భాషా పరిషత్తు నుంచి, 1996 లో కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పురస్కారాలు లభించాయి. అప్పాజోస్యుల- కందాళ- విష్ణుభొట్ల ఫౌండేషన్ నుంచి జీవిత సాఫల్య పురస్కారము కూడా ఆయనకు వచ్చింది. భోగి, వేరు అనే రెండు నవలికలు వ్రాశారు, వారి ఉపన్యాసాలు, వ్యాసాలు కలిపి "సంగమం" అనే పేరుతోను, ముందుమాటలు, సమీక్షలు కలిపి పరిచయం అనే పేరుతోను వచ్చాయి. ఈయన ఆంగ్లములో వ్రాసిన Traditions and Trends, Change and Relevance అనే పుస్తకములు వచ్చాయి. కొడవటిగంటి కుటుంబరావు గారి సాహిత్యాన్ని, 13 సంపుటాలుగా విభాగించి, సంపాదకత్వం వహించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారికి అందించి వాటికి చక్కని ముందుమాటలు వ్రాశారు. ఆయన ముందు మాటలు చదివితే ఒక రచయితను ఎలా అంచనా కట్టాలో తెలుస్తుంది. ఆయన వ్రాసిన విమర్శనాత్మక వ్యాసాలు దృష్టి, దీపధారులు అనే సంపుటాలుగా వచ్చాయి.

ముఖ్యంగా విశ్వనాధ రెడ్డి గారు అభ్యుదయ వాద రచయిత. అభ్యుదయ సాహిత్యానికి మార్క్సిజం తాత్విక సిద్ధాంతం. మార్క్సిజం గతి తార్కిక భౌతికవాదము, చారిత్రక భౌతికవాదము అని రెండు సూత్రాలమీద ఆధారపడి నడుస్తుంది. చరిత్ర మనకు తెలిసినంత వరకు వర్గ పోరాట చరిత్ర అని చెబుతుంది మార్క్సిజం. ఇప్పుడు కూడా సమాజంలో పీడించే, పీడింపబడే అనే రెండు వర్గాలున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య ఆర్థిక అంశం పునాదిగా ఉంది. దానిపైన సాహిత్యము కళలు, నీతి శాస్త్రము, న్యాయ శాస్త్రము వంటి ఉపరితల అంశాలు ఉన్నాయని మార్క్సిజం మనకి చెబుతున్నది. మానవ సంబంధాలను ఆర్థిక అంశం నడిపిస్తూ ఉంది అని మార్క్సిజం నేర్పించింది. ఉత్పత్తి సాధనాలు (భూమి, నీరు వంటివి). ఉత్పత్తి శక్తులు (వ్యవసాయ కూలీలు, వ్యవసాయ వృత్తుల వారు, కర్మాగారాల్లో కార్మికులు). ఈ రెంటి మధ్య ఉండే సంబంధాలను ఉత్పత్తి సంబంధాలు అంటారు. వీటినే అభ్యుదయ రచయితలు వారి సాహిత్యంలో ప్రతిబింబిస్తారు. విశ్వనాధ రెడ్డి గారు తన సాహిత్యంలో ఈ శ్రామికవర్గం, పొలాల్లో పనిచేసేవారు, కర్మాగారాల్లో పనిచేసేవారు, ఇంట్లో పనిచేసేవారు లాంటి వారి పక్షం వహించారు. మధ్యతరగతి వారు చాలీ చాలని సంపదతో ఎలా బాధపడుతున్నారు, ఈ మధ్యతరగతి వారు ఆపై మధ్యతరగతి వారితో ఎలా బాధపడుతున్నారు, అదే సమయంలో ఈ మధ్యతరగతి వారు, వారి క్రింది తరగతివారిని ఎలా పీడిస్తున్నారు. వీళ్లందరినీ సంపద ఎలా నడిపిస్తూన్నది అనే విషయం మనకి అర్థం కావడానికి ఆయన చాలా కథలు వ్రాశారు. ఆయన కథల్లో చాలా వరకు కడప జిల్లా నేపధ్యం ఉంటుంది. అంత మాత్రం చేత ఆయన కడప జిల్లాకి పరిమితమయ్యే రచయిత కాదు. తను నివసించే ప్రదేశం నుంచి మొత్తం భారతదేశం వాస్తవికతని ప్రతిబింపజేయడానికి కృషి చేశారు.

విశ్వనాధ రెడ్డి గారు తనకాలపు సమాజం ఈ రెండు వర్గాలుగా ఎలా విభజింపబడి ఉంది, ఇందుకు కారణాలు ఏమిటి? ఈ సమాజ వ్యవస్థ మారాలి అని సమాజ మార్పును ఆహ్వానించారు. ఈ మార్పు ఎప్పటికన్నా మెరుగైన మార్పు అయిఉండాలి అనేది అభిలషించారు. ముఖ్యంగా మనకున్న మూడు వ్యవస్థల్లో (శాసన, కార్య నిర్వాహక, న్యాయ) కార్యనిర్వాహక వ్యవస్థలో వివిధ శాఖలలో గల దోపిడీని చిత్రీకరిస్తూ వచ్చారు. అదే సమయంలో రాయలసీమ కరువు, కరువుకి ఫాక్షనిజానికి ఉన్న సంబంధాన్ని కూడా చాలా కథల్లో చెప్పుకుంటూ వచ్చారు.

ఆయన కథల్లో మానవ సంబంధాలను ఆర్ధిక సూత్రాలు ఏవిధంగా నియంత్రణ చేస్తున్నాయి అనే ప్రధాన అంశాన్ని ప్రతిబింపజేసారు. సంపద మానవ ప్రవర్తనకు గల సంబంధం గూర్చి "స్వతంత్రం" అనే కధలో సాంబయ్య, సాయమ్మ, రాముడు. రాముడు తల్లి, గొల్లచిన్నబ్బ పాత్రలద్వారా, సంపద ఒక చోటే కేంద్రీకృతమైతే వచ్చే 'పీడన-అసమ' వ్యవస్థ గూర్చి  కేతిరెడ్డిగారు తెలిపిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.

పెట్టుబడి దారీ వ్యవస్థ, ఉద్యమ లక్షణాలు, శ్రామికుల ఐక్యత, పోరాటం  గూర్చి రాయలసీమ లోని ఎర్రగుంట్ల సిమెంటు ఫ్యాక్టరీ ఇతి వృత్తంగా రచించిన కధ "శ్రుతి" (ఆమ్టే ఐక్య పోరాటం) వివరణ ఆద్యంతం హృద్యముగా సాగిన  రెడ్డిగారి కధ.

ఒక చీర విలువ పేద దానికి తెలిసిన విధంగా డబ్బున్న వాళ్ళకి తెలియదు అని "దాపుడు కోక" (1972) అనే కధలో విశ్వనాధ రెడ్డి గారు, చెన్నమ్మ అనే పేదరాలి పాత్ర ద్వారా చెప్పిన విధానం, కష్టం తెలిసిన కన్నీళ్ళు చెన్నమ్మవి అని రచయిత చెప్పడం ఎంతో వేదనా భరితంగా ఉంది.

ఆర్ధిక అసమానతలు మధ్య తరగతి కుటుంబాలలో, భార్యా, భర్తల అన్యోన్యతల మధ్య ఎలా చిచ్చును లేపుతాయో వివరించే కధ విశ్వనాధ రెడ్డి గారి "చెదరని గుండెలు".  ఇందులో భర్త పాత్ర ద్వారా " మనలాంటి వారందరినీ విశ్వామిత్రుడు సృష్టించి నట్లుగా ఉందని చెప్పించడం" ఎంతో ముదావహం.

అలాగే, "గడ్డి" కధలో సంపన్నుడు అయిన సుబ్బారెడ్డిని, అదే కులానికి చెందిన పేదరాలు అచ్చమ్మ నిర్లజ్జగా నిందించడం, ఆర్ధిక అసమానతలు సమాజాన్ని ఎలా దిగజారుస్తాయో వివరించడం, విశేషం.

అలాగే, విశ్వనాధరెడ్డి గారి ఇతర రచనలు తారతమ్యం, ప్రేమ రూపం, చక్రబంధం, వైరుధ్యము, జప్తు, సానుభూతి ఉటంకిస్తూ సాగిన డా. రాచపాళెం  చంద్రశేఖర రెడ్డి గారి సాహితీ ప్రసంగం నభూతో నభవిష్యతి అన్నట్లుగా సాగింది.

ప్రసంగానంతరం గీతామాధవిగారు వీక్షణం ఫేస్ బుక్ నెలవారీ కవిత్వ పోటీల్లో భాగంగా మే నెలలో "ఆగిపోని గెలుపు ఇద్దరిదీ" అనే కవితకుగాను, పురస్కార గ్రహీత ఎ. అమృతవల్లి గారిని అభినందించి, అవార్డుని అందజేశారు.

తదనంతరం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడిన కవిసమ్మేళనంలో డా.కె.గీతామాధవి, శ్రీధరరెడ్డి బిల్లా, డా. మీరాసుబ్రహ్మణ్యం, డా.నీహారిణి కొండపల్లి, దాలిరాజు  వైశ్యరాజు, ప్రశాంతిరామ్, మొండ్రేటి సత్యవీణ, ప్రసాదరావు రామాయణం, డా. అరుణ కోదాటి, కె. సంధ్యారెడ్డి, రవీంద్రబాబు ఆరావా, శ్రీ సుధ కొలచన, ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్, సావిత్రి రంజోల్కర్, పిళ్ళా వెంకట రమణమూర్తి, సరోజినీదేవి బులుసు, దేవి గాయత్రి, కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి, కృష్ణదాస్ ఆకుమళ్ల, డా. ఉమామహేశ్వరరావు భోగెల, మోటూరి నారాయణ రావు, డా. భమిడిమర్రి కమలాదేవి, ప్రవీణ్ రేపాక, సోమన్న గద్వాల, డా.చీదెళ్ళ సీతాలక్ష్మి, అమృతవల్లి అవధానం, సందడి అరుణ, జె.వి.కుమార్ చేపూరి, మొదలగు అనేకమంది కవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గీతగారు వందన సమర్పణ చేస్తూ, భవిష్యత్తులో వచన కవిత్వానికి సంబంధించి ప్రముఖులను ఆహ్వానిస్తూ, కవులకు ఒక వర్క్ షాప్ నిర్వహించే ఆలోచన చేస్తున్నట్లు తెలియజేశారు.

Posted in July 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!