Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

రాయలసీమ కవిరత్నం - గడియారం వేంకట శేష శాస్త్రి

gadiyaram-venkata-seshasastri

ఈ శ‌తాబ్ధపు మ‌హాక‌వుల‌లో ఒకరైన గడియారం వెంకట శేష శాస్త్రి గారు ములికినాటి శాఖీయ బ్రాహ్మణుడు. మైత్రేయస గోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. ఈయన పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో రామయ్య, నరసమ్మ దంపతులకు 1894, ఏప్రిల్ 7న జన్మించాడు. విద్యాభ్యాసం కోసం ప్రొద్దుటూరు చేరుకుని స్థిరపడ్డాడు. వీరి ధర్మపత్ని వెంకటసుబ్బమ్మ. రామశేషయ్య, వెంకట సుబ్రహ్మణ్యం ఇతని పుత్రులు.

1932లో అనిబిసెంట్‌ మున్సిపల్‌ పురపాలక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. బ్రహ్మ నందిని అనే సాహిత్య సాంస్కృతిక మాసపత్రికకు సంపాదకులుగా సేవలు అందించారు. గడియారం వేంకట శేషశాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. రూపావతారం శేష శాస్త్రి వద్ద తర్క, వ్యాకరణ, సాహిత్య శాస్త్రాలు, వాసుదేవ అవధాని వద్ద యజుర్వేదం, ఉపనిషత్తులు, దుర్భాక రాజశేఖర శతావధాని వద్ద అవధాన విద్యల్లో ఆరితేరాడు. గోవర్ధన సప్తశతి, ఉత్తర రామాయణ గ్రంథాలు సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. పుష్పబాణ విలాసం, వాస్తు జంత్రి, మల్లికా మారుతం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం, రఘునాదీయం, వాల్మీకి హృదయావిష్కరణ వంటి గ్రంథాలను రచించాడు.

నన్నయ్య భారతం, పోతన భాగవతం లాగా గడియారం వేంకటశేష శాస్త్రికి కీర్తిని తెచ్చిన పెట్టిన గ్రంథం "శివభారతం". పరాయి పాలన నిరసించి స్వాతంత్య్ర కాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యం 'శ్రీశివభారతం'. భరత మాత పరాయి పాలనలో కళావిహీనమైన తరుణంలో అరుణోదయంగా వెల్లివిరిసిన కావ్యం అది. మాతృభాష విముక్తికి మార్గదర్శిగా పంచకావ్యాల సరసన 1943లో 8 ఆశ్వాసముల ప్రబంధంగా శివభారతం వెలుగొందింది. ‘శివ‌భారతం మ‌హాకావ్యం మూలంగా గడియారం వేంకటశేష శాస్త్రి గారు చిర‌స్థాయిగా ప్రజ‌ల మ‌న‌స్సుల్లో చోటు చేసుకోగ‌లరు’ అని ఆనాటి ముఖ్యమంత్రి అంజ‌య్య గారు త‌న సంతాపంలో పేర్కొన్నారు. ఈయ‌న కాలిగోటికి కూడా మేము స‌రిపోము. ఈయ‌న శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని శాస్త్రి గారి వ‌ర్ధంతి స‌భ‌లో మ‌న పుట్టప‌ర్తి నారాయ‌ణాచార్యులు గారు కోరారు. ప్రతి ఒక్కరూ మ‌న గ‌డియారం గురించి తెలుసు కోవాలి, నాటి మ‌హానుభావుల‌ను భావిత‌రాల‌కు తెలియ‌జేయాలి.

20వ శతాబ్దం ఆరంభంలో ఆంధ్ర దేశంలో జంట కవిత్వం ఒక వాడుకగా మారింది. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు సోదర కవులను అనుసరించి అనేక మంది జంటకవులు బయలు దేరారు. ఆ పరంపరలో రాయలసీమకు చెందిన కవులు దుర్భాక రాజశేఖర శతావధాని (1888-1957), మరియు గడియారం వేంకట శేషశాస్త్రి(1894-1980) ఇరువురూ రాజశేఖర వేంకటశేష కవుల పేరుతో జంటగా అవధానాలు చేయడం ప్రారంభించారు. శేష శాస్త్రి గారు జన్మభూమిలో నుండి పోతన వలె వ్యవసాయం చేసుకుంటూ వీలుపడినపుడు ఇతర ప్రదేశాలకు వెళ్లి ఆవధానములు ప్రదర్శించుచు, భారతి, మల్లికామారుతము, పుష్పబాణవిలాసము వంటి సంస్కృత కావ్యాలను తెలుగులోకి అనువదించి, 'హరికథలు' రచించి తమ అన్నగారు వేంకట సుబ్బా శాస్త్రి గారిచే నాపరిసరమున నచట నచట కాలక్షేపం చేసేవారు. 1959 నుంచి 1968 వరకు శాసన మండలి సభ్యునిగా, 1969 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.

సన్మానాలు సత్కారాల విషయానికి వస్తే గోదావరి తీరంలోని రాజమహేంద్రవరం లో శ్రీపాద, తల్లావజ్జుల వారి ఎదుట గజారోహణ సత్కారము అందుకున్నారు. 1945 లో అనంతపురం లోని హిందూపురంలో లలిత కళాపరిషత్ వారు స్వర్ణ గండపెండేరము సువర్ణ కంకణాన్ని బహుకరించారు. 1948లో మద్రాసు ప్రభుత్వం దశాబ్ద కాలపు ఉత్తమ సాహితీ గ్రంథంగా శివభారతాన్ని గౌరవించి ప్రథమ బహుమతితో సత్కరించారు. 1967లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సాహిత్య అకాడమి అవార్డు అందజేసింది. 1968లో ప్రొద్దుటూరులో కనకాభిషేకం చేశారు. 1974లో మరాఠామందిర్‌ వారు శివాజి త్రిశత జయంతి ఉత్సవాల్లో భాగంగా బంగారు పతకాన్ని బహుకరించారు.1976లో వెంకటేశ్వర విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించారు. ఈ కవిరత్నము 1980 సెప్టెంబ‌రు 20, 86 ఏళ్ల వయస్సులో ప్రొద్దుటూరులోని తన స్వగృహములో తుది శ్వాస విడిచారు గడియారం వేంకట శేష శాస్త్రి గారి కీర్తి తెలుగున గలకాలము నిలుపుటకు "శివభారతము" ఒక్క కృతి చాలు.

********

Posted in July 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!