Menu Close
తెలుగు పద్య రత్నాలు 26
-- ఆర్. శర్మ దంతుర్తి --

హిందూమతం, వేదాలు ఉపనిషత్తుల ప్రకారం, మానవ జన్మ ఎత్తడానికి ముందు అనేకానేక పశు, పక్ష్య, వృక్షజాతులుగా పుట్టాలి. ఒక్కో జన్మలో చేసుకున్న పుణ్యం ప్రకారం ఒక్కో మెట్టు ఎక్కుతూ మానవ జన్మ ఎత్తితే ఇక్కడ నుంచి నేరుగా భగవంతుణ్ణి తెలుసుకోవచ్చు. అలా జ్ఞానం సంపాదించుకునే శక్తి మానవులకి ఒక్కరికే ఉంది అంటారు. అయితే భగవంతుణ్ణి చేరుకోవడానికి మానవ జన్మ ఎత్తడం కూడా అనవసరం అనే విషయం మనం శ్రీకాళహస్తి కధలో చూస్తాం – సాలీడు, ఏనుగు, పాము కూడా శివైక్యం చెందడం చదివినప్పుడు. అయితే మానవ జన్మ ఎత్తాక, లేదా అక్కడనుంచి పై లోకాలలో దేవతగానో మరోటో జన్మ ఎత్తినప్పుడు భగవంతుడి మీద భక్తి కుదురుతుందా? ఆ విషయంలో ఎవరికి ఎవరు సమాధానం చెప్పుకోవాల్సిందే వాళ్ళు చేసే పనులబట్టి. లక్ష్మీ దేవి అంతటి ఆవిడ కూడా చాలాకాలం తపస్సు చేస్తేనే మహావిష్ణువుని చేరుకుందిట. ఇంక మాములు మనలాంటి వాళ్ల సంగతి చెప్పేదేవుంది? ఇదే విషయం ఈ నెల పోతన భాగవతంలో పద్యం చెప్తోంది.

కాళీయుడు మడుగులో ఉండి కక్కే విషం వల్ల మొత్తం చుట్టుపక్కల అంతా నాశనం అవుతోంది. వాడి గర్వం అణచడానికి గోపాలసింహం మడుగులోకి దూకాక వళ్ళు, పడగలూ చితికిపోయేవరకూ నాట్యం చేసాడు. మొత్తం మనసులో ఉన్న గర్వం (నేనింత గొప్పవాణ్ణి, నాకింత బలమైన విషం ఉంది, నేను కరిస్తే బతికే ప్రాణి లేనేలేదు అనేవి), బలమైన శరీరం సర్వనాశనం అయిపోయి తుడిచిపెట్టుకుపోయాయి. ఎందువల్ల? కృష్ణుడి పాదాలవల్ల. అప్పుడు మాట్లాడలేని స్థితిలో ఉంటే వాడి భార్యలు వచ్చి మాకు పతి భిక్షపెట్టు, అంటూ కృష్ణుణ్ణి వేడుకునే చెప్పే పద్యం ఇది.

మ.
బహు కాలంబు తపంబు చేసి వ్రతముల్ బాటించి కామించి నీ
మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ
మహిళారత్నము తొల్లి కాంచె నిదె నేమం బేమియున్ లేక నీ
యహి నీ పాదయుగాహతిం బడసె నే డత్యద్భుతం బీశ్వరా! [10.1.678]

వాళ్ళేమంటున్నారంటే, భగవంతుడివైన నీ మహనీయమైనా, ఉజ్జ్వలమైన పాదరేణువులని ముట్టుకునే అధికారం లక్ష్మీదేవికి (శ్రీ మహిళా రత్నంబు) అనేక సంవత్సరాలు తపస్సు చేసి, వ్రతాలు పాటించాక మాత్రమే వచ్చింది. కానీ ఇవేమీ లేకుండానే (నిదె నేమం బేమియున్ లేక), ఏ వ్రతమూ పాటించకుండానే మా కాళీయుడికి ఆ అనుగ్రహం కలిగింది. ఇది అత్యద్భుతం కదా? ఈ పద్యం తర్వాత పద్యంలో ఏమంటారంటే ముందు మాకు ఎవరో చేసి పెట్టారు పెళ్ళి ఈయనతో ఆ ముహుర్తం ఎటువంటిదో కానీ వీడు చచ్చిపోయే స్థితికి వచ్చాడు మీ చేతిలో; ఇప్పుడు కానీ వీణ్ణి క్షమించి వదిలేస్తే మీ వల్ల మాకు ఈయనతోనే రెండో పెళ్ళి చేసినట్టౌతుంది. భగవంతుడివైన నీ చేత్తో చేసిన ఆ రెండో పెళ్ళి బాగుంటుంది. అందువల్ల దయచేసి విడిచిపెట్టండి. అలా వేడుకున్నాక కృష్ణుడు చెప్తాడు – ఇక్కడనుంచి సముద్రంలోకి వెళ్ళిపోండి. నీ పడగలమీద నా పాదాలు చూసి గరుడుడు మిమ్మల్ని ఏమీ చేయడు అని.

అసలు కధ ఏమిటంటే, గరుడుడుకీ నాగులకీ ఉన్న శతృత్వం మనకి తెల్సిందే. గరుడుడు అస్తమానూ వచ్చి వీళ్లని చంపుతూంటే ఈ కాళీయుడు మరో మడుగులో దూరుతాడు. అక్కడ తపస్సు చేసుకునే సౌభరి అనే ముని గరుడుడి వల్ల జరిగిన ఈ వృత్తాంతం, అక్కడ మడుగులో గరుడుడు తినేసే చేపల సంగతీ విని శపిస్తాడు గరుడుణ్ణి – ఈ మడుగులోకి వస్తే ఛస్తాడు అని. అందువల్ల కాళీయుడు ఈ మడుగులో తల దాచుకున్నాడన్నమాట. ఓ విషయం గమనించండి. అపాయంలో ఉన్నప్పుడు అహంకారం పారిపోయి ఎక్కడో మనసులో/శరీరంలో కనిపించకుండా దాక్కుంటుంది. అపాయం గడవగానే ఆ నేనింత, నా బలం అంత అనుకుంటూ బయటకి రావడం కద్దు. ఇదే కాళీయుడికి జరిగింది కూడా. గరుడుణ్ణి సౌభరి అనే ముని శపించనంతవరకూ కాళీయుడికి గరుత్మంతుడంటే భయం, చంపుతాడేమో అని రోజూ నరకం కనిపిస్తోంది. గర్వం లేనట్టు ఉన్నాడు. కానీ ఒక్కసారి ఈ మడుగు – ఎక్కడికైతే గరుడుడు రాలేడో – కనిపించగానే అక్కడకి చేరాడు; వెంఠనే మనసులో అహంకారం, దాని విషం అన్నీ బయటకొచ్చాయి. అప్పుడే కృష్ణుడు పడగలు చితక్కొట్టాడు. అలా ఈ కాళీయుడికి అదృష్టవశాత్తూ భగవంతుడి పాదాల స్పర్శ లభించింది. ఇదే విషయం కూడా మనం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల విషయంలో చూడవచ్చు. నారాయణీయంలో భట్టాత్తిరి గారు అంటున్నారు చూడండి.

జాడ్యేన బాలక గిరాపి కిలాహమేవ
వాసుదేవ ఇతి రూఢమతి శ్చిరం సః
సాయుజ్యమేవ భవదైక్య ధియాగతో భూత్
కోనామ కస్య సుకృతం కథమిత్యవేయాత్                [83-2]

(జాడ్యం చేత – అంటే బుద్ధిలేక, నేనే వాసుదేవుడిని అని ఎగిసిపడి, పౌండ్రక వాసుదేవుడు చేసిన నీ సారూప్య భావనచేతనే సాయుజ్య సిద్ధి పొందాడు. స్వామీ, ఈ లోకంలో ఏ జీవి ఏ పుణ్యం చేసుకుందో చెప్పడం ఎవరితరం?)

అందువల్ల, పైన చెప్పిన కాళీయుడి కధ చూస్తే ఈ పుణ్యం ఏ నాడు చేసుకున్నాడో, భవగంతుడి పాదాలు తన తలమీద పడడం కోసం అనేది చెప్పడం ఎవరితరం? శ్రీ రామకృష్ణులు అంటారు అందుకే, భగవంతుడు ఎవరికి ఎప్పుడు కనిపిస్తాడనేది ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు అని. ఆయన కృప వచ్చేవరకూ అలా సాధన చేస్తూ ఉండవల్సిందే. ఎందుకు అంత సులభంగా కనిపించడు అనేదానికి సమాధానం వచ్చేనెల పద్యంలో చూద్దాం.

****సశేషం****

Posted in August 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!