Menu Close
అత్తలూరి విజయలక్ష్మి
దూరం (ధారావాహిక)
అత్తలూరి విజయలక్ష్మి

విజిటర్స్ లాంజ్ లో కూర్చుని ఉన్నారు దీపక్, సంధ్య.. సంధ్య బాగా ఏడ్చినట్టు ఆమె కళ్ళు ఎర్రగా తడిసిన మందారపూవుల్లా ఉన్నాయి. దీపక్ రెండు రోజులుగా బాగా దిగులుగా, ఆందోళనగా ఉన్నట్టు కొద్దిగా పెరిగిన గడ్డం, దువ్వుకోని క్రాఫ్, చెప్పకనే చెబుతున్నాయి. సంధ్య చేయి తన చేతిలోకి తీసుకుని నిమురుతూ మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్యా కాలం బరువుగా కదులుతోంది.

“స్మరణ బయలుదేరి ఉంటుందా!” అడిగింది సంధ్య.

“తెలియదు సంధ్యా.. నేను పూర్తిగా ఏమి చెప్పకుండానే నేను వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది.. మరి బయలుదేరిందేమో.. బస్సో, రైలో, ఫ్లైట్ ఏది దొరకాలన్నా ఇంత త్వరగా ఎలా కుదురుతుంది.. మరి టికెట్స్ కోసం ట్రై చేస్తోందేమో.. ఇంకా ఫోన్ చేయలేదు..” అతని స్వరంలో వినిపించిన నీరసం గమనించిన సంధ్య తలెత్తి అతని మొహంలోకి చూస్తూ..

“మీరు ఏదన్నా తిని రండి.. బాగా నీరసంగా అనిపిస్తున్నారు.. నేనిక్కడ ఉంటాను..” అంది.

“కాఫీ తాగాలే సంధ్యా..” అన్నాడు.

“కాఫీ ఏంటండి? నేను ఇడ్లి తిని వచ్చాను.. మీకు తెస్తానంటే వద్దు క్యాంటీన్ లో తింటాను అన్నారు.. ఎంత పొద్దుపోయిందో తెలుసా... మధ్యాహ్నం కూడా తినలేదు.. వెళ్ళండి ఏదో ఒకటి తినండి. ప్లీజ్..వెళ్ళండి కిందనే ఉంది క్యాంటీన్..” బలవంతం చేసింది.

దీపక్ కి కూడా అనిపించింది ఏదన్నా తినాలి అనుకున్నాడు. బాగా నీరసంగా అనిపిస్తోంది. మానసికమైన ఆందోళన కొంత, రెండు రోజులుగా సరిగా తిండి లేకపోవడం చేత కొంతా బాగా నీరసంగా ఉంది.

“నువ్వు కూడా రా.. ఇద్దరం వెళ్లి తిందాం” అన్నాడు.

“నేను వస్తే ఎలా? ఏ క్షణంలో సిస్టర్ పిలుస్తోందో మనల్ని“ సందేహంగా అంది.

దీపక్ కి తెలుసు. ఇప్పుడు ఎవరూ వాళ్ళని పిలవరు.. లోపల ఆయన అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఆయనికి స్పృహ వచ్చిందాకా వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఏదో ఒక వైద్యం చేస్తూనే ఉంటారు.. ఆయన కళ్ళు తెరిచి ఏదన్నా కావాలి అంటే అప్పుడు పిలుస్తారు.. అందుకే అన్నాడు..

“ఫర్వాలేదు.. ఇప్పుడప్పుడే పిలవరు.. రా వెళదాం”

సంధ్యకి కూడా తను వెళ్తే కాని ఆయన తినడు అనిపించింది.. అందుకే ఎక్కువ తాత్సారం చేయకుండా బయలుదేరింది. ఇద్దరూ కాంటీన్ కి వెళ్తుండగా స్మరణ నుంచి ఫోన్ వచ్చింది.

దీపక్ ఆన్సర్ చేసాడు.. “డాడీ తాతయ్య ఎలా ఉన్నారు?” అడిగింది స్మరణ.. గొంతు బొంగురుగా వినిపించడంతో బాగా ఏడ్చినట్టుంది అనుకుంటూ అబద్ధం చెప్పడానికి తనని తాను సిద్ధపరచుకుంటూ

“పర్లేదురా... రేపు మార్నింగ్ వార్డ్ కి పంపిస్తారు” అన్నాడు.

“నేను వస్తున్నాను డాడీ... దారిలో ఉన్నాను” అంది.

“ఎలా వస్తున్నావు?”

“కారులో... ఒక ఫ్రెండ్ తో...”

“ఓ ఓ ఓ ... సరే జాగ్రత్తగా రా.. “

“ఏ హాస్పిటల్ లో ఉన్నారు..”

“సికిందరాబాద్ యశోదా లో.”

“సరే... నేరుగా అక్కడికే వస్తాను..”

“ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయి రావచ్చు రా..”

“లేదు.. నేను హాస్పిటల్ కే వస్తాను... తాతయ్యని వెంటనే చూడాలి..”

దీపక్ ఏమి మాట్లాడలేదు.

“ఏంటి?” అడిగింది సంధ్య.

“స్మరణ బయలుదేరింది... ఎవరో ఫ్రెండ్ తో కారులో వస్తోంది..”

సంధ్య మాట్లాడలేదు.. ఆవిడ మాట్లాడే స్థితిలో లేదు.. తండ్రి లాంటి మావగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.. పెళ్లి అయి ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి అన్నీ ఆయనే అయి కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇంటి పెత్తనం మొత్తం తనకి అప్పచెప్పి నిశ్చింతగా నిట్టూర్చాడు. అప్పటి నుంచీ ఇద్దరి బంధం తండ్రి కూతుళ్ళ బంధం కన్నా బలంగా పెనవేసుకుపోయింది. దీపక్ తో కూడా చర్చించని ఎన్నో విషయాలు ఆయనతో చర్చించేది.. ఏనాడూ ఆయన సంధ్య మాట కాదనలేదు. “నీ ఇష్టం వచ్చినట్టు చేయమ్మా.. చదువుకున్న దానివి నీకన్నీ తెలుసు కదా” అంటుండే వాడు.. “స్మరణ పెళ్లి బాధ్యత నాకు అప్పచెప్పావు కదా.. నువ్వు నిశ్చింతగా ఉండు” అని హామీ ఇచ్చారు. అప్పటి నుంచీ తన మనసులో ఆ పిల్ల పెళ్లి పట్ల ఉన్న ఆందోళన చాలా వరకూ పోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలా అవడం ఆమె జీర్ణించుకోలేక పోతోంది. ఆయనకి ఎన్నడూ లేనిది అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ రావడం ఏమిటి? ఏ విషయంలో ఆయన అంత టెన్షన పడి ఉంటాడు.. ఎందుకో రాజమండ్రి వెళ్లి వచ్చిన దగ్గర నుంచీ ఉదాశీనంగా ఉంటున్నారు.. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం లేదు.. పెట్టింది తినడం గదిలోకి వెళ్లి పడుకుని అలా శూన్యంలోకి చూస్తూ ఉండడం గమనించింది.. ఏం జరిగి ఉంటుందో అని ఆలోచించింది కానీ ఆమెకి ఎదో జరిగింది అన్న ఆలోచన మాత్రం రాలేదు.. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఎదో జరిగింది అనిపిస్తోంది.. అది ఎవరివల్ల జరిగిఉంటుంది! తన వల్లనా.. తనేం తప్పు చేయలేదే.. దీపక్ వల్లనా.. అదే నిజమైతే కొడుకేగా డైరెక్ట్ గా అడగచ్చు.. వీలైతే కడగచ్చు.. అది కూడా కాదు... మరి స్మరణ వల్లనా.. స్మరణ బెంగుళూరు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదా! కానీ అంతకు ముందు నుంచే అన్యమనస్కంగా ఉన్నారు.. అది కూడా కాదేమో... అసలు ఇల్లు మాట వరసకి కూడా చెప్పకుండా అమ్మకానికి ఎందుకు పెట్టినట్టు? అంతా అయోమయంగా ఉంది సంధ్యకి.

భార్యాభర్తలు ఇద్దరూ క్యాంటీన్ కి వెళ్ళే సరికి టిఫిన్స్ ఏమి లేవు. శాండ్ విచేస్ తిని, కాఫీ తాగారు. అప్పుడు సమయం రాత్రి పదిన్నర దాటుతోంది.

“మీరు ఇంటికి వెళ్లి పడుకోండి” అంది..

“నువ్వు ఇక్కడ ఉంటావా... మతి లేకపోతె సరి.. నిన్ను  డ్రాప్ చేసి వస్తాను.. రేపు మార్నింగ్ వద్దువు గాని పద” అన్నాడు.

“ఊహు..ఒద్దు.. నాకు ఇక్కడైనా, అక్కడైనా ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తోంది.. మీ దగ్గరే ఉంటాను.. కష్టమైనా, సుఖమైనా కలిసి పంచుకుందాం అని పెళ్లి పీటల మీదే ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నాం కదా” అంది అదోరకమైన ట్రాన్స్ లో.

“సంధ్యా!” కలవరంగా ఆమె చేయి పట్టుకున్నాడు.

ఎప్పటి నుంచో అణచుకున్న దుఃఖం వెల్లువైంది... “ఏవండి.. మావయ్య గారు..” అంటూ బావురుమంది. దీపక్ కి కూడా గుండెకి గండిపడినట్టు అయింది. మనసులోనే కుళ్ళిపోతూ ఆమెని పట్టుకుని కుర్చీలో కూర్చుని ఆమె తల తన ఒడిలో పెట్టుకున్నాడు. ఆమె వెక్కి, వెక్కి ఏడవసాగింది ... దీపక్ చెంపల మీదకి జారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ తల ఎత్తాడు.. ఐ సి యు నుంచి సిస్టర్ బయటకి వచ్చి తమ వైపే నడవడం మసక, మసకగా కనిపించింది.

దీపక్ గుండె దడ, దడలాడింది. కాళ్ళల్లో వణుకు మొదలైంది.. ఏం చెప్పబోతోంది సిస్టర్.. భగవాన్ ఎలాంటి చెడు వార్త నా చెవుల పడనీకు.. నాన్న కోలుకోవాలి.. నీకు మాట ఇస్తున్నాను.. ఇక నుంచి నాన్నని నా కంటి రెప్పలా చూసుకుంటాను. ఇంతకాలం ఆయన్ని నిర్లక్ష్యం చేసినందుకు నన్ను క్షమించు.. ఆయనకి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగించు. తల్లడిల్లిపోతూ దేవుడిని కోరుకున్నాడు.

సిస్టర్ మెత్తటి బూట్లు శబ్దం చేస్తూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. కొంత నీరసంగా, మరికొంత సంతృప్తిగా నిట్టూర్చాడు.

నాన్న కోలుకుంటాడు అనుకున్నాడు తనకి తనే ధైర్యం చెప్పుకుంటూ.

తన ఒడిలో తల పెట్టుకుని గాఢంగా నిద్రపోతున్న సంధ్య మొహం మీద కదులుతున్న ముంగురులు సవరిస్తూ ఆమె వైపు పరీక్షగా చూసాడు. అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు.. కళ్ళ కింద వలయాలు.. వడలిన చెక్కిళ్ళు... సరిగ్గా ముప్ఫై ఏళ్ల క్రితం, పిట్టగోడ మీద వాలిన సన్నజాజి తీగలా తన ఇంటి వాకిట్లోకి వచ్చింది..ఆ తీగనిండా విరిసిన జాజి పూల పరిమళం లా తన జీవితంలోకి వచ్చింది.. వచ్చిన దగ్గర నుంచి నిస్వార్ధంగా ఆ ఇంటికి, ఆ ఇంట్లో మనుషులకే తన జీవితాన్ని అంకితం చేసింది.. ఏనాడూ ఇది కావాలని కోరలేదు.. ఇచ్చింది తీసుకుంది... లేనిది కావాలి అనలేదు.. అతి త్వరగా తండ్రిని కోల్పోవడంతో మావగారినే తండ్రిలా భావించింది. స్మరణ పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లే తన జీవితం అన్నట్టు బతికింది. ఇంకో పిల్లని కంటే పెంచలేమేమో సంధ్యా... ఒక్క కూతురు చాలదా మనకి అంటే మనసులో మరో బిడ్డ కావాలని అనిపించినా, మరో బిడ్డని మోయగల శక్తి ఉన్నా తన మాటే వేదంలా భావించి సరే అంది. సంధ్య లాంటి భార్య లభించడం తన అదృష్టం.. స్త్రీలని మంచి భర్త లభిస్తే నువ్వు చేసిన పూజలు మంచివి మంచి భర్త లభించాడు అంటారు.. తనేం పూజలు చేసాడో పోయిన జన్మలో... ఎందుకంటే ఈ జన్మలో ఏ పూజా చేసిన గుర్తులేదు. ఇంతటి అనుకూలవతిని ఇచ్చాడు దేవుడు.. దైవమా! జన్మ, జన్మ లకి ఈమే నా భార్య అవాలంటే ఏం పూజలు చేయాలో చెప్పవా... చేస్తాను. అతని కళ్ళ నుంచి ఓ బిందువు చెంపమీదకి జారింది. కుడిచేయి చిటికెన వేలితో ఆ కన్నీటి చుక్క తుడుచుకున్నాడు.. కానీ గుండెల్లో పొంగుతున్న గోదారిని ఎలా తుడుచుకొగలడు! కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు అలా కుర్చీలో. అలసి ఉన్నాడేమో వెంటనే నిద్రపట్టేసింది.

అతనికి తిరిగి మెలకువ వచ్చేసరికి అప్పుడే తెల,తెలవారుతోంది. ఐ సి యు లో ఉన్న పేషంట్ ల తాలూకు అటెండట్స్ కుర్చీల్లో నిద్రలు పోతున్నారు. కాలు నెప్పిగా అనిపించి కదిలాడు. ఆ కదలికకి సంధ్య లేచింది. కళ్ళు నులుముకుంటూ “అయ్యో చాలా సేపు పడుకున్నానా.. సారీ.. మీ కాలు నెప్పిగా లేదూ.. లేపచ్చు కదా” అంది నొచ్చుకుంటూ.

“నేనూ నిద్రపోయాను.. ఇప్పుడే లేచాను” అన్నాడు లేచి నిలబడి కాళ్ళు జాడిస్తూ.

“టైం ఎంత?” అడిగింది చుట్టూ చూస్తూ... అంతటా నిశ్సబ్దంగా ఉంది. అద్దాల తలుపుల్లోంచి రోడ్డు మీద అడపా, దడపా వెళ్తున్న వాహనాలు కనిపిస్తున్నాయి. స్ట్రీట్ లైట్ వెలుగు రోడ్డు మీద గాజుపొడి వెదజల్లినట్టు ఉంది.

రాత్రి డ్యూటీలో ఉన్న నర్సులు, ఆయాలు అటూ, ఇటూ తిరుగుతున్నారు. రోజంతా తడిబట్ట, ఫినాయిల్ వేసి తుడుస్తారేమో పరిశుభ్రంగా ఉంది ఫ్లోర్.. ఆంజనేయులుని అప్పటికప్పుడు ఇంటికి దగ్గరగా ఉన్న హాస్పిటల్ కి తీసుకు వెళితే , పరిస్థితి కొంచెం సీరియస్ గా ఉందని వాళ్ళే అంబులెన్స్ లో సికిందరాబాద్ యశోదా హాస్పిటల్ కి పంపారు. అదే హాస్పిటల్ లో ఉండి ఉంటె ఒకళ్ళు రాత్రి ఇంటికి వెళ్లి పడుకునే వాళ్ళు... ఒకళ్ళు హాస్పిటల్ లో ఉండేవాళ్ళు. ఇప్పడు ఇంత దూరం నుంచి ఇంటికి వెళ్ళడం చాలా కష్టం..అందుకే ఇద్దరూ అక్కడే ఉంటున్నారు. అక్కడే తింటున్నారు.

సంధ్య మొబైల్ చూసింది.. ఐదు నలభై..

“తెల్లారుతోంది... మావయ్య గారికి ఎలా ఉందో ఎవరన్నా చెప్పారా” అడిగింది.

“ఇంకా లేదు..” అన్నాడు దీపక్.

అప్పుడే అతని మొబైల్ మోగింది.. స్మరణ ఫోన్...

“డాడీ మేము ఇప్పుడే సిటీ లోకి ఎంటర్ అయాము.. ఎక్కడికి రావాలి.. మీరు ఎక్కడ ఉన్నారు?” అడిగింది స్మరణ.

“హాస్పిటల్?” చెప్పాడు.

“సరే... అక్కడికే వస్తాము” అంటూ ఫోన్ పెట్టేసింది.

“స్మరణ వచ్చేసిందా” అడిగింది సంధ్య.

“అవును హైదరాబాద్ రీచ్ అయింది... ఇంకో అరగంటలో వస్తుంది..”

“మీ తమ్ముడికి, అక్కయ్య కి ఫోన్ చేసారా..”

“లేదు.. కంగారు పడతారేమో..”

“అలా అని కబురు చేయరా... తెల్లారాక చేయండి.. మీ అక్కయ్యకి ఇప్పుడు చేయచ్చు.. వాళ్లకి పగలేగా” అంది సంధ్య.

“చేస్తా” అన్నాడు ముభావంగా.. కనీసం ఏడాదికి ఒకసారి అయినా,

“నాన్నా! ఎలా ఉన్నావు, అన్నయ్యా నాన్న ఎలా ఉన్నాడు?” అని పలకరించని వాళ్లకి చెప్పడం అవసరమా అనిపించింది.

“వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా తండ్రికి అస్వస్థత గా ఉన్న విషయం చెప్పాల్సిన బాధ్యత విస్మరించడం మంచిదికాదు.. మన కర్తవ్యం మనం పాటించాలి.. అంతే” అతని మనోభావాలు గుర్తించి మరోసారి అతని బాధ్యతని సున్నితంగా గుర్తుచేసి.

“రండి కాఫీ తాగి వద్దాము” అంది.

ఇద్దరూ క్యాంటీన్ వైపు వెళ్ళారు. కాఫీ పరిమళం గుప్పుమంది. ఇద్దరూ కాఫీ తాగి కాసేపు అక్కడే కూర్చున్నారు. ఎవరి ఆలోచనలో వాళ్ళు మౌనంగా ఉండిపోయారు.

“స్మరణని తీసుకుని ఇంటికి వెళ్తాను.. స్నానం చేసి, భోజనం చేసాక వస్తాము. మేము వచ్చాక మీరు వెల్దురుగాని” అంది సంధ్య.

“రానీ ఆలోచిద్దాం ఏం చేయాలో..” అన్నాడు.

ఆయనకి తెలిసి స్మరణ ఇక్కడి నుంచి కదలదు.. తాతయ్యని తీసుకునే ఇంటికి వెడదాము అంటుంది కచ్చితంగా. ఎంత గొడవ చేస్తుందో ఏం చేస్తుందో.. అనికూడా అనిపిస్తోంది. అసలు తనతో ఎవరు వస్తున్నట్టు! మేము వస్తున్నాము అని చెప్పింది..

ఆయన ఆలోచనలు తెగకముందే స్మరణ ఫోన్ ...

“ఎక్కడ ఉన్నారు నేను హాస్పిటల్ కి వచ్చాను” అంది.

“ఐ సి యు దగ్గరకు రా” అన్నాడు.

“ఓకే” అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది.

పద స్మరణ వచ్చేసింది అంటూ లేచాడు దీపక్.. వచ్చిందా అంటూ తను కూడా లేచి అతనితో పాటు బయటకి నడిచింది.

స్మరణ పక్కన ఆరడుగుల మాధవన్ ని చూడగానే ఒక్కసారి ఉలిక్కిపడింది సంధ్య.. తేజోవంతంగా ఉన్న కళ్ళు.. ఖరీదైన కళ్ళజోడు, హుందాగా పాంట్ జేబులో చేతులు పెట్టుకుని నిలబడి ఉన్న అతను దీపక్ ని , సంధ్యని చూడగానే జేబులోంచి చేతులు తీసి జోడిస్తూ నమస్తే అన్నాడు.

దీపక్ స్మరణ వైపు చూసాడు ఎవరు అన్నట్టు.. “మిస్టర్ మాధవన్.. నా బాస్” తొణక్కుండా చెప్పింది స్మరణ.

దీపక్ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి...”థాంక్ యు .. సమయానికి మీరు దగ్గర ఉండి మా అమ్మాయిని తీసుకువచ్చారు” అన్నాడు.

****చివరి భాగం వచ్చే సంచికలో****

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!