Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

"భోజరాజు వంటి రాజుంటే.. కాళిదాసు లాంటి కవి పుడతాడు" - మన పెద్దవారు ప్రవచించిన సామెత. మరి సాక్షాత్తు "రాముడే ఒకప్పుడు రాజుగా ఉన్న గడ్డ పై, ఒక గొప్ప కవి పుట్టే ఉంటాడు" కదా? నేను మాట్లాడుతుంది రామయాణాన్ని రచించిన వాల్మీకి గురించి కాదు, ఆయన తరువాత వేల సంవత్సరాల పిదప జన్మించిన "తులసీదాస్" గురించి. ఉత్తర భారత దేశంలో జన్మించి, నడయాడిన తులసీదాస్ గురించే ఈ నెల రచ్చబండ చర్చ కార్యక్రమం.

దేశంలో అనేక మంది రామాయణాన్ని తిరగ రాశారు. వాటిలో 16 శతాబ్ది నాటి తులసీదాన్ రచన ఒకటి. హిందీకి దగ్గరగా ఉండే అవధీ భాషలో రాసినందున జనానికి సులభంగా అర్ధం కావటంతో ప్రాచుర్యం పొందింది. అయోధ్య ప్రాంతవాసులు మాట్లాడే భాషే అవధి భాష.  తులసీదాస్ కలం నుంచి వెలువడిన ‘రామ చరిత మానస్’ గ్రంధంలోని అంశాలు ప్రజలను వందల సంవత్సరాలుగా ఆకట్టుకున్నాయి. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, “కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడ”ని చెబుతాడు. అవధి భాషలో తులసీదాస్ రచించిన 'రామచరితమానస్' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. మధ్యయుగాల భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమ శాఖలు రెండు ఉండేవి. అవి నిర్గుణ, సగుణ. భగవంతుడికి రూపం లేదని భావించేది నిర్గుణ శాఖ అయితే, రూపం ఉంటుందని పేర్కొన్నది సగుణ సంప్రదాయం. సగుణ సంప్రదాయం లో మళ్లీ రెండు శాఖలు. రామమార్గీ, కృష్ణమార్గీ. తులసీదాసు రామమార్గానికి చెందినవాడు.

తులసీదాస్ తన తల్లి గర్భంలో పన్నెండు నెలలు గడిపిన తర్వాత జన్మించాడని చెబుతారు. పుట్టినప్పుడే ఏడవకుండా పూర్తి 30 దంతాలతో జన్మించాడని పండితులు చెబుతారు. జ్యోతిష్యశాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, తులసీదాస్ అభూక్త మూల నక్షత్రంలో జన్మించాడు. బిడ్డ తండ్రికి అదొక అశుభ సంకేతంగా అప్పుడు ప్రజలు భావించేవారు. దీని కారణంగా ఆందోళన చెందిన ఆయన తల్లి మరియు తండ్రి తనను చునియా అనే మహిళకు అప్పగించారు. చునియా తులసీదాస్ ని ఐదేళ్ల పాటు పెంచిన తర్వాత మరణించింది. దీని తర్వాత గురువు నరహరిదాస్ తన నాలుగో శిష్యుడు గా తులసీదాస్ ను స్వీకరించాడు. చునియా మరణించిన కొద్దికాలానికి ఈయన తులసీదాస్ ను దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో పాటు తులసీదాస్ ను అయోధ్యకు తీసుకెళ్లి అక్కడ రామాయణ కథను గురువు బోధించాడు.

తులసీదాస్ వివాహం కథ చాలా ప్రసిద్ధి గాంచింది, కర్తవ్యం బోధించి స్ఫూర్తి నిచ్చిన శక్తివంతమైన మహిళ కథ అది. ఆ కథనం ప్రకారం తులసీదాస్ బ్రాహ్మణ కుమార్తె రత్నావళిని వివాహం చేసుకున్నారు. ఓసారి తులసీదాస్ హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు రత్నావళి తన సోదరునితో తన తల్లి ఇంటికి వెళ్లారు. అదే రాత్రి తన భార్యను కలవడానికి పెద్ద ఎత్తున పరవళ్లు తొక్కుతున్న గంగా నదిని ఈది తులసీదాస్ అక్కడికి చేరుకున్నాడు. అక్కడకు వచ్చిన తులసీదాస్ ని చూసి రత్నావళి చాలా ఆశ్చర్యపోయింది. “నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది, భగవంతుని పై మీరు చూపే దివ్య ప్రేమ ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు మీకు సహాయ పడుతుంది" అని తన కర్తవ్యాన్ని గుర్తుచేసింది. దీంతో తులసీదాస్ వివాహ జీవితానికి వీడ్కోలు పలికాడు. ఈ విధంగా వైవాహిక సంబంధమైన ప్రేమ భగవంతుడి పట్ల దివ్యప్రేమగా రూపాంతరం చెందింది, ఆ తర్వాత ఆయన ప్రయాగ్ రాజ్ నగరానికి మకాం మార్చారు.

హనుమంతుని ప్రార్థిస్తూ ధ్యానం చేసే హనుమాన్ చాలీసా వెనుక ఒక కథ ఉంది. వారణాసిలో ఒక గృహస్తు కుమారుడు అకారణంగా మరణించాడు. ఆ యువకుడి అంత్యక్రియల నిమిత్తం స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి ఆ యువకుడి భార్య పరుగుపరుగున ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో విస్మయం చెందిన ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న భర్త శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని అప్పటికప్పుడు శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన బలవంతంగా హిందూ మతం నుండి వేరే మతం మారిన వారు తిరిగి రామ భక్తులుగా మారే సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి అప్పటి చక్రవర్తి పాదుషాకు స్వయముగా వివరించి తులసీదాస్ పై తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను తన దర్బారుకు విచారణకు పిలిపించాడు. ఒక శవాన్ని అప్పటికప్పుడు తెప్పించి, "తులసీ దాస్! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా ఈ శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే ఈ సమస్యను పరిష్కరించుకోమని ప్రార్థించి, మౌనం వహించాడు. తులసీదాస్ మౌనాన్ని రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో దర్బారులో ఉన్నవారందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ తలోదిక్కు పరుగు లంకించుకున్నారు. ఈ కలకలానికి ధ్యానభగ్నమై కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ దాస్! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు అప్పటినుండి ఇప్పటివరకు 40 దోహాలతో కూడిన హనుమాన్ చాలీసా భక్తుల ఇళ్లలో మార్మోగుతూనే ఉంది. 'హనుమాన్ చాలీసా' కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో మనకు ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. తులసీదాస్ వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.

వర్తమానానికి వస్తే, రామచరిత మానస్‌లో మహిళలు, దళితులను, శూద్రులను కించపరిచేలా చాలా వాక్యాలు ఉన్నాయని దిల్లీలోని జామియా యూనివర్సిటీకి చెందిన పని లేని కొంతమంది ప్రొఫెసర్లు వాదిస్తున్నారు. అయితే ‘‘ఆ వివాదాస్పద వాక్యాలను చెప్పినవి ఆ కథలోని పాత్రలు.. వీటిని తులసీదాస్‌ అభిప్రాయాలుగా మనం భావించకూడదు’’ అని తులసీదాస్‌ మద్దతుదారులు వీరికి ధీటుగా సమాధానం  చెబుతున్నారు. దళితులు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నట్లుగా చెబుతున్న ఆ వాక్యాలను అసందర్భోచితంగా, నేపథ్యాన్ని చదవకుండా విమర్శకులు తప్పుగా అర్ధంచేకున్నారని రామచరిత మానస్‌పై అధ్యయనం చేపట్టిన పలువురు చరిత్రకారులు వాదిస్తున్నారు. అయితే, రామచరిత మానస్‌ను నేటి దృక్కోణంలో చూడాలని, దీనిలోని అంశాలపై లోతైన చర్చలు జరగాల్సిందేనని విమర్శకులు అంటున్నారు. ఈ లెక్కన మరి మిగతా మతగ్రంధాలను కూడా నేటి దృక్కోణంలో చూసి, చర్చించి తిరిగిరాయాల్సిదే కదా? కాదంటారా? ఇంకో 200-300 ఏండ్ల తరువాత తరం వారు మళ్ళీ వీటిని తిరిగి రాస్తారు - లేదా రాయవలసి వస్తుంది ఎందుకంటే భవిష్యత్తు దృక్కోణం ఎప్పుడూ వర్తమాన దృక్కోణం కు సరిసమానంగా ఉండదు. ‘‘ఎన్ని దుర్గుణాలు ఉన్నప్పటికీ బ్రాహ్మణుడిని పూజించాల్సిందే.. దళితుడు వేద పండితుడు అయినప్పటికీ పూజనీయుడు కాదు.. అని కూడా రామచరిత మానస్‌ లో ఉంది. ఇలాంటి పక్షపాతం చూపించే పుస్తకాన్ని మనం ఎలా అంగీకరించగలం?’’ అని కూడా కొంతమంది ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. నిజానికి వీరి సమస్య "రామచరిత మానస్‌" కాదు, వీరి సమస్య "మతం" - దాని అనుసరించే ఎదుటి వారిపై వీరికున్న ఉక్రోషం! "వీడిని ఎక్కడైనా చూపించండ్ర అలా వదిలేయకండ్రా" - ఇది ప్రముఖ తెలుగు నటుడు దివంగత రావు గోపాలరావు కొడుకు, నటుడు "రావు రమేష్" ఒక సినిమాలో చెప్పిన ప్రాచుర్యం పొందిన డైలాగ్. ఈ ప్రొఫెసర్లకు ఇది అతికినట్లు సరిపోతుందేమో?

ప్రముఖ జర్నలిస్ట్, డిజిటల్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కేవల్ కపూర్, 16వ శతాబ్దపు ఉత్తమ కవి తులసీదాస్‌పై అద్భుతమైన డిజిటల్ సిరీస్‌తో వచ్చారు. ఇందులో తులసీదాస్ అన్ని విజయ రహస్యాలను ఆయన వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఇది అనేక ఎపిసోడ్‌లతో ప్రేక్షకులను అలరించనుంది. శ్రీ రామయణ గ్రంధంతోపాటు.. తులసీదాస్ ప్రస్థానం.. ఆయన చేసిన సేవలు, రచించిన రచనలను దీనిలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. ఇది నేటి యువతను ప్రేరేపిస్తుందని కేవల్ కపూర్ పేర్కొన్నారు. నిరాశలో ఉన్న వారికి ఆశలు చిగురించేలా చేసే సిరీస్ ఇది, జ్ఞాన శక్తికి మించిన శక్తి ఏదీ లేదని ఇది చూపిస్తుంది, ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అని మీరు విశ్వసిస్తే.. ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు, నేటి డిజిటల్ యుగంలో ఈ సిరీస్ విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంది.. అని కేవల్ కపూర్ బల్ల గుద్ది చెబుతున్నారు. సదరు డిజిటల్ సిరీస్‌ ను మనకు ఉచితంగా యూ ట్యూబ్ ద్వారా వీక్షించే మార్గం ఉంది కాబట్టి మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం.

ప్రముఖ తెలుగు భక్తి పాటల గాయకుడు ప్రవచన కర్త దివంగత ఎం ఎస్ రామారావు హనుమాన్ చాలీసా పఠనం వినని తెలుగు వారు అరుదు. ఈ మధ్య హనుమాన్ చాలీసా అని యూ ట్యూబ్ లో వెతికితే వచ్చిన వీడియో ను యధాలాపంగా ప్లే చేసిన పిదప ఒక యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి అద్భుతంగా హనుమాన్ చాలీసా గానం చేయడం కనులవిందు చేసింది, గొంతు మాత్రం అచ్చం ఎం ఎస్ రామారావు గొంతే, ఆయనే స్వయానా పాడినట్లు ఉంది. తరువాత ఆయువకుడి గూర్చి వెతికితే అర్ధం అయింది, సదరు యువకుడి పేరు డా. పి శ్రీనివాస్ - ఎం ఎస్ రామారావు మనుమడు అని (కుమార్తె కొడుకు). చరిత్ర పునరావృత్తం అవటం అంటే ఇదేనేమో?

సందర్భం వచ్చింది కాబట్టి ఎం ఎస్ రామారావు హనుమాన్ చాలీసా, సుందరకాండ పట్ల ఎలా ఆకర్షితులు అయ్యారో తెలుసుకుందాం. రచ్చబండ చర్చలు అంటే ఇలావుంటాయి కదా! అప్రస్తుత ప్రసంగాలు చాలానే ఉంటాయి! అయితే చర్చలో చివరిదాకా కూర్చుంటేనే తెలుస్తుంది అసలు విషయం ఏమిటో! 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తహసీల్దార్ చిత్రంలో ఎం ఎస్ రామారావు చేత మొదటి సారిగా "ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా" అనే ఎంకి పాట పాడించారు. అప్పట్లో కొన్ని తెలుగు సినిమాలకు పాటలు పాడిన ఎం ఎస్ రామారావు 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని అక్కడ నవభారతి గురుకులంలో పది సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 1970 లో ఎం ఎస్ రామారావు పెద్ద కుమారుడు బాబూరావు భారతీయ వాయుసేన ఇండియన్ ఏర్ ఫోర్స్ పైలట్ ఆఫీసరుగా నియమితుడైనారు. 1971లో పాకిస్థానుతో జరిగిన యుద్ధ కాలంలో అతని కుమారుడి ఆచూకీ తెలియ లేదు.  కుమారుని క్షేమం కోసం వాయు కుమారుడైన హనుమంతుని ఎం ఎస్ రామారావు ఆరాధించడం మొదలు పెట్టారు. తర్వాత కొంత కాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారి ఇష్ట దైవమైనాడు. ఎం ఎస్ రామారావు హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ అని చరిత్రకారులు చెబుతారు.  1972 నుండి 74 వరకు తులసీదాసు హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు, పిదప సుందరకాండ తెలుగు గేయరచన చేశాడు. రామారావుకు 1977 సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు.

తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచన వైరాగ్య సందీపిని వంటివి ఉన్నాయి.తులసీదాసు హనుమంతుని సహాయంతో శ్రీరామ దర్శనం పొందాడంటారు. ఈ కృతజ్ఞతతో వారణాసిలో ‘‘సంకటవిమోచన్’’ అనే దేవాలయాన్ని తులసీదాసు కట్టించాడు అని అంటారు. ఇళ్లలో పిల్లలు కానీ, పెద్దలు కానీ మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని తెలిస్తే మొదటగా వచ్చే సలహా ఏదైనా ఉందంటే.. అది హనుమాన్‌ చాలీసాను చదువుకోండి, ఆంజనేయుడికి దండం పెట్టుకోండనే. అందుకే దాన్ని రచించి దాదాపు 500 ఏండ్లు గడిచిపోయినప్పటికీ ఇప్పటికీ దాని ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆగస్టు నెల అనగానే ముఖ్యంగా తెలుగువారికి ముందు గుర్తుకు వచ్చేది "ఆగస్టు 15 - భారత స్వతంత్ర దినం" అని. హనుమాన్ చాలీసా అభిమానులు గుర్తుపెట్టుకోవాల్సింది మరొకటి ఉంది - హనుమాన్ చాలీసా సృష్టికర్త "తులసీదాస్" పుట్టినరోజు ఈ ఆగస్టు 23, 2023 నే. కాబట్టి సిరిమల్లె పాఠకుల కు స్వతంత్ర దినోత్సవ సంబరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణంతో అఖండ రామజ్యోతి వెలిగించిన తులసీదాస్ ను స్మరించుకుంటారని, ఆయన ఆధ్యాత్మిక రచనల, చరిత్ర  స్పూర్తితో ఉత్తేజితులవుతారని  ఆశిస్తూ...  యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in August 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!