Menu Close
Page Title

అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన

“ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు” అంటూ శ్రీ వేంకటేశ్వర, అలమేలు మంగల జోడీని పొగడుతూ:

ఇద్దరి కిద్దరే సరి యీడుకు జోడుకు దగు
గద్దరికన్నుల జూడ గలిగెగా మనకు ||

పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు
కాంతుని పీతాంబరపు కాంతులు సరి
దొంతల చెలినీలపుతురుము కాంతులకు
వంతుల మేనినీలవర్ణము సరి ||

జలజాక్షి వెలలేని జఘనచక్రమునకు
చలమరివల కేలిచక్రము సరి
కులికేటి యీయింతి కుత్తిక శంఖమునకు
చలివాయ రమణుని శంఖము సరి ||

కమలాక్షి శ్రీవేంకటపతి గూడుటకు
రమణుడంటిన సమరతులు సరి
తమితోడి నిద్దరికి తారుకాణలై నట్టి
సముకపు మోహముల సంతసములు సరి ||

వేదాల లోగుట్టులు నలుగురి తెలియచేస్తూ తనదైన పద శైలిలో:

ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు
తక్కినవి యిన్నియును తలపు రేచెడిని ||

యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు
గుఱియై మాయలలోన గూడించే వింతె
మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు
తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె ||

తెలుసుకో జీవుడా దేహమును నమ్మరాదు
వలసితే నుండు బోవు వన్నెవంటిది
తలచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు
పలులంపటములచే బరచెడి దింతె ||

సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు
బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె
యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత
నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||

రామాయణములో హనుమంతుని శక్తియుక్తుల పొగడుతూ ఈవిధంగా కీర్తించాడు :

అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు

బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు

దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు

కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు.

అక్కమాంబను వివాహమాడి, పెద్ద తిరుమలాచార్యని పుత్రునిగా బడసి తొంబది నాలుగేండ్లు సార్ధక సంగీత, సాహిత్య జీవితాన్ని గడిపి, శ్రీ వేంకటేశ్వరుని భక్తుని కి కావలిసిన అర్హతలు ఇట్లా పొందుపరిచాడు:

ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినెఱిగినవాడు

పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ దత్పరుడు గాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులదానే యని భావించువాడు

నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పరబుధ్ధి దలిగిన వాడు
కర్మమార్గములు తడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు

జగతి పై హితముగా జరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ దెలిసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు

కర్మఫలాన్ని అనుభవిచడంకోసం పుట్టుతూ గిట్టుతూ, వాటి మధ్యలో చేసిన కర్మలు వదిలించుకోవడంకోసం మళ్ళీ  జన్మల నెత్తుతూ గడపడం కష్టమంటూ వైరాగ్య ధోరణిని వెళ్లబుచ్చుతూ..

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీవుయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్ట వెరపై తోచె వుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల||

'సంకీర్తనా లక్షణం' అనే సంగీత లక్షణ గ్రంథరచన చేసి తన సంగీత ప్రతిభని విశదపరచాడు, అన్నమయ్య.
ముప్పదిరెండువేల పదాలు వ్రాసిన పిమ్మట అలసిపోయి, ఆ దేవుని సన్నిధిలో సమర్పించి ..

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక // అంతర్యామి //

జనుల సంగముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక // అంతర్యామి //

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక // అంతర్యామి //

అంటూ తిరుమలలో పాడుకుంటూ స్వయంగా తన పద మాలలతో శ్రీ వేంకటేశ్వరుని పూజ కొన సాగించే ధ్యేయంతో వైకుంఠానికి ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు అలంకరించనరిగాడు (అనగా ఏప్రిల్ 4 ,1503 న)  అసమాన వాగ్గేయకారుడు, కవి, భక్తుడు, అన్నమయ్య.

అన్నమయ్య కీర్తనల పదరవళికి సంగీత ఝరిని జోడించి జనాలు అలవోకగా పాడుకునే తీరుని అలరించిన వారిలో ప్రముఖులలో  మంగళంపల్లి బాల మురళి, నేదునూరి కృష్ణమూర్తి, శోభారాజ్, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ఎం.ఎస్ . సుబ్బులక్ష్మి, పారుపల్లి రంగనాధ్, శ్రీపాద పినాకపాణి, నిత్య సంతోషిణి, మల్లాది సోదరులు మున్నగు ఎందరో తమవంతుగా అన్నమయ్యకు తమ గళాలతో ఆయన పదాలు పాడి శ్రీ వేంకటేశ్వరునికి, అన్నమాచార్యునికి భక్తిని చాటుకున్నారు. వారిలో కొందరి కృతులు ....

నారాయణతే నమో నమో - మంగళంపల్లి బాల మురళీ కృష్ణ - https://youtu.be/9O4XO1wTqEc

గాలినై పోయా కలకాలము - శ్రీమతి శోభా రాజ్ - https://youtu.be/8oIiG56RMEo

అన్నమయ్య కీర్తనలు - నిత్య సంతోషిణి - https://youtu.be/ZNU7Y26AFUM

అంతయు నీవే హరి పుండరీకాక్ష - కుమారి శ్రీలలిత - https://youtu.be/Z_ioPfPw3p0

తిరుమలగిరి రాయ దేవరా ఉత్తరాయ - శ్రీమతి  శోభా రాజ్ - https://youtu.be/yuXprelrLyA.  

కోరికలు కొనసాగె గోవిందరాజ- గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ - https://youtu.be/CKuVSDihqY8

బ్రహ్మ కడిగిన పాదము - శ్రీమతి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి - https://youtu.be/dJq6R_pblis

పలుకు తేనెల తల్లి పవళించెను - వాణీ జయరాం - https://youtu.be/-XZhs-_FXWo

రాజీవ నేత్రాయ రాఘవాయ నమో - కె జె ఏసుదాసు - https://youtu.be/PoI1ADlYpac

అలరు చెంచలమైన ఆత్మలందుండెడి - ఎస్ వేదవ్యాస ఆనందభట్టార్ - https://youtu.be/wEORkYJzB4E

రామభద్ర రఘువీర - రాహుల్ వల్లాల్ & శ్రీకర్ - https://youtu.be/UM3yg8_iBec

కలియుగ మెటులైన - S.P.బాలసుభ్రహ్మణ్యం & సుజాత మోహన్ - https://youtu.be/kB9QSH3V0BU

అంతర్యామి అలసితి సొలసితి - వేదవ్యాస ఆనంద భట్టార్ - https://youtu.be/Jif-pzopO-A

వేంకటేసుడు మా తిరుమలేసుడు గోవిందుడుకాడా - కుమారి సత్యయామిని - https://youtu.be/Rf1lCqL7XsU

బిరుదులన్నియు నీవె - శ్రీకృష్ణ - https://youtu.be/bm3wDtojkIQ

సుదతులకితనికి సోబన వేళ - శ్రీనిధి - https://youtu.be/npWCtfqrQfM

అదెచూడు తిరువేంకటాద్రి - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం - https://youtu.be/8wQQNYEmAxs

హరి యితండు హరుడతండు  - ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం - https://youtu.be/TciQMFynxJU

ధర్మా ధర్మము లాల, దైవములాల - హేమచంద్ర - https://youtu.be/B3Z8gX-Nhkw

అణుమాత్రపు దేహి నంతే నేను - హేమచంద్ర - https://youtu.be/Lfmy_oJGZeI

కలదొక్కటె గురి ఓకమలాక్ష - శ్రీమతి ద్వారం లక్ష్మి - https://youtu.be/E8qP6reM5vM

అన్నమయ్య సాహితీ ప్రభవం, సంగీత ఝరుల సుమధుర గమనం, భక్తి భావ సౌందర్యం, ఎంతచెప్పినా తక్కువే.

-o0o-

Posted in August 2023, సాహిత్యం

2 Comments

  1. Venugopal Rao Gummadidala

    Thank you, అన్నమయ్య గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ప్రతి ఒక్క పదం కాంతులీనే వజ్రపు తునకే.

  2. K V Bhanu Bhushan

    అన్నమయ్య పదాన్ని, భక్తి గొప్పదనాన్ని, భాష తియ్యదనాన్ని తెలుగు లోగిళ్ళకి తీసుకొని వచ్చిన ప్రయత్నం హర్షణీయం. అభినందనలు ! ఆ తిరుమలేశుడి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని ఆశిస్తూ…

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!