Menu Close
గోదావరి (పెద్ద కథ)
-- వెంపటి హేమ --

గత సంచిక తరువాయి »

“రంగా!” అంటూ ఎలుగెత్తి పిలిచాడు రమాపతి.

యజమాని పిలుపువిని పరుగునవచ్చి, చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు రంగడు.

“రంగా, నీ భోజనం అయ్యిందిట్రా?”

“ఆయ్! తిన్నానండయ్యా. శానాసేపయ్యిందండి.”

“నీ భార్యాబిడ్డలు ఎక్కడ?”

“ఆళ్ళని ఇందాకానే మన అరుగుమీన కూకోమెట్టి వచ్చానండి, ఆయ్! మా ఇంట్లోకి  నీల్లోచ్చేసినాయండి. ఇగ మనం సిద్దంగుండాల."

”ఔను. ఈమాటు వరదకు వడి చాలా ఎక్కువగా ఉంది. ఇల్లు పాతది. మనం ఇల్లువదలి మెరక మీదికి వెళ్ళక తప్పదు. అసలే ఇది తాతలనాటి కొంప. దీన్ని మా తాతయ్య తండ్రి కట్టించాడుట! అది సరేగాని రంగా, పశువుల మెడల పలుపుతాళ్ళు విప్పావుట్రా? పాకలోకి నీరోచ్చిందిగావును, అవి తెగ అరుస్తున్నాయి, తొందరగా వెళ్ళి చూడు ... ”

“ఆయ్! ఆటి నింకా ఇప్పలేదండయ్యా, ఇదిగో ఇప్పుడే వెడుతున్నానండి అంటూ సిగ్గు పడ్డాడు రంగడు. వెంటనే ఆ పనిమీద పరుగెత్తుకుని వెళ్ళిపోయాడు.

పశువుల్ని మెడకు కట్టిన పలుపు తాళ్ళు విప్పి, వాటిని స్వేచ్ఛగా విడిచిపెడితే అవి, నీటి వడినిబట్టి ఒడ్డును వెతుక్కుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోతాయి. వరద తగ్గాక వాటిని వెతికి తెచ్చుకోవాలి. ప్రాప్తమున్నకాడికవి దొరుకుతూంటాయి.

రంగడు పశువుల మెడలకున్న పలుపు తాళ్ళను విప్పేసి వచ్చాడు. వాడికి మోకాళ్లను దాటి వచ్చింది నీరు.

“రంగా, పడవ ఎక్కడుందిరా? మనకి దాని అవసరం వచ్చింది” అన్నాడు రమాపతి.

“ఆయ్! దాన్ని పాకలోంచి తెచ్చి, దుమ్ము దులిపి తాడుతో మావిడి సెట్టుకి కట్టి వచ్చానండయ్యా” అన్నాడు రంగడు.

ఇంట్లో వాళ్ళవైపు చూసి చెప్పాడు రమాపతి, “ఎవరికి కావలసినవి వాళ్ళు మూటకట్టుకుని తెచ్చుకుని, ఇంటికి తాళం పెట్టి, అందరూ అరుగుమీదికి వచ్చి కూర్చోండి.”

ఆ మాట ఇంట్లోవాళ్ళకి చెప్పి, పంచె మొకాళ్ళ పైకంతా వచ్చేలా ఎగ్గట్టి, రంగడి వెంట నడిచాడు రమాపతి కూడా.

దుర్గమ్మా, రమాపతులకి ఎనమండుగురు సంతానం కలిగారు. పోయినవాళ్ళు పోగా ముగ్గురు మిగిలి ఉన్నారు. ఈ రోజులలో ఉన్నన్ని వైద్యసదుపాయాలు లేకపోడంవల్ల పుట్టిన బిడ్డలు చాలావరకూ చిన్నప్పుడే మరణించేవారు. ఆ రోజుల్లో, చెట్టున కాసిన ప్రతికాయా నిలుస్తుందా ఏమిటి - అన్న (మెట్ట) వేదాంతంతో మనసు సరిపెట్టుకుననేవారు.

రమాపతి దంపతులు, ముందు పుట్టిన కూతుళ్లిద్దరికీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసి, పసుపూ-కుంకం, చీరా-సారీ పెట్టి అత్తారిళ్ళకి పంపించారు. దక్కిన ముగ్గురి బిడ్డలలోకీ చిన్నవాడు కొడుకు. అతడికి చిన్నతనంలోనే వాతం (పోలియో) వచ్చి ఒక కాలు లాగేసింది. పెద్దగా పనిపాటలు చెయ్యలేడు. యుక్తవయసు రాగానే కొడుక్కి కూడా పెళ్ళి జరిగింది. అతనికి ఒక పదేళ్ళ కొడుకు, మరో ఐదేళ్ళ కూతురూ ఉన్నారు. ఇద్దరికీ మధ్యలో ఇద్దరు బిడ్డలు పుట్టారు గాని అక్కరకు రాలేదు. పురిటిలోనే వాళ్ళని ఎన్నెమ్మ పొట్టన పెట్టుకుంది. ఒక కొడుకు, ఒక కూతురూ మాత్రం బతికి బట్టకట్టారు. గోపాలం కొడుకుపేరు రమాపతి శర్మ, కూతురు వనదుర్గ. మళ్ళీ ఇప్పుడు గోపాలం భార్య మహాలక్ష్మి నీళ్లోసుకుంది.

*********

అది ఎనమండుగురు మాత్రం పట్టే చిన్న పడవ. రమాపతి తెడ్డు వేసి దారి చూపిస్తూంటే, రంగడు గడ పట్టి పడవను ముందుకు తోస్తూంటే, అది అరుగు పక్కకు వచ్చి ఆగింది. రంగడు దానిని ఒక పక్కన స్తంభానికి కట్టి, రెండవ పక్కన తను పట్టుకుని కదలకుండా నిలబెట్టాడు. నెమ్మదిగా ఒకరొకరే పడవలోకి దిగి, పడవలో పరిచివున్న వెదురు చాపమీద ఎవరి మూటను వాళ్ళు ఒడిలో ఉంచుకుని కూర్చున్నారు. రమాపతి వయసు ముదిరి మంచంపట్టిన ముసలితల్లిని చేతులలోకి ఎత్తుకుని తీసుకువచ్చి, పడవలో ఒక వారగా, దుర్గమ్మ పరిచిన బొంతమీద పడుకోబెట్టాడు. సీతమ్మ బట్టల మూటతోపాటు తల్లి తాలూకు చేతికర్రను కూడా తీసుకువచ్చింది. ఈ లోగా దుర్గమ్మగారు సద్దివుంచిన పెట్టె తెచ్చి పడవలో ఉంచాడు రంగడు. పడవ నిండింది.

రమాపతి పడవెక్కి తెడ్డు అందుకున్నాడు. ఆయన పడవలోని వాళ్ళను ఉద్దేశించి చెప్పాడు, “కాస్త సద్దుకుని తాయారుకి కూడా చోటివ్వండి” అని, ఆపై రంగనివైపు చూసి, “రంగా, నువ్వు ముందు వాళ్ళనెక్కించి తరవాత పడవను విప్పి, గడందుకో” అన్నాడు.

రంగడు మొహమ్మాటపడ్డాడు, “వద్దయ్యా, పడవ సిన్నది, ఇప్పటికే పూటుగా ఉంది. తమర్ని దింపి ఆల్లకోసం మళ్ళీ వస్తానండయ్యా” అన్నాడు.

“ఫరవాలేదులేరా, ఆ పిల్ల ఎక్కితే అంతలో పడవకేమీ కాదు, ఎక్కించు. పది నెలల పసివాడిని ఒడిలో ఉంచుకుని, తాయారు నడిరాత్తిరి ఒక్కర్తీ ఇక్కడ ఉంటే బేజారౌతుంది. మరేమీ ఫరవాలేదు, ఎక్కించు.”

భార్యా బిడ్డల్ని ఎక్కించి, పడవ తాడు విప్పి, తనుకూడా ఎక్కి గడ అందుకున్నాడు రంగడు. రమాపతి తెడ్డు పట్టి దారి చూపుతూండగా, రంగడు గడవేసి పడవ ముందుకి నడుపుతూండగా, పుంత దారుల వెంట  వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది.

గోదావరినుండి కట్ట తెంచుకుని వస్తున్న వరదనీరు గలగలా శబ్దం చేస్తూ, ప్రవహిస్తోంది. పున్నమి రోజు కావడంతో వెన్నెల పుచ్చపువ్వులా ఉంది. ఆకాశంలో పరుగులు తీస్తూన్న వానమేఘాలు ఉండుండీ చంద్రుడిని కమ్మేస్తున్నాయి. ఆకాశంలో చందమామ మేఘాల కొంగు చాటున దాగొని దోబూచులాడుతూంటే, భూమిపై వెలుగునీడల సయ్యాట కోనసాగుతోంది.

“రంగా! టపాసులు ఉన్నాయా పడవలో?” రమాపతి గట్టిగా కేకపెట్టాడు.

“ఆయ్! ఉన్నాయండయ్యా! తాయారుకాడుందండి సంచీ.” అరిచి జవాబు చెప్పాడు రంగడు కూడా.

పడవ నెమ్మదిగా, పూర్ణ గర్భిణిలా కదులుతోంది. బరువు ఎక్కువగా ఉండడంతో వంచకు జానెడుకి తక్కువగా పడవ నీళ్ళలో మునిగి ఉంది. అప్పటికింకా వెలుగు పూర్తిగాపోలేదు. ఇంటికప్పులు ఎక్కిన జనం గుర్తు తెలుస్తున్నారు.

కొంతదూరం వెళ్ళగానే ఆర్తనాదం లాంటి ఒక కేక వినిపించింది, “ఎవరది, రమాపతి బాబుగారేనా?”

ఆ కేక పెట్టింది ఆ ఊరి గుడిలో పూజారి, పురోహితుడు, వేదపండితుడు ఐన రామశాస్త్రి తల్లిది. వాళ్ళ ఇంటి చూరుకి నిచ్చెన ఆనించివుంది. ఆ కుటుంబమంతా ఇంటి పైకప్పుమీద కూర్చుని ఉన్నారు. వారిలో శాస్త్రి మాత్రం కనిపించలేదు, తలతిప్పి చూసిన రమాపతికి.

“అమ్మా! శాస్త్రిగారు ఊళ్లోలేరా?” అడిగాడు.

“లేడు బాబూ. గురువుగారికి సుస్తీ చేసిందిట! కబురువస్తే చూసి రావడానికి నిన్ననే అగ్రహారం వెళ్ళాడు. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చిపడింది. అక్కడ వాడెల్లా ఉన్నాడో, ఏమో!” ఉసూరుమంది తల్లిప్రాణo.

ఆ తల్లికి ధైర్యం చెప్పాడు రమాపతి. "ఆయనకేమీ ఫరవాలేదమ్మా. అగ్రహారం మెరకమీదేవుంది"అని, “అమ్మా! పిల్లలతో ఉన్నారు, మీకిది సరైన చోటు కాదు. మీరు అటకమీద చోటు చూసుకోవలసింది” అన్నాడు.

“అటకనిండా కొబ్బరికాయలు ఉన్నాయి. వాటిలో తేలో, జేర్రో, పురుగో - బూచో దాగివుందంటే పిల్లలకు ప్రమాదమనిపించింది. దానికన్నా ఇదే నయమనిపించి ఇలా ఇంటికప్పుమీద జేరాము బాబూ!” అంది ఆ పెద్దావిడ.

“భయపడకండమ్మా. ఇపుడు మా పడవ పూటుగావుంది. మేము ఆడంగు చేరగానే పడవను వెనక్కి పంపుతాను. మీరు మాత్రం రాత్రి నిద్రపోవద్దు. పిల్లలు దొర్లి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలకు తినడానికి ఏమైనా ఉన్నాయా?” హెచ్చరించాడు రమాపతి.

"ఉన్నాయి; జొన్నపేలాలు, తాటిబెల్లం మూటకట్టింది మా కోడలు. రెండు గిన్నెలు కూడా ఉన్నాయి. నాలుగు ఇండుపగింజలు కూడా కొంగుకు కట్టుకుంది. గిన్నెల్లోకి గోదారి నీళ్ళు పట్టి, పెంకుమీద ఇందుపగంధం తీసి కలిపింది ఇందాకానే. నీళ్ళు తేరాయి. మంచి నీళ్ళకు కూడా లోటు లేదు బాబూ!"

"సరేనమ్మా! ఈ రాత్రికి జాగ్రత్తగా గడపండి. రేపు తెల్లారి, జాము పొద్దెక్కేసరికి పడవ మీ గుమ్మంలో ఉంటుంది. సెలవమ్మా! ఉంటా మరి." పడవ ముందుకుసాగింది.

నెమ్మదిగా రాత్రి పడింది. కాని వెన్నెల రాత్రి కావడంతో, రమాపతికి దారి కనుక్కోడం కష్టంగాలేదు. ఉరవడితో ప్రవహిస్తున్న నీరు చేస్తున్న శబ్దంతోపాటుగా చెట్ల ఆకులలో దాగివున్న కీచురాళ్ళు జీబురోమని గీపెడుతున్నాయి. తెడ్డు నీటిని కోసినప్పుడు, గడ ఎత్తి నీటిలో వేసినప్పుడు వచ్చిన శబ్దం తప్పించి మరే శబ్దం లేదు. పడవలో ఉన్నవాళ్ళంతా మౌనంగా ఉన్నారు. ఎవరికీ మాటాడాలన్న బుద్ధి పుట్టడంలేదు. పడవ పక్కకి ఒరిగి భయపెట్టినప్పుడు మాత్రం పిల్లలు “కెవ్వు, కెవ్వు”మని కేకలు పెడుతున్నారు. మళ్ళీ అంతలో పడవ సద్దుకోగానే, పిల్లలు కూడా సద్దుమణిగి పోతున్నారు. కొంత సమయం అలా గడిచాక పిల్లలకు నిద్రవేళ కావడంతో, తల్లి తొడమీద ఒకరు, బామ్మ తొడమీద ఒకరు తలపెట్టుకుని, కొద్దిజాగాలో ముడుచుకుని పడుకుని, నిద్రపోయారు వాళ్ళు.

ఈదురుగాలి జోరుగా వీస్తోంది. ఆ గాలి విసురు నీటిలో అలలు రేపుతోంది. ఆ అలల ఊపుకి పడవ అటూ ఇటూ ఒరుగుతోంది. పడవలోని జనం అంతా భయం గుప్పిట్లో చిక్కి, ప్రాణాలు అరచేతుల్లో ఉంచుకుని మనసులోనే దైవనామస్మరణ చేసుకుంటూ మాటాడకుండా కూర్చున్నారు.

పాము పుట్టలు మునిగిపోడంతో పాములు నీటిలో ఈదుకుంటూ  ప్రవాహ వేగానికి నిలదొక్కుకోలేక కొట్టుకుపోతున్నాయి. వాటిలో కొన్ని దారిలో దొరికిన చెట్టుకొమ్మలు ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటున్నాయి. వాటి బుసలు వింటూ - అలా చెట్టుకొమ్మల్లో చేరిన ఏ పామైనా జారి పడవలో పడితే పడవలోవాళ్ళని పాముకరవడం, ఆపై జరిగే తొక్కిసలాట, మరుక్షణంలో పడవ మునిగిపోవడం రెప్పపాటులో అంతా జరిగిపోవచ్చు - అని భయపడ్డాడు రమాపతి. “అంతా ఆ దేవదేవునిదే భారం! శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా” అనుకుని మనసు దిటవు చేసుకునే ప్రయత్నం చేశాడు అతడు. ఆ ప్రదేశంలో నీరు, నిలువు లోతుకి పైనే ఉందని, రంగడి చేతిలోఉన్న గడ మునక చూసి అర్థం చేసుకున్నాడు రమాపతి.

అంతకంతకీ ఆకాశమంతా మేఘావృతమౌతూ, పున్నమి చంద్రుడిని కమ్మేస్తూండడంతో క్రమక్రమంగా చీకటి దట్టమౌతోంది. రివ్వున వీస్తున్న గాలి, బరువుగా ఉన్న ఆ చిన్న పడవను గడగడా వణకించ సాగింది. ఏ క్షణం లోనైనా పడవ పల్టీ కొట్టడం ఖాయమనిపించింది రమాపతికి.

రంగడి నుద్దేశించి గట్టిగా కేకపెట్టాడు ఆయన, “రంగా! పెట్టి నీళ్ళలోకి తోసెయ్యి, పెట్టెలోని వాటికన్నా ప్రాణాల విలువ ఎక్కువ! ప్రాప్తముంటే తరవాత వెతికి తెచ్చుకోవచ్చులే” అన్నాడు.

విలువైన వస్తువులతో నిండివున్న ఆ పెట్టెను నీటిలో పారేయడమన్నది అందరికీ దుఃఖం తెప్పించింది. ప్రాణాలు దక్కించుకోవాలంటే అది తప్పనిసరి - అనుకుని, పొంగి వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా దిగమింగుకుంది దుర్గమ్మ. రంగడు కూడా రమాపతితో మరోసారి చెప్పించుకున్నాక గాని ఆ పెట్టెని నీటిలో పారేయలేదు.

పెట్టి లేకపోయినా పడవ తగినంతగా పైకి లేవలేదు, కుదుపులు ఆగలేదు. ఏమీ తోచని పరిస్థితి అది రమాపతికి. తెడ్డుతో ఆ స్థితిని ఆపడానికి ప్రయత్నించసాగాడు, కాని సాధ్యపడ లేదు.

క్రమంగా చంద్రుని పూర్తిగా మేఘాలు కమ్మేయడంతో, ఘోరమైన చీకటి అంతటా అలముకుంది. ఎవడి అరచేయి వాడికి కనిపించని కటిక చీకటి అది! ఆకాశంలో వ్యాపించివున్న కారుమేఘాలు ఏ క్షణంలోనైనా హోరున వాన కురిపించడానికి ఉవ్విల్లూరుతున్నాయి. వాన కనక కురిసిందంటే  పడవలో వాన నీరు చేరి మరింత బరువెక్కడంతో మునిగిపోక మానదు. ఎలాగ! దిక్కుతోచని పరిస్థితి ఇది. భయంకరమైన ఈ చీకటిలో పడవ దారి తప్పినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు - అనుకునేసరికి దిక్కుతోచలేదు రమాపతికి.

దిక్కులేనివారికి దేవుడే దిక్కు - అన్న సామెత గుర్తొచ్చింది ఆయనకి. వెంటనే, ఆ కటికచీకటిలో విడవకుండా తెడ్డు మెడ్డుతూ, పడవను సరైన దారిలో నడిపించే ప్రయత్నం చేస్తూ, రమాపతి తన ఇష్టదైవమైన అంతర్వేది నరసింహస్వామికి మనసులో మొక్కుకున్నాడు...

“స్వామీ! గోదావరీ సాగర సంగమము క్షేత్రంలో నది ఒడ్డునే ఉన్ననీ గుడి కూడా ఈసరికి వరదనీట మునిగే ఉంటుంది కదా. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నేను చెప్పకుండానే నీకు అర్ధమౌతుందనుకుంటాను నా పరిస్థితి. స్వామీ! నా కుటంబమంతా ఈ పడవలోనే ఉన్నారు. ఎవ్వరికీ ఈత రాదు. ఈ పడవ మునిగితే నాకు వంశమే లేకుండా తుడిచిపెట్టుకు పోతుంది. నువ్వే మమ్మల్ని కాపాడాలి, పాహిమాం! పాహిమాం! ఈ ఆపదనుండి నువ్వుమమ్మల్ని కాపాడి, మేమంతా కలిసి  వచ్చి, భీష్మేకాదశికి అంతర్వేదిలో నీ కల్యాణం అంగరంగ వైభోగంగా చేయించేలా అనుగ్రహించు తండ్రీ! స్వామి కల్యాణమే లోక కల్యాణ మంటారు కదా” అని అనుకుంటూ మనసులోనే అంతర్వేది నరసింహస్వామికి మొక్కుకుని, తమను, తన కుటుంబాన్ని రక్షించే బాధ్యత భగవంతుని పరం చేసి, దైవ ధ్యాన్నంలో బాధను మర్చిపోయే ప్రయత్నంలో పడ్డాడు ఆయన.

రమాపతికి అకస్మాత్తుగా పడవ తేలికైనట్లు అనిపించింది. అక్కడితో ఇంక అలల కుదుపుకి మునిగిపోతుందన్న భయం తప్పింది. నీటిలో మునిగిన గడను పైకి తీసినప్పుడు, గడను నీటిలో వేసినప్పుడు అది చేస్తున్న చప్పుడు వింటూ, “అంతా ఆ నరహరిరూప స్వామివారి దయ” అని మనసులో అనుకున్నాడు రమాపతి.

పడవ తేలికవ్వడంతో వేగంగా ముందుకు సాగింది. అదాటుగా వచ్చిన ఒక గాలి విసురుకి చెదిరిన మేఘాలు, అక్షింతలు జల్లినట్లు నాల్గు చినుకులు కురిసి, దూరంగా తరలిపోయాయి. మేఘాలు చెల్లా చెదురు కావడంతో ఆకాశం తెరిపినిచ్చింది. చూస్తూండగా, చంద్రకాంతిని మించిన, ఒక విధమైన అలౌకిక కాంతితో నిండిపోయింది ఆకాశం.

“అమ్మయ్య! ఇక మనం బ్రతికి బయటపడ్డట్టే! బ్రాహ్మీముహూర్త సమయమయ్యింది. కొంచెం సేపట్లో ఇక తెల్లారుతుంది” అన్నాడు రమాపతి సంతోషంతో.

ఆ శల్యూష (false dawn, బ్రాహ్మీముహూర్తము) కాంతిలో దూరంగా మెరకమీదున్న ఇళ్ళన్నీ లీలగా కనిపించసాగాయి. ఇళ్లలో వెలిగించిన ఆముదం దీపాలు, గాజుకుప్పెల్లోoచి తొంగిచూస్తూ, మినుకు మినుకు మంటూ నక్షత్రాల్లా మెరుస్తూ జాలకర్ర (కిటికీ)ల లోంచి బయటకు కనిపిస్తున్నాయి.

సంతోషం తలమునకలుకాగా, “ఒరే రంగా! దేవుని దయ ముమ్మాటికీ మనపై ఉందిరా, మనం ఇంక ఒడ్డెక్కేసినట్లేరా” అని ఉషారుగా కేకవేశాడు కానీ, వెంటనే తనకు జవాబుగా “ఆయ్!” అన్న కంఠ స్వరం వినిపించకపోయేసరికి, రంగడి కోసం తలెత్తి చూసిన రమాపతి, ఎదురుగా కనిపించిన దాన్ని చూసి ఉన్నబడంగా నిర్ఘాంతపోయాడు. రమాపతికి ఆ కనువెలుగులో రంగడి స్థానంలో తాయారు గడ వేస్తూ కనిపించింది. రమాపతికి ఒక్కసారిగా అంతా అర్థమయ్యినట్లయ్యింది.

****ముగింపు వచ్చే సంచికలో****

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!