Menu Close
సాహిత్యపు పూదోటలో విరబూసిన "సిరిమల్లె"
-- శ్రీ శేష కళ్యాణి గుండమరాజు --

తెలుగు భాష తియ్యదనాన్ని నలుదిశలా చాటుతూ, భారతీయ సంస్కృతిని పదిలంగా కాపాడుతూ, తేనెలొలుకు తెలుగు సాహిత్యపు కమ్మదనాన్ని ఆస్వాదించాలనుకునే వారి ఆరాటాన్ని తీర్చే చక్కటి రచనలను మనకు ప్రతి నెలా అందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీప్రియుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటున్న మన "సిరిమల్లె" పత్రికకు ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు!!

నేటి సమాజంలో ఎటుచూసినా మనసును కలచివేసే దుర్ఘటనలే కనపడుతున్నాయి. మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అటువంటి తరుణంలో, పత్రికలు చదవడం అనేది మంచి కాలక్షేపమే కాకుండా మన మనసుకు చక్కటి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో అంతర్జాల పత్రికలకు కొదవే లేదు. అవి మనం కూర్చున్న చోటికే వచ్చి, ఎక్కడైనా ఎప్పుడైనా వాటిని చదువుకునే వీలును మనకు కల్పిస్తూ ఉంటాయి. అయితే, ప్రస్తుతం అటువంటి అంతర్జాల పత్రికలు లెక్కకు మిక్కిలిగా ఉన్నప్పటికీ, ఉత్తమమైన రచనలతో పాఠకుల దృష్టిని ఆకర్షించి, వారి మెప్పును పొందగలిగే పత్రికలే కలకాలం నిలుస్తాయి. అలాంటి మంచి పత్రికల కోవకు చెందుతుంది మన "సిరిమల్లె" పత్రిక.

ఒక పత్రిక చదవటంవల్ల పాఠకులకు ఏదైనా ప్రయోజనం ఉండాలని భావించే అరుదైన పత్రిక "సిరిమల్లె". పాఠకులకు ఆరోగ్య సంబంధిత విషయాలు తెలియజేస్తూ, అందులో వారిని ఆలోచింపజేసే అంశాల గురించి ప్రస్తావిస్తూ, అందరికీ ఉపయోగపడే విలువైన సూచనలను అందిస్తున్న అపూర్వ శీర్షిక "మన ఆరోగ్యం మన చేతిలో..". ప్రముఖుల గురించి తెలియని ఆసక్తికరమైన విషయాలను తెలిపే శీర్షికలు, తెలుగు సాహిత్యపు వెలుగులను చూపించే శీర్షికలతోపాటూ మనసులను పరవశింపజేసిన ఆ పాత మధురాలను పాఠకులకు గుర్తుచేసే "మనోల్లాసం గేయం"వంటి శీర్షికలు "సిరిమల్లె" పత్రికకు ప్రత్యేకం! పద్యాలూ, కథలూ, కవితలూ, ధారావాహికలూ, చర్చలూ, ఆధ్యాత్మిక విశేషాలూ, చరిత్రకు సంబంధించిన సంగతులూ.. ఒకటేమిటి? సాహిత్యపరంగా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా అది మీకు "సిరిమల్లె" పత్రికలో కనపడుతుంది. అదీ ఈ పత్రిక విశేషత!

తెలుగు సాహిత్యంలో ఎన్నో అద్భుతమైన ప్రక్రియలున్నాయి. వాటన్నికీ తగిన విలువని ఇస్తూ, పాఠకులకు సరికొత్త ప్రక్రియలను పరిచయం చేస్తూ, కొత్తగా రచనలు చేస్తున్నవారిని ప్రోత్సహిస్తూ, పత్రికకు తాము పెట్టుకున్న ఆశయాన్ని ఏమాత్రం సడలనివ్వకుండా చూసుకుంటూ, మల్లెపువ్వంత స్వచ్ఛమైన రచనలను మనకు “సిరిమల్లె” పత్రిక ద్వారా ప్రతినెలా అందిస్తున్నారు “సిరిమల్లె” పత్రిక నిర్వాహకులు.

సాహిత్యరంగంలో పత్రికలు ఎదుర్కొంటున్న పోటీని తట్టుకుని, "సిరిమల్లె" పత్రిక ఈనాడు ఘనవిజయాన్ని సాధించి ఎనిమదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందంటే, దానివెనుక ఆ పత్రిక సంపాదకుల కృషి ఎంతగానో ఉంది. ఒక మాసపత్రికను సమర్ధవంతంగా నిర్వహించడమంటే మాటలు కాదు. అందులోనూ, పత్రిక నిర్వహణ అనేది మనం ఎంచుకున్న ప్రవృత్తయినప్పుడు దానికి ప్రతిరోజూ కేటాయించవలసిన సమయంతో సహా అన్నీ సవాళ్ళే! ఎన్ని అవరోధాలొచ్చినా, వాటన్నిటీ నేర్పుగా అధిగమించి, పత్రికను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది, ఖచ్చితంగా ఒకటవ తేదీన పాఠకులకు చేరుస్తున్నారు "సిరిమల్లె" పత్రిక సంపాదకులు. దీనినిబట్టి పత్రికపట్ల వారికున్న అంకితభావం ఎంతటిదో మనం అర్థం చేసుకోవచ్చు. "సిరిమల్లె" పత్రికకోసం అహర్నిశలూ శ్రమిస్తూ, నెలతిరిగేసరికి మరొక నెల మొత్తం మనల్ని అలరించే అద్భుతమైన రచనలను మనకు అందిస్తూ, రచయితలలో కొత్త-పాత అన్న భేదం చూపకుండా ఆసక్తితో రచనలను పంపుతున్న అందరినీ సమానంగా ప్రోత్సహిస్తూ, తెలుగుభాషనూ, తెలుగు సంస్కృతినీ నేటి తరానికి పరిచయం చేస్తూ, "పాతసంచికల" ద్వారా విలువైన రచనలను మన ముందుతరాలకోసం భద్రపరుస్తూ, ఎనలేని సాహిత్య సేవను చెయ్యడంలో సఫలీకృతులవుతున్న "సిరిమల్లె" పత్రిక సంపాదకులు శ్రీ మధు బుడమగుంట గారికీ, శ్రీమతి ఉమాప్రియ బుడమగుంట గారికీ "సిరిమల్లె" పత్రిక ఎనిమిదవ వార్షికోత్సవ శుభసందర్భంగా ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నాను. అలాగే, నేడు “సిరిమల్లె” సాధించిన విజయంలో భాగస్వాములై, ఆ ఆనందంలో పాలుపంచుకుంటున్న "సిరిమల్లె" పత్రిక రచయితలకూ/రచయిత్రులకూ, పాఠకులకూ అభినందనలనూ, శుభాకాంక్షలనూ తెలియజేస్తున్నాను.

వైవిధ్యభరితమైన రచనలతో నిత్యనూతనంగా వెలువడుతున్న మన అభిమాన పత్రిక "సిరిమల్లె" ఇకముందు కూడా చక్కటి రచనలతో కొనసాగాలని కోరుకుంటూ, “సిరిమల్లె” పరిమళాలు ప్రపంచమంతా మరింతగా వ్యాపించాలని ఆశిస్తున్నాను.

Posted in August 2023, సిరిమల్లె

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!