Menu Close
Vempati Hema photo
జీవనస్రవంతి (సాంఘిక నవల)
వెంపటి హేమ

క్రమంగా వెలుగు పెరిగింది. ప్రకృతిలో మార్పు వచ్చింది. దినకరుడు సంధ్యాదేవి ఒడిలోనుండి లేచి పైకివచ్చాడు. సూర్యోదయమయ్యింది. ప్రకృతి మాత నొసట మెరిసే కుంకుమ బొట్టులా ఉన్నాడు సూర్యుడు.

పచ్చని వరిచేలమీదుగా పైకి లేచిన సూర్యుడు, ఆకుపచ్చని పట్టు చీర కట్టుకున్న నేలతల్లి నుదుటి కుంకుమ బొట్టులా కనిపించాడు భావుకుడైన జీవన్ కి. దిగంతరేఖవరకూ వ్యాపించి ఉన్న వరి పొలాల మీదుగా, తూరుపు దిక్కు నుండి పైకి లేచిన సూర్యుణ్ణి చూడగానే మేను పులకిస్తుంది ఎవరికైనా.  ప్రకృతి సిద్ధమైన మహా సౌందర్యమది! దానికి ఏదీ సాటి కాదు, ఏ కృతక సౌందర్యమూ దానితో పోటీ పడలేదు.

వెలుగురావడంతో, క్రమంగా జనం మసలడం మొదలుపెట్టారు. బండికి అడ్డంగా వచ్చిన జనాన్ని, కేకలుపెట్టీ, గిరగిరా తిరిగుతున్న బండి చక్రంలో కొరడాకర్రుంచి "టక టకా" చప్పుడుచేసీ, బండికి అడ్డురాకండని హెచ్చరిస్తున్నాడు ముత్యాలు. క్రమంగా ఊరు సమీపించడంతో రోడ్డుకి ఇరుపక్కలా ఇళ్ళు కనిపించడం మొదలయ్యింది.

అలా ఎన్నో ఊళ్ళ మీదుగా చాలా దూరం ప్రయాణించింది ఆ గుర్రపుబండి. వెళ్ళగా వెళ్ళగా సముద్రాన్ని సమీపించిన దానికి గుర్తుగా అక్కడక్కడ తాడిచెట్లతో కూడిన బంగన బయళ్ళు, ఆ బయళ్ళలో ఉప్పుకూర దుబ్బులూ కనిపించడం మొదలయ్యింది.

అది చూడగానే, "మనo అంతర్వేది దగ్గరకి వచ్చేశాం" అన్నారు సుబ్బరామయ్యగారు.

ఎదురుగా అల్లంత దూరంగా దేవాలయ శిఖరం కనిపించింది. అందరూ వినయంగా దానికి నమస్కరించారు. కొంచెం దూరం వెళ్ళీసరికి దారి రెండుగా చీలింది. ఒకదారి స్నానాల రేవుకి తీసుకెడితే, రెండోది గుడి వైపుగా వెడుతుంది. గుడివైపుకి కాకుండా స్నానాలరేవు వైపుగా సాగింది బండి. స్నానం చేశాకే కదా దైవదర్శనం!

తనువూ మనసూ కూడా నిర్మలంగా, పవిత్రంగా ఉంచుకుని మరీ దైవ దర్శనానికి వెళ్ళడం అన్నది మన సాంప్రదాయం. అందుకనే గోదావరీ సాగర సంగమ తీర్థంలో ముందుగా స్నానం చెయ్యడానికిగాను స్నానాల రేవులో బండిని ఆపాడు ముత్యాలు. గోదావరి నదిలోని రేవులో స్నానాలకు దిగారు వాళ్ళు. ఆసరికే అక్కడ కొందరు స్నానాలు చేస్తున్నారు.

తన స్నానం చెయ్యడం ముందుగా ముగియడంతో, సముద్రాన్ని చూసివస్తానని, అనుమతికై సుబ్బరామయ్య గారిని అడిగాడు జీవన్.

సుబ్బరామయ్యగారు "సరే" అంటూనే ఎన్నో హెచ్చరికలు చెప్పారు అతనికి, "తొందరపడి నీటి వారకు వెళ్ళకు సుమీ, ఇక్కడ ఉన్నది కత్తెర ఒడ్డు, భద్రం! ఎప్పుడు మట్టిని కెరటం దొలిచేస్తుందో, ఎప్పుడు ఒడ్డు విరిగిపడుతుందో ఎవరికీ తెలియదు. కన్ను మూసి తెరిచేలోగా జరగరాని ఘోరం జరిగిపోతుంది. అలా చూడాలని వచ్చిన వాళ్ళని ఎందరినో ఈ సముద్రం పొట్టనపెట్టుకుంది! జాగ్రత్తసుమీ! మేమిక్కడ తర్పణాలూ అవీ పూర్తిచేసి ఒడ్డుకి వచ్చే సరికి నువ్వు తిరిగి రావాలి" అంటూ అతన్ని సాగనంపారు.

అప్పటికే సూర్యుడు సముద్రానికి మూరెడు పైకి లేచి ఉన్నాడు. సూర్యరశ్మితాకిడికి నీటిలో లేస్తున్న అలలపై బంగారపు మెరుపులు కనిపిస్తున్నాయి. నీటి పక్షులు నీటిమీదకంతా ఎగిరి వెళ్ళి అలలపై తేలిన చిన్న చిన్న చేపల్ని ముక్కుతోపట్టి తింటున్నాయి. కొన్నైతే అలలమీద వాలి నీటిలో తేలుతూ, అలల ఊపులో ఊయలలూగుతూ వినోదిస్తున్నాయి. బెస్తవాడ దగ్గరున్నపడవల రేవునుండి ఉదయమే బయలుదేరి వెళ్లిన వేటపడవలు దూరంగా ఉండడంతో చిన్నవిగా నీడల్లా కనిపిస్తున్నాయి.

ధవళేశ్వరం దగ్గర చీలిపోయిన అఖండ గౌతమి పాయయైన వశిష్ఠగోదావరి, వడివడిగా ప్రవహించి వచ్చి, తూరుపు వాకిలి నున్న, నిరంతరం ఎడతెగని అలల ఉరవడితో ధ్వనించే వినీల సాగరం, బంగాళాఖాతంలో కలిసిన పవిత్ర క్షేత్రం ఈ అంతర్వేది! రెండు అమేయ ప్రకృతి శక్తులు సంగమించినచోట నీటిమీద ఒక విరుపు, గోదావరి నదియొక్క ఈవలి ఒడ్డున మొదలై ఆవలి ఒడ్డువరకూ, స్పష్టాస్పష్టమైన ఒక సరళరేఖలా కనిపిస్తోంది. నదీసాగర సంగమమన్నది సృష్టిలోని ఒక అద్భుత విన్యాసం! మానవుడు ఆ మహా శక్తికి వినమ్రుడు కాక తప్పదు.

ప్రవహించే జీవనదికి, ఎడతెగక సాగే మానవ జీవన ప్రస్థానానికీ సన్నిహితమైన పోలిక ఉంది. మానవ జీవితాన్ని ఒక జీవనదితో పోల్చడ మన్నది, మనకు అనాదినుండీ వస్తున్నఒక ఆచారం. జీవనది యైన గోదావరి నాసికా త్రయంబకం అన్నచోట ఉన్న కొండకోనల్లో ఎక్కడో రాతిగుట్టలమధ్య ఒక చిన్ననీటి ఊటగా ఉద్భవించినా, క్రమంగా పల్లానికి దిగివస్తూ, దారిలో ఎన్నెన్నో సెలయేళ్ళనూ, మరెన్నో నీటి వనరులనూ తనలో ఐక్యం చేసుకుంటూ, క్రమ క్రమంగా పెరిగి పెద్దదయ్యి, ఎల్లకాలాలయందూ నిండుగా ఉన్న నీటితో, ఎడతెగక ప్రవహించే ఒక జీవనదిగా మారి, ఎత్తు పల్లాలను ఏకం చేస్తూ, చెట్టుపుట్టల్ని తనలో చేర్చుకుంటూ, అవిశ్రాంతంగా సాగుతూ, తూరుపు కనుమలను దాటి మైదానంలో ప్రవేశించి, ధవళేశ్వరం అన్నచోట పాయలుగా విడిపోయి వెళ్లి తూరుపు సముద్రంలో ఐదు చోటుల్లో ఐదు పాయలుగా కలిసి పోయింది! అలాగే, సుదీర్ఘమైన తన జీవితకాలంలో పరస్పర విరుద్దాలైన అనేక ద్వంద్వ ప్రవృత్తుల బారినపడి ఎన్నెన్నో ఒదుగులు పోతూ, సుఖ దుఃఖాల గమకాలతో ఏకబిగిని ఎక్కడా ఆగకుండా సాగుతూ, కడదాకా పయనించి ఆఖరుకి మరణంతో తిరిగి పంచభూతాల్లో లయమైపోతాడు మానవుడు! అక్కడితో ముగుస్తుంది మానవ జీవిత మనే మహాప్రస్థానం!

జీవనదిలా ఎడతెగని ఉరవడితో సాగిన ఒక మానవ జీవితాన్ని ఎంచుకుని, అతని జీవన ప్రస్థానాన్ని కథావస్తువుగా తీసుకుని, ఒక మంచి నవల రాయాలనే కోరిక కలిగింది జీవన్ కి. ఆ నవల రాయడానికి ఈ సాగర సంగమ క్షేత్రంలోనే అతని హృదయంలో ఒక బీజం నాటబడింది.

ఆలోచనల్లో పడి పరాకుగా ఉన్న జీవన్ కి, "అబ్బాయి గోరండీ" అన్న పిలుపు దగ్గరగా వినిపించడంతో, ఉలికిపడి తిరిగి చూశాడు. ఎదురుగా ముత్యాలు!

సుబ్బరామయ్య దంపతులు బండి దగ్గర జీవన్ రాకకోసం ఎదురుచూస్తూ నిలబడి, పిలుచుకు రావడానికి ముత్యాలుని పంపారు.

ఆ రోజు పర్వదినం కావడంతో సాగరసంగమ తీర్థంలో స్నానం చెయ్యడానికి జనం చాలామంది వచ్చారు. ఎదురుగా వస్తున్న జనాల్ని తప్పించుకుంటూ జీవన్ వేగంగా బండి దగ్గరకు నడిచాడు.

*       *        *

500 సంవత్సరాలకు పూర్వపు మాటది! ఒక పుణ్యాత్ముడికి ఆ వశిష్ఠ గోదావరి సాగర సంగమ క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని నిర్మించాలన్న కోరిక కలిగింది. ఆలయ నిర్మాణం జరిగాక, వేదపండితులను పిలిపించి స్వామివారికి సమంత్రకంగా ప్రాణ ప్రతిష్ఠ వగైరాలన్నీ జరిపించారు. అది మొదలు అంతర్వేది కోనసీమలో ఉన్న ఒక పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కల్యాణంతోపాటుగా అక్కడ గొప్ప ఉత్సవం కూడా జరుగుతుంది. ఆ సమయంలో దేశం నాలుగు చెరగులనుండి, వేలాది భక్తులు వచ్చి, సాగర సంగమంలో స్నానం చేసి, పునీతులై స్వామివారిని దర్శించి, పూజించి, తరిస్తూంటారు. ప్రతి పర్వ దినానికి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి, సాగరసంగమ పుణ్యతీర్థంలో స్నానంచేసి స్వామిని అర్చించి వెడుతూ ఉంటారు. అక్కడి స్వామి గొప్ప మహిమ గల దేముడని ప్రసిద్ధిపొందాడు. భక్తవత్సలుడు కదా భగవంతుడు ఎప్పుడూ!

సుబ్బరామయ్యగారు తన పేరునా, కొడుకుపేరున అర్చన చేయిస్తే, జీవన్ కూడా తన పేరునా, తన తల్లి పేరునా, యాజులుగారి పేరునా విడివిడిగా పూజలు చేయించాడు. తీర్థ ప్రసాదాలు తీసుకుని వాళ్ళు బయటికి వచ్చారు. జీవన్, అడంగుకి తీసుకెళ్ళడం కోసం నిలవ ఉండే పొడి ప్రసాదాన్ని కూడా తీసుకున్నాడు.

వాళ్ళు గుడినుండి బయటికి వచ్చేసరికి ముత్యాలు బండితో సిద్ధంగా ఉన్నాడు.

బండి ఎక్కబోతూ, సావిత్రమ్మ గారు, "ఇదిగో, మిమ్మల్నే! మనల్ని ఈరోజు సీతమ్మగారు, వాళ్ళిoటికి భోజనానికి రమ్మని పిలిచారు. మరీ ఆలస్యమైతే ఏం బాగుంటుంది! ముందుగా వాళ్ళింటికి పట్టించండి బండిని" అంది.

"ముత్యాలూ! విన్నావుకదా... బండి తిన్నగా కరణంగారి ఇంటికి పోనియ్యి" అన్నారు సుబ్బరామయ్యగారు. ముగ్గురూ ఎక్కగానే బండి కదిలింది.

*       *         *

జీవన్ అంతర్వేది వెళ్ళివచ్చిన మరునాడే మేజర్ గారి దగ్గరనుండి పిలిపు వచ్చింది. జీవన్ ని వెంట తీసుకుని, కావలసిన కాగితాలు పట్టుకుని మేజర్ గారి ఇంటికి బయలుదేరారు కరణం కామేశంగారు.

మేజర్ గారి ఇల్లు - చుట్టూ పెరడు వదలి, మధ్యలో కట్టబడిన పెద్ద మండువా లోగిలి. తండ్రి కట్టించిన పాత ఇంటినే బాగుచేయించుకుని, దానిలోనే ఆధునిక సౌకర్యాలన్నీ ఏర్పరచుకుని, మేజర్ గారు స్వoత ప్లానుతో తీర్చి దిద్దుకున్న ఇల్లది! దానిలోనే మేజరు ఉపేంద్ర శర్మ గారి కుటుంబం ఉంటుంది. మేజరుగారిని గురించిన విషయాలన్నీ కరణంగారు చెప్పేరు జీవన్ కి.

యాజులుగారు వెళ్ళిపోగానే చిన్నబోయిన ఊరు మళ్ళీ మేజరుగారు వచ్చాకే కోలుకుంది. ఆయన పాకిస్థాన్ తో ఇండియాకు వచ్చిన ఒక యుద్ధంలో మేజర్ గా పని చేస్తూ, యుద్ధంలో ఒక కన్నూ, ఒక చెయ్యీ నష్టపోయి, పదవీ విరమణ చెయ్యాల్సి వచ్చింది. ఆ తరవాత స్వంత ఊరుకి వచ్చిన మేజరు గారు, తనకు ఇష్టమైన వ్యవసాయాన్నే ఇకనుండి తన వృత్తిగా ఎంచుకుని, ఆధునిక పద్ధతులతో పిత్రార్జితమైన భూముల్ని వృద్ధిలోకి తీసుకువచ్చి, కొద్ది కాలంలోనే ఆస్తిని రెండింతలుగా పెంచి, ఆ చుట్టుపక్కల అందరిలోకి గొప్ప భూకామందుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు, ఏ రైతుకి ఏ సలహా కావాలన్నా ఆయనదగ్గరకే వస్తారు. ఊళ్ళో ఎవరికి యే అవసరం వచ్చినా ఆయన సాయం కోసం వస్తారు. యాజులుగారిలాగే ఆయనకూడా ఊరందరికీ తలలో నాలుకలా ఉంటారు. అడిగిన వారికి లేదనకుండా వీలైనంత సహకారాన్ని అందిస్తూ, ఆ ఊరు వచ్చిన కొద్దికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు మేజరుగారు. కాని, ఆయన ప్రతిదానిలోనూ డిసిప్లిన్ ఉండాలంటారు. అది ఒక్కటే ఆయనలో జనానికి అంతగా నచ్చనిది. ఆయన క్రమశిక్షణకి బేజారౌతారు ఊళ్ళో వాళ్ళు.

మేజరుగారి ఆవరణలో ప్రవేశించడంతో కరణంగారు మాటలు ఆపేశారు. తను విన్న మాటలనుబట్టి మేజరుగారంటే మంచి గౌరవం కలిగింది జీవన్ కి. వాళ్ళరాక కోసమే ఎదురుచూస్తున్న మేజరుగారు, వాళ్ళు లోనికిరాగానే ఆహ్యానించడానికి లేచి ముందుకి వచ్చారు.

మేజరుగారు చేయెత్తు మనిషి! కండలుతిరిగిన శరీర సౌష్టవంతో, గంభీరమైన విగ్రహం. బుగ్గలవరకు పెరిగిన మీసాలతో ఠీవిగా, దర్జాగా కనిపిస్తున్నారు ఆయన. కళ్ళకి టింటెడ్ కళ్ళద్దాలతో ఉన్న కళ్ళజోడు ఉంది. పొడుగు చేతుల చొక్కా తొడుక్కుని ఉన్నారు. తెగిపోయిన చేతికి జయపూర్ చెయ్యి ఉండడంతో తొలిచూపులో మేజర్ గారికి అంగవైకల్యం ఉన్నదని ఏమాత్రం తెలియదు. మొత్తం మీద చూడగానే గౌరవం కలిగించే నిండైన విగ్రహం ఆయనది.

పరిచయాలు, మర్యాదలు అయ్యి స్థిమితంగా కూర్చున్నాక, మేజర్ గారు అన్నారు...

"ఇన్నాళ్ళకు దిగొచ్చారు యాజులుగారు! ఈ పని ఏనాడో జరిగి ఉండాల్సింది. “ట్రాక్టర్ తో ఏకబిగిని పొలం దున్నడానికి మీ మడిచెక్క మధ్యలో అడ్డుగా ఉంది, అది నాకిచ్చెయ్యవయ్యా మహానుభావా, న్యాయంగా నువ్వేమడిగినా ఇస్తా" అంటూ ఆయన్ని ఎన్నో విధాలుగా బ్రతిమాలాను, కాని ఆయన వినలేదు. అవసరం నాది కనుక ఎక్కువరేటు ఇస్తానని కూడా అన్నా. వేరేచోట ఈ పొలానికి బదులుగా మరో పొలం ఇమ్మన్నా, ఇస్తాననీ అన్నా! ఒప్పుకోలేదు! అలాంటిది అకస్మాత్తుగా ఇప్పుడెందుకని ఇలా అమ్మేయాలని అనుకుంటున్నారు?"

"తాతలనాటి ఈనాం భూములని సెంటిమెంటు! ఇప్పటికి మనసు సరిపెట్టుకోగలిగాడు కాబోలు. నయమేకదా, మీరు కోరుకున్న మడిచెక్క, కాస్త ఆలస్యమైతేనేం, మీ స్వంతమౌతోంది! వెనక మీరు ఆ మడిచెక్క కావాలన్నారనేది యాజులు మర్చిపోలేదు, ముందుగా మీతో చెప్పి, మీరు వద్దంటే మాత్రమే వేరే ఎవరికైనా చెప్పమన్నాడు" అన్నారు కరణంగారు మిత్రుణ్ణి వెనకేసుకుని వస్తున్నట్లు ఎవరికీ తెలియనీకుండా లౌక్యంగా.

"యాజులుగారు ఇప్పుడా సెంటిమెంటు మర్చిపోయి పొలం అమ్మకానికి పెట్టారంటే ఆయనకేదో అర్జంటుగా అవసరం వచ్చి ఉంటుంది. అప్పుడు అవసరం నాది, ఇప్పుడు అవసరం ఆయనది! అలాగని నేనేం తక్కువ చెయ్యను. ఊళ్ళో నారుమడి పోసే పొలాలు ఏ రేటు పలుకుతున్నాయో కనుక్కోండి, ఆరేటునే ఖాయం చేద్దాం. వెనకటిలా ఎక్కువ రేటు పెట్టను, మీకు సమ్మతమైతే "అగ్రిమెంట్" రాసుకుందాం. మూడు లక్షలు ఇప్పుడు ఇచ్చి, తక్కింది రిజిష్ట్రేషన్ సమయంలో ఇస్తాను. ఏమంటారు?"

"మీరు న్యాయమైన రేటు ఇస్తున్నప్పుడు, ఇంక మాటాడవలసింది ఏముంది! ఇవిగో అగ్రిమెంటు పేపర్లు, అక్కడే రాయించి సంతకం చేసి మరీ ఈ అబ్బాయికిచ్చి పంపించాడు యాజులు" అంటూ ఆ కాగితాలు మేజరుగారి చేతికిచ్చారు కరణం గారు.

"ఇంతకీ ఇతను యాజులుగారికి ఏమౌతాడు?" కాగితాలు అందుకుని, జీవన్ వంక తిరిగి అడిగారు మేజరుగారు.

"చిన్నప్పటినుండీ ఇతడు ఆయనకి తెలుసు. యాజులుకి కావలసినవాడు, నమ్మకస్థుడు. లెక్కలతో డిగ్రీ చేసి, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. గోల్డుమెడల్ కూడా వచ్చింది ఇతనికి" అంటూ చెప్పడం ముగించారు కరణంగారు.

మేజర్ గారు జీవన్ తో కరచాలనం చేశారు. ఆపై పేపర్లన్నీ పరిశీలించి బాగానే ఉన్నట్లు తలపంకించి, వాటిపైన సంతకాలు చేశారు. ఇంక సాక్షులు సంతకాలు చెయ్యాల్సి ఉంది.

మేజరుగారు, "సాక్షిసంతకాలు చెయ్యడానికి ఎవరినైనా రమ్మన్నారా" అని కరణం గారిని అడిగారు.

"రామారావుని రమ్మన్నా. వస్తూవుంటాడు. నేను రామారావు పెడతాము సాక్షిసంతకాలు." అన్నారు కరణంగారు.

"కేవలం ఇవి లాంచన ప్రాయాలు మాత్రమే, అవసరాలు కావు. నేను, యాజులుగారూ కూడా మాటతప్పేవాళ్ళం కాము" అన్నారు మేజరుగారు.

అంతలో రామారావు వచ్చాడు. వస్తూనే అతడు పెద్దవాళ్ళకి నమస్కరించి, "బాగున్నారా అబ్బాయిగారూ" అంటూ జీవన్ని కుశలమడిగాడు.

వెంటనే జీవన్, "రామారావుగారూ! మీ బాబు కులాసాయా" అని అడిగాడు.

"అయ్! మర్నాటికే జ్వరం తగ్గిపోయిందండి. ఐతే తమరు వచ్చింది ఈ పనిమీదాండి? చెప్పారే కాదు" అన్నాడు రామారావు. జీవన్ ఏమీ జవాబివ్వలేదు. చిన్నగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అంతలోనే అందరికీ కాఫీలు వచ్చాయి.

కరణంగారూ, రామారావు సాక్షి సంతకాలు చేశారు. అక్కడితో అగ్రిమెంటు రాసుకోడం పూర్తయ్యింది. మేజరుగారు డబ్బుతెచ్చి, లెక్కపెట్టి మూడులక్షలు కరణంగారికి అప్పజెప్పారు. ఎక్కువభాగం బ్యాంక్ నుండి తెచ్చిన కట్టలే కావడంతో, లెక్కించడం సులువుగానే అయ్యింది. డబ్బంతా ఒక సంచీలో ఉంచి కరణంగారి చేతికి ఇచ్చారు మేజరుగారు. అక్కడితో వచ్చిన పని పూర్తి అయ్యింది. అందరూ వెళ్లడానికి లేచారు.

*       *       *

వచ్చిన పని అయ్యింది కనుక ఇక తిరుగు ప్రయాణం అవ్వొచ్చు. ఇంక తను డబ్బు తీసుకువెళ్ళి యాజులు తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన అప్పచెప్పిన పని విజయవంతంగా పూర్తిచేసినట్లే కదా - అనుకున్నాడు జీవన్, డబ్బును పెట్టె అడుగున సద్దుకుంటూ. కాని అదే పెద్దపని! మేజరుగారు ఇచ్చిన దానికి కరణంగారు మరో లక్ష జత చేర్చారు, “కౌలుకిచ్చిన పొలాల తాలూకు శిస్తు” అంటూ. అంత డబ్బు ఎప్పుడూ చూసివుండకపోడంతో, "దీన్ని క్షేమంగా తీసుకెళ్ళి యాజులుగారికి అప్పగించి మాటదక్కించుకోగలనా" అన్న భయంపట్టుకుంది జీవన్ కి. ఒక్కసారి అతడు తన తిరుగు ప్రయాణాన్ని తలుచుకున్నాడు - ముందుగా కాలవ గట్టు వెంట ఒంటరిగా నడిచివెళ్లి బస్సెక్కాలి, తోడుగా ఎవరైనా ఉంటే బాగుండును - అనుకున్నాడు. కాని ఆమాట కరణంగారికి చెప్పడానికి మొహమాటపడ్డాడు. ఆ రాత్రంతా అతనికి సరిగా నిద్రపట్టలేదు. మళ్ళీ వెలుగు వచ్చేసరికే ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చేసింది.

జీవన్ ప్రయాణానికి సిద్ధమై, సీతమ్మగారు ఆప్యాయంగా అందించిన కాఫీ, టిఫిన్లు తీసుకుని వచ్చేసరికి కరణంగారు ఎవరికోసమో ఎదురుచూస్తూ అరుగుమీద ఆత్రంగా పచార్లు చేస్తూండడం కనిపించింది. అంతలో, "అయ్యగోరండీ" అన్న పిలుపు వినిపించింది గేటు బయట. వెంటనే కరణంగారి ముఖం వికసించింది.

"ఆ, వచ్చేశావా! నీ కోసమే చూస్తున్నా" అంటూ కరణంగారు వీధిలోకి వెళ్ళారు.

"ఆయ్! ఆలీసమైనాదండి. నేను బేగే బయలెల్లినా, కానీ, నా ఆడది ఆపేసిందండి, "కూసిన్ని గంజినీలు తాగి ఎళ్లు మావా” అంటా..." ఆమాట చెపుతూ సిగ్గుపడ్డాడు ఆయబ్బి.

"బలేవాడివిరా భీముడూ! అజ్జెప్పడానికి మరీ అంత సిగ్గెందుకురా! కావలసినంత టైము ఉంది బస్సుకి. కంగారేం లేదు. ఈ అబ్బాయిగారు మన యాజులు గారి తాలూకు! ఆయన పనిమీదే వచ్చారు ఇక్కడికి. ఈయన్ని తీసుకెళ్ళి శివాలయం దగ్గర బస్సు ఎక్కించిరావాలి నువ్వు."

"ఆయ్! ఎడతానండి. సామాను ఏపాటి ఉంటాదండి?''

"ఎంతో లేదు. ఈ చిన్న సూట్కేసు, ఓ గోనెమూట - అంతే!"

"ఆయ్" అంటూ తన సమ్మతిని తెలియజేశాడు భీముడు.

కరణంగారు జీవన్ వైపుకి తిరిగి, "బాబూ! ఈ భీముడు సామాను తీసుకుని నీ వెంట వస్తాడు. మంచి నమ్మకస్థుడు, విశ్వాసపాత్రుడు. ఇతనితో కలిసి వెళ్ళు" అన్నారు.

అంతలో నెత్తిమీద గోనె మూటతో వచ్చాడు మల్లేశు. వాడిముఖం చిన్నబోయి ఉంది. వాడు జీవన్ ఇచ్చిన చొక్కా తొడుక్కుని ఉన్నాడు. ఆ చొక్కాజేబులో ఒక ఏభై నోటు కూడా ఉంది. అయినా వాడికి సంతోషంగా లేదు. అబ్బాయిగారు అప్పుడే వెళ్ళిపోడం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు.

చేతిలోని బాణాకర్ర అరుక్కి ఆనించి, భీముడు గోనెమూట తలకెత్తుకున్నాడు. తరువాత సూట్కేసు ఒకచేత్తో, బాణాకర్ర ఒకచేత్తో పట్టుకుని ప్రయాణానికి సిద్ధమైపోయాడు. అందరి దగ్గరా సెలవుతీసుకుని, జీవన్ అతని వెంట నడిచాడు.

కరణంగారు వాళ్ళ వెంట రోడ్డు మీద కొంచెం దూరం వరకూ నడుస్తూ, "జీవన్ బాబూ! యాజుల్ని, చెల్లెమ్మనీ, పిల్లల్నీ అడిగానని చెప్పు. ఆడంగు చేరగానే ఉత్తరంరాయి. నీకు ఇక్కడ వసతిలో ఏమైనా లోపాలు ఉన్నా, మామీద అభిమానముంచి అవన్నీ మర్చిపో బాబూ! ఎప్పుడైనా మనుసు పుట్టినప్పుడు ఒకసారి మళ్ళీ ఇటువచ్చి వెళ్ళు, మమ్మల్ని మర్చిపోకేం! ఇక ఉంటా... " అంటూ సెలవు తీసుకుని అక్కడ నిలబడి పోయారు. వాళ్ళు కనుమరుగయ్యే పర్యంతం అక్కడే నిలబడి, ఆ తరువాత వెనుదిరిగి ఇల్లు చేరుకున్నారు కరణంగారు.

****సశేషం****

Posted in August 2023, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!