20
మరునాడు పొద్దుటే తల్లితండ్రులతో కలిసి కాఫీ సేవించింది మీనాక్షి.
"మీనా నీవు కావాలనుకున్న స్పోర్ట్స్ కార్.. ఈ నెల డెలివెరీ అవుతుందని నోటీసు వచ్చింది. పోతే, రిషిని కాంటాక్ట్ చేసావా లేదా? లేదంటే చేయిరా బంగారం." అన్నారు శ్రీనివాస్.
"సరే, రాధిక వచ్చినట్టుంది. నేను మా ఫ్రెండ్స్ తో గోవా వెళుతున్నాను. మళ్ళీ మాట్లాడుతాను." అంటూ పైకి వెళ్లి, తన ట్రావెల్-బాగ్ తీసుకుని మరోమాట లేకుండా బయటికి వెళ్ళిపోయింది మీనా.
"సరే విమలా! కానివ్వు. మన మీనా పూర్తి స్వేచ్ఛ ఉన్న పాతికేళ్ల యువతి. గోవా వెళ్లి రానీ. నేనైతే, ఇవాళ వాకర్ లేకుండా మన గార్డెన్ లో నడుస్తున్నాను. నా వెంట వేణు ఉన్నాడులే.." అంటూ పైకి లేచాడు శ్రీనివాస్.
***
పరమేశ్వరికి 'లండన్ ఆర్ట్స్ కౌన్సిల్’ నుండి...ఇంగ్లాండ్ పర్యటన గురించిన ప్రతిపాదన అందింది. ఓ ఏడాది పాటు ‘టీచింగ్ ప్రొఫెసర్’ గా కూడా ఆహ్వానిస్తూ ఆరు నగరాల్లో కర్ణాటక కచేరీలకి ఒప్పందం జత పరచిన డాక్యుమెంట్ పంపారు. పరిశీలించి తమకి జవాబు ఇవ్వమని కోరారు. ఈ విషయమై అమ్మా, అమ్మమ్మా, తండ్రితోనూ సంప్రదించింది పారూ.
పునీత్, జననీ సంతోషాలకి అంతే లేదు. "అక్కా! హాయిగా ఇంగ్లాండ్ చుట్టేసి రా. నీవు నిజంగా గ్రేట్. నీవు లేని లోటు ఇక్కడ తెలియకుండా మేము చూసుకుంటాముగా" అని హామీ ఇచ్చారు.
సీతమ్మ గారు ఇంగ్లాండ్ పర్యటన విషయం సుదీర్ఘంగా అలోచించి, "మీ అమ్మని కూడా ఈ ప్రతిపాదనలో పెట్టమని అడుగమ్మా పారూ! శాంత మ్యూజిక్ కాలేజీ లెక్చరర్ గా పని చేసింది. ఆమె బయో-డేటా పంపించు. మీ అమ్మ ప్రావీణ్యత ఉన్న గాయని. ఇప్పుడు అవకాశం ఉంది కనుక మీ అమ్మ విషయంలో నీవు ప్రయత్నం చేయాలి." అంది పారూతో.
ఆ చక్కని ఆలోచన పట్ల హర్షాన్ని వెలిబుచ్చింది పారూ.
***
'ఆలయనాదాలు' సెట్స్ మీద.. ఉన్నట్టుండి కోలాహలం మొదలయింది. షూటింగ్ పని ఆపేసారు. లాప్-టాప్ మీద లైవ్-న్యూస్ ఛానల్ పెట్టారు స్టాఫ్.
"బ్రేకింగ్ న్యూస్ - ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీనివాస్ మూర్తి గారు అరెస్ట్ అయ్యే అవకాశం. ఆయన కుమార్తె మీనాక్షి చేసిన 'గృహ హింస' ఆరోపణలపై ... మరో ఇరవైనాలుగు గంటల్లో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం...ఉందని ఇప్పటివరకు అందిన సమాచారం" ...
అన్న ప్రకటన విన్నవారు నిర్ఘాంతపోయారు.
ప్యాక్-అప్ చెప్పారు డైరెక్టర్ గారు. కళ్లనీళ్లు పర్యంతమవుతూ పారూ రామనాథం గారికి ఫోన్ చేస్తే, నేరుగా శ్రీనివాస్ గారి ఇంటికే రమ్మన్నారాయన.
***
వెళ్ళేప్పటికీ హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు శ్రీనివాస్ గారు. విమల వంటింట్లో ఉన్నారు.
"బాబూ శ్రీనివాసూ... ఎలా ఉన్నావు?” అంటూ ఆయనకి ఎదురుగా సోఫాలో కూర్చున్నారు సీతమ్మ.
"ఏముందమ్మా! .. పిల్లల తీరుతెన్నులు మన చేతుల్లో లేవుగా. నేను బాగున్నాను. వాకర్ లేకుండా నడవగలుగుతున్నాను." అన్నారు.
అక్కడినుండి వంటింట్లోకి వెళ్లిన పారూ.."నేను సాయం చెయ్యనా.. ఆంటీ? అనడిగింది విమలని.
"నువ్వా పరమేశ్వరి. మీ తాతయ్యా వాళ్ళు వస్తారంటే... ఏదో వంట ప్రయత్నం. అంతే." అని ఆమె అంటుండగానే.. హాల్లో రామనాధం గారి గొంతు వినబడింది. కిచెన్ నుండి పారూ, విమల కూడా హాల్లోకి నడిచారు.
"ఏమిటయ్యా శ్రీనివాసు! ఇదో కొత్త రకమైన హడావిడి మనకి. ఏమిటట మీనమ్మ గొడవ? ఏమ్మన్నా అవసరం ఉంటే చెప్పు. మనకి అందరూ తెలుసును. ఫోన్లు చేద్దాం. ఏమ్మా విమలా! ఏమిటి నీ ఆలోచన?" అన్నారు రామనాధం గారు.
"ఏముంది బాబాయ్ గారు! మీనాక్షికి తన గొడవ తనదే. వాళ్ళ డాడీ ఓ మంచి సంబంధం చూసి, ఆ అబ్బాయిని కలసి, అభిప్రాయం చెప్పమన్నారు. గోవాకి వెళతానంటూ కోపంగా వెళ్లిపోయి రెండురోజుల్లో వచ్చేసింది. మమ్మల్ని అనరాని మాటలంది..ఆయన్ని చేతకాని వాడని తిట్టింది. బిడ్డ కోరికలు తీర్చలేని తల్లితండ్రులు ఉన్నా లేకున్నా ఒకటేనంది. ఒక మాట కాదు….” అని చెబుతూ వేదన భరించలేనట్టుగా కొద్ధి క్షణాలు మౌనం వహించింది.
“…. ఆమె కోరుకున్న వాడినే తెచ్చి పెళ్ళిచేయాలట. లేకపోతే, తండ్రి పరువు తీస్తానని, తను చస్తానని బెదిరించింది,” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది విమల.
పక్కనే ఉన్న వకుళ ఆమెని ఓదార్చింది. "మీనా కోపతాపాలు మనకి తెలిసినవే కదా. ఏమైనా, మీ మధ్య ఉండవలసిన ఈ గొడవని, పోలీస్ వరకు ఎందుకు తీసుకువెళ్లినట్టు? అంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకుంది?” నెమ్మదిగా తగ్గుస్వరంలో అడిగింది వకుళ.
మౌనం వీడిన శ్రీనివాస్ గారు "ఏం చెప్పనమ్మా? నాలుగు రోజులు ఓపిక పట్టాక, మీనా మితిమీరిన చేష్టలు, బెదిరించడాలు, భరించలేక పోయాను. భయపడితే లాభంలేదని, ఓ సగటు తండ్రిలా వ్యవహరించాను. నా ఆధీనంలో ఉన్న దాని బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, కార్లని కంపెనీకి తరిలించి, గట్టిగా మందలించేసరికి.. మొన్న రాత్రి తన ఫ్రెండ్స్ వద్దకి వెళ్ళిపోయింది. ఇవాళ ఇదిగో ఇదీ న్యూస్. అన్నింటికీ రెడీ అయిపోయాను." అన్నారు ఉదాసీనంగా. అందరూ మౌనంగా ఉండిపోయారు.
***
కాసేపటికి, శ్రీనివాస్ గారు .. "ఆకలేస్తుంది.. పదండి లంచ్ చేద్దాము" అనడంతో అందరిలో కదిలిక వచ్చింది. అందరూ ఏదో తిన్నామనిపించారు.
రామనాధం ... సీతమ్మ వద్దకి వచ్చి, "మీరు గెస్ట్-హౌజ్ కి వెళ్ళండి వదిన గారు. మీకు రెస్ట్ అవసరం. మళ్ళీ రేపటి నుండి పారూకి పనుంటుంది. ఇక్కడ తోడుగా మేముంటాము లెండి" అన్నారు.
***
న్యూస్ అప్డేట్... అంటూ....రాష్ట్రంలోనే ప్రముఖ వ్యాపారవేత్త - శ్రీనివాస్ మూర్తి v/s మీనాక్షి మూర్తి ...అనే శీర్షికన మీడియా.. సమాచారాన్ని అందజేస్తూనే ఉంది.
‘మీనాక్షి తన తండ్రి శ్రీనివాస్ మూర్తి పై జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గృహహింస ఫిర్యాదుపై కేసు నమోదు. అనారోగ్య కారణాల వల్ల... వైద్యుల సర్టిఫికెట్ ఆధారంగా... పోలీస్ వారే ఇంటికి వెళ్లి, ఆయన్ని కొన్నిగంటలు సేపు ప్రశ్నించి సమాచారం రికార్డు చేశారు’ అని వార్త.
.... మీనాక్షి ఫిర్యాదు వివరాలని కూడా బహిర్గతం చేసింది మీడియా....
‘తండ్రి తనకి బలవంతపు పెళ్లి చేయడానికి తన స్వేచ్చని హరించి, మానసికంగా హింసకి గురిచేస్తున్నాడని, తన ఆర్ధిక స్వాతంత్రాన్ని కూడా హరించాడని’ మీనాక్షి తండ్రిపై మోపిన ఆరోపణ’లని కూడా వివరించారు.
***
మరునాడు పొద్దుటే పారూ స్టూడియోకి వెళ్లేందుకు తయారవుతుండగా.. 'తాను హైద్రాబాదు వచ్చి మామయ్య వద్ద ఉన్నానని తీరిక దొరకగానే మాట్లాడుతానని' మెసేజ్ పెట్టాడు కిరణ్.
పారూ కలవరాన్ని చూసి... "పదమ్మా! అన్నిటికీ ఆ దైవమే ఉన్నాడు. ఏమీ పర్వాలేదు. పనిలో నిమగ్నమయిపో. రేపటి రోజు ఓ కొత్త ఉదయం. చీకటిని పారద్రోలే వెలుగు రావాల్సిందే." అన్న అమ్మమ్మ మాటలు పారూ పై మంత్రం వేసినట్టుగా పనిచేసాయి.
రోజంతా పనిలో మునిగిపోయింది. అలిసిపోయి ఇల్లు చేరాక, త్వరగా పడుకుండి పోయింది కూడా.
***
పొద్దుటే ఆరింటికల్లా అమ్మమ్మకి చెప్పి, ట్రాక్ మీద నడిచి వద్దామని ఇంటి తలుపులు తీయగానే ఎదురుగా ఇంటి మెట్లెక్కుతున్న కిరణ్ కనబడ్డాడు.
"పద.. నేనూ నీతో పాటు పరిగెడతా" అంటూ పారూ చేయి పట్టి వేగంగా ట్రాక్ మీదకి నడిచాడు. శ్రీనివాస్ గారి విషయంలో తాజాగా జరిగిన విషయాలని ఏకరవు పెట్టాడు కిరణ్. "నమ్మవు పారూ. ఆ స్టుపిడ్ మీనాక్షి … ఆ రంజిత్ గాడి ఇంట్లోనే ఉంది. ఇదంతా వాడి ప్రభావమే అని నా అనుమానం. మొత్తానికి.. ఫోన్ చేసి బయటకి తీసుకెళ్లి మాట్లాడాను. మామయ్య పైన పెట్టిన కేసు డ్రాప్ చేయమని అడిగాను. పెళ్లి చేసుకోడం ఇష్టం లేకపోతే మానేయమన్నాను. మామయ్యతో ప్రాబ్లెమ్ ఉంటే నాతో చెప్పమన్నాను. దాంతో ఆలోచనలో పడింది.” అంటూ పారు చేతిలోని వాటర్ బాటిల్ తీసుకున్నాడు.
మరేమైందని అడిగిన పారూ చెక్కిలిపై చిటికేసి... "ఏమవుతుంది? అర్ధరాత్రి ఫోన్ చేసి తండ్రిపై పెట్టిన క్రిమినల్ కేసు డ్రాప్ చేస్తానంది. ఇవాళ తనని మామయ్యా వాళ్ళింటికి తీసుకెళ్లి... మధ్యవర్తిత్వం చేస్తాను. ఇద్దరూ ఏదో ఒక ఒప్పందానికి వస్తారు. రావాలి." అంటూనే కాస్త ఉదాసీనంగా మారాడు.
"ఏమైంది బావా! కాసేపు ఇలా కూర్చుందాము" అంటూ పక్కనే ఉన్న బెంచ్ వద్దకు తీసుకు వెళ్ళింది. కిరణ్ కళ్ళు తుడుచుకోడం చూసి కంగారు పడింది.
"ఏమి లేదు. మామయ్యకి, అత్తయ్యకి కూతురి వల్ల ఇంత కష్టమేమిటా అని బాధగా ఉంది పారూ." అంటూ క్షణం సేపు కళ్ళు మూసుకున్నాడు.
"అర్ధం చేసుకోగలను బావా! వారికి అండగా మనం ఉన్నాముగా. వీలు చేసుకుని ఆదివారాలు వెళ్లి వారిని కలుస్తుంటాను. సరేనా? నీవిలా బాధపడకు." అంటూ అతన్ని శాంతపరచాలని ప్రయత్నించింది.
కాసేపటికి కోలుకున్న కిరణ్, "ఇంకా నయం.. మన కుటుంబాలు కలిసారన్న విషయం, పెళ్లి సంబంధం ఖరారైన విషయం ... మామయ్యా వాళ్లకి తెలియదు. కొంత ఆగి, మన రెండు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్ధం ప్లాన్ చేద్దాము. ఈలోగా నీవు నీ ఇంగ్లాండ్ టూర్.. కూడా ప్లాన్ చేసుకో. నేను నా మాస్టర్స్ కాస్త ముందుగానే పూర్తి చేసే పని మీద ఉంటాను. ఏమంటావ్? అడిగాడు కిరణ్.
"నిన్నటినుండి నాదీ ఇదే ఆలోచన. ఐ లవ్ యు బావా!" అంటూ పైకి లేచి కిరణ్ కి చేయందించింది పారూ.
***
‘ఆలయనాదాలు’ షూటింగ్ పని…. స్టూడియో నుండి వరంగల్ అవుట్-డోర్ కి మార్చడంతో, పారూ, సీతమ్మ వరంగల్ వెళ్లిపోయారు.
మీనాక్షి విషయానికి వస్తే.. కిరణ్ నిర్దేశించిన సమయానికి తండ్రి పై మోపిన పోలీస్ కేసుని డ్రాప్ చేసి, రంజిత్ కారులోనే తల్లితండ్రుల ఇంటికి వచ్చింది.
అప్పటికే అక్కడికి చేరిన కిరణ్ సమక్షంలో... తన కారుని, రెండు బ్యాంకు అకౌంట్లని అడిగి తీసుకుంది. ముగ్గురినీ ఉద్దేశించి... "మీ ముగ్గురూ నన్ను బాధించారు. నా మనసు తెలుసుకోలేని బావ.. నా ఇష్టాయిష్టాలు తెలిసినా ... వేరెవరినో పెళ్ళడమంటూ ఒత్తిడి చేస్తున్న తల్లితండ్రులు. నిజానికి మీదే అనాలోచిత ప్రవర్తన. నాది కాదు. మీతో ఈ ఇంట్లో ఉండలేను. నేను విడిగానే ... వేరే ఇల్లు తీసుకునుంటాను." అంటూ... లేచి కారులో వెళ్ళిపోయింది మీనాక్షి.
మీనాక్షి ఆలోచనలని, ఆరోపణలని జీర్ణించుకోలేక పోయారు ఆ ముగ్గురూ కూడా. ఆమె వితండవాదానికి సంజాయిషీ ఇచ్చుకోలేని పరిస్థితికి వాపోయారు.
ముందుగా తేరుకుని "మామయ్యా! బాధ పడకండి. అసలింటికి వస్తుందా? ఈ కేసు వెనక్కి తీసుకుంటుందా అనుకున్నామా? అలాంటిది ఆ రెండూ జరిగాయి కదా! కానివ్వండి. మీనా తన జీవితాన్ని తనకిష్టమైనట్టు మలుచుకోనివ్వండి. మీరు వీలయినంత ప్రశాంతంగా ఉండండి. ఏదైనా మీతో తెగతెంపులు చేసుకోలేదు కనుక అన్నీ సర్దుకుంటాయి" అంటూ వారిని ఉత్సాహాపరిచి, భోంచేసి వెళ్ళాడు కిరణ్.
***
పోలీస్ కేసు నుండి శ్రీనివాస్ గారికి స్వేచ్ఛ దొరికినందుకు అందరిలో ప్రశాంతత నెలకొంది. మీనాక్షి తల్లితండ్రుల్లో మాత్రం తమ బిడ్డ జీవితం ఏమవుతుందో అన్న దిగులు మొదలయింది. రంజిత్, రాణీల స్నేహం మానుకోమని ... పలుమార్లు కిరణ్ హెచ్చరించినా లెక్కచేయని కూతురిని ఎలా రక్షించుకోవాలో తెలీక కృంగిపోసాగాడు శ్రీనివాస్.
***
వరంగల్ నుండి తిరిగి వచ్చాక, ఆదివారం పొద్దుటే లేచి స్నానపానాదులు ముగించుకుని .. అమ్మమ్మకి చెప్పి నేరుగా శ్రీనివాసు గారి ఇంటికే వెళ్ళింది పారూ. హాల్లో విమల గారితో పాటు ఆయన కూడా టీవీ చూస్తున్నారు.
"మీ ఇద్దరికీ శుభోదయం. ఎలా ఉన్నారు? ప్లాన్ ప్రకారం మనం ఈ రోజు ముందు గుడికి, తరువాత లంచ్ కి. ఆ తరువాత మీ ఇష్టం." అంది పారూ వారికెదురుగా సోఫాలో కూర్చుంటూ.
"పరమేశ్వరీ! అలాగేనమ్మా. కాఫీ తాగి బయల్దేరుదాము." అంది విమల.
***
అమ్మవారికి, ప్రత్యేకంగా నేయించిన చీర-సారె సమర్పించి, అర్చన చేయించారు శ్రీనివాస్ దంపతులు. తీర్థప్రసాదాలు తీసుకుని, ఆలయ ప్రాంగణంలో ఓ పక్కకి, విశ్రాంతిగా కూర్చున్నారు ముగ్గురూ. కాసేపట్లో మొదలవబోయే ‘గీత ప్రబోధకి’ పక్కనే ఉన్న హాల్లోకి జనం వెళుతున్నారు.
"మీరు మెల్లగా రండి. నేను లోనికి వెళ్లి హోమం విషయం పంతులుగారితో మాట్లాడాలి." అంటూ వెళ్ళింది విమల.
పారూ నుండి కొబ్బరి ముక్కలు అందుకున్న శ్రీనివాస్ గారు, ఆమె రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకున్నారు. కన్నీటి పర్యంతమవుతూ పారూ వంక చూసారు.
“అమ్మా పరమేశ్వరీ! నా కళ్ళకి ఈ రోజు నీవు అమ్మవారిలాగానే ఉన్నావు. ఈ రోజు నీతో గడిపే సదవకాశం కూడా ఆ దేవతే మాకు కల్పించిందేమో!” క్షణం సేపు కళ్ళు మూసుకున్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకోడానికి ప్రయత్నిస్తున్నారు. మీనాక్షి భవిష్యత్తు పట్ల ఆందోళనగా ఉందన్నారు.
“మీనాకి … మా డబ్బు తప్ప మేము ఏమీ ఇవ్వలేము. ఒత్తి అభాగ్యురాలు. నీ మాట సాయం వల్ల ఆమె జీవితం మెరుగయ్యే అవకాశం ఉంది. ఒక్క ప్రయత్నం చేసి చూడమ్మా! కిరణ్ తో మాట్లాడు. అతను మనసు మారి మీనాక్షి తో పెళ్ళికి ఒప్పుకుంటాడేమో.. అని నా ఆశ. అది నెరవేరితే మా జీవితాల్లోకి సుఖశాంతులని తేగలవు తల్లీ!" అంటూ చేతులు జోడించి నమస్కరించారు.
నివ్వెరపోయింది పారూ. తల గిర్రున తిరిగినట్టయ్యి... తెలియని ఉద్వేగంతో, ఆమె కళ్ళనిండా నీళ్ళు నిండాయి. గుండెల నిండా గుబులు కమ్ముకున్నట్టయి బాధతో తల వంచుకుందామె.
ఆలయంలో నుండి బిగ్గరగా వినవచ్చిన శంఖారావంతో తేరుకున్న పారూ ... దిగాలుపడి కూచునున్న శ్రీనివాస్ గారి వంక చూసింది. ఆయన అభ్యర్ధనలో బలహీనపడిన ఆయన మనస్థితి అర్ధమయిందామెకి. నీట మునిగేవాడు గడ్డిపరకనైనా ఆశ్రయిస్తాడన్నట్టు, ఆయనలా చేతులు జోడించి ... తమ జీవితాలని చక్కదిద్దమనడం ఊహించలేని విషయమే ననుకుంది పారూ.
ఆయన స్థితికి జాలిపడాలో... లేక... తన దుస్థితికి ఆందోళన చెందాలో తెలీలేదు పారూకి. పక్కనే ఉన్న చేతికర్రని అందించి... ఆయనకి పైకి లేచేందుకు సాయం చేసింది.
***
ఓ గంటసేపు సాగిన గీతబోధ కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ, గుడి నుండి ఇంటి దారి పట్టారు వారు. పారూ మనస్సులో అలజడిగా అశాంతిగా ఉంది.
వారితో.. మరికాసేపు గడిపి ఇలు చేరాక దిగులుగా, పరధ్యానంగా ఉండిపోయింది పారూ. రాత్రంతా నిద్ర పోకుండా ఇల్లంతా పచార్లు చేసింది. ఇది గమనించిన సీతమ్మ గారు... మనమరాలిని నిలదీయడంతో.. గుడిలో జరిగిన సంఘటన, శ్రీనివాస్ గారితో సంభాషణని... ఆమెకి వివరించింది.
సీతమ్మ కాసేపు ఆలోచించారు. "కిరణ్ తో నీకు నిశ్చితార్థం జరిపేందుకు... ఇరు కుటుంబాలు సంసిద్దమౌతున్నాయని ఆయనకి తెలియక పోవడమే కాక మీనాక్షి విషయంగా తీవ్ర ఆందోళనలో ఉన్నందువల్లనే నిన్నలాటి సాయం కోరారు.
పుట్టినప్పటి నుండీ కిరణ్ కి మీనాక్షి తెలుసును. అయినా కిరణ్ నిన్ను, నీ కళని, వ్యక్తిత్వాన్ని ప్రేమించాడు. అతని ప్రేమను పొందడం నీ అదృష్టం. నీ అదృష్టాన్ని పదిలంగా కాపాడుకో.
శ్రీనివాసు గారు శారీరికంగా, మానసికంగా కోలుకుంటారు. వారిప్పుడు ఓ సంక్షోభంలో ఉన్నారు. అంతా సర్దుకుంటుంది. ఆలోగా... నీవు నీ పనిపై, నీ లండన్ ప్రతిపాదన పై దృష్టి పెట్టు. ఏదెలా జరగాలో అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదని నా నమ్మకం తల్లీ!" అని పారూకి సద్బోధ చేశారామె. అమ్మమ్మ చెప్పింది అర్ధం చేసుకుంది పారూ.
శ్రీనివాస్ గారి పరిస్థితి గురించి కిరణ్ తోనూ అన్నది. "బావా!. ఆయన ప్రస్తుత స్థితికి నేను కూడా ఓ కారణమేమో అని బాధగా ఉంది." అంటూ భావోద్వేగానికి గురయింది.
"పారూ! ఆపు. ఇలా ఆలోచిస్తావని ఊహించలేదు. తమ కూతురి విషయంలో క్రమశిక్షణ లేని పెంపకం, దానికన్నా ఎక్కువ మీనాలోని మెండితనమే.. ఈనాటి వారి పరిస్థితికి కారణం.
నేనైనా, నీవైనా చేయగలిగినంత చేస్తాము. మనమేమీ దేవుళ్ళం కాము. మంచి మనస్సుతో సాయం చేయి. తలరాతలు మార్చడానికి ప్రయత్నించవద్దు. తెలిసిందా? ఈ విషయాలు పక్కకి పెట్టి... నీవు నీ ఇంగ్లాండు పర్యటన పై దృష్టి పెట్టు. ఐ లవ్ యు పారూ!” అంటూ ఫోన్ పెట్టాడు.
***
ముందుగా, లండన్ ఆర్ట్స్ కౌన్సిల్ వారి ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది. తల్లి శాంత రామ్‌కుమార్ బయో-డేటా కూడా జత చేసి.. తామిద్దరికీ, సంగీత శిక్షణ నిచ్చే ఆసక్తి ఉందన్న.. మనవి కౌన్సిల్' ప్రతినిధికి తెలియజేసింది పరమేశ్వరి.
అప్పుడప్పుడు శ్రీనివాస్ గారి మాటలు పారూ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ‘తనకి, మీనాక్షికి ఎక్కడి పోలిక? ఎందులో పోలిక? అదృష్టాలని, అవకాశాలని కాలదన్నుకొంటున్న మీనాక్షికి, మధ్య తరగతి అమ్మాయిగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని... అంకిత భావంతో పాటుపడే తనకి పోలికా?
బావ ప్రేమని బలవంతంగా సొంతం చేసుకోవాలనుకొనే ఆమెతో ... బావ ప్రేమ ఒక వరం అని భావించే తనకి పోలిక ఎక్కడ?’ అని బాధ పడింది పారూ.
'అయినా సరే... శ్రీనివాస్ గారి పరిస్థితి మెరుగుపడాలి, ఆ దంపతుల జీవితాల్లో సంతోషాలు తిరిగి రావాలి' అని ఆ దేవుణ్ణి మనసారగా ప్రార్ధించింది పారూ.
***
మరో నాలుగు వారాలకి ఆలయనాదాలు టెలీఫిల్మ్ పని ముగిసింది. హైదరాబాదు నుండి పారూ, సీతమ్మలు కాకినాడకి తిరిగి వచ్చేసారు.
ఇంగ్లాండ్ పర్యటన విషయంలో... పరమేశ్వరి ప్రతిపాదనలకు సమ్మతి తెలుపుతూ, శాంత రామ్‌కుమార్ ని రెండవ కర్ణాటక సంగీతకారిణిగా చేర్చి, మార్పులతో … ‘ఆర్ట్స్ కౌన్సిల్’ పంపిన కొత్త ప్రతిపాదన డాక్యుమెంట్ అందుకుంది పారూ.
ఐదు నగరాల్లో మ్యూజిక్ వర్క్-షాప్ నిర్వహించేందుకు, స్థానిక వాద్యకారులతో సాధన చేసేందుకు, యేడాది సమయంలో పలు సంగీత కచేరీలు చేసేందుకు... ఒప్పందం కుదుర్చుకున్నారు శాంతా, పరమేశ్వరి. ఏడాది పాటు వారు నిర్దేశించిన వేతనాలకు సమ్మతిని తెలిపారు.
***
'లండన్ ఆర్ట్స్ కౌన్సిల్' ఆధ్వర్యంలో జరగనున్న వారి ఇంగ్లాండు పర్యటన వివరాలని.. రామ్‌కుమార్ ప్రెస్-నోట్ గా అందించడంతో... తల్లీ కూతుళ్ళకి అభినందనల వెల్లువ మొదలయింది.
వారి సంగీత జీవన ప్రస్థాన నేపధ్యం ... ఒక సంచలనమే అయింది.
తన స్నేహితురాలు శాంత ... ఓ సంగీత విద్వాన్ గా ఇంగ్లాండ్ పర్యటన చేయనున్నదని విని మాలిని ఆనందంతో ఉప్పొంగిపోయింది. "నీ లోని విద్వత్తుకి తగిన గుర్తింపు ఇప్పటికైనా దక్కినందుకు ఆనందంగా ఉంది" అంటూ ఆమెని హత్తుకుని అభినందనలు తెలిపింది.
***
ఉగాది పండుగ సెలవుల్లోనే తమ పయనానికి తేదీ నిర్ణయించుకోవడంతో, రామ్ కుటుంబమంతా పండుగకి హైదరాబాదు చేరి, శ్రీ క్రియేషన్స్ కచేరీ చేసుకుని, బంధువులతో ఉగాది పండుగ జరుపుకుని ... లండన్ కి బయలుదేరిపోయేలా ఏర్పాటు చేసుకున్నారు.
****సశేషం****
రచయిత్రి పరిచయం ....
‘నాట్యభారతి’ ఉమాభారతి - నర్తకి, నృత్య గురువు, నటి, రచయిత్రి, టీ.వి చిత్ర దర్శక-నిర్మాత
కూచిపూడి, భరతనాట్యం నృత్యాలలో నిష్ణాతురాలు ఉమాభారతి. నాలుగు దశాబ్దాలుగా దేశవిదేశాల్లో కూచిపూడి నృత్య విస్తరణకు కృషి చేసి ఆ కళకు వన్నె తెచ్చిన మేటి నర్తకిగా, గురువుగా ఖ్యాతి గడించారు ఆమె. పద్నాలగవ యేట అఖిలభారత కూచిపూడి నృత్య పోటీలో గెలుపొంది, 1977 లో ప్రపంచ సాంస్కృతిక సభలచే ఆహ్వానింపబడి, ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక విభాగం వారిచే సాంస్కృతిక రాయబారిగా పరిగణింపబడిన అప్పటి యువ నర్తకి, ఉమాభారతి.
1970 లో ‘కూచిపూడి రంగప్రవేశం’ గావించి, 20 సంవత్సరాల వయసుకే విదేశీ పర్యటనలు, జాతీయ అంతర్జాతీయ గుర్తింపు, సినీ రంగ ప్రవేశం, చిత్ర నిర్మాణం కూడా చేపట్టి కళారంగంలో ఎనలేని కీర్తినార్జించింది ఉమాభారతి.
బాలనటిగా ‘సుడిగుండాలు’ చిత్రంలో, కథానాయకిగా ‘చిల్లరదేవుళ్లు’ చిత్రంలో, ఊర్వశి గా NTR సరసన ‘యమగోల’ చిత్రంలో నర్తించిన ఉమాభారతి 1976 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి కోసం విద్యార్ధి దశలోనే ‘భారతీయ నృత్య రీతులు’ అనే 30 నిముషాల డాక్యుమెంట్రీ నిర్మించారు.
సేవే ధ్యేయం, నృత్యం మార్గంగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా… విద్యానిలయాల నిర్మాణాలకి, వరద బాధితుల నిధికి, నేత్రదాన శిబిరాలకి, 2 వ తెలుగు ప్రపంచ సభలకు, ‘రామసుబ్బయ్య పేద విద్యార్ధుల స్కాలర్షిప్ ఫండ్’ కు స్వచ్చందంగా నృత్య కార్యక్రమాలను చేసారు.
సౌతాఫ్రికా, మారిషస్, సెషిల్స్ ఆంధ్ర మహాసభల నిర్వహణలో నృత్య ప్రదర్శనల ద్వారా ఆలయ నిర్మాణ నిధులకి, తెలుగు భాషా-సంస్కృతి ప్రాచుర్యం పెంపొందించే కార్యక్రమాలకి నిధులు సేకరణకి నృత్య ప్రదర్శనలు చేశారు.
అమెరికా లోని వివిధ (25) దేవాలయ నిర్మాణ సంస్థల నిధుల సేకరణార్ధం సాంస్కృతిక పర్యటనలు నిర్వహించారు. 1982 లో హూస్టన్ లో అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ స్థాపించి ప్రవాసాంధ్రుల యువతకి నృత్యశిక్షణ కొనసాగిస్తూ జెమిని టి.వి కి ‘అలయనాదాలు’ టెలీ సీరియల్ నిర్మించి దర్శకత్వం వహించారు.
ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న కృషికి గుర్తింపు:
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేతుల మీదగా స్వర్ణకంకణం, ‘నాట్యభారతి’ అనే బిరుదు, పాండుచేరి గవర్నర్ నుండి L.V.R ఫౌండేషన్ వారి ‘రాజ్యలక్ష్మి అవార్డ్’. ‘వంశీ’ వారి ‘ఉత్తమ ప్రవాసాంధ్ర కళాకారిణి’ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సినీ గోయర్స్ వారి ‘జవహర్లాల్ నెహ్రూ సెంటినియల్ అవార్డ్, U.S.A హూస్టన్ ‘ఏషియన్ విమెన్స్ వారి ‘వుమన్ ఆఫ్ ది ఇయర్ ’ అవార్డ్, ‘TANA’ వారి సాంస్కృతిక పురస్కారం... ఆమె అందుకున్న కొన్ని పురస్కారాలు.
రచయిత ఉమాభారతి:
తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువతో 2012 నుండీ నృత్యేతర రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టి ఉమా రాసిన కథానికలు, కవితలు, నృత్యనాటికలు తెలుగునాట ప్రముఖ పత్రికల్లోను, పలు అంతర్జాల పత్రికల్లోను ప్రచురించబడ్డాయి. విదేశీ కోడలు – కధా సంపుటి (2013), ఎగిరే పావురమా – నవల (2015), సరికొత్త వేకువ – కధా సంపుటి (201 7), వేదిక – నవల (2016), నాట్యభారతీయం – వ్యాసా సంపుటి (2018) ..ఇప్పటివరకు పుస్తక రూపంగా వంగూరి ఫౌండేషన్ వారి ప్రచురణాలగా వెలువడిన గ్రంధాలు. నాట్యభారతి ఉమాభారతి కధలు – కధా సంపుటి (2023) లో వెలువడింది.
ఆమె తాజా నవల ‘హృదయగానం – నేడే విడుదల’ – నవల (2024) లో సిరికోన సాహిత్య అకాడెమీ వారి ఉత్తమ నవలగా గెలుపొంది, ‘జొన్నలగడ్డ రాంభొట్లు, సరోజమ్మ స్మారక పురస్కారం’ అందుకుంది.
నృత్య నాటికలకు గుర్తింపు:
ఆమె రచించి, నిర్వహించిన ‘భరతముని భూలోక పర్యటన’ ‘పెళ్లి ముచ్చట’, ‘మానసపుత్రి’, ‘లయగతులు’, ‘తెలుగింటి వెలుగు’ నృత్యనాటికలకి అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ వారి ఉత్తమ ప్రదర్శన అవార్డు, సృజనాత్మకతకి గుర్తింపు పొందారు.
విద్యాభ్యాసం: M.A (Pol. Science) – Osmania Universisity
కుటుంబ నేపధ్యం: తల్లితండ్రులు: కీ. శే. మేజర్ సత్యనారాయణ, కీ. శే. శ్రీమతి శారద.
భర్త: డా. మురళి మోహన్ కోసూరి, సంతానం: డా. సత్యజిత్, డా. శిల్ప-సంతానం.
కూచిపూడి గురువులు – పద్మశ్రీ వెంపటి చిన్నసత్యం, ‘కళాప్రపూర్ణ’ శ్రీ వేదాంతం జగన్నాధ శర్మ
భరతనాట్యం గురువులు – పద్మశ్రీ ఫకీరుస్వామి పిళ్ళై, కళైమామని శ్రీ. టి.ఆర్. రాధాకృష్ణన్