Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

అభ్యుదయ మరియు భావకవి “దేవరకొండ బాల గంగాధర తిలక్”

దేవరకొండ బాలగంగాధర తిలక్ పేరు గుర్తు చేసుకున్న వెంటనే గుర్తుకు వచ్చే కవితా సంకలనం "అమృతం కురిసిన రాత్రి". తన అక్షరాలను వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా చెప్పుకున్న భావకవి.

"నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు" అంటూ తన కవితా పరమార్ధం చెప్పుకున్న కవి దేవరకొండ బాల గంగాధర తిలక్. భావకవులలో అభ్యుదయ కవి అభ్యుదయ కవులలో భావకవి అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ ఈయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా లోని మండపాక గ్రామంలో 1921 ఆగస్టు 1 న జన్మించాడు అతను కవి, కథకుడు, నాటక కర్త. ఒక ఆధునిక తెలుగు కవి. భావుకత, అభ్యుదయం అతని కవిత్వంలో ముఖ్య లక్షణాలు.

"సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి"..

అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడం ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి తిలక్.

ఈయన ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది. భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యం గాని ఎంతో బాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది. మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరుగుతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్డు మీద తారసిల్లిన వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపు గత్తెలు, చీకటి బజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలు గా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టారు.

మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతో, తరువాత శ్రీశ్రీ ప్రభావంతో, కవిత్వం రాసిన, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభా సంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లిన ప్రముఖుడు ఈయన వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వం లోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వ లక్షణాలు కలిసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత తిలక్. సృజన శక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లె పువ్వుల ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1న అనారోగ్యంతో రాలిపోయాడు. ఆయన మరణానంతరం శ్రీశ్రీ

"గాలి మూగదయి పోయింది
పాట బూడిదయి పోయింది
వయస్సు సగం తీరకముందే
అంతరించిన ప్రజాకవి
వయస్సు సగం చేరకముందే
అస్తమించిన ప్రభారవి" అని తన బాధను తెలియజేశాడు.

తిలక్ కవిత్వంలో భావుకత్వం ముఖ్యమైన లక్షణం గా ఉండేది  కొన్ని అభ్యుదయ కర ధోరణులను ఎత్తిచూపి విమర్శించినా,. తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం - కొద్దిపాటి ప్రేరణకు కూడా చలించి పోగల సుకుమార హృదయ స్పందన శక్తి.ఈ భావకవిత్వానికి తోడు, తన హృదయంలో అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తి, అలంకార పుష్టి, కలిసి రావడంతో తిలక్ ఉత్తమ శ్రేణి కవి కాగలిగాడు అని ప్రముఖ మార్క్సిస్టు విమర్శకుడు రా.రా ప్రశంసించాడు.

"దేవుడా
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి, పతివ్రతలనుండి
పెద్దమనుషుల నుండి, పెద్ద పులుల నుండి
నీతుల రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాల నుండి
లక్షలాది దేవుళ్ల నుండి
వారి పూజారుల  నుండి
వారి వారి ప్రతినిధుల నుండి
సిద్ధాంత కేసరులనుండి
శ్రీమన్మద్ గురు పరంపర నుండి". వీళ్లందరినుంచీ ఈ సమాజాన్ని కాపాడమని వేడుకొన్న కవి దేవరకొండ బాలగంగాధర తిలక్‌..

"నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు" అని పేర్కొన్న ఈ కవి, ఈ విధమైన సామాజిక స్పృహతో తన కత్తికి రెండు వైపులా పదునే అని నిరూపించుకొని కవిత్వములోను కథారచనలో బలమైన ముద్ర వేసాడని మరో అభ్యుదయ కవి చీకోలు సుందరయ్య తిలక్ ను ప్రశంసించాడు. ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందిన తిలక్ "అమృతం కురిసిన రాత్రి" కవితా సంకలనం ద్వారా సామాజికమైన తన ఆలోచనల్ని కవిత్వీకరించి కవిత్వానికే సార్థకత కలిగించా ఆని మరో సాహితి విమర్శకుడు గిరిజా మనోహర్ బాబు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు .'తిలక్‌మంచి అందగాడు, మానసికంగా మెత్తని వాడు, స్నేహశీలి కవి, రసజ్ఞుడు' అని కుందుర్తి అమృతం కురిసిన రాత్రి పీఠికలో అన్నాడు.

తిలక్‌, కృష్ణశాస్త్రి గారి romanticism కి, అభ్యుదయవాదం అందంగా పెనవేసి, ఆనాటి కవిత్వాన్ని, ఒక రెండు మెట్లు పైకి తీసికెళ్ళిన గొప్ప కవి అని వీరఅభ్యుదయవాది అని మరో సాహితి విమర్శకుడు వేలూరి వేంకటేశ్వర రావు గారు అంటారు.

"యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్ఫటిక ఫలకం" అంటూ తన ఎలిజీలో (జవాబు రాని ప్రశ్న) శ్రీ శ్రీ అభివర్ణించాడు. ఆ విధంగా తన కవితా ప్రతిభతో ఎంతో మంది విమర్శకుల, తోటి రచయితల, అశేష పాఠకుల అభిమానాన్ని చూరగొన్న గొప్ప కవి దేవరకొండ బాలగంగాధర తిలక్.

********

Posted in August 2023, వ్యాసాలు

1 Comment

  1. Annapurna

    Tilak gari gurinchi chadivinapudu eppudoo kottagane vuntundi.
    aayana daggira bandhuve ienaa eppudoo choodaledu.
    aayanaku endaro youth abhimanulu vunnaru. vichitram varu koodaa writers. “endaro kavitalu rase varu paathakulu andarivaadoo TILAK !”

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!