Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుని శివరాత్రి మహత్యం – శ్రీనాథుని కావ్యాలలో పరిశోధనలు

‘ఆంద్ర సాహిత్య పరిషత్ వారు ప్రచురించినది గాక డాక్టర్ బిరుదరాజు రామరాజు గారు ఒక సంపూర్ణ శివరాత్రి మహాత్య గ్రంథాన్ని సంపాదించారు. దాని సరిచూసి పరిష్కరించడం జరిగింది’ అని దానిని గూర్చి ఆరుద్ర వివరించారు.

దీని పరిష్కర్త కర్రి సాంబమూర్తి గారు. కథ అంతటితో ఆగలేదు అన్నట్లు ఆరుద్ర మరొకవార్త అందించారు. అది ఏదనగా-

ఇటీవల మెదకు మండలమున (ఒక జంగమదేవర కడ) మరొక శివరాత్రి మహత్యము యొక్క తాళపత్ర ప్రతి ఒకటి లభించింది. అని ఇంకొక వార్తను అందించారు. ఇందులోని వివరాలు క్లుప్తంగా-

ఈ వ్రాయసగాడు కాలాదులేవీ వివరింపలేదు. తాటాకు, లిపి మొదలైన వాటిని బట్టి దాని కాలం 280-300 సంవత్సారాల క్రితం ఉండవచ్చని పెద్దలు, ఆరుద్ర గారి అభిప్రాయం.

ముద్రిత ప్రతిలో లేని పద్యాలు మొదలైనవి కలిగి ఉండిన సంపూర్ణమైన అయిదు ఆశ్వాసముల గ్రంథమిది. జంగమ దేవర భద్రపరిచిన శివరాత్రి గ్రంథం వల్ల మరికొంత మేలు జరిగింది.

శివరాత్రి మహత్యంలో గుణనిధి తల్లి వంటి పాత్రే తెనాలి రామలింగ కవి గారి పాండురంగ మహత్యంలో ఉంది. దీనిని గూర్చి గుర్తు చేస్తూ ఆరుద్ర్ “ఈ గుణనిధి తల్లి పాండురంగ మహత్యం లోని నిగమశర్మ అక్కగారికి అక్కగారు” అన్నారు. మన దేశంలో తల్లుల ప్రేమ పాకం ముదిరి పిల్లలు చెడిపోయే కథలు ఉన్నాయి.” ఈ సందర్భంగా గుణనిధి కథను ఆరుద్ర తెల్పుతూ ప్రసిద్ధములైన జంగమదేవర ఇచ్చిన గ్రంథంలో అయిదవ ఆశ్వాసం లో ఉన్న కొన్ని మంచి పద్యాలను తెల్పారు.

యమధర్మరాజు చేసే శివ స్తుతి పద్యం –

“ఎవ్వాని యందుండు నెల్ల భూతంబులు
సింధువునందు వీచికల వోలె...”

అంటూ సాగిన ఈ పద్యం ఉపమాలంకార భూషితమై వివిధ నామాలతో వెలుగు భగవంతుడు ఒక్కడే అనే సందేశాన్ని అందిస్తున్న ఈ పద్యం శ్రీనాథుని ఏకోపాసనకు నిదర్శనం. (శివ.రా.5-24)

అలాగే సుకుమారుని దుర్మార్గాలను తెలిపే పద్యం ఇత్యాదులు చక్కని పద్యాలు. శివరాత్రి మహత్యంలో దుష్ట నాయకుడు సుకుమారుడు. ఇలాంటి నాయకుడే శ్రీనాథుని కాశీఖండం లో ఉన్నట్టి గుణనిధి. ఈ ఇద్దరూ చెడిపోవడానికి వారి తల్లుల అతి ప్రేమే కారణమని శ్రీనాథుడు కథాముఖంగా తెల్పాడు. ఈ రెండు కథలను, వాటికి సంబంధించిన పద్యాలు ఆరుద్ర వివరించారు. కాశీఖండం లో పద్యాలు

“అక్ష ధూర్తుల లోన నీ యనుఁగు గొడుకు” అన్నది, “చాలు నింక నా పాలికి జచ్చినాడు” మొదలైనవి ప్రసిద్ధ పద్యాలు.

శ్రీనాథుడు ఆగర్భ పండితుడు. అష్ట భాషా ప్రవీణుడు. అయినప్పటికీ తెలుగును గాఢంగా అభిమానించి ఆదరించాడు. అందుకు సాక్ష్యంగా మొదటిసారిగా తెనుగు భాషా గొప్పదనాన్ని శ్రీనాథుడే చాటాడు అని ఆరుద్ర చెప్తూ,

“జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్య సంపద
మెచ్చుటాడు బిడ్డ మేలుగాదె” (క్రీడా-37 , స.ఆం.సా. పేజీ 735)

‘తెలుగు లెస్స’ అని మొదటిసారిగా అన్నది శ్రీనాథుడని ఆరుద్ర మాట. తరువాత రాయల వారు వాడారని అనుకోవచ్చు.

శ్రీనాథుడు తన వివిధ కావ్యాలలో వివిధ ఛందస్సులను వాడాడని ఆరుద్ర వివరించాడు. ఉత్సాహం, ఉపేంద్ర వ్రజ, తాళవృత్తం, పంచచమీరం, చంపక, ఉత్పలమాలలు మొదలైనవి. మొత్తం ఆయన జీవితమంతా వ్రాసిన  గద్య పద్యాల సంఖ్య 8814 అని ఆరుద్ర లెక్క చెప్పాడు. ‘శ్రీనాథుని సీసాలు’ ప్రసిద్ధం.  తన రచనల లోని గద్య పద్యాలలో దాదాపు 7వ వంతు సీసాలే అని అన్నారు ఆరుద్ర. సీస రచనకు అనంతర కవులకు శ్రీనాథుడు మార్గదర్శకుడనవచ్చు.

శ్రీనాథుని ఛందస్సును వివరిస్తూ ఆరుద్ర, హరిగతిరగడ, రగడ, తాళవృత్తం మొదలైన వాటిలోని ప్రత్యేక అంశాలను వివరించాడు. శ్రీనాథుని వలె ఆరుద్రకు కూడా ఛందస్సు, అందులోని ప్రత్యేకతలు అంటే మిక్కిలి ఇష్టమని ఈ వివరణ తెలుపుతున్నది.

‘శ్రీనాథుడు తన జీవితంలో ఆటవెలదులు అంటే ఇష్టపడ్డాడు. కానీ సీసాల తర్వాత వాటిని చేరనివ్వక పోవడం అబ్బురమే’ అని అన్నాడు ఆరుద్ర. అలాగే శ్రీనాథుని రగడ లాగే ఆయన దండకాలు కూడా విలక్షణమైనవని చెప్పి వాటిని సంస్కృత సంప్రదాయంలో రెండు నగణాలపై రేఫలు పెట్టి వ్రాసాడని ఆరుద్ర తెల్పారు.

శృంగార నైషధం లోని (4-168) సరస్వతీ దండకం అంతా సంస్కృతమే. కానీ హరవిలాసంలో, కాశీఖండం, భీమఖండాలలో ‘నమస్తే నమస్తే నమః’ అనేవి ఉన్న దండకాలు ఉన్నాయి. అవన్నీ దండకాలు కావు అన్నారు ఆరుద్ర. సంబోధనా ప్రధానంగా గల బిరుదు గద్యలు, వచనాలు ఉన్నాయి.

వచనమైనా, పద్యమైనా తన సొంత ముద్రతో రచించిన వాడే మహాకవి అన్నారు ఆరుద్ర.

శ్రీనాథునికి ఇష్టమైన రాగం మాల్ కోస్, ఇష్టమైన నాట్యం గోండ్లి. అఘమర్షణ స్నానమే చేయించాడు పురుష పాత్రలచేత. అతని స్త్రీ పాత్రలందరూ చిరుబంతి పసుపాడుతారు. కాళిదాసు శ్లోకాలను అనువదిస్తూ అచ్చరల చేత హిందోళరాగమే పాడించాడు (హర-3-63). శ్రీనాథుడు పేర్కొన్నన్ని రుచులు, పానీయాలు, వంటకాలు మరే కవీ తన కావ్యంలో పేర్కొనలేదని శ్రీనాథుని గ్రంథాలు పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుందని ఆరుద్ర పేర్కొంటూ ‘శ్రీనాథుని గ్రంథాలు పరిశీలించాలి, పరిశోధించాలి అప్పుడే ఇంకా ఎన్నో విషయాలు తెలుస్తాయి’ అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతేగాక కొన్ని విషయాలను గూర్చి చర్చించారు.

ఆరుద్ర వాటి గురించి చెప్తూ ఆనాడు శూద్రులకు కూడా ఆచమనాది కార్యక్రమాలు ఉన్నాయని ఈ క్రింది పద్యం తెలుపుతుందని పేర్కొన్నాడు.

“శూద్రుడగు...”అంటూ ప్రారంభించిన ఈ పద్యంలో చివర “శూద్రుడు నాటవియును నాచామన వేళయందు వింద్యాద్రిదమన అంటూ తెల్పాడు.

**** సశేషం ****

Posted in December 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!