Menu Close
అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
-- మధు బుడమగుంట --
శ్రీవేంకటేశ్వరుఁడు

నందివర్ధనము 
     ప్రహ్వభక్తగణనంది(1)వర్ధనము పావనాహ్వయముఁ దా
     జిహ్వఁ దాల్చి నుడువంగఁ జాలు నిజచింత లెల్ల నుడుగున్
     విహ్వలత్వమును వేగఁ బాపునది(2) వేంకటేశుస్మరణే
     గహ్వరం బగు మనాన జ్ఞానశిఖ కానఁ జేయుఁ బరమున్ 105 
           (1) సంతోషము (2) పోగొట్టునది / పోగొట్టు నది/ పోగొట్టును + అది

సీ. తోటపూవుల భక్తితోరాలఁ గూర్చిన
       మాలలసేవ తోమాలసేవ
    అంగాంగములు చేరి రంగారు హ్రస్వదీ
       ర్ఘసుగంధసుమబంధరాజితంబు
    వివిధవర్ణంబుల విన్నపంబుల నెల్ల
       వేంకటపతిఁ జేర్చు విష్ణులీల,
    వ్యూహలక్ష్మీధరామోహనవక్షస్స్థ
       లవిశేషమాలికాలాలితంబు

తే.గీ. చరణయుగఖడ్గభుజకంఠశంఖచక్ర
      సాలగ్రామశిఖాస్పర్శ చాలు నొక్క 
      టైన క్షణమాత్ర మైన సప్తాచలముల
      విరుల వీక్షింప భాగ్యంబు వేంకటేశ! 106

చం. తిరుమల పుష్పమండపము; దివ్యమహీధరసప్తజాతసు
     స్థిరహరివాసభాసురనదీజలపోషితనిర్మలాంగసుం
     దరతరుసూనసూను(1)సమదాసజనాళివిశేషసేవలన్
     నిరతము స్వీకరించు విభునిత్యమనోహరమూర్తిఁ గొల్చెదన్ 107
       (1) సంతానం. ఇది రెండువిధాలు: పూర్వసంతానం (తిరుమల కొండలలోని చెట్లు, పూలు)
           ప్రస్తుతసంతానం (సేవలు చేస్తున్న పుష్పలావికలు, మాలాకారులు, తిరుమలేశుని
           దివ్యదర్శనం చేసి తరించే భాగ్యమున్నవారు)

శా. చక్రస్నానముఁ జూచినాఁడ నిఁక నీ జన్మంబు ధన్యంబు ని
    ర్వక్రంబై సతతంబు సద్గతిని శోభాపూర్ణమై సాగ శ్రీ
    చక్రాబ్జాంచితమంగళాకరవపుస్సందర్శనోత్సాహభ
    క్తక్రీడాంగణదివ్యపుష్కరిణి కల్గన్ జేయుఁ గల్యాణముల్! 108

చం. కనులు తరించె మిమ్ముఁ గని కాంచనభూషణరత్నమండితా!
     అనుపమగంధసుందరమహాద్భుతసూనవితానమానితా!
     అనిశసమాశ్రితావనిసుధాబ్ధిసుతామితప్రేమలాలితా! 
     అనితరసప్తశైలనిలయామరభక్తజనాళిసేవితా! 109

కం. ఇరుదెసలను సిరిధరణుల
     హరి కరముల నాదరించి యరుదగుప్రీతిన్
     తిరుగఁగ ధన్యంబగు నా
     గరుడుని పృష్ఠంబు గాచుఁ గావుత మమ్మున్! 110
Posted in December 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!