Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

తొలి తెలుగు కావ్యకర్త నన్నయ

‘ఆదికవి’ అన్న బిరుదు శ్రీ నన్నయ భట్టుకున్న సంగతి అందరికీ విదితమే. ఇక్కడ నన్నయను తొలి తెలుగు కావ్యకర్త అనుటకు కారణం: నన్నయ భట్టుకు పూర్వమే తెలుగు భాషకు ఛందస్సు, తెలుగులో పద్యాలు ఉండటం, తెలుగులో అప్పటి వరకు ఎటువంటి కావ్య రచన జరగకపోవడం, అనువాదమే అయినా తెనుంగులో అట్టి ప్రయత్నం చేసిన తొలి కవి నన్నయ కావడం. నన్నయకు పూర్వం తెలుగులో కావ్య రచనలేవైనా వున్నప్పటికీ అవేవీ నేటికీ లభ్యమవలేదు. నన్నయ తరువాతి కవులెవరూ పంపకవి రచించాడనబడుతున్న జినేంద్ర పురాణం గురించి తప్ప మరే ఇతర రచన గురించీ కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. కావున నన్నయను ఆదికవి అనడం కన్నా ‘తొలి తెలుగు కావ్యకర్త’ అనుట సమంజసం.

క్రీ.శ పదకొండొవ శతాబ్దంలో తీరాంధ్ర ప్రాంతంలో గల వేంగీ రాజ్యమును రాజమహేంద్రవరం రాజధానిగా పాలించిన తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రుడి కుల బ్రాహ్మణుడు నన్నయ భట్టు. ఇతడు ముద్గల గోత్రానికి చెందినవాడు.

శ్రీ మదాంధ్ర మహాభారతములోని అవతారికలో :-

రాజకులైక భూషణుండు
రాజమనోహరుండు
అన్యరాజతేజోజయశాలి శౌర్యుండు
విశుద్ధ యశశ్శరదిందు చంద్రికా రాజిత సర్వలోకుండు
అపరాజిత భూరి భుజా కృపాణధారాజల శాంత
శాత్రవ పరాగుండు
రాజమహేంద్రుండు ఆనతి నివ్వగా

వాఞ్మయ దురంధురుండు
తనకు ఇష్టుడు సహాధ్యాయుడు
ధరామర వంశ విభూషణుండు
నారాయణభట్టు తోడవగా

కవులు ప్రసన్న కథాకలితార్ధ యుక్తిని గమనించి ప్రశంసించే విధంగా
అన్యులు అక్షర రమ్యతను మెచ్చుకునే విధంగా
నానా రుచిరార్ధ సూక్తి నిధి నన్నయ భట్టు
తెనుంగులో మహాభారత సంహితా రచన బంధురుడయ్యనని - నన్నయ రాశారు.

నన్నయ మహాభారతంలోని ఆదిసభా పర్వములు,అరణ్య పర్వములోని ౧౪౨ పద్యములు రచించారు. అరణ్య పర్వములోని మిగిలిన భాగాన్ని ఎఱ్ఱన పూరించారు. భారతంలోని మిగతా పదహైదు పర్వాలను తిక్కన రచించారు. ‘నన్నయభట్టు ఆంధ్రభాషా వాగను శాసనుడు. అది వరకు తెలుగులో కావ్యము లేదు.తెలుగుకు వ్యాకరణము లేదు. నన్నయ భట్టు తెలుగు భాషకి రెంటినీ ప్రసాదించెను’ అని విశ్వనాథ సత్యనారాయణగారు రాశారు.

నన్నయ ఆంధ్ర శబ్ద చింతామణి అను వ్యాకరణ సూత్రములను సంస్కృతంలో రాశారు. ’మహాభారతం వంటి ఉద్గ్రంథమును రచించుటకు తగిన పద సంపద గానీ, ఛందో విస్తృతి గానీ అప్పటి తెలుగులో లేకపోవడం వల్ల సంస్కృత పదములను తెలుగులో వాడుకోవటానికి తగిన ప్రణాళికను ఏర్పరచుకుని, శాసనములయందును, జన వ్యవహారమునందును వైవిధ్యముతో ఉన్న దేసీయ పదాల స్వరూపమును స్థిరీకరించి, సంస్కృతము నుండి ధారాళమైన గమనము గల వృత్తములను గ్రహించి తెలుగున భారతము రాయుటకు నన్నయ ఉపక్రమించారని’ దివాకర్ల వెంకటావధాని రాశారు.

నన్నయ తన కవిత్వములో ప్రసన్నకథాకలితార్థయుక్తి, అక్షర రమ్యత, నానారుచిరార్థసూక్తి నిధిత్వము వంటి గుణములుండునని అవతారికలోని ౨౬వ పద్యములో కంఠోక్తముగా చెప్పారు.

‘రుచిరార్థ సూక్తులనగా’ బహు ధర్మములు మిక్కిలి రమ్యముగా చెప్పుట. ఈ సూక్తులు వట్టి సూక్తులుగా కాకుండా రచించు కథలో సందర్భోచితముగా ప్రతిపాదించుట. ‘అక్షరరమ్యత’ అనగా అక్షరములు కూర్చుటలోని సొగసు. ‘కథాకలితార్థయుక్తి’ అనగా కథతో కూడుకుని యొక మహార్ధము ప్రకాశించుట.

భారతము గాక నన్నయ చౌడేశ్వరి విలాసము,ఇంద్ర విజయము అను రెండు కావ్యములు రాసెనని ప్రచారంలో ఉంది.  చౌడేశ్వరి విలాసము మూడు ఆశ్వాసములు, నూట ఇరవై పద్యములు గల చిన్న గ్రంథం. మొదటి ఆశ్వాసము నందు నందవరీక బ్రాహ్మణుల గురించి, రెండు మూడు ఆశ్వాసముల యందు దేవాంగ కులములోని ఒక శాఖకు సంబంధించిన కథలు గలవట.

‘శ్రీ వాణీగిరిజాశ్చిరాయ’ అంటూ శ్రీ కారంతో తన కావ్యం ఆరంభించిన నన్నయ భావికవులకు దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రాచీనాంధ్ర కవిత్వమంతా ఆయన బాటలోనే పయనించింది.

*సర్వేభవంతు సుఖినః*

Posted in December 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!