Menu Close
వీక్షణం-135 వ సాహితీ సమావేశం
-- వరూధిని --
vikshanam-135

నవంబరు 10, 2023 న ప్రత్యక్ష సమావేశంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ లో షర్మిల గారింట్లో జరిగిన వీక్షణం 135వ సాహితీ సమావేశం శ్రీ మధు ప్రఖ్యా గారి అధ్యక్షతన ఆద్యంతం ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశ ప్రధానోద్దేశ్యం వీక్షణం చిరకాల సభ్యులు, మిత్రులు, ప్రముఖ శతావధానులు అయిన శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారితో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం. ఇటీవల శ్రీచరణ్ గారు అవధానిగా అమెరికాలో మొట్టమొదటి సంస్కృతాంధ్ర ద్విశతావధానాన్ని విజయవంతంగా పూర్తిచేసిన విషయం మనందరికీ విదితమే. ఈ సందర్భంగా వారికి ఈ సమావేశంలో ఆత్మీయ సన్మానం జరిగింది.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారు కాలిఫోర్నియా నివాసి. బహుముఖ ప్రజ్ఞాశాలి. సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా సంస్కృతాంధ్ర భాషా పండితులు. పద్య కావ్యాలు రచించారు. అనేక మార్లు కావ్య పఠనం, వ్యాఖ్యానం చేసారు. గత ఐదారేళ్లుగా అవధానాలు చేస్తున్నారు.

వారి గురించి వారి మాటల్లోనే చెప్పాలంటే "మాది తిరుపతి సమీపంలోని కమ్మపల్లె. నాన్నగారు విద్వాన్‌పాలడుగు జయరామా నాయుడు ప్రధానోపాధ్యాయుడిగా, అమ్మగారు రావిళ్ల మనోరంజని జువాలజీ అధ్యాపకురాలిగా పనిచేశారు. మా తమ్ముడు జయచరణ్‌. నా చదువు బీటెక్‌ వరకూ తిరుపతిలోనే జరిగింది. 1997లో ఎంటెక్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చేశా. వెంటనే ఉద్యోగం వచ్చింది. 1998లోనే అమెరికా వెళ్లా. అక్కడ సాప్ట్‌వేర్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాను. చిన్నపుడు అమ్మానాన్నలు నేర్పిన శతకపద్యాలు ఇప్పటి నా అవధానాలకు పునాది వేసాయనిపిస్తుంది. రోజూ నాలుగైదు పద్యాలు అప్పట్లో కంఠతా పట్టేవాడిని. రామాయణం, భారతాల నుండి కథలు చెప్పేవారు. ఇక తిరుపతిలో ఉండడమనే కారణంతో గుడులకు వెళ్ళడం, అన్నమాచార్య కళామందిరానికి వెళ్ళడం వంటివి చిన్నతనం నుంచీ అలవడింది. దీంతో భక్తి, సాహిత్యం, భాష.. ఈ మూడింటిపై ఆసక్తి కలిగింది. ఆలయాల్లో పసితనం నుంచీ వింటున్న వేదపారాయణం కారణంగా శృతి, లయలపై కూడా తెలియని అరాధనాభావం ఏదో మదిలో ఉండేది. ఘంటసాల వారి పద్యాలు, ఎన్టీఆర్‌పౌరాణిక సినిమాల ద్వారా సాహిత్యం, పురాణాలపై జిజ్ఞాస కలిగింది. చిన్నతనం నుంచి చూస్తున్న అవధానాలు, వింటున్న ప్రవచనాలు, ఉషశ్రీ పుస్తకాలు వంటివి నాలో సాహిత్యం పట్ల అనురక్తిని పెంపొందించాయి.

అమెరికాలో ఓ గుడికి వెళ్ళినపుడు పరిచయమైన గణేశశర్మ అనే పురోహితుడి ద్వారా ప్రతి సోమవారం సాయంకాలం మూడేళ్లపాటు రుద్రాభిషేకంలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ శబ్ద సౌందర్యం మంత్రాలపై ఆసక్తి కలిగించింది. వేదం నేర్చుకోవాలనే కోరిక కలిగింది, కానీ కొన్ని ఆటంకాలతో అది ముందుకు సాగలేదు. చివరకు, గురువుగారు శ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారు ఒకసారి నాలోని భక్తి, శ్రద్ధ గమనించి, ఈ రెంటికీ తోడు శుద్ధి కూడా పాటిస్తే వేదం నేర్పుతానన్నారు. వారి అనుగ్రహంతో 2007 మే మాసం నుంచి వేదాధ్యయనం చేస్తున్నా. ఒకవైపు తెలుగు, సంస్కృత సాహిత్యాలు చదువుకుంటూ, మరో వైపు వేదం నేర్చుకోవడంతో నాలో సాహిత్య అధ్యయన దృష్టి పెరిగింది.

2007లో తొలిసారి పద్యం రాసే ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అడపా దడపా, ఆశువుగా రాసుకున్న పద్యాలను ఒకసారి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు చూసి, పద్యనిర్మాణంలో మెలకువలు చెప్పారు. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌నేను రాసిన శివోహం పద్యాలు చూసి ప్రోత్సహించారు. "ఛందఃపద్మాలు" అనే నా తొలిపుస్తకాన్ని 2013లో వారే ఆవిష్కరించారు. నా సాధనలో భాగంగా ఇప్పటివరకూ 8వేలపద్యాలు, శ్లోకాలు రాశా.

ఇంటర్లో సంస్కృతం తీసుకున్నా. అప్పటి మా ఉపాధ్యాయులు పాఠం చెప్పేతీరు సంస్కృతం అంటే నాకుఇష్టం పెరిగేలా చేసింది. ఐఐటీలో మంచి లైబ్రరీ ఉండేది. అక్కడ చాలా పుస్తకాలు చదివా. అమెరికా వెళ్ళిన తొలినాళ్ళలోనే మళ్లీ ఆన్‌లైన్లో సంస్కృతం నేర్చుకోవడం, పుస్తకాలు తెప్పించుకోవడం చేసేవాణ్ణి. తిరుపతి విశాలాంధ్ర నుంచి నాకు కావలసిన పుస్తకాలను అమ్మ కొని పంపేది. అలా సంస్కృతంలో పంచమహా కావ్యాలు, వాల్మీకి రామాయణం పూర్తిగా చదువుకున్నా.

2016లో వద్దిపర్తి పద్మాకర్‌గారు సమస్య, వర్ణనలతో నా చేత అవధానం సాధన చేయించారు. 2017 మే మాసంలో అమెరికాలో నా తొలి అవధానం వేద గుడిలో జరిగింది. వెంటనే సెప్టెంబర్‌మాసంలోనే తెలుగు- సంస్కృత భాషలలో ద్విగుణిత అష్టావధానం మన వీక్షణం వార్షిక సాహితీ సమావేశంలోనే చేశాను. ఆ తరువాత వారంరోజుల వ్యవధిలోనే ఐదు అవధానాలుచేసే అవకాశం వచ్చింది. సంస్కృతంలోనే అప్రస్తుత ప్రసంగంతో అవధానం చేశాను. జంట అవధానం, త్రిగళావధానం, 8 మంది పృఛ్చకులతో కాకుండా 15 మంది పృఛ్చకులతో అవధానం చేయడం జరిగింది. ఇపుడు చేసినది నా తొలి ద్విశతావధానం, అదికూడా సంస్కృతం-తెలుగు భాషల్లో జరిగింది. వీక్షణంలో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ అవధానంలోని పృచ్ఛకులు అడిగిన సమస్యలను పూరించిన పద్యాలను ఆశువుగా చెప్పి అందరినీ ఆనందింపజేశారు.

శ్రీ పాలడుగు శ్రీచరణ్ గారిని ఉద్దేశించి వీక్షణం అధ్యక్షులు డా. కె. గీతామాధవి గారు మాట్లాడుతూ "శ్రీ చరణ్ గారు నాకు మా వీక్షణం సాహితీ వేదిక ద్వారా దాదాపు గత పదేళ్ల కిందట పరిచయం కావడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. వారు భాషా, సాహిత్య పండితులు, సాఫ్ట్ వేర్ రంగంలో నిపుణులు మాత్రమే కాకుండా, ఏ రంగంలో ఏ ప్రశ్న అడిగినా చెప్పగలిగిన నిష్ణాతులు. ఒక విధంగా చెప్పాలంటే జీనియస్ ఆయన. అంతకంతా మంచి మనసున్న మనిషి. సౌశీల్యత, నిరాడంబరత కలిగిన గొప్ప మనీషి. అటువంటి శ్రీచరణ్ గారు నా సమకాలీకులు అని చెప్పుకోవడం కూడా గర్వకారణమైన విషయం. నా సహోదర సమానులైన వారి కోసం ఉడతా భక్తిగా ఒక చిన్న పద్యం-

శ్రీచరణ్ గారు -
సంస్కృతాంధ్ర పలుకు సమముగా పలుకుచు
ఎల్ల జగములెల్ల నెదుట నిలుపు
వారి కెవరు సాటి పద్దె విద్యను జూడఁ
చరణు వారి మాట చద్దిమూట!
అంటూ వారిని పద్యంతో కూడా సత్కరించారు.

శ్రీ చరణ్ గారిని ఉద్దేశించి శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ సుభాష్ పెద్దు, శ్రీమతి షంషాద్, శ్రీమతి ఉదయలక్ష్మి, శ్రీ చిమటా శ్రీనివాస్, శ్రీమతి షర్మిల, శ్రీమతి శారద, శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీమతి అనూరాధ, శ్రీ రామకృష్ణ మున్నగువారు ప్రసంగించారు.

శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారు చరణ్ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు ఆయనకు సరస్వతి పూనినట్లు మధ్య పూరణ గావించారని తెలియజేస్తూ పూరణ చేసిన కొన్ని పద్యాలను,వ్యాఖ్యతో సహా వివరించారు. సమస్యలు అందించిన వారు డా. కె.గీతామాధవి, శ్రీ మధు ప్రఖ్యా, శ్రీ శ్యామ్ పుల్లెల, శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్, డా. పిల్లలమఱ్ఱి శేషశాయి, శ్రీ చిమటా శ్రీనివాస్ మొ.న వారు.

1. సమస్య: వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
పూరణ:
ఆర్షజ్ఞాన విధానధర్మములకును యజ్ఞేశ్వరారాధనం
కర్షక్షేత్ర చిదగ్ని బీజరుహ వాగ్గంధ ప్రకాశంబు దు
ర్ధర్షాఘాంధ వినాశమున శివమరుత్కౌండిన్య గోత్రోజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్


2. సమస్య: మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్
పూరణ:
వనరుహ లోచనాభినవ పంచశిరోరుహ నాట్యలాస్యముల్
ధనమదమూని అపహృత ధర్మ నిరీశ్వర యాగభావమున్
దునిమెడివేళ సత్యధృతి దోర్బల భధ్రకరాళ రూపమే
మనలను గాచునదె మారణహోమము చిత్తగింపగన్


3. సమస్య: ఆలి మాట వినుట కలుక దేల
పూరణ:
కాలికైన లోక పాలనా వేశంబు
విషము గ్రోల నైన వెనుదిరుగదు
నిండుబలము నెడమనిండి నడుపువేళ
ఆలి మాట వినుట కలుకదేల


4. సమస్య: పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!
పూరణ:
కలహ విమర్శనాంత నరకప్రద దుఃఖ దురంత భారముల్
నళిన మనోహరాద్భుత గణద్వర నీలిమ రోచిరంశముల్
తొలగెడి వేళలందు నిజరూప విలాస సనాతనంబునే
పలికెద గాక సత్యమును పట్టణ వీధుల యందు మిత్రమా!


మరి కొన్ని పూరణలు:

రామా! శూర్పణఖాంతమ
ప్రామిన్నుకుల సొగసులూని రవళింపగక దు
ష్కామిత మప్రాచ్యయమనును
మామా! మామ్మేమి! మమ్మిమమ్మీ మామ్మా!

బుధుల గొలుచువారి పుణ్యవిశేషముల్
మహితకాంతిసారమౌక్తికములు
జ్ణానదుగ్ధసింధు జాతపర్వాధ్యక్ష
విధుని పొట్టలోన నిధులు మెండు

ఛందఃపద్మాకరమున
వందనపూరిత కవిత్వపానజిగీషన్
చిందు కనకసుమముల ప్రా
కుందేటిని కోడిపిల్ల గుటుకున మింగెన్

నవనవజన్మశ్రీయుత
పవిత్రసూత్రాన్వితునకు వరమంగళమున్!
అవిసెను చింతామణికై
అవధానికి సానిదాని అవసరమయ్యెన్!

విద్వదనేకసంఘపరభీతివిదూరకవిప్లవార్థముల్
మృద్వభిరమ్యభావహితవృత్తివివర్ధితపద్యబంధముల్
సాధ్వభినవ్యవైఖరివిశాలసమున్నతశైలవేదవేదీ
ద్విశతావధనమున తిప్పలుబెట్టిరి పృచ్ఛకాళిరో!

చందనచర్చితానుభవసౌమ్యకళంకవపుర్విలాసముల్
సుందరసింధుజాత విధుసుమ్నకరగ్రహకౌముదీతతుల్
కుందసమానరోచిరతికోమలబైందవతారకావళుల్
వందలభార్యలున్న పతి వందనపాత్రుడు వేదసాక్షిగా!

రాగవిమోహపారసలిలప్లవకేతుకదీర్ఘవీచికల్
మూగినవేళ కప్పబడు మోహమనోగతభావనావళుల్
దాగని ధూర్తవర్తనము దాటగ త్రెళ్ళెడి తార తానహో
ఏగతి వేడుకోగలదు ఈసతి దుర్మతి సాహసించగన్

దాడిమ్యామ్రఫలాంతరద్భుతరసోద్యానాధినాథాళికిన్
నీడల్ గాంచని మూర్ఖసంతతికిలన్ నిర్ఘోషితాక్రందనల్
వ్రీడావర్జితసద్విమర్శసరణిన్ వెల్గొందు ఖడ్గాళికిన్
సోడా త్రాగినవారు వ్రాయగలరే సోకైన పద్యంబిలన్

సద్య ఉపాసనప్రథమశాస్త్రవిచారవిమర్శసంచరత్
వైద్యనిధానమూర్తులకు వంద్యులకున్ సురసోమతీర్థమున్
హృద్యవికారరోగతరణీయసమర్థన చేయువేళ చి
న్మద్యము గ్రోలు వారలనె మాన్యులుగా నుతియింత్రు సజ్జనుల్

కట్నము దయ్యమై వరలు కాపురుషాధమచిత్తమందునన్
చట్నజనించునట్టి విరసంబుల గాడ్పులు మిన్నునంటగా
పట్నపువాసులెల్లరకు భావము దాచెడి భావముష్టికై
రాట్నము చేతబట్టుకుని రాక్షసకృత్యము చేసినాడహో!

బలరిపుభంజనాకృతి విపత్పరిణామవినాశమూర్తినిన్
పొలుపుగ పేర్చినట్టి పలుభూములగుంపులు కల్పకాలముల్
తెలియగజేయునక్కథల తీరులవింతలు బాంధవాళులన్
చెలువగ రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభు డన్నయౌ

కల్పనా తిగతుంగా కల్పసూత్రము జ్ఞానమంగళమూర్తియై
శిల్పసుందరమందిరాంతర చిద్విలాసమనోజ్ఞియై
పొల్పునిల్చిన దుర్గరూపము మోయచిత్తగుహంబునన్
మిల్పిటాసున సింహమొక్కటి మేలుకొన్నది చూడరా!

ఆర్షజ్ఞానవిధానధర్మములకున్ యజ్ఞేశ్వరారాధనున్
కర్షక్షేత్ర చిదగ్నిబీజరుహ వాగ్గంధప్రకాశంబు దు
ర్ధర్షాగాంధవినాశమున్ శివమరుత్కౌండిన్యగోత్రౌజసీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్

ఈ సమావేశంలో స్థానిక వక్తలు, కథకులు, కవులు, కవయిత్రులు, సాహిత్యాభిలాషులు మొ.న వారు పాల్గొన్నారు. సభలోని వారి ఆత్మీయ స్పందనలతో, శ్రీచరణ్ గారికి సన్మానాలతో సభ దిగ్విజయంగా ముగిసింది.

అత్యంత విశేషంగా జరిగిన ఈ సమావేశ వీడియోని ఇక్కడ చూడవచ్చు.

Posted in December 2023, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!