Menu Close
మ మ (కథ)
-- యిరువంటి శ్రీనివాస రావు --

సుబ్బారావుకి కోపం వచ్చింది. సుబ్బారావు కి కోపం రావటం ఇది మొదటిసారి, రెండోసారి కాదు. ఇదివరకు చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఎప్పట్లా ఇప్పుడు కూడా కాస్త ఎక్కువగానే కోపం వచ్చింది. సుబ్బారావు కి కోపం వస్తే కొంచెం కష్టమే. ఒకచోట కూర్చోలేడు. కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంటాడు. తనలో తానే గొణుక్కుంటాడు, తిట్టుకుంటాడు. అవ్వీ ఇవ్వీ సర్దుతుంటాడు అవసరం లేకపోయినా.

ఇంతకీ సుబ్బారావు కి ఎవరిమీద కోపం వచ్చింది? బాస్ మీదా? కింది పనివాళ్ల మీదా? తల్లిదండ్రుల మీదా? పిల్లల మీదా? స్నేహితుల మీదా? అప్పుతీసుకొని ఇవ్వని వాళ్ళ మీదా? కాదు కానే కాదు. ఆ ఆ.. మీకర్ధమైపోయివుండాలి ఈపాటికి. ఇంకెవరు తన భార్యామణి మీదనే. సుబ్బారావు కి ఎప్పుడు కోపం వచ్చినా తన పెళ్ళాం మీదనే వస్తుంది. ఇంకెవరి మీదా రానే రాదు. అసలు తాను అనవసరంగా పెళ్లి చేసుకున్నానని, అప్పట్నుంచే తన భార్య తన అభివృద్ధికి అడ్డుపడుతూ, తన్నీ జీవితంలో ఏ విషయంలో కూడా ముందుకు వెళ్లనియ్యటం లేదని వాపోతూవుంటాడు.

సుబ్బారావు కి తోడు అచ్చు సుబ్బారావు లాగా ఆలోచించే అప్పారావు, వెంకట్రావు తోడయ్యారు. సుబ్బారావు వీళ్లిద్దరికీ గురువు, బాసునూ ఈ విషయంలో. ఈ ముగ్గురిలో ఎవరికి కోపం వచ్చినా ముగ్గురు ఒకచోట కలుసుకొని తమ అక్కసుని వెళ్లబోసుకుంటుంటారు. ఇదిగో మరి ఈసారి కూడా ఈ ముగ్గురు మిత్రులు కలుసుకున్నారు.

గురు గురు ఇది విన్నావా ఈ రోజు లేడీస్ నైట్ పార్టీ అట?

బాసు, ఇది చూసావా రేపు లేడీస్ మూవీ నైట్ అట?

ఊ ఊ విన్నాను విన్నాను ... అన్ని చూస్తున్నాను.

ఏంటి గురు, ఇది వాళ్ళకేమో నైట్ పార్టీలా..మనకేమో బేబీ సిట్టింగులా?

బాసు, వాళ్ళకేమో మూవీ నైట్ లు, మనకేమో కుకింగ్ క్లాసులా?

అవును...అవును (కోపంగా)...వీళ్ళు ఈ ఆడవాళ్లు మన "మ మ" ల్ని అర్థచేసుకోవటంలేదు.

మన టాలెంట్ ని తొక్కి పారేస్తున్నారు గురు.

మన క్రియేటివిటీ ని నొక్కేస్తున్నారు బాసు.

అవునవును .. నన్ను చూడండీ .. పెళ్ళికాకముందు ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా చెంగుచెంగున గంతులేసుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడిట్లా తయారయ్యాను.

“మ మ” అంటే లెక్కలేకుండా పోయింది గురు వీళ్ళకి.

అవును బాసు, అసలు ఈ విషయంలో అమ్మయినా, అత్తయినా, భార్యయినా, కూతురయినా అందరూ ఒక్కటే.

“మ మ” ని అర్ధం చేసుకోరు, వాళ్ళ మూడ్ ని బట్టి మనం ఉండాలట.

మన మూడ్ ని ఎప్పుడైనా తెలుసుకున్నారా గురు.

మనమేమన్న ధర్మరాజులమా బాసు వీళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవటానికి.

ఇంతలో దారిన పోయే దానయ్య ఒకాయన అప్పటిదాకా వీళ్ళ సంభాషణ విని, వీళ్ళ frustration చూసి అటు గా వచ్చి –

మాష్టారు మాష్టారు.. నాకొక సందేహం ఇందాకణ్ణించి చూస్తున్నాను మీరేదో “మ మ” అంటున్నారు. గుళ్లో పంతులుగారంటారే మమ అని, అదేనా మాష్టారు?

కాదయ్యా కానే కాదు ... అవును నీకు పెళ్లయిందా? కనీసం గర్ల్ ఫ్రెండ్ అన్న ఉందా? ఉంటే డేటింగ్లు గట్రా ఏమన్నా?

అయ్యో మాష్టారు, నాకింకా పెళ్లి కాలేదు. గర్ల్ ఫ్రెండ్ కూడా ఎవరూ లేదు మాస్టారు (సిగ్గుపడుతూ చెప్పాడు దానయ్య)

ఓహో పెళ్లి కాలేదు, గర్ల్ ఫ్రెండూ లేదు..అయితే నీకర్థం కాదులే మా బాధ. వెళ్ళవయ్యా ... వెళ్ళూ (కోపంగా దానయ్యని తరిమేశారు ముగ్గురూ కలిసి)

అసలు ఓక సినిమాకో, పార్క్ కో వెళ్లాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి.

అవును గురు, కాస్త ప్రశాంతంగా ఉంటుందని బీచ్ కి వెళదామంటే అందరూ బయల్దేరతారు వెనకాలే.

అవును బాసు, అలా జాలీగా ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ వెళదామంటే ఫామిలీ మొత్తం వచ్చి కార్లో ముందే కూచుంటారు.

అసలు ఏ సినిమా రైటర్ నో, డైరెక్టర్ నో కావాల్సిన వాడిని, ఇక్కడున్నాను ...హు

అవును గురు, నేను ఏ IT కంపెనీ కో సీఈఓ కావాల్సినవాడిని మరి .. నా ఖర్మ ఇలా తయారయ్యింది

అవును బాసు, రాజకీయాల్లో చేరి ఏ సీఎం నో, పీఎం నో కావాల్సినవాడిని. ఇలా తయారయ్యాను.

(ఇలా సాగుతోంది వారి సంభాషణ .. ఇంతలో)

గురు గురు ఒక ఐడియా

ఈ ఐడియా మన జీవితాల్ని మార్చేస్తుందా? (చెవిలో గుసగుస లాడతారు ముగ్గురు)

లాభం లేదు కష్టం వర్కవుట్ అవ్వదు ..నిరాశతో అనుకున్నారు

బాసు బాసు ... నాదొక ఐడియా (మళ్ళీ ముగ్గురు గుసగుసలాడతారు)

నో నో నో ...ఇదీ కష్టం కుదరదు

పోనీ .. “మ మ” hashtag మీ టూ మొదలెట్టి, ట్రెండ్ చేద్దామా?

లాభం లేదు గురు మనవల్ల కాదు.. మళ్ళీ నిరాశ, నిస్పృహ ఆవరించాయి ముగ్గురిలో

బాసు మనకొక్కటే దారి ... ఆ త్రిమూర్తుల్ని వేడుకుంటే సరి, వాళ్ళే మనకి దిక్కు

ఈ ఐడియా ముగ్గురికీ నచ్చింది. వున్న పళంగా ముగ్గురూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్ధించడం మొదలెట్టారు.

ఓ త్రిమూర్తులారా! మీరే మమ్మల్ని రక్షించి ఈ మగజాతికి ఓక దారి చూపాలి. ముగ్గురూ కూడబలుక్కుని ఆ త్రిమూర్తుల్ని వేడుకుంటారు.

అంతలో ఆకాశవాణి లో వార్తల్లా అశరీరవాణి గొంతులు ఇలా వినిపించాయి.

భక్తులారా! మీ భక్తికి మెచ్చితిమి. ఏం వరం కావాలో కోరుకోండి.

గురు గురు ... చూసావా మన మొర ఆలకించి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిగివచ్చినట్లున్నారు.

అవును బాసు, మనల్ని కాపాడటానికి ఆ త్రిమూర్తులే వచ్చారు, ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే.

(ముగ్గురు కలిసి) ఓ బ్రహ్మ దేవా! ఈ సృష్టి కి మూలకారకుడివి మీరే కదా స్వామి, మా “మ  మ” లను అర్ధం చేసుకునే ఆడజాతిని సృష్టించు స్వామీ.

నాయనలారా, నేను ఈ సృష్టికి ఎంత మూల కారణమైనా, మీ చదువుల తల్లి సరస్వతి అనుమతి లేకుండా ఏమీ చెయ్యలేను. నన్ను వదిలేయండి నేనేమీ చెయ్యలేను నాయనలారా.

ఓ విష్ణుమూర్తి, నువ్వన్నా మాయందు కొంచెం కనికరం చూపు స్వామి.

చూడండి నాయనలారా! నేను మాత్రం ఏమి చెయ్యగలను. మీకు తెలుసుగా మీ లక్ష్మి దేవి నా కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను లేవనీయడం లేదు. నేను నిమిత్తమాత్రుణ్ణి ఈ విషయంలో.

ఓ మహేశ్వరా! పరమేశ్వరా! హాలాహలం మింగిన వాడివి. నీకిది ఒక లెక్కా స్వామి, మమ్మల్ని కాపాడు స్వామి.

భక్తులారా! మీకష్టం నాకర్ధంఅయింది. అయినా మీకు తెలియంది కాదు కదా. ఆ పార్వతి దేవి నాలో సగభాగం, ఆమె అనుమతి లేకుండా నేనేమి చెయ్యగలను. నన్నర్ధం చేసుకొని వదిలేయండి.

అయ్యో అయ్యో మీరే అలా అంటే మా గతేమిటి మేమెవరితో చెప్పుకోవాలి స్వామి?

నసుల్ని ఎవరర్ధం చేసుకుంటారు?

భక్తులారా, ఆవేశపడకండి ఈ మగ మనసుల్ని అర్ధం చేసుకునే శక్తి  ఒక్క ‘ఆ మ’ అదే ఆ ఆడ మనసులకే వుంది. వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడండి. అదే మీ సమస్యకి పరిష్కారం.

ఏవండోయ్, ఏమిటా కలవరింతలు... లేవండి లేవండి .. త్వరగా తెమలండి ఆఫీస్ కి టైం అవుతుంది.

భార్యామణి కేక తో ఠక్కున లేచి కూర్చున్నాడు సుబ్బారావు.

ఏమిటీ ఇది  కలా, అంటూ కళ్ళు నులుముకుంటూ, ఏమ్మోయ్ అదికాదోయ్ అంటూ ఆమెకి తన ‘మగ మనసులో’ ఏముందో చెప్పటానికి ఆమె వెనకాలే పరుగుదీశాడు మన సుబ్బారావు.

********

Posted in December 2023, కథలు

11 Comments

  1. Rao Penumudi

    సుబ్బారావుకి ఈ సారి బాగాకోపం ఎక్కువావచ్చింది ఎందుకంటే ఇప్పటిదాకా మీరుఅయిన కోపంమీదకథరాయలేదు అనికోపంబాగావచ్చింది అందుకే ఈ మమగోల . ఇంక ఈ కోపంతగ్గుతుంది అందునాచలికాలం, ధన్యవాదములు – తెనాలి రామ్స్

      • Rao Penumudi

        మగ మనసు అడ మనసు అని రొండు ఉండవు , మనసు అందరిది ఒకటే , కాకపోతే తల్లికి కొంచం ఎక్కువ గా బయటకు కనపడుతుంది , తండ్రి మనసు కరుకు గా ఉంటుంది – తెనాలి రామ్స్

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!