Menu Close
మనస్సు బంధం (కథ)
-- డాక్టర్. షహనాజ్ బతుల్ --

కూరగాయల సంచి మోసుకుంటూ ఎండలో ఒక్కడినే వస్తున్నాను. బాగా ఎండగా ఉంది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.

కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. అంతా మసక మసక గా కనిపిస్తుంది. తర్వాత ఏమైందో తెలియదు. స్పృహ వచ్చేసరికి నేను ఎక్కడో ఇంటిలో మంచం మీద పడి ఉన్నాను. ఇది ఎవరి ఇల్లు నాకు ఏమీ అర్థం కాలేదు ఇది మా ఇల్లు కాదే. లేవబోయాను నీరసంగా ఉంది.

"పడుకోండి నీరసంగా ఉన్నారు" అన్నాడు అబ్బాయి.

"నువ్వు ఎవరు బాబు నేను ఎలా వచ్చాను ఇక్కడికి?" అడిగాను.

"మానవత్వం మిమల్ని ఇక్కడికి తీసుకొచ్చింది".

నాకేమీ అర్థం కాలేదు. ఆశ్చర్యంగా చూశాను అతని వైపు.

"నేను రోడ్డు మీద వెళ్తుంటే మీరు అప్పుడే కళ్ళు తిరిగి కింద పడ్డారు అంకుల్. మిమ్మల్ని మా ఇంటికి తీసుకు వచ్చాను" అన్నాడు నన్ను అర్థం చేసుకున్నట్లు.

రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయబోయాను చేతుల్ని పట్టుకున్నాడు.

"అంకుల్ మీరు పెద్దవారు మీరు నాకు నమస్కారం పెట్టకూడదు" అన్నాడు.

నేను వెళ్తాను అని లేవపోయాను.

"వద్దు అంకుల్ కాసేపు రెస్ట్ తీసుకోండి."

"నన్ను అంకుల్ అని పిలవద్దమ్మా నేను ఈ కాలం వాడిని కాదు కదా బాబాయ్ అని పిలువు ప్రేమగా." అన్నాను.

"బాబాయ్ చాలా బాగుంది నాకు బాబాయిలు పెద్దనాన్నలు లేరు నాన్న కూడా లేడు" అన్నాడు.

నా మనసుకి ఎందుకో చాలా బాధ కలిగింది.

"పాపం మీ అమ్మగారు పెంచారా మిమ్మల్ని?" అడిగాను.

"అవును బాబాయ్ మా అమ్మ ఆ కాలంలో డిగ్రీ చదివింది ఉద్యోగం చేస్తూ నన్ను పెంచింది."

"ఇంట్లో ఎవరూ లేరా?" అడిగాను.

"మా ఆవిడ ఉంది బాబు నిద్రపోతున్నాడు." అని చెప్పి భార్యని పిలిచాడు.

వంట గదిలో ఉండిందనుకుంటా చేతులు చెంగుతో తుడుచుకుంటూ వచ్చింది.

"నమస్కారం మావయ్య"అన్నది.

"మా ఆవిడ శ్వేత మీకు ఎవరున్నారు చెప్పండి బాబాయ్ వాళ్లకు ఫోన్ చేస్తాను" అన్నాడు.

"నాకు ఎవ్వరూ లేరు."

శ్వేత లోపలికి వెళ్లి ప్లేట్లో ఉప్మా పెట్టి తీసుకొచ్చింది అప్పుడే చేసినట్టుంది వేడివేడిగా ఉంది.

"బాబాయ్ మీరు ఏమీ తినలేదేమో కళ్ళు తిరిగి పడ్డారు. మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ ఉప్మా తింటే కొంచెం శక్తి వస్తుంది. "

ఎవరీ అబ్బాయి? ఏమిటీ బంధం?ఈ అబ్బాయికి నాకు ఏదో బంధం ఉంది. కన్న కొడుకులు వదిలేసి, విదేశాలకు వెళ్లి పోయారు? నన్ను ఎంతో బాగా చూసుకునే, శ్రీమతి నన్ను వదిలి సుదీర తీరాలకు వెళ్ళిపోయింది. నాకు హోటల్ తిండి పడదు. నా సీత చాలా బాగా వండేది. నేనే వండుకొని తింటున్నాను. నిన్న ఏమి తినాలని అనిపించలేదు. తినలేదు. నీరసంగ ఉన్నాను. ఎండ బాగ ఉండింది.

నన్ను తనింటికి తీసుకొచ్చాడు. ఈ కాలం లో ఎవరు ఇలా చేస్తున్నారు? ఆ అబ్బాయి ఇచ్చిన ఉప్మా తిన్నాను. ఇంటి తిండి తింటున్నాను. హాయిగా ఉంది. టీ ఇచ్చింది. దానితో టాబ్లెట్ ఇచ్చాడు.

"నువ్వు డాక్టర్ వా?"

"కాదు బాబాయి. ఇది మల్టీ విటమిన్ టాబ్లెట్. మీకు నీరసం పోవటానికి."

టీ తాగి, టాబ్లెట్ వేసుకున్నాను. నిజంగానే చురుకుదనం వచ్చేసింది. మంచం మీద నుండి లేచాను. కాస్సేపు అటు, ఇటు నడిచాను.

"బాబాయ్ మీకు పిల్లలు లేరా?"

"ఇద్దరు కొడుకులు. ఇద్దరూ విదేశాలలో ఉన్నారు."

"బాబాయ్ మీరు ఎక్కడికి వెళ్ళవద్దు. మా దగ్గరే ఉండి పొండి. నేను పదవ తరగతి చదివేటప్పుడు నాన్న గారు పోయారు. మీలో నాన్నను చూసుకుంటాను". నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా ఆ అబ్బాయిని హృదయానికి హత్తుకున్నాను.

తల పైకి ఎత్తినప్పుడు, గోడకు దండ వేసి, ఉన్న ఫోటో కనిపించింది.

"ఈ ఫోటో?"

"మా నాన్న గారిది."

"నువ్వు మా విశ్వం కొడుకువా?"

"మీరు శంకరం గారా?"

"అవును."

"మా నాన్నగారు ఎప్పుడూ మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉండేవారు."

దేవుడు నన్ను నా ప్రాణ స్నేహితుడు విశ్వం కొడుకు దగ్గరికి చేర్చాడు. ఆ కాలంలో ఇంటర్నెట్, మొబైల్స్ లేవు. మా మధ్య ఉత్తరాలు ఆగి పోయాయి. విశ్వం ఎక్కడ ఉన్నాడో తెలియదు.

మేమిద్దరం ఇంటర్ డిగ్రీ కలిసి చదివాము. మా స్నేహం జీవితాంతం ఉండాలని అనుకున్నాము. మేము తాతలము అయినా మా స్నేహం కొనసాగాలని అనుకున్నాము. ఎన్నో విషయాలు చెప్పుకునే వాళ్ళం. ఎన్నో ఆలోచనలు చేసేవాళ్లం.

నేను బ్యాంకులో మంచి ఉద్యోగం చేసాను. నాకు అదృష్టవసాత్తు అనుకూలవతి అయిన నన్ను చాలా బాగా చూసుకునే భార్య దొరికింది. కానీ నేను పదవి విరమణ చేసిన సంవత్సరానికి తను నన్ను వదిలి సుదీర తీరాలకు  వెళ్ళిపోయింది."

"బాబాయ్ మీరు మా ఇంటికి వచ్చేసేయండి నేను మిమ్మల్ని కన్నతండ్రి లాగా చూసుకుంటాను మీలో మా నాన్నని చూసుకుంటాను. నాన్నగారు చెప్పారు మిమ్మల్ని కలవమని. కానీ మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. ఫేస్ బుక్ కూడా వెతికాను. దొరకలేదు" అన్నాడు.

మళ్లీ రెండు చేతులు చాచి ఆ అబ్బాయిని హృదయానికి హత్తుకున్నాను. నేను నాకు కొడుకుని కౌగిలించుకున్న అనుభూతి కలిగింది.

ఇద్దరు కొడుకులు ఇంటిని కూడా అమ్మేసి ఆస్తులు పంచుకొని, వెళ్ళిపోయారు మీకు పెన్షన్ ఉంది కదా నాన్న అదొక్కటి మీకు చాలు కదా మీరు వండుకో లేకపోతే వృద్ధాశ్రమంలో చేరిపొండి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు.

ఈ కాలం మనుషులకు ఇదేం పిచ్చి నాకు అర్థం కాదు ప్రతి ఒక్కరూ విదేశాలకి వెళ్ళిపోతున్నారు.

ముసలి వాళ్లకు కావాల్సింది డబ్బు ఇల్లు కాదని వృద్ధాశ్రమంలో వాళ్ళు బాగా చూసుకున్న కన్న కొడుకులు మనవలు లేని లోటు అలాగే ఉంటుందని ఎలా చెప్పాలి?

ఆలోచిస్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నా కన్నీళ్లు తుడిచాడు నీ పేరేమిటి బాబు అడిగాను.

"శ్రీకాంత్."

నా మనసు గతంలోకి వెళ్లిపోయింది. ఆరోజు ఇద్దరం పార్కులో కూర్చున్నాము. ఏవో కబుర్లు చెబుతున్నాడు. ఎన్నో విషయాలు పంచుకున్నాము. నీకు పెళ్లి అయ్యాక కొడుకు పుడితే ఏం పేరు పెడతావ్ రా అడిగాడు విశ్వం.

ఏమో పెళ్లి కాలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాను. నాకు కొడుకు పుట్టినా నీకు కొడుకు పుట్టినా సేమ్ పేర్లు పెట్టుకుందాం.

ఒకవేళ మొదట కూతురు పుడితే ఆ తర్వాత కొడుకు పుడతాడు కదా అప్పుడు పెట్టుకుందాం అని చెప్పాడు. నా పేరు కూడా తనని నిర్ణయించాడు నాకు కొడుకు పుడితే శ్రీకాంత్ అని పెడతాను నీకు కొడుకు పుట్టిన శ్రీకాంత్ అని పెట్టు. అందుకే నా పెద్ద కొడుకు పేరు కూడా శ్రీకాంత్. ఇతన్నీ నేను శ్రీకాంత్ అని పిలిచినా, పెద్ద కొడుకుని పిలిచినట్టుగా అనిపిస్తుంది కదూ. దేవుని లీల. నన్ను నా కొడుకు దగ్గరికి చేర్చాడు దేవుడు అనుకున్నాను.

మేము మొదటి కొడుకుకి శ్రీకాంత్ అని పేరు పెట్టాలని అనుకున్నాము అని చెప్పాను. చూసారా బాబాయ్. మిమ్మల్ని నా దగ్గరకు చేర్చాడు, దేవుడు. మీరు మా దగ్గర ఉంటేనే, మా నాన్న ఆత్మకి శాంతి.

"మీ ఇల్లు సొంతిల్లా అద్దిల్లా?"అడిగాడు.

"అద్దె ఇల్లు."

"అయితే బాబాయ్ వెళ్లి సామాన్లు తెచ్చేసుకుందాం."

వాళ్ళ బాబు బంటి లేచి వచ్చాడు. మీ తాతయ్య అన్నాడు కొడుకుతో. రెండు చేతులు చాచాను.

వచ్చాడు ఎత్తుకున్నాను నా మనవడిని ఎత్తుకున్నట్టుగా అనుభూతి కలిగింది.

నేను శ్రీకాంత్ శ్వేతా బాబు అందరం వెళ్లి నా ఇల్లు ఖాళీ చేసి సామాన్లు తెచ్చేసుకున్నాము అయినా నా దగ్గర ఉన్నది చాలా కొద్ది సామాను.

ఇప్పుడు నాకు పెద్ద కొడుకు నా దగ్గరే ఉన్నాడు శ్రీకాంత్ దగ్గర నేను చాలా సంతోషంగా ఉన్నాను శ్రీకాంత్ శ్వేత నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.

రక్తసంబంధం కంటే మనసుతో పెనవేసుకున్న అనుబంధం గొప్పది అనిపించింది. అదే మనస్సు బంధం.

********

Posted in December 2023, కథలు

2 Comments

  1. కొత్తపల్లి ఉదయబాబు

    కధ మానవత్వపు ప్రతీకలా ఉంది. హార్దిక అభినందనలు. మీకు 👏👌👏👌

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!