Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

తెలుగు సినిమా వాచస్పతి చందాల కేశవదాసు

Chandala-Kesavadas

తెలుగునాట ఏ నాటకాల్లో అయినా మొదట పాడే ‘పరబ్రహ్మ పరమేశ్వర’ అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశ మంతటిని ఉర్రూతలూగించిన ‘భలే మంచి చౌక బేరము పోయినన్ దొరకదు’ అనే పాటను రాసిన మహానుభావుడు చందాల కేశవదాసు. ఈయన తొలి తెలుగు సినీ గీత రచయిత, నాటక కర్త, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పవచ్చు. అంతే కాకుండా తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు పాటలు రాసింది కూడా ఈయనే. ఈయన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో జక్కేపల్లి లో జూన్ 20, 1876, చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. 18,19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని `చందవోలు' గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు ప్రజల నోళ్ళలో నలిగి వాడుకలో `చందోలు' గా మారింది.

కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందినవారు. చందవోలు గ్రామం లో తెలగ వంశీయులలో వైద్య వృత్తిని సాగిస్తున్న ‘శ్రీనివాసులు’ అనే ముఖ్యుడు చందవోలు గ్రామం నుండి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన ‘గంగదేవిపాడు’కు చేరుకున్నారు. ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా, ఉదారంగా వైద్యం చేసేవారట. ఆ ఊరి వారు వీరిని సులభంగా గుర్తించేందుకు ‘చందోలు వారని’ పిలిచే వారు. కాల క్రమంలో అది ‘చందాల’ వారుగా స్థిరపడిపోయింది అని చెప్తారు. అతని  ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్య వృత్తి తో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తర్వాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారాయన. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో అన్న వెంకటరమణ యోగి నిర్వహణలోని వీధిబడిలో కేశవదాసు విద్యనభ్యసించారు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసానంతరం తాను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు. కేశవదాసుగారి వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఒడిదుడుకులు ఉన్నాయి. మొదటి భార్యకు సంతానం లేదని రెండో వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించడంతో శిష్యులు అభిమానుల వత్తిడితో
మరో రెండు వివాహాలు చేసుకున్నారు. దురదృష్ణం వెంటాడినట్టు వారిద్దరు కూడా దూరం అవ్వడంతో తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మను వివాహం చేశారు. అంటే చిట్టెమ్మ గారు వీరికి లెక్క ప్రకారం ఐదో భార్య అన్నమాట. మొదటి నలుగురి గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తిగారి సతీమణి వెంకట నర్సమ్మగారు అందించిన సమాచారం ప్రకారం తమ్మర కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మ దాసు గారి మొదటి భార్య, నడిగూడెం దగ్గర సిరిపురం అమ్మాయి రెండో భార్య, ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన మూడవ భార్య, తిరువూరు మొండి జగ్గయ్య గారి మరదలు నాలుగవ భార్య.

కేశవదాసు గారికి తిరువూరు గ్రామంతో మంచి సంబంధం ఉంది. ఆ ప్రాంతపు ఆడపడుచును వివాహం చేసుకున్నందువల్ల తన స్వంత ఖర్చులతో తిరువూరు గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికే నిర్మించిన బావిని నేటికీ ఆ గ్రామ ప్రజలు దాసు బావి అని పిలుస్తుంటారు. అంతేకాకుండా భద్రాచలం వెళ్లే యాత్రికులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటు చేసి ఉచిత అన్నదానం దాసు గారు చేసేవారు. ఆ రోజుల్లో దాసు గారు పాటలు పాడటంతో పాటు అష్టావధానం, శతావధానం చేసేవారు.

పలు దేవాలయాలకు గాలి గోపురాలు కూడా నిర్మించారు. పలు గ్రంధాలలో ఉన్న అర్థంకాని విషయాలను సులభ రీతిలో బోధించేవారు. అతను చేసిన సేవలకు తిరువూరు సంస్థానం వారు ఘనంగా సత్కరించారు. 1933- 1935 ప్రాంతాల్లో తిరువూరు, తదితర ప్రాంతాల్లో స్వాతంత్ర్య ఉద్యమం బలంగా ఉండేది. దాసు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని నింపేవారు. అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతం లోని మెలకువలు నేర్పాడు. క్రమముగా దాసు గేయ రచనలో, సంగీతం కూర్పులో, హరికథనంలో, రచనలో ఆరితేరాడు. కాంతయ్య నాటక సమాజంలో చేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్ధుడు అని రుజువు చేసుకున్నాడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణతులాభారం, రాధా కృష్ణ నాటకాలకు పాటలు రాసిచ్చాడు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తి చెప్పి తెలంగాణ అంతటా హరికథలు చెప్పారు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, మూడు పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తి భావం, సరళత్వం తొణకిసలాడుతుంటాయి.

నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగి పోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటి దాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా 'ఆలం ఆరా' అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ. అదే యేడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకుని భక్త ప్రహ్లాద చిత్రం (1931-32)న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో అతను సినీ జీవితం మొదలైంది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు వ్రాశాడు. భక్త ప్రహ్లాద  చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజిరావు షిండే, హిరణ్యకశ్యపుని మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురభి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఆమె పాడిన పరితాప భారంబు భరియింప తరమా పాటనే చందాల కేశవదాసు సినిమాకి రాసిన తొలి పాట. ఇదేగాక ఈమెనే పాడిన తనయా ఇటులన్‌ తగుపలుకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపంబునకు భీతి లేక ఇటు చేసెదవా రెండు పాటలు కూడా చందాల వారు రాశారు. చందాల కేశవదాసు గారు తొలి తెలుగు సినీ కవిగా చరిత్ర కెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద (1931-32)కు రాసిన పాటలు, 1942లో తీసిన భక్త ప్రహ్లాద లో వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం (1935)లో రాసిన పాటలు ఆ తర్వాత 1956, 1966లో అందుకే అతను తెలుగు సినిమా వాచస్పతిగా చరిత్రకెక్కారు. 1930-33 ల మధ్య కేశవదాసు రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావులు పాడగా బెంగుళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా, కేశవ శతకం, బలి బంధనం, సీతాకళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశారు.

ఈయన ఆధ్వర్యంలో బాల భారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. "కనక తార", "లంకాదహనం" వంటి నాటకాలను సినిమాలు కూడా తీసారు. తన కళాప్రదర్శనల ద్వారా పొందిన బంగారు కంకణాలను, పతకాలను దాచుకోకుండా సత్కార్యాల కోసం ఖర్చుచేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథా గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి తవ్వించి, భోజన, విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్ర స్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు. వ్యక్తిగా కూడా ఉన్నతమైన విలువలు, ఆదర్శాలకు కట్టుబడి జీవించాడు. ఏనాడూ కుల వివక్షను పాటించని వారాయన. హెచ్చు తగ్గులు మన సంస్కారాన్ని బట్టి గాని, కులాన్ని బట్టి కాదనే  వారు. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వాదించి మెప్పించేవారు. జక్కేపల్లికి దగ్గరలో ఉన్న రాజ పేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు దాసుగారి హరికథలు విని మురిసిపోయేవారు. అతను వీరాభిమాని. ఇదంతా గమనించిన దాసుగారు ఒకనాడు అతని బీదరికాన్ని చూసి తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి పక్కనే కూర్చుని విసనకర్రతో గాలి విసిరేవారు. ఈ ఒక్క సంఘటన కేశవదాసు గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తేటతెల్లం చేస్తోంది. అతను జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేశారు. వాటిలో కొన్నింటిని బెంగుళూరులోని గ్రామ ఫోన్ కంపెనీ వారు రికార్డులుగా విడుదల చేసింది తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథ గోపురం నిర్మాణానికి వాడారు. తమ్మరలో గాలిగోపురం, ధ్వజస్తంభం పనులు డబ్బులేక ఆగిపోతే ఇంటికి మనిషిని పంపించి భార్య చేతి బంగారు గాజులు తెప్పించి అమ్మారు. జగ్గయ్య పేట లో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతి బంగారు కంకణాన్ని అమ్మారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లో నాయకన్ గూడెం లో 1956 మే 14న రామనామ స్మరణతో నిద్రలేచిన దాసుగారు స్నానాదికాలు ముగించుకుని నిలువు నామాలు పెట్టుకుని ఆరోజు కొడుకు కృష్ణమూర్తిని ఎక్కడికీ వెళ్ళవద్దని ఆదేశించారట. నవ్వు ముఖం తో ప్రశాంతమైన వదనంతో ఇంట్లో వారందరినీ, ఇంటినీ ఒకసారి కలియజూసి కన్నులు మూసుకొని ధ్యానంలోకి జారిపోయారట. అలా ధ్యానం చేస్తుండగానే దీర్ఘ నిద్రయై వారికి ఇష్టమైన తమ్మర రామునిలో లీనమై పోయారని కుటుంబ సభ్యులు కళ్ళకు కట్టినట్లు చెప్తున్నారు.

********

Posted in December 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!