Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. కవులు కలమును ఝుళిపిస్తే, మార్పు వచ్చు సంఘమున!
    ఆత్మ బలమే యుండినచో, రాదు సమస్య బ్రతుకున!
  2. స్వీయ సుఖము కావలెనంటె, భయమన్నది విడిచేయి!
    పరుల సుఖము ఆశిస్తుంటె, స్వ సుఖాలను వదిలేయి!
  3. ప్రపంచాన్ని మార్చ దలచిన, ముందు నీవు మారాలి,
    దైవమునే చేరదలచిన, భక్తి బాట నడవాలి!
  4. వంచన వదిలి పెడితేనే, మంచి యోచనలు కలుగు!
    గతమును మరచి పోతేనే, బ్రతుకు సవ్యముగ జరుగు!
  5. సాధువువలె బ్రతకాలంటె, కోరికలనే త్యజించు,
    అణకువతో మెలిగినపుడే, పదుగురి మెప్పు లభించు.
  6. దైవముచే లిఖించబడును, జరుగు భువిని వివాహము,
    ఏడు జన్మల బంధనమును, విడదీయును కాగితము!
  7. ఆలు మగల నడుమనెపుడు, తగదు అన్యుల జోక్యము,
    అత్తా కోడలి సఖ్యతే, భువినియుండుట ముఖ్యము.
  8. ఎల్లలు ఎరుగని ప్రేమకే, వసుధను ప్రతీక జనని,
    అన్నా చెల్లెలు బంధమే, చెప్పదగునులె ఘనమని.
  9. అందుచుండగ ఉచితములే, మించుచుండె బద్ధకము,
    జీవన ఉపాధి దొరుకకే, నలిగె బడుగు జీవితము.
  10. వెన్న దొంగ గోవిందుడే, నాథుడు విశ్వ మంతకు,
    మన్ను తిన్న నోటనే, జగతిని చూపె యశోదకు.

**** సశేషం ****

Posted in December 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!