Menu Close
తెలుగు దోహాలు
-- దినవహి సత్యవతి --
  1. పెట్టే చేతిని విడిస్తే, పిడికెడు భిక్ష దొరకదు,
    కన్నవారిని వదిలేస్తే, దైవమైన క్షమించదు.
  2. మనసు నిజమని నమ్మినపుడు, ఆచరింపను వెరువకు
    నీది కానిది ఏదైనా, దక్కలేదని వగచకు
  3. తలచిన పని జరగవలెనా, క్షమతను కలిగియుండుము
    గమ్యము చేరే వరకూ, పయనము ఎచటా ఆపకుము
  4. శ్రమ జీవుల చెమటయే, సొమ్మౌ ధనికుల యింట!
    ఇతరుల స్వ విషయాలలో, జోక్యము అనవసరమట!
  5. అవకాశము తలుపుతడితే, మొండి చెయ్యి చూపకుము
    ధారుడ్యము లేని పునాదిపై, నిలువబోదు హర్మ్యము
  6. కడలి నీరెంత త్రాగినా, తీర్చలేదు దాహాన్ని!
    ఆకాశమును జయించినా, మరువరాదు ఇహాన్ని!
  7. మగువను అణచ చూచెదవా, తిరగబడును కాళికగా
    అన్యాయాన్ని సహించుటే, అన్యాయమౌ నిజముగా!
  8. రాజకీయ బాసలన్నీ, గాలిలోని భవనములు!
    నోటుకు ఓటు వేసేవా, మూర్ఖులపాలు పదవులు!
  9. మాటలు దొరకని తరుణములో, మౌనము సంభాషించు
    దండన పని చేయకుంటే, ప్రేమ లాఠి ఝుళిపించు!
  10. మనసు సంతులత తప్పితే, బ్రతుకు గతి దారి తప్పు,
    కుటిల యోచన కలిగినచో, సత్యాచరణకు ముప్పు!

**** సశేషం ****

Posted in November 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!