Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుని శైవ గ్రంథాలు

శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి తో కొన్ని సంవత్సరాల క్రితం కాశీకి వెళ్ళినప్పటి నుండి స్కాంద పురాణాంతర్గతమైన కాశీఖండాన్ని అనువదించాలని అనుకొన్నప్పటికీ ఆ యత్నం ఫలించలేదు. ఇప్పటికది కార్యరూపం దాల్చింది.

“బ్రాయ మింతయు మిగుల గై వ్రాలకుండ
కాశికా ఖండమను మహాగ్రంథమేను
తెనుగు జేసెద కర్ణాట దేవకటక
పద్మవనహేళి శ్రీనాథ భట్ట సుకవి!”

అని తనను గూర్చి శ్రీనాథుడు పద్యం చెప్పుకొన్నాడు. ఈ పద్యం వల్ల శ్రీనాథుడు ఏ గ్రంథం ఎప్పుడు రచించాడో తెలుస్తున్నాది.

రచనా విధానం – శైవ గ్రంథాలు

శ్రీనాథుడు శివభక్తి తత్పరతతో వ్రాసిన శైవ గ్రంథాలు: కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మహత్యం. ఇక శృంగార నైషధాదులు వేరు వేరు కథలు గల గ్రంథాలు. ఇవన్నీ దేనికదే ప్రత్యేకతను కల్గినవే.

ఆరుద్ర శివపరమైన గ్రంథాలను పరిశీలించే క్రమంలో ఒకదానికి మరొకదానికి వర్ణనలలో ఉన్న భిన్నత్వాన్ని సమానత్వాన్ని వివరించడం వల్ల పాఠకునికి ఆయా కావ్యాలు చదివిన అనుభూతి, తృప్తి, జ్ఞానం కలుగుటకు ఆస్కారం ఏర్పడింది. శ్రీనాథుడంటే పద్యాల పుట్ట. ఆయన పొట్టలో పద్యాల బంగారు గని ఉంది కాబోలు. ఆరుద్ర చక్కని విమర్శక చక్రవర్తి. అందుకే శ్రీనాథుని రచనలను పరిచయం చేసే ఆరుద్ర, అద్భుతంగా శ్రీనాథుని కావ్యాలలోనివి మరియు ఆయన (శ్రీనాథుని) చాటువులు వివరణాత్మకంగా పాఠకులకు తెల్పారు. ఆరుద్ర చూపిన కొన్ని విశేషాలు.

౧. కాశీఖండంలోనే, శృంగార నైషధంలో కన్నా శ్రీనాథుని పలుకుబడులు, సొంపులు కనపడతాయి.

౨. కాశీఖండం లోనూ, భీమఖండం లోనూ ఒకే కథాఘట్టం ఉంది. ఆ కథ –

కాశీలో భిక్ష దొరకని వ్యాసుడు కోపించి కాశీని శపించబోవడం, పార్వతి అతనిని వారించి భోజనం పెట్టిన తరువాత శివుడు వ్యాసుని కాశీని విడిచి వెళ్ళమని శపిస్తాడు.

ఇక్కడ భీమఖండం లో జరిగిన ఒక చోట సంభాషణలో కొంత లోపం శ్రీనాథునికి స్ఫురించి దానిని కాశీఖండం లో సవరించిన విషయం ఆ రెండు గ్రంథాల నుండి పద్యాలు చూపి తెలిపాడు. మొదటిది భీమఖండం లోని పద్యం –

భిక్ష లేదని ఇంత కోపింతురయ్య
----నీ మనశ్శుద్ధి తెలియంగ నీలకంఠు
డింత జేసెను గాక కూదేమి చ్రాతి !!

ఇది మొదటి పద్యం (పార్వతి చెప్పినది). ఇందులో మొదటనే నిన్ను పరీక్షించుటకు శివుడు పెట్టిన పరీక్ష ఇది అని పార్వతి చెబుతుంది. ఇలా చేస్తే కథలో పస ఉండదని తర్వాత గ్రహించిన శ్రీనాథుడు కాశీఖండంలో కథ మార్చాడు. మొదట వ్యాసుడు కాశీని శపిస్తూ తిట్టబోగా అమ్మణ్ణి పెద్ద ముత్తైదువ వలె వెళ్లి హితోపదేశం, అటుపై కాశీ ప్రశంస మొదలైనవి జరిగినట్లు వ్రాయడం వల్ల కథ సందర్భోచితంగా సాగింది.

ఆ కంఠంబుగ వేడ్కతో నిపుడు భిక్షాన్నంబు లేనంత మాత్రాన – “ఓ మునీశ్వర! వినవయ్య యున్న యూరు గన్న తల్లియు నొక్క రూపన్నరీతి”...శివుని అర్థాంగి అన్నపూర్ణ ఉన్న కాశీని శపించవచ్చా” అంటూ అసలు విషయం (భీమఖండం లో మాదిరి) చెప్పకుండా హితోపదేశం చేసి, వ్యాసునికి భోజనం పెట్టిన తరువాత నెమ్మదిగా ఇది ‘శివుని యొక్క పరీక్ష’ అని చెప్పడం వల్ల కథ రక్తి కట్టింది. ఇక్కడ ఒక మంచి విషయం మనకు స్ఫురిస్తుంది. ఆకటి బాధతో ఉన్న వారిని ఆదరించాలే గాని ఆరడి పెట్టకూడదు. అన్న సత్యం ఈ ఘట్టంలో పార్వతి నిరూపించింది.

కుందాడుట, కుడిచి కూర్చొన్న తర్వాత, ఆకొనుట మొదలైన తెలుగు పదాలు శ్రీనాథుని మాతృభాషా పాండిత్యానికి మచ్చు తునకలు.

వ్యాసుడు, భీమఖండంలో తనను భిక్షకు పిలించింది పార్వతి అని గ్రహించడు. కానీ కాశీఖండం లో నిండు ముత్తైదువ వలె వచ్చిన అన్నపూర్ణ ను జూచి

......బుద్ది గృపజేసి రక్షింపు పున్యసాధ్వి
కాన నీ పేరు నాకు నిక్కముగ జెప్పు!

అంటూ, అప్పుడు పార్వతి చెప్పిన సమాధాన పద్యం మొదట్లో “ఊకో” అనే పదం శ్రీనాథుడు వాడాడు.  దీనిని గూర్చి చెబుతూ ఆరుద్ర ఇది ఆనాటి వ్యావహారిక భాషాపదం కాబోలు ఇలాంటివి కాశీఖండం లో అక్కడక్కడా కనబడుతున్నాయి అని వివరించాడు. (స.ఆం.సా. పేజి 727-28).

అలాగే మరువక- మారాక, అనక, అనాక మొదలైనవి తిక్కన వాడినట్లు ఆరుద్ర మాట.

భీమఖండ, కాశీఖండాల నుండి మంచి పద్యాలను ఆరుద్ర పరిచయం చేసి వాటిని గూర్చి వివరించాడు.

శివరాత్రి మహత్యం

ప్రాయం కైవాలే దినాలలో హాయిగా పిల్లాపాపలతో కాలం గడిపే అదృష్టం శ్రీనాథునికి దూరమైంది. కాశీఖండం రచనానంతరం రెడ్డిరాజుల తేజస్సు నశించింది. గజపతుల తళ్ళు ప్రారంభం కాగానే శ్రీనాథుడు మళ్ళీ దేశాటనకు బయలుదేరవలసి వచ్చింది. విజయనగర రాజుల సామంతుడైన మైలార రెడ్డిని దినవెచ్చానికి ఆశ్రయించాడు.

మైలార రెడ్డి విజయనగరంలో ప్రౌఢ దేవరాయల వద్ద మంచి స్థానం ఆక్రమించి యుద్ధంలో సహాయం చేశాడు. శ్రీనాథునికి మైలార రెడ్డి మరణం వరకు దినవెచ్చం అందేదని ఆరుద్ర మాట. ఆయన మరణానంతరం శ్రీనాథుడు శ్రీశైలానికి వెళ్ళినట్లున్నాడన్నారు ఆరుద్ర.

శ్రీశైలంలో పండితారాధ్య పీఠం ఉండేది. దానికి సంత భిక్షవృత్తి యతీశ్వరుడు అధికారి. ఇతని వైభవం రాజులకు మించి ఉండేది. శ్రీనాథుడు ఈ యతీశ్వరుని కలుసుకొన్నాడు. యతీశ్వరునికి మూల భ్రుత్యుడైన పువ్వుల కాంతయ్యకు శివరాత్రి మహత్యం రాసి అంకితమివ్వమని శ్రీనాథునికి యతీశ్వరుడు ఆదేశించాడు. శ్రీనాథుడు ఆరు ఆశ్వాసాల గ్రంథం -శివరాత్రి మహత్యం రాసి కాంతయ్యకు అంకితమిచ్చాడు.

శివరాత్రి మహత్యం మొదట 4 ఆశ్వాసాలు మాత్రమె లభించాయి. దానిని ఆంధ్ర సాహిత్య అకాడెమీ ముద్రించింది. అని ఆరుద్ర ఆ గ్రంథంలోని కథను ప్రస్తావించాడు. అంతేగాక ఈ గ్రంథం శ్రీనాథుడు పూర్తిగా వ్రాశాడని, అది డా. బిరుదరాజు రామరాజు గారు సంపాదించారనే మంచి వార్తను ఆరుద్ర అందించారు. (స.ఆం.సా. పేజీ 731).

**** సశేషం ****

Posted in November 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!