Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

నువ్వు వేదానివా...?
లేక వాదానివా...?
కాక కాటి కాపరివా...?
లేక మేటి విశ్వనాధుడివా...?
నువ్వేమిటో నీ అవతారాలేమిటో...?
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నేను ఇసుక రేణువును...
నువ్వు మసక తీసే కాంతి రేణువు...
నేను నవరంధ్రాల వేణువును...
నువ్వు రాగాలను ఊదే వేకువవు...
వేణువైన వేకువైనా నీ కేళి పాచిక కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా..

అందరూ దూరమైతే దగ్గరైయ్యావు
అందరూ దగ్గరైతే దూరమైతావా...
కాలేవు...
ఎందుకంటే
నా మనసు నీ స్మరణకు స్నేహమైంది...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

అమ్మ నాన్న ఆశ నీకో ఆట...
ఆ ఆశకు నేను పుట్టుట ఓ ఆట...
నాకు ఓ కొడుకు పుట్టుట ఇంకో ఆట...
కాలపు కట్టపై ఆడుకోవడమే నీ పనట...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నా కడుపుకు ఇంత బువ్వపెట్టావు...
నా మనసుకు ఇంత భక్తిని ఇచ్చావు...
నా మెదడుకు నిన్ను తలచే తపనిచ్చావు...
నా కర్మపోవడానికి కష్టం ఇచ్చావు...
నా రాకకై శ్మశానంలో ఎదురుచూస్తున్నావు...
ఇంతకన్నా ఏం కావాలి నాకు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నేను వేదం చదవలేదు...
నాదం సాధన చేయలేదు...
శ్లోకము నేర్వలేదు...
శోకమునే అభిషేమనుకుని తడిసి
నను తరింపజేస్తివా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీ స్మరణే నా శ్రీశైలం...
నీ ద్యాసే నా ద్రాక్షారామం...
నీ కరుణే నా కాశీ...
నా మనసే నీ కైలాసం...
కుటుంబ సమేతంగా వచ్చావా....
ఈ దేహ దేవాలయంలోకి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు
నా మనసుపై
తాండవించి
నన్ను
తడిపితివి సదాశివా...
నీ దయే నా దేహం...
నా జన్మే ధన్యం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

ఓ సదాశివా
నిన్ను చూస్తే...
అదో ఆనందం...
అదో అహ్లాదం...
అదో అనుబంధం...
ఎందుకలా...
ఏమో ఎందుకలా జరుగుతుందో నీకే తెలుసు...
నీదే కదా నా మనసు...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీ తలపై గంగ బరువు సరిపోలేదా
పాము తన తలపై మణి నీపై పెడితే మోక్షమిస్తివా...
నీ ఇల్లు కైలాసం  చాలదా...
సాలీడు గూడు కడితే మోక్షమిస్తివా...
నీ జటలో నీరు తక్కువైందా...
ఏనుగు తొండం నీటికి తడిసి మోక్షమిస్తివా...
నీ ఆటే శ్రీకాళహస్తి...
ఏనాటీ భాగ్యమో నీతో నాకీ దోస్తి...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in November 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!