Menu Close
Satyam-Mandapati
‘అనగనగా ఆనాటి కథ’ 15
సత్యం మందపాటి

స్పందన

నేను ఇప్పటిదాకా వ్రాసిన, ఇంకా వ్రాస్తున్న చాల కథలలాగానే ఈ కథ కూడా ఒక జరిగిన సంఘటన ఆధారంగా వ్రాసినదే. ఆరోజుల్లో నేనొకసారి ఏదో పని మీద గుంటూరునించి విజయవాడకు రైల్లో వెళుతున్నప్పుడు, నా కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటన చూసి, ఎంతో బాధ వేసి అప్పటికప్పుడు అల్లిన కథ. ముగింపు మాత్రం, నేను కథకి కావలసినట్టుగా మార్చి వ్రాసినదే. ఇది 1978 సంవత్సరంలో “ఆంధ్రభూమి” వారపత్రికలో ప్రచురించారు. ఈ కథ తమిళంలోకి అనువదింపబడింది. ‘సావి’, ‘ఆనందవికటన్’ మొదలైన ప్రముఖ తమిళ పత్రికల్లో ప్రచురింపబడిన నా నాలుగు అనువాద కథల్లో ఇదే మొదటిది. ఈ అనువాదాలు చేసిన మిత్రుడు ‘వేల్’ (డాక్టర్ కనకవేల్)కు నేనెప్పుడూ కృతజ్ఞుడినే. ‘సావి’ తమిళ మాసపత్రికలో ప్రచురింపబడిన ఈ కథ సైజులో చాల చిన్నదే అయినా, ఆ రోజుల్లో రెండు భాషా పత్రికల ద్వారానూ పలువురి ప్రశంసలు అందుకున్నది.

‘కృష్ణార్పణం’

(ఈ కథ ‘ఆంధ్రభూమి వారపత్రిక’ ఏప్రిల్ 27, 1978 సంచికలో ప్రచురింపబడింది.)

Krishnarpanam story image

మద్రాస్ – కాకినాడ సర్కార్ ఎక్స్‌ప్రెస్, పాసెంజర్ కన్నా నెమ్మదిగా వెడుతున్నది.

ఆ కంపార్ట్‌మెంటులో ఉన్న జనం, కొందరు రకరకాల విషయాల మీద చర్చలతోనూ, కొందరు ప్రకృతి ఆస్వాదనలోనూ, కొందరు ఏవో పుస్తకాలు చదువుకుంటూనూ, కొందరు మెల్లగా వెడుతున్న ట్రైన్ మీద విసుక్కుంటూనూ కూర్చుని ఉన్నారు.

అప్పుడే వాళ్ళ కళ్ళెదుట పడింది ఆ అమ్మాయి. నల్లగా, ఒళ్ళంతా మురికితో ఉంది. శరీరం మీద మాసిన ఒక డ్రాయర్ తప్ప వేరే ఏమీ లేదు. తైల సంస్కారం లేని జుట్టు, చిందరవందరగా ఎగిరెగిరి పడుతున్నది. కళ్ళల్లో కళ లేదు, ప్రాణాలు పెట్టుకుని ఉంది. ఆ అమ్మాయికి ఐదారేళ్ళ వయసుంటుందేమో. పొట్ట లోపలకి పోయి ఎముకలు స్పష్టంగా కనపడుతున్నాయి. నీరసంగా నడుస్తున్నది. ఇంకా నీరసంగా, కనీసం ఒక పైసా అయినా ధర్మం చేయమని అడుగుతున్నది.

ఎవరూ ఆ అమ్మాయిని పట్టించుకోవటం లేదు.

“మూడు రోజుల నుంచీ ఏమీ తినలేదు బాబూ. ఒక్క పైసా ముష్టి వేయండి బాబూ” అంటున్నది.

పళ్ళులేని ముసలాయన పైకి ఏమాత్రం వినపడనంత మెల్లగా సణుక్కుని, చేతిలోని భగవద్గీతను చదువుకుంటున్నాడు.

“గొంతు ఆరిపోతున్నదమ్మా, ధర్మం చేయండి తల్లీ” ఆ మహా ఇల్లాలు మహా కోపంగా చూసింది.

“బాబూ, ధర్మం”

కొత్త పెళ్ళాం నున్నటి భుజాలకు ఆనుకుని కూర్చున్న కళ్ళజోడు కుర్రవాడు విసుక్కున్నాడు.

“ఛీ పో” అని కూడా అన్నాడు.

“అమ్మా, ముష్టి”

“ఛీ! ముదనష్టపు ముష్టివాళ్ళు” పట్టు చీర ఆవిడ కసురుకున్నది, పట్టు చీర మడతలు చేత్తో సర్దుకుంటూ.

“అమ్మా, ఆకలి”

“అయ్యా, ఆకలి”

“ప్రాణాలు పోతున్నాయి, తల్లీ”

“మూడు రోజుల నించీ తిండిలేక చచ్చిపోతున్నాను, తండ్రీ”

ఆ పిల్ల మాటలు, కృష్ణా బ్రిడ్జి మీద ట్రైన్ “టక్ టక్”మని పెద్దగా చేస్తున్న శబ్దంలో కలసిపోతున్నాయి.

క్రింద పారుతున్న కృష్ణానది, కాన్పుకి పుట్టింటికి వచ్చిన నిండు చూలాలులా ఉంది.

భగవద్గీతని పక్కన పెట్టి, ముసలాయన కృష్ణానదికి నమస్కారం చేశాడు. లాల్చీ జేబులోనించీ ఒక పావలా బిళ్ళ తీశాడు. ముష్టి అమ్మాయి ఆశగా, ఆబగా ఆయన్నీ, ఆయన చేతిలోని నాణాన్నీ చూస్తున్నది.

చటుక్కున ఆయన చేతిలోని పావలా బిళ్ళని కృష్ణవేణి నదీ గర్భంలోకి విసిరేసి, ఆ పుణ్యనదికి దణ్ణం పెట్టుకుని, ‘కృష్ణార్పణం’ అన్నాడు.

తళుక్కున ఆ అమ్మాయి కళ్ళ ముందు మెరిసిన ఆ చిల్లర నాణెం, ఆ పిల్ల కళ్ళల్లోని నీళ్ళ ముందే నీళ్ళపాలయింది.

ఆయన రెట్టింపయిన తన పుణ్యంతో, మళ్ళీ భగవద్గీతని చదువుకోవటం మొదలుపెట్టాడు.

మహా ఇల్లాలు లేచి, “కృష్ణమ్మ తల్లీ, మమ్మల్ని కాపాడి జాగ్రత్తగా చూసుకో” అంటూనే చెంగున దోపిన ఒక అర్థ రూపాయి బిళ్ళ తీసి నదిలో వేసి నమస్కారం చేసింది.

ఆనుకుని కూర్చున్న మొగుణ్ణి, బంగారు గాజులతో నిండిపోయిన చేత్తో సుతారంగా ప్రక్కకు తోసి, ఎర్రటి హాండ్ బాగ్ తెరిచి, రెండు అర్ధ రూపాయి బిళ్ళలు తీసి, వాటిని నీటిపాలు చేసి, మళ్ళీ అతన్ని ఆనుకుని, అతని కళ్ళల్లోకి గోముగా చూసిందతని కొత్త పెళ్ళాం.

అతను ఆమె కళ్ళల్లో తన అర్థ భాగం పుణ్యం కోసం వెతుకుతున్నాడు.

పట్టు చీర ఆవిడ కూడా లేచి, పట్టు చీరని ఒకసారి సర్దుకుని, ఒక రూపాయ బిళ్ళతో పాటు, కాస్త పసుపూ కుంకుమా కూడా నీళ్లల్లోకి విసరి నమస్కారం చేసింది.

తను ఇక్కడ ఆకలితో చస్తున్నా తనకేమీ ఇవ్వకుండా, అలా అంత డబ్బు నీళ్ళల్లో ఎందుకు విసిరేస్తున్నారో ఆ ఐదేళ్ళ ముష్టి పిల్లకు అర్థం కాలేదు. అయినా అది ప్రతిరోజూ చూస్తున్న వ్యవహారమే కనుక, ఏదో ఆలోచిస్తూ తన ఆకలి కడుపులో నొప్పిగా ఉంటే, పీక్కుపోయిన ఆ పొట్ట మీద చేత్తో రుద్దుకుంటున్నది.

బహుశా తను కూడా చదువుకుని ఉంటే, ఆ ‘అర్థం’ అర్థమయేదనుకుంటున్నదేమో!

ట్రైన్ కృష్ణానదిని దాటిన తర్వాత విజయవాడ స్టేషన్లో ఆగింది.

ముష్టి అమ్మాయి, తన దురదృష్టాన్ని మరోసారి తలుచుకుంటూ, నీరసంగా ట్రైన్ దిగబోయింది.

కళ్ళు తిరిగి ప్లాట్‌ఫారం మీద స్పృహ తప్పి ధబేల్‌మని పడిపోయింది.

మరిక లేవలేదు.

ట్రైన్ బయల్దేరింది.

అక్కడే కిటికీ దగ్గర కూర్చున్న ముసలాయన, భగవద్గీతలోనించీ తల ఎత్తి చూసి, “కృష్ణార్పణం” అని, మళ్ళీ భగవద్గీత చదవటంలో ముణిగిపోయాడు.

౦                            ౦                            ౦

చివరి మాటలుః (ఈ కథలో నేను వ్రాసిన చిల్లర డబ్బులు పావలాకి, అర్థ రూపాయికి, ఒక్క రూపాయకి ఏమి కొనగలరు అనే అనుమానం మీలో కొందరికి వస్తుందని నాకు అనుమానం వచ్చింది. 1960, 1970లలో ఒక్క పావలాకి చట్నీ, సాంబారులతో సహా రెండు ఇడ్లీలు, లేదా ఒక దోశ కొనుక్కునే వాళ్ళం. ఒక్క రూపాయికి కొన్ని చిన్నపాటి హోటళ్ళలో ప్లేటు భోజనమే దొరికేది. అలా నీళ్ళపాలయిన నాణాలలో ఏది ఇచ్చినా, ఆ చిన్ని ప్రాణం బ్రతికిపోయేది కదూ!)

Posted in November 2023, కథలు

4 Comments

  1. Sreenivas Iruvanti

    నిజమే. దేవుడికి అన్ని చేస్తాం, కానీ పక్కనున్న వాళ్ళని పట్టించుకోము. పాలాభిషేకాలు చేస్తాము, కానీ ఆ పాలను లేనివాళ్లకు ఇస్తే ఎంతో సంతోషిస్తారు.

    • సత్యం మందపాటి

      అవునండీ, అందుకే కదా నా బాధ. ఈ కథ. ధవ్యవాదాలు.

    • సత్యం మందపాటి

      ధన్యవాదాలు రావుగారు. ఈ కథ మీకు నచ్చినందుకు సంతోషం. కానీ పరిస్థితులే ఇంకా మారినట్టు లేదు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!