Menu Close
Shyama-Sundara-Rao
తెలుగు తేజాలు
అంబడిపూడి శ్యామసుందర రావు

వ్యాకరణ దిగ్గజము "దువ్వూరి వేంకటరమణ శాస్త్రి" గారు

Duvvuri-Venkata-Ramana-Sastry

ఎక్కువ చదువుకోకపోయినా వ్యాకరణం మాత్రము నేర్చుకో అని పెద్దలు చెబుతారు. భాష ఏదైనా వ్యాకరణము చాలా అవసరం. ఆ విషయం వేరే చెప్పనవసరం లేదు. తెలుగు భాషలో పరవస్తు చిన్నయ సూరి, నేటికీ గొప్ప వ్యాకరణ వేత్త గా చెప్పుకుంటారు. ఆయన తరువాత అటువంటి వ్యాకరణ దిగ్గజము, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, కళాప్రపూర్ణ గ్రహీత "దువ్వూరి వేంకటరమణ శాస్త్రి" గారి గురించి తెలుసుకుందాము.

వీరు తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జిల్లా) లో, ద్రాక్షారామానికి దగ్గర లో ఉన్న మసకపల్లి గ్రామంలో 1898 మార్చి 25న (విళంబి నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు) పండిత కుటుంబంలో వర్ధని, పార్వతీశం దంపతులకు జన్మించారు. వారి ఇంటి పేరు దువ్వూరి. దువ్వూరు అనే గ్రామం నెల్లూరు జిల్లాలో ఉన్నది. వీరి పూర్వీకులు మొదట్లో ఆ గ్రామంలో ఉండి క్రమేణా గోదావరి ప్రాంతం చేరారు. అందుచేత వీరు దువ్వూరి వారయ్యారు. వీరి తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. విద్యాభ్యాసం తాతగారైన రామచంద్రుడు గారి వద్ద జరిగింది. ఆయన సుప్రసిద్ధ వేదవేత్త. తాత మనవళ్ళు ఇద్దరు చదువు ముగిసిన తర్వాత ఎక్కువగా "కట్టు శ్లోకాలు" అనే చిత్రమైన సారస్వత క్రీడా వినోద ప్రక్రియ ఆడేవారు. ఇది నేటి అంత్యాక్షరి లాంటిది. అయితే ఈ సారస్వత క్రీడా వినోద ప్రక్రియలో పాటలతో కాకుండా శ్లోకాలతో ఆడాలి. ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి పిన తాత లింగయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృత కావ్య నాటకాలు అభ్యసించారు. అనంతరం తంగేడు గ్రామంలో ఉప్పులూరి గంగాధర శాస్త్రి గారి వద్ద, ద్రాక్షారామంలో కొండయ్య
శాస్త్రి గారి వద్ద, కొంకుదురు గ్రామంలో వేదుల సూర్యనారాయణ శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణము (సిద్ధాంత కౌముది) చదువుకున్నారు.

ఆయన 1914 సంవత్సరంలో విజయనగరం సంస్కృత కళాశాల విద్యార్థిగా చేరారు. ఆ కాలంలో గుదిమెళ్ళ వరదాచార్యులు గారు కాలేజీ అధ్యక్షుడు, కిళాంబి రామానుజాచార్యులు వైస్ ప్రిన్సిపాల్, సంస్కృత భాషా బోధకులుగా, వజ్ఝల సీతారామ స్వామి శాస్త్రులు తెలుగు బోధకులుగా పని చేసేవారు. రమణ శాస్త్రి గారు అటువంటి ఉద్దండుల వద్ద విద్యను అభ్యసించి విద్వాన్ పట్టాను పొందారు. వీరి వివాహం పదిహేనేళ్ళ వయసులో కోనసీమలో అమలాపురం తాలూకా ఇందుపల్లి గ్రామంలో జరిగింది. వీరి మామగారు వంక జగన్నాధ శాస్త్రి. ఆయన 1918లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి "విద్వాన్" పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

వడ్లమాని విశ్వనాథశాస్త్రి, వడ్లమాని లక్ష్మీనరసింహశాస్త్రి, సోమావజ్ఝల సత్యనారాయణ శాస్త్రి, గుళ్లపల్లి వేంకటేశ్వర శాస్త్రి నలుగురు వీరి సహాధ్యాయులుగా విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులయినారు. కొద్దికాలము విజయనగరం, కొవ్వూరు, చాల కాలము చిట్టి గూడూరు సంస్కృత కళాశాలలో పనిచేశారు. తరువాత 1942-63 మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో వ్యాకరణ పండితులుగా సేవలందించారు. 65 ఏళ్ల వయస్సు నాటికి మొత్తం 45 ఏళ్ళు బోధనా వృత్తిలో ఉండి తెలుగునాట మూడు తరాల సంస్కృతాంధ్ర పండితులెందరినో తయారు చేశారు.

రమణ శాస్త్రి గారి పేరు చెప్పగానే బాల వ్యాకరణము చదువుకున్న వారందరికీ "రమణీయము" గ్రంధము గుర్తుకు వస్తుంది. ఈ గ్రంథం వీరికి అత్యంత పేరు ప్రఖ్యాతులు ఆర్జించి పెట్టింది. వీరి ప్రతిభకు ఈ గ్రంథం నిదర్శనం. ఈ గ్రంథం విశ్వ విద్యాలయాల స్థాయిలో చిరస్మరణీయంగా నిలిచింది. ఈ గ్రంధాన్ని వ్యాఖ్యానం రూపముగా కాకుండా సమీక్ష రూపంలో రచించారు. వ్యాకరణము, కావ్యాలు, నాటకాలు అంత ఆకర్షణీయమైన అంశం కాకపోయినప్పటికీ రమణ శాస్త్రి గారు ఆకట్టుకునే శైలిలో భోధించటంలో లక్ష్మణశాస్త్రి గారు విశేషమైన ప్రజ్ఞాపాటవాలను చూపేవారు. ఈ గ్రంథం విశ్వవిద్యాలయ స్థాయి లో చిరస్మరణీయంగా నిలిచింది. చిన్నయ సూరి 18 ఏళ్ళు అహోరాత్రాలు కృషి చేసి రచించిన బాల వ్యాకరణాన్ని శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారు "హరికారికావళి" అనే పేరుతో సంస్కృతీకరించారు. కాలక్రమేణా హారికారికావళియే మూల గ్రంథము అని బాలవ్యాకరణము దాని అనువాదమని కొందరు వాదం లేవదీశారు. కానీ దువ్వూరి ప్రామాణిక నిదర్శనాలతో బాల వ్యాకరణం స్వతంత్రమైన మూల గ్రంథము అని, హారికారికవళి దానికి అనువాద గ్రంథము అని ఋజువు చేశారు. దీనికి సంబంధించిన 40 పేజీల వ్యాసాన్ని రచించి 1993లో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికలో ప్రచురించారు. ఇది దువ్వూరి వారి ప్రతిభకు మరో నిదర్శనంగా చెప్పవచ్చు. అలాగే పింగళి సూరన గారి ప్రబంధ కావ్యం కళాపూర్ణోదయం ను సరసమైన వచనంలో "కలభాషిణి" పేరుతో రచించారు. పూర్వ ఎస్.ఎస్.ఎల్.సి విద్యార్థులకు ఇది చాలా కాలం పాఠ్య గ్రంధముగా ఉండేది. వీరు 1976వ సంవత్సరంలో మార్చి 6వ తేదీన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ 78వ ఏట కీర్తిశేషులైనారు.

********

Posted in November 2023, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!