Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

అద్వైతంలో దైవం

అచ్చులు, హల్లులు నేర్వగానే చదువు పూర్తయినట్లెలా కాదో, పురోహితులు చెప్పే పురాణ కథలు విని, అందులో చెప్పబడ్డ పూజలు చేయగానే దేవుడి గురించి తెలుసుకోవడం వీలు కాదు. ఆధ్యాత్మిక మార్గంలో అది కేవలం ప్రాథమిక స్థాయి వంటిది. మరీ ముఖ్యంగా హిందూ దేశంలో అద్వైతులెవరూ వ్యక్తిక దైవాన్ని ఆమోదించరు. ఆరాధించలేరు. వారు చేసేదంతా శాశ్వత సత్యం గురించి అన్వేషణ. వ్యక్తిక దైవాన్ని ఆరాధించేవారెవరైనా, ఏ మతస్తులైనా, వారంతా పౌరాణికులే!

అద్వైతంలో ప్రతిపాదించబడిన దైవం సమిష్టి స్వరూపుడు. సర్వమూ ఆ దైవంలోనివే. భగవంతునికి మూడు లక్షణాలు ఉన్నాయని అద్వైత సిద్ధాంతం. అవి అఖండ సత్త (ఉనికి), అఖండ చిత్తు (జ్ఞానం), అఖండానందం. ఓం సత్ చిత్ ఆనందం అనే ఉపనిషద్ వాక్యం సూచించేదదే. వీటిలో మనం చర్చించాల్సింది అఖండ సత్ గురించి. అఖండ సత్ అంటే ఈ విశ్వమే. భగవంతుడు అనే పదం ఈ విశ్వానికి పర్యాయ పదమే.

అద్వైత సిద్ధాంత కర్త గౌడపాదులైనప్పటికీ, దానిని విస్తరింపజేసింది ఆది శంకరాచార్యులు. శంకరాచార్యుల సిద్ధాంతంలో మాయావాదానికి అధిక ప్రాధాన్యతనివ్వడం గుజ్జును వాడాలి టెంకను తినడానికి ప్రయత్నించడం వంటిది. కనబడే ఈ లోకానికి శాశ్వత అస్తిత్వం అశాశ్వత అస్తిత్వం లేదు కాబట్టి అది వ్యవహారిక సత్యమని అద్వైతులంటారు. కేవలం ఈ మాటను పట్టుకుని అద్వైతాన్ని తూలనాడడం అసంబద్ధం. అసమంజసం. మనిషికి కనబడే ఈ జగత్తును శంకరులు వ్యవహారిక సత్యమని అన్నారు కానీ అసత్యమని అనలేదు కదా!

అద్వైతంలో మనం ముఖ్యంగా అర్ధం చేసుకోవాల్సింది దైవం గురించి ఏమి చెప్పారు, ఎలా చెప్పారన్నది. శంకరులు దైవమంటే శుద్ధమైన చైతన్యమని అన్నారు. నిర్జీవ పదార్ధానికి చైతన్యం తోడైనపుడే అది ఉనికిలోకి వస్తుంది. ఈ విశ్వం ఎల్లప్పుడూ ఉనికిలోనే ఉంటుందని, విశ్వానికి ఆద్యంతాలు లేవని శాస్త్రీయ నిరూపణ. ఎల్లప్పుడూ విశ్వం ఉనికిలోనే ఉంటుందంటే, పదార్ధం, చైతన్యం, ఎల్లప్పుడూ కలిసే ఉంటాయని కదా భావం. పదార్ధానికి విడిగా చైతన్యానికి ఎలా అస్తిత్వం ఉండదో, అలానే చైతన్యం లేకుండా పదార్ధం యొక్క ఉనికికి అర్ధం లేదు. పదార్ధాన్ని అంటే ఈ ప్రకృతిని శక్తి అని, చైతన్యాన్ని బ్రహ్మన్ అని అద్వైతం చెబుతుంది. శక్తిని స్త్రీ రూపంగాను, చైతన్యాన్ని పురుష రూపంగాను భావించి పౌరాణికులు అలంకారికంగా కథలల్లారంతే. ఈ అవగాహన ఉంటే ఆస్తిక, నాస్తిక గొడవలతో అనవసర చర్చలు ఉండనే ఉండవు.

బ్రహ్మన్ హేతువుకు అందడు అని శంకరులు తేల్చి చెప్పారు. చర్చలు, తర్కాలు మానవుడికి గోచరమయ్యే విషయాలకు పనికి వస్తాయి కానీ, అతనికి అగోచరమైన దైవం గురించి తెలుసుకోవడానికి పనికి రావని అద్వైతుల అభిప్రాయం. సత్యం అనుభవవేద్యమే కానీ, తర్కాలతో, చర్చలతో నిర్ణయింపబడేదో, గోచరమయ్యేదో కాదన్నది అద్వైత సిద్ధాంతం. మానవుడు దైవాన్ని గుర్తించగలిగితే, అదంటూ జరిగేది అతని హృదయంలోనే. ఎందుకంటే ఈ అనంత విశ్వమంతా ఉన్న చైతన్యమే కదా మనిషిలోనూ ఉన్నది. అలానే శక్తి కూడా మనిషిలో అనేక రూపాల్లో ఉంటుంది. క్రియా శక్తి, జ్ఞాన శక్తి, కుండలినీ శక్తి వంటివి. ఈ శక్తులను జాగృతం చేసుకోవడమే మానవ జీవిత పరమార్ధం. “THE KINGDOM OF GOD IS WITHIN YOU” అన్న లియో టాల్స్టాయ్ వాక్యం అద్వైతానికి ముందుమాట వంటిది.

వ్యక్తిక దైవం అంటే మానవ రూపంలోనే ఉండేటువంటి, పరలోకంలో ఉంటూ భూలోకాన్ని శాసించేటువంటి సర్వశక్తిమంతుడు. అతను కూడా మనలానే ఒక వ్యక్తి. కాకుంటే మనిషి కంటే గొప్పవాడు. శక్తిమంతుడు. కాబట్టే దైవం అనే పేరు. మానవుడు తన ప్రవృత్తికి అనుగుణమైన దైవాన్ని ఆరాధిస్తాడు. అంతే కాకుండా తన అవసరాలను తీర్చేటువంటి దైవాన్ని పూజిస్తాడు. వ్యక్తిక దైవానికి మనిషిలానే భావోద్వేగాలుంటాయి. మతాలన్నీ ఇటువంటి దైవాన్నే ప్రతిపాదించాయి.

ఈ జగత్తులో మార్పు నిత్యమూ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వైరాగ్య భావంతో దాన్ని మాయ అన్నారు. ఎందుకంటే నేను, నాది అన్న భావనే కదా మనుషుల మధ్య విరోధానికి కారణం. మానవవాదులు సహితం  కోరుకునేది మనుషుల మధ్య సహకార భావన ఉండాలనే కదా. అద్వైత సిద్ధాంత సారాంశాన్ని మానవుడు అర్ధం చేసుకుంటే, సమస్త ప్రాణకోటి, సమస్త ప్రకృతిలోను అంతర్గతంగా ఆ దైవం నెలకొని ఉంటాడని అవగతం చేసుకుని, వసుధైక కుటుంబం అన్న ఆర్యోక్తిని నిజం చేయగలడు.

Advaithamlo-Daivam

ఈ అద్వైత ధర్మాన్నే నైతిక దృక్పథం నుండి బుద్ధుడు, వైజ్ఞానిక దృక్పథం నుండి శంకరుడు చూచి బోధనలు చేశారని, విశ్వమానవ ప్రేమ కారుణ్యాలతో పొంగారు బుద్ధుని హృదయం, తేజో దుర్నిరీక్షయమైన శంకరుని బుద్ధి నేడు వియ్యమందాలి, ఆ సంబంధం వల్ల, అత్యున్నత తత్వజ్ఞానం వెలువడగలదు. అప్పుడు భౌతిక శాస్త్రాలకు, ఆస్తిక ధర్మానికి మధ్య వైరం నశించి సఖ్యత చేకూరగలదని, ఇది భావి కాలపు మతం కాగలదని, స్వామి వివేకానంద తన జ్ఞాన యోగ ప్రసంగాలలో ఆశాభావం వ్యక్తం చేశారు.

- ఓం తత్ సత్ -

Posted in November 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!