Menu Close
Venkat Nagam
మన ఊరి రచ్చబండ
వెంకట్ నాగం

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం’ అంటే శరీరంలోని అన్ని ఇంద్రియాలలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. అయితే నయనం తో పాటూ, చెవులు, మనస్సు కూడా జతచేసి చూడవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఒకటి ఇటీవల జరిగింది. వంగూరి ఫౌండేషన్ వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సహకారంతో కాలిఫోర్నియా రాష్ట్ర సిలికాన్ లోయలో నిర్వహించిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు అక్టోబర్ 21-22, 2023 తేదీలలో కన్నులపండుగగా అద్భుతంగా జరిగింది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించడానికి విశేష కృషి చేస్తున్నవారు ఈ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో సరదాగా మొదలెట్టిన ఈ సాహితీ సదస్సు ప్రతీయేటా తప్పకుండా చేద్దామన్న స్థాయికి వచ్చిందంటే అందుకు కారణం తెలుగు సాహిత్యం పట్ల అటు నిర్వాహకులకు, ఇటు ఆహూతులకు ఉన్న ఆసక్తి, నిబద్ధత అని వేరే చెప్పనక్కర్లేదు.

ఈ సభకు ముఖ్య అతిధులుగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారూ, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ విచ్చేసారు. ఈ సదస్సులో తెలుగు కథా పరిణామం, ఇంటర్నెట్ మాధ్యమం-లో తెలుగు భాష, సాహిత్యమూ వంటి చర్చలూ, ప్రముఖుల ప్రసంగాలూ, స్వీయ పద్య, కవితా, కథా పఠనాలూ తదితర విషయాలతో ఉపన్యాసకులు అందరినీ ఆకట్టుకున్నారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సేవల గురించి సిలికానాంధ్ర నాయకుడు కూచిభొట్ల ఆనంద్ ఆహూతులకు వివరించారు.

సాధారణంగా సాహితీ సదస్సులంటే రెండు మూడు పదుల కుర్చీలు, అవీ ముందు వరసల్లో ఉన్నవి మాత్రమే, నిండుతాయి. దీనికి భిన్నంగా అక్టోబర్ 21-22, 2013 న జరిగిన సాహితీ సదస్సు మాత్రం ఇంతకు ముందు చెప్పిన వాక్యం తప్పని రుజువు చేసింది. రెండు రోజులపాటు మొత్తం 22 గంటల పైగా సాగిన సభకి సుమారు రెండు వందల మంది పైగా వచ్చారు. ఇది ఇటు నిర్వాహకులను, అటు వక్తలను అందర్నీ ఆశ్చర్య పరిచింది. “సాహితీ సదస్సులకి వెళ్ళాలంటే ఇష్టం ఉండాలి” అని కొందరు అంటే ఔనౌను అంటూనే ఒక చమత్కారి “ఒక్క ఇష్టమే కాదు, కాసింత  ధైర్యం కూడా ఉండాలి” అని చెణుకు విసిరిన సందర్భం నా దృష్టికి రాకుండాపోలేదు! ఈ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు హాజరైన వారితో మాట్లాడితే ఆ చమత్కారి తన అభిప్రాయం తప్పని ఒప్పుకుంటాడని నా విశ్వాసం. పలు కథా సంపుటి పుస్తకాలు, శతకం పుస్తకాలు, కవితా సంకలన పుస్తకాలు ఈ సదస్సులో ఆవిష్కరింపబడ్డాయి. ఈ సాహితీ సదస్సు లో సంప్రదాయ సాహిత్యం, ఆధునిక సాహిత్యం, సమకాలీన సాహిత్యం పై వివిధ అంశాలపై అనేక మంది వక్తలు ఉపన్యసించారు. బహు భాషా కోవిదుడు "ఆలూరి బైరాగి" రాసిన తెలుగు కవిత్వం పై ఆచార్య  యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రసంగం అద్భుతం. ఆలూరి బైరాగి: (1925-1978) ప్రముఖ కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది, అంతే కాదు పేరుకు తగ్గట్టు "విరాగి", ఆజన్మ బ్రహ్మచారి కూడా. భారతీయ జ్ఞానపీఠ్ సంస్థ వారు ఇచ్చే మూర్తిదేవి పురస్కారం గ్రహీత, తెలుగు రచయిత, సాహితీకారుడు, కవి. అతను తెలుగు పదాలకు వెలుగులద్దిన పదనిర్దేశి. ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి అయిన ఆచార్య  కొలకలూరి ఇనాక్ చేసిన "సాహిత్యం - సమాజం: పరస్పర భావాలు" ప్రసంగంలో సాహిత్య సృష్టి లో సమాజం పాత్ర ఉంటుంది, మెరుగైన సమాజానికి వికసించడానికి సరిపడ సాహిత్యాన్ని మనం సృష్టించాలి అని నొక్కి చెప్పారు. ఈ సదస్సులో ఆచార్య కొలకలూరి ఇనాక్ రచనలపై ముగ్గురు పరిశోధనాపత్రాలు సమర్పించడం, అందులో నా పత్రం "మునివాహనుడు: చతుర్ధ అంకం - ఒక పరిశీలన" కు చోటు దొరకడం నా అదృష్టం. మరో ఇద్దరు వేణు నక్షత్రం సమర్పించిన "ఇనాక్ గారి సాహిత్యం - పాఠ్యాంశాలు" పత్రం కాగా, మరో పత్రం ఆచార్య సురేంద్ర దారా సమర్పించిన "ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి తెలుగు వ్యాస పరిణామం పై అవలోకనం" పత్రం - ఈ మూడు పత్రాలు సభా విశేషసంచిక లో ప్రచురితం కావడం ముదావహం.

పలువురు ఆహుతులు ఇటువంటి సదస్సులు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులూ ఆహూతులందరికీ సిలికానాంధ్ర సంస్థ వారు ఏర్పాటు చేసిన అల్పాహారాలు, టీ, కాఫీ, భోజనాలూ, తక్కిన సదుపాయాలూ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యాభిమానులందరూ ఒక చోట చేరి వ్యక్తిగతంగా కలుసుకునేందుకు నిర్వాహకులు ఒక మంచి అవకాశాన్ని కల్పించారు అని పలువురు వ్యాఖ్యానించారు. ఘనత వహించిన తెలుగు సాహిత్యం సజీవం, ప్రస్తుత కాలంలో దాని తీరుతెన్నులను గమనించి, విశ్లేషించే ప్రయత్నాలు ఈ సదస్సు ద్వారా కొంత జరిగిందనేది నా నిశ్చితాభిప్రాయం. మాట్లాడే ప్రతివారూ మొదట్లో స్తుతులూ, వందనాలూ, అభివందనాలూ చెయ్యడం, నిర్వాహకులకి లాంఛనంగా సుదీర్ఘమైన కృతజ్ఞతలు చెప్పడం, సభికులకి పదే పదే అభివాదాలు చెయ్యడం” ఇది తెలుగువారి బలహీనత అని చెప్పక తప్పదు - కానీ ఇవేవి ఈ సదస్సులో పెద్దగా కనపడలేదు అంటే నమ్మండి. సాహిత్యం మనం సృష్టించుకున్న రెండో ప్రపంచం. రెండు రోజుల సమయంలో ఆహుతులను అద్భుతమైన ఈ రెండో ప్రపంచంలోకి తీసుకువెళ్లి మధురానుభూతులు కలిగించిన నిర్వాహకులు ఎంతగానో అభినందనీయులు.

ఈ మధ్య “డయస్పోరా సాహిత్యం” అనే మాట పత్రికల్లో, సమావేశాలలో తరచుగా వినిపిస్తోంది, ముఖ్యంగా ఉత్తర అమెరికాలో జరిగిన పలు తెలుగు సాహితీ సదస్సులలో ఈ అంశం పైన కొన్ని ప్రసంగాలు జరిగాయి కూడా. అయితే ఆ సదస్సులో వంగూరి గారు మనం పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోకుండా డయస్పోరా రచయిత అంటే ఎవరో దాని  నిర్వచనం ఏమిటో సులభంగా వివరించారు. డయస్పోరా పదం మొట్టమొదట తమ స్వదేశాన్నుంచి బహిష్కరింపబడి బలవంతంగా వేరే దేశాలకి వెళ్ళిపోవాల్సొచ్చిన యూదుల పరిస్థితిని వర్ణించడానికి సృష్టింపబడింది. ఇలా పరదేశాలకు చెల్లాచెదురైపోయిన యూదులని డయస్పోరా అన్నారు. కాలక్రమాన, ఈ పదం వాడకంలోనూ, అర్ధంలోనూ కొంత మార్పు వచ్చి, ఇప్పుడు స్వదేశాన్ని వదిలి వేరే చోట స్థిరపడినవాళ్ళందరికీ వర్తిస్తుంది - ఉదాహరణకు "ప్రవాసాంధ్రులందరికీ" - వారు రాసిన సాహిత్యం నిస్సందేహంగా “డయస్పోరా సాహిత్యం” అవుతుంది - అయితే వారి పిల్లలు అంటే విదేశాలలో పుట్టి పెరిగినవారు రాసినది “డయస్పోరా సాహిత్యం” కాదా? కాదనే చెప్పాలి - అని వంగూరి వారు బల్ల గుద్ది చెబుతున్నారు.

నన్ను ఆకట్టుకున్న కొన్ని ప్రసంగాలను ప్రస్తావించకుండా ఉండలేను. ఉదాహరణకు "కర్ణాటక సంగీతంలో తెలుగు సాహిత్యం" - ప్రసంగించినవారు కల్యాణి జి ఎస్ ఎస్. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్నీ, త్యాగరాజునీ వేరు చేసి చూడ లేరు. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఆయన చేసిన అసమానమైన కృషి అలాంటిది. కర్ణాటక సంగీతానికీ, త్యాగరాజుకీ విడదీయరాని బంధం ఉంది. శాస్త్రీయ సంగీతం లో ఉండే మాధుర్యంను చూపించి, సంగీతం అంటే ప్రజలకు మరింత ఆసక్తిని కలిగించిన త్యాగరాజు, మన తెలుగు వాడు. కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఆయన ఒకరు. త్యాగరాజు పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా, కంభం మండలంలో కాకర్ల అను గ్రామం నుండి తంజావూరు పరిసర ప్రాంతానికి (ప్రస్తుతం తమిళనాడులో భాగం) వలస వెళ్లారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత వినే ఉంటారు. ఇది నిజమే అసలైన విజయం అంటే బయట నలుగురిలో మీరు కోరుకున్న విజయం అందుకోవడం - తమిళనాట తెలుగు సాహిత్యంతో కర్ణాటక సంగీతాన్ని కూర్చడం ద్వారా త్యాగరాజు విజయం సాధించారు. త్యాగరాజు తో సహా రామదాసు, మైసూరు వాసుదేవాచార్య, మంగళంపల్లి బాల మురళీ కృష్ణ తదితరుల నుండి జాలువారిన "కర్ణాటక సంగీతంలో తెలుగు సాహిత్యం" గూర్చి కల్యాణి జి ఎస్ ఎస్ ప్రసంగించడం అభినందనీయం. కాకతాళీయంగా ఈ త్రిమూర్తుల చిత్రపటాలు కల్యాణి జి ఎస్ ఎస్ ప్రసంగించిన వేదిక పక్కన కొలువుదీరి ఉండడం విశేషం. ఈ చిత్రపటాలను అదనపు ఆకర్షణ గా పలువురు సభికులు పేర్కొన్నారు.

పత్ర సమర్పకులు పత్రం మొత్తం చదవకుండా, గీతాల మధ్యనున్న సారాన్ని చెబితే ఉపయుక్తంగా ఉంటుందని సిలికానాంధ్ర నాయకుడు కూచిభొట్ల ఆనంద్ చెప్పారు. నిర్వాహకులు అందజేసిన సభా విశేష సంచికలో మొత్తం పత్రాలు ముద్రితం అయిఉన్నాయి కనుక, తీరిగ్గా వాటిని తరువాత చదువుకోవచ్చు, కాబట్టి ఉన్న కొద్ది సమయంలో వేదికపై ప్రసంగించే సందర్భంలో “Between the lines” చెబితే బాగుంటుంది అని ఆయన అభిప్రాయం! ఇదొక మంచి సూచన.

నన్ను ఆకట్టుకున్న మరో ప్రసంగం "అద్దంలో జిన్నా" రచన - దేవరకొండ బాలగంగాధర తిలక్, ప్రసంగించినవారు "యదుకుల భూషణ్ తమ్మినేని". దేశవిభజన ప్రభావం ఉత్తరభారతంలోనే ఎక్కువని, బహుశా, దక్షిణభారతంలో దాని ధ్యాస ఎక్కువగా ఉండకపోవచ్చుననే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. కొంతవరకు అది నిజమే ఎందుకంటే "జిన్నా టవర్" పేరుతొ ఒక నిర్మాణం ఇప్పటికీ గుంటూరులో ఉంది. అదేమీ మారుమూల ఎవరూ పట్టించుకోని ప్రాంతంలో లేదు - అందరూ రోజూ తిరిగే కూడలిలో ఇప్పటికీ ఉంది. స్వాతంత్రం సిద్దించే సమయంలో ఉమ్మడి దేశం తన వైఖరి అనే తన సిద్ధాంతాన్ని జిన్నా అకస్మాత్తుగా మార్చుకొని ప్రత్యేక పాకిస్థాన్ దేశానికి జై కొట్టడం, పిదప అతని నిర్ణయం మూలంగా లక్షల మంది దేశ విభజన సమయంలో జరిగిన హింస కారణంగా మరణించడం - పాఠకులు ఈ సంఘటనల నేపధ్యాన్ని  అవగతం చేసుకొని పిదప తిలక్ చే రాయబడిన "అద్దంలో జిన్నా" రచన చదివితే అప్పుడు తిలక్ అంతరంగం, అతని భావాలు మనకు మరింత చేరువ అవుతాయని నా భావన. స్ఫూర్తినిచ్చే ప్రసంగం చేసిన  "యదుకుల భూషణ్ తమ్మినేని" ను నేను ప్రత్యక్షంగా కలిసి ఇదో సాహస ప్రయత్నంగా పేర్కొని ఆయన్ని అభినందించాను. చాలామంది చరిత్రలో జరిగిన హింస గుర్తుకుతెచ్చుకోవడానికి, చర్చించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ...

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం
నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం:
రణరక్త ప్రవాహసిక్తం
బీభత్సరస ప్రధానం.

... అని అన్నారు శ్రీశ్రీ. కానీ చరిత్రలో జరిగిన హింస గూర్చి తెలుకోకుంటే... ఉదాహరణకు... భవిష్యత్తులో హిట్లర్ కూడా సాధారణ మానవుడే, యూదుల ఊచకోత లో ఆయన ప్రమేయం పెద్దగా లేదు అని ఎవరైనా వాదిస్తే దాన్ని ఖండించే అవకాశాన్ని ఎదుటివారు కోల్పోతారు. 1940లలో హిట్లర్ ప్రత్యక్షంగా హింస కు పూనుకుంటే, జిన్నా పరోక్షంగా ఆ పని కానిచ్చేసాడా అనే అనుమానం "అద్దంలో జిన్నా" ప్రసంగం విన్నాక నాకు కలిగింది. మరో సారి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే భావితరాలు చరిత్రను ఆకళింపుచేసుకోవాలి కదా!

సదస్సు విజయవంతం కావడానికి గత రెండు మూడు నెలలుగా అవిశ్రాంతిగా వారి కార్యకర్తల బృందాలను సమన్వయం చేస్తూ తలమునకలు అయివున్న వంగూరి చిట్టెం రాజు గారు, ఆనంద్ కూచిభొట్ల గారు ఇద్దరూ అక్టోబర్ 21-22 తేదీలలో జరిగిన సదస్సుకు చివరి రోజు చివరి గంటలో - ఆహుతులను "అయ్యా ఈ సదస్సులను ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మీ వైపు నుండి ఏవైనా సూచనలు సలహాలు ఉంటే చెప్పమని" వేదిక సాక్షిగా  వినమ్రం గా అడుగుతుంటే...నాకు సాక్షాత్తు ఆ సూర్య చంద్రులు దిగి వచ్చి ఈ భూమికి “ఇంకా” మేము ఏమిచేయాలో చెప్పమని అడిగినట్లు ఉందంటే నమ్మండి!

చివరిగా... "చీకటి నీడలు" కవితలో నీడల బహురూప వర్ణన చేసిన ఆలూరి బైరాగి కవిత మీ కోసం...

"గాలిలోన మృతకాత్మల నీడలు
నేలపైన కృతకాత్మక ‌ నీడలు
ఆశయాల ఆకాశపు నీడలు
వాస్తవాలు యమపాశపు నీడలు"

సామాజిక చీకట్లకు దివిటీ పట్టిన బైరాగి రాసిన కవితా సంపుటిలో ఒక చిన్న కవిత ఇది. చరిత్రలో దాగిన యమపాశపు నీడల వంటి వాస్తవాలను తెలుసుకోవాలంటే కాసింత ధైర్యం కావాలి కదా! బైరాగి కవితల గూర్చి కొంత తెలుసుకునే అవకాశం నాకు అందించిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులకు, అలాగే ఎప్పటిలాగే సిరిమల్లె పాఠకులకు సాహిత్యాభినందనలు తెలియజేసుకుంటూ... పాఠకులందరూ కాలిఫోర్నియా రాష్ట్ర సిలికాన్ లోయలో నిర్వహించిన 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు స్పూర్తితో ఉత్తేజితులవుతారని ఆశిస్తూ... యధావిధిగా క్రింద కామెంట్ బాక్స్ లో మీ స్పందనను తప్పక తెలియజేయండి. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చిద్దాం.

-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం

********

Posted in November 2023, వ్యాసాలు

1 Comment

  1. వేణు నక్షత్రం

    అద్భుతంగా వర్ణించారు రెండు రోజుల కార్యక్రమాన్ని . మీతో పాటు ఈ సభల్లో పాల్గొనడం , ఇనాక్ గారితో చాలా సమయం గడపడం , ఇంకా ఎందరో సాహిత్యకారులని కల్సుకోవడం చాలా సంతోషం .

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!