Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ఆ సాయంత్రం విరించి ఫ్రెండ్స్ అంతా ఏటి ఒడ్డున కలిశారు. కాబోయే బావ శ్రీధర్ వడివడిగా అడుగులేస్తూ వస్తున్నాడు.

“ఒరేయ్! కవిగారొస్తున్నారు. పూల మాలలు తెమ్మంటే తెచ్చారు కాదు!”అన్నాడు అల్లరిగా చంద్రం.

“ఓర్నాయనోయ్! వాడి చేతిలో కాయితాల బొత్తి చూడరోయ్! అయిపోయామ్!” అన్నాడు వాసు.

“నేనుండన్రా! బేగెళ్లిపోవాలి. పొద్దుగాల తిన్నది అరిగినట్టు లేదు. కడుపులో గడబిడ గా ఉంది. నా వల్ల కాదురోయ్... ఆడు ఆ కయితలు అట్టుకెచ్చెస్తన్నాడు. సచ్చూరుకుంటాంరోయ్!” అని అరిచాడు! చంద్రానికి ఆన్ని యాసల్ని వాడడం ఇష్టం. అతడి మాటలకి అందరూ పడి పడి నవ్వుతున్నారు. దగ్గరికి వచ్చీ రాగానే శ్రీధర్ విరించిని గట్టిగా కౌగలించున్నాడు.

“బావా! ఎప్పుడు వచ్చేతీవు... సతుల్, సుతుల్ క్షేమమా? ... అని ఆరున్నొక్క రాగాన్ని ఎత్తుకున్నాడు చంద్రం.

“ఈ చంద్రం గాణ్ణి తన్నండి రా!” అన్నాడు శ్రీధర్.

“తంతే తన్నారు గానీ శ్రీధర్ చేతిలో కాయితాలు లాక్కుని దాచేయండ్రోయ్ బాబు!” అన్నాడు చంద్రం. అందరితో పాటు శ్రీధర్ కూడా ఫక్కుమన్నాడు.

చంద్రం ఎక్కడుంటే అక్కడ నవ్వులే నవ్వులు. రెండు మూడు గంటలపాటు అక్కడ హాస్య చతురోక్తులు, కబుర్లు, కేరింతలు కొనసాగాయి. వెళ్ళేముందు చంద్రం గుర్తు చేశాడు. మర్నాడు జరిగే నిశ్చితార్ధానికి పంతుల్ని తీసుకురావడం మరిచిపోకూడదని. నవ్వేసారందరూ!!

ఊరు ఊరంతా తరలి వచ్చేస్తున్నారు. ఆ గ్రామంలో ఎవ్వరింట్లో శుభకార్యం ఉన్నా ఊరందరికి పండగే! ఒకర్నొకరు వాటేసుకోవడం, మామా, అత్త, చిన్నాన్నా, పెదనాన్న, పిన్నమ్మా, పెద్దమ్మ అంటూ అప్యాయతలు, ఆపేక్షలు చూపించుకోవడం!

ఉత్సాహంగా, గట్టిగా మాట్లాడేసుకుంటూ, జోకులు వేసుకుంటూ చక చక పనులు చక్కబెడుతున్నారు. విరించిని పలుకరిస్తున్నారందరూ. అందరికీ బదులిస్తూ మాట్లాడుతున్న విరించి గేటు తీసుకుని వస్తున్న లావణ్యని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు.

ఆమె నడక, కదలికలు, నవ్వు చూస్తుంటే మతిపోతోందతడికి.

“ఒర్నీ! లావణ్యే!” అన్నాడు చంద్రం చేతులు నడుం మీద ఉంచుకుని.

“అబ్బో! ఇప్పుడే చూసినట్టు!” అంది లావణ్య.

“ఈ సూడ్డం వేరులే!” అన్నాడు విరించిని చూసి కన్ను కొడుతూ.

“ఏట్రా! దిష్టి పెట్టేస్తారా పి‌ల్ల కి?” అన్నాడు విరించి ఫ్రెండు సీతారాం.

“దిష్టి చుక్క ఎట్టాలనే కదా వీడి ప్లాన్?” అన్నాడు చంద్రం కన్నుకొడుతూ.

“నోర్ముయ్యరా!” అని మురిసిపోతూ చుట్టూ చూశాడు.

“నేనూ నోరుమూసుకుంటాను రా. నాకేం తెలీనట్టు. ఆనక మీ నాన్నకి తెలిస్తే నువ్వూ నోరుమూసుకుందువు గాని!” వెనక నుంచి మేనత్త సుందరి కఠినమైన మాటలు విని గాభరపడిపోయాడు విరించి.

“నేను చూసుకోలేదు రా!” చంద్రం అన్నాడు తల వంచుకుని.

“ఎప్పటికైనా తెలియాల్సిందే కదా?” అంది సుందరి కూతురు లక్ష్మి.

అక్కడే ఉన్న సత్యమూర్తి, లక్ష్మి ఇద్దరూ ఒకర్ని చూసి ఒకరు నవ్వుకున్నారు.

“అద్గదీ!” అన్నాడు చంద్రం చప్పట్లు కొట్టి అర్ధమయినట్లు తమాషాగా తలూపుతూ. కధ సుఖాంతం అయ్యేట్లు ఉందని అనుకునేలోగా విరించి మేనత్త కాస్త దూరంగా వెళ్ళి మధ్య గా నుంచుని కొంపలు మునిగిపోయెటట్టు అరుపులు మొదలెట్టింది.

‘అన్నయ్యో... అన్నయ్యా! ’ శోకాలు పెడుతూ పిలిచింది. పరుగెట్టుకు వచ్ఛాడు విరించి తండ్రి పరంధామం.

“లక్ష్మి పుట్టిన వెంటనే నీ కొడల్ని చేసుకుంటానని మాటిచ్చావ్! గుర్తుందా? ఇప్పుడు నీ కొడుకు ప్రేమలో పడ్డాడు. ఆదిశేషు కూతుర్ని చేసుకుంటాడని వాడి ఫ్రెండ్స్ ఇప్పుడే అనుకుంటున్నారు!” అంది ఏడుస్తూ.

“అమ్మా!  గొడవ చెయ్యకు! నేనెలాగు సత్యమూర్తి నే పెళ్లాడతాను!” అంది లక్ష్మి. అది విన్న సత్యమూర్తి మహదానంద పడిపోయాడు. టక్కున సత్యమూర్తి వైపు చూశాడు విరించి. ఓహ్! సత్యమూర్తి నిన్న తనతో పాటు నడుస్తూ చూపించిన పరాకుకి కారణం ఇదన్నమాట. ఏదో చెప్పాలని చెప్పలేక సతమతమయిన బాల్య స్నేహితుడు సత్యమూర్తి ని చూస్తే సరదాగా వేసింది విరించికి. తన స్నేహితుడు తన బంధువు కూడా అవడం అతడికి చాలా హాయిగా ఉందతడికి.

“నోర్ముయ్! పల్లెటూళ్ళకి ఈ డబ్బా టి‌విలు వచ్చాక మరీ పెట్రేగిపోతున్నారు ప్రేమలంటూ. కులం, గోత్రం అక్కర్లేదా?” అగ్గిమీద గుగ్గిలం అయింది సుందరి. ఒక్కసారిగా తండ్రి వైపు చూశాడు విరించి. పరంధామం మొహం పాలిపోయి ఉంది. తల్లి అతని ప్రక్కన దిగాలుగా కూర్చుని ఉంది.

వచ్చిన జనమంతా మాటాపలుకూ లేకుండా చేష్టలుదిగి నించున్నారు. ఒక్కో నిముషం భారంగా నడుస్తోంది. ఒక పక్క నిశ్చితార్ధపు ముహూర్త ఘడియలు సమీపిస్తున్నాయి. పల్లె పల్లె అంతా అతడేమంటాడా? అని కుతూహలంగా ఉన్నారు.

గతంలో కులాల కతీతంగా ఒక పెళ్లి జరిపించాడు పరంధామం. పెద్దల్ని సద్దుబాటు చేశాడు. “ప్రేమని మించినది ఏముంది?” అని అనర్గళంగా ఉపన్యాసమిచ్చి అందరి చేతా అవుననిపించాడు.

“తనదాకా వచ్చాక ఏమంటాడా!” అని ఎదురుచూస్తున్నారంతా!

కొద్ది నిముషాల్లో తేరుకున్నాడాయన!

పురోహితుడి వైపు చూస్తూ నిశ్చితార్ధపు తంతు మొదలుపెట్టమన్నాడు. లావణ్య తండ్రి రామశేషు జనాలమధ్య కనిపించకుండా కూర్చున్నాడు.

‘పరంధామం ఆ ఊరి పెద్ద. తన కూతుర్ని చేసుకునేందుకు ససేమిరా ఒప్పుకోడు.’ అనుకుంటున్నాడు సత్యమూర్తి

రామశేషు కి మతిపోయినంత పనయి అక్కడున్న గోడకి జారబడి కూర్చున్నాడు.

‘అసలీ పిల్లలేమిటి? తనలాంటి పేదవాళ్లని చిక్కుల్లో పడేస్తారు.’ అని బాధ పడిపోతున్నాడు. పరంధామం రామ శేషు వైపు చూశాడు. ఎంత సాంప్రదాయ కుటుంబమే అయినా కొన్ని అనుకోకుండా జరుగుతాయి. ప్రేమించుకున్న జంట వైపు చూశాడు. అందరూ బెరుకుతో, ఏ గొడవలు ఉండకూడదనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అంత మంది జనం ఉన్నా అక్కడ అతి నిశ్శబ్దంగా ఉంది. తాను కాదన్నా ఎవ్వరూ తనని ఎదిరించరు. కానీ లోలోపల పడే బాధ వర్ణనాతీతం. విరించి తండ్రి వైపు చూశాడు. ఆ చూపులో ఒక ప్రార్ధన ఉంది. నవ్వాడు పరంధామం కొడుకు వైపు చూసి. చంద్రం గట్టి విజిల్ కొట్టాడు. అందరిలో సందడి మొదలయింది. క్షణాల్లో విరించి, లావణ్య ల నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది.

‘మే’ నెలలో ముహూర్తాలు ఖరారయ్యాయి. విరించికి కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రి పెద్ద మనసుకి నమస్కరిస్తుంటే చాలా గంభీరంగా దగ్గరకు తీసుకున్నాడు పరంధామం! తండ్రిని విప్పారిన కళ్ళతో చూశాడు విరించి.

జనసమూహంలో తామూ ఒకరిమనే భావం కలిగితే అది ప్రజ్ఞ కి గుర్తు!!

కాలం తో పాటు మార్పుని కూడా ఆహ్వానించాడు పరంధామం!

పల్లె వాసుల్ని వారి ఉన్నతమైన సంస్కారాల్ని చూసి గర్వపడ్డాడు విరించి.

అలా కధ సుఖాంతం అయ్యాక విరించి, లావణ్యలు విశాఖపట్నం లో స్థిరపడ్డారు. సౌమ్య శ్రీధర్ తో అమెరికా వెళ్ళింది.

లావణ్యకి బ్యాంక్ లో ఉద్యోగం దొరికింది.. విరించి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కధ అంతా సుఖాంతం!

వాళ్ళ పెళ్ళయి పదేళ్ళు దాటింది... లక్ష్మినగర్ కాలనీ లోని సాగరిక అపార్ట్మెంట్స్ లో ఒకటో నెంబర్ ఫ్లాట్ లో అద్దెకి దిగారు. హర్ష, స్వాతి ఇద్దరు పిల్లలు. హర్ష మూడోతరగతి. స్వాతి ఒకటో క్లాసు.

******

లాలలా లాలాల ఆహా ఓహో!

ఫేస్ బుక్ ఆండ్ బై ధీరజ! టైమ్ పొద్దున్న తొమ్మిదిన్నర!

ఒక్క క్షణం క్రితమే ఈ బుజ్జమ్మ చున్నీ లాగిపారేసి రెండు చేతుల్తో చున్నీ రెండు చివర్లు పట్టుకుని వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా ఎగరేసింది. ఒక్క నిముషం క్రితమే భర్త మధు ఆఫీస్ కి వెళ్ళాడు. అతడిని సాగనంపుతూ లిఫ్ట్ దాకా వెళ్ళి వినయంగా నవ్వుతూ నిల్చుని, లిఫ్ట్ కిందకి వెళ్ళాక ఇంట్లోకొచ్చి తలుపుని బలంగా దఢాల్న వేసింది. సిస్టమ్ ఆన్ చేసింది.

అద్దంలో మొహం చూసుకుంది. మోడరన్ సినిమా యాక్ట్రస్ లా ఫీల్ అవుతూ పిచ్చి గెంతులు వేసింది. కోయిల కూస్తున్నట్టు ఓ కూత కూసింది. ఫేస్ బుక్ ఓపెన్. అమ్మాయి సైలెంట్. సిస్టమ్ వైపు తియ్యగా తదేకంగా చూసింది. మెసేజ్ చాట్ బాక్స్ ఓపెన్ అవగానే సుభాష్ మెసేజ్. ‘హలో మైడియర్!’ అని ఉంది. ఆమె ఒళ్ళంతా పులకరిచింది. పెదాలు విచ్చుకున్నాయి. కళ్ళు తన్మయత్వం తో మూసుకున్నాయి. గుండె వేగంగా కొట్టుకున్నాది. చేతి వేళ్లు వణికాయి. చాట్ స్టార్ట్స్ నౌ!!

“ఏయ్!” ధీరజ.

“వచ్చావా? అమ్మాయి గారికోసం వెతికి వేసారి కళ్ళు కాయలు కాచాయి.”

“హహహ!”

“నవ్వుతున్నావా? పో అస్సలు నీతో మాట్లాడను” ముత్యాల్లాంటి ప్రింట్.

“ప్లీజ్ రా!” ధీరజ సుతారంగా టైప్ చేసింది. ఆపిల్లకి గాల్లో తేలుతున్నట్టు ఉంది.

“ఏంటమ్మా మరి? పొద్దుటి నుంచి ఎదురుచూస్తున్నాను. బాస్ వచ్చి గదిమాడుకూడా! నీకోసం క్షణం క్షణం లెక్కబెట్టుకుంటున్నాను!”

“నువ్వేనా?  నేనూ అంతే!”

“ధీరూ!”

“ఊ!”

ఎన్నాళ్ళిలా?”

“ఎలా?” ఒక హగ్, ఒక లుక్, ఒక బిగికౌగిలి, ఒకే ఒక్క చిన్న ముద్దు లేకుండా?”

“నాకు మాత్రం ఇవన్నీవద్దనుకుంటున్నావా పిచ్చోడా!”

“ఇంతకీ నీ హబ్బీగాడు ఏమంటున్నాడు?”

“ఏముంది? ఎలాగైన దగ్గరగా రావాలని ట్రై చేస్తున్నాడు”

“హహహ! ధీరూ నాదని వాడికింకా తెలియదు!”

“అబ్బా! ధీరూ నీదా?”

“దేవుడు నాకోసమే ధీరజ అనే అందమైన చిన్నారిని సృష్టించాడు. ఆమె బుజ్జి బుజ్జిమాటలు, ఆ రోజ్ రోజ్ పెదాలు, ఆ చిలిపి వలపు చూపులు, చిట్టి చిలక ముద్దులు అన్నీ నాకోసమే! ఇంకా చాలా చాలా నాకోసమే!” సుభాష్ కావాలనే ఉత్తేజపరుస్తూ ఒక్కొక్క మాటని టైప్ చేసి వదిలాడు. ఆమెలో కుతూహలం బాగా పెరిగింది.

“చాలా అంటే?” అడిగింది ధీరజ. ఆపిల్ల కి ఇంకా ఇంకా పొగిడితే బాగుండునని ఉంది.

“ఓసోస్. తెలియనట్టు!” రిఫ్లై.

“నిజంగా తెలియదు!”

“నువ్వూ చాలా బాగుంటావు!”

“అబద్దాల్!”

“నో. నెవ్వర్. సుభాష్ ఒక్కసారి కూడా అబద్దం చెప్పడు. నిండుపున్నమి చంద్రుడి మీద ఒట్టు! నీ ఫోటో లోనే ఇంత అందం? నేను వర్ణిస్తే ఒక్క పరుగున వచ్చేస్తావ్!”

“చెప్పక పోయినా వస్తాను సుభా!” తమకం ఆమెలో.

“సరే కానీ ‘కేం’ ఓపెన్ చెయ్. ప్లీజ్” సుభాష్ బాణం గుర్తు వదిలాడు.

నిముషం గడిచినా నో ఆన్సర్!

“ఉన్నావా?”

“ఉన్నారా!”

“చూడాలి నిన్ను!”

మళ్ళీ మౌనం!

ఒక్కసారి చూడనివ్వమని బతిమాలాక కుదరదని తెలిసిపోయాక...

టైపింగ్. టైపింగ్. టైపింగ్. పొగడ్తల వెల్లువ. సుభాష్ మునివేళ్లు కొట్టి కొట్టి అలిసిపోతున్నాయి. ధీరజ అమ్మడు సిగ్గు సిగ్గుగా ఆన్సర్ ఇస్తూనే ఉంది. మధ్య మధ్యలో కెమెరా ఆన్ చేయమంటాడు బాబుగాడు. “పో”  అంటుంది అమ్మడు.

నాలుగు రోజులు నలభై రోజులయినా విసుగెయ్యని ప్రేమ జంట అది! యవ్వన గుబులు. ఏదో పొందెయ్యాలనే తపన! ఎందుకో ఏమిటో తెలియని ఉరుకు! ఏదనిపిస్తే అది చేసేసే బలుపు!

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in November 2023, కథలు

2 Comments

  1. విజయశ్రీముఖి

    సరోజినీదేవిగారి కలం నుండి ప్రస్తుతం ప్రేమ గాలి వీస్తోంది.
    “యవ్వనంలో ఎందుకో ఏమిటో తెలియని ఉరుకు..
    ఏది అనిపిస్తే అది చేసే బలుపు!”
    నిజమే! బాగా చెప్పారు.
    రచయిత్రికి అభినందనలు!

  2. M.వెంకటరమణ

    బులుసు సరోజినీ దేవి గారు మంచి సామాజిక స్పృహతో రచనలు చేయడంలో పేరెన్నికగల వారు.
    గ్రామీణ వాతావరణం పట్ల ఎంతో అవగాహనతో రచనలు చేయడం వారి ప్రత్యేకత. జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు రావలసిఉంది.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!