Menu Close
Bulusu-Sarojini-Devi
గాలి (ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

మసక వీడని వేకువ!

ఏదో కొత్తదనం!

చల్లని గాలి ఉండుండి చెంపల్ని సుతారంగా తాకుతోంది.

సన్నటి మట్టి రోడ్డుమీద నెమ్మదిగా నడుస్తున్నాడు విరించి!

రోడ్డు పక్క పొలాలు పచ్చగా నిగనిగ లాడుతున్నాయి. అతడికి కొద్దిదూరం లో ఎద్దులబండి గంట మోగిస్తూ పెళ్లినడక కొనసాగిస్తోంది. మింటిలో చుక్కలు ఇంకా మిలమిలలాడుతూనే ఉన్నాయ. గాలి ఒక్కసారిగా బలంగా వీచి విరించి మెడలో ఉన్న స్కార్ఫ్ అంతెత్తున లేచి మళ్ళీ వాల్తూ మొహాన్ని కప్పింది. దాన్ని చేత్తో లాగి మెడ చుట్టూ గట్టిగా బిగించాడు. రంగు రంగుల దుస్తుల్లో ఉన్న పల్లె పడుచులు తలమీద గంపల్తో వరుసగా చకచకా కదులుతున్నారు.

“ఓయ్ జాబిల్లీ! అదుగో మన దొరకొడుకు!” అరిచింది ఆహ్వానం లా ఒకామె.

వరుస సాగిపోతూనే ఉంది. ఆ క్రమంలో సమీపంగా వచ్చిన ఒక పడుచు

“బాగున్నవా?” అడిగింది ఆగకుండానే. తలూపాడు.

”ఉంటవా?” అంది.

”నెల్రోజులు!” అన్నాడు.

“పరీచ్చలు కి చదువుకోడానికా?” ఇంకో యువతి అడిగింది.

“ఈడ సల్లంగుంటుందని” అన్నాడు వాళ్ళయాసలోనే.

“ఈ ఊరి పిల్లనే నచ్చుకో మరి!” అంది ఇంకో పడుచు పరాచిక మాడుతూ.

“ఎహే! ఊకొయే! ఎల్లెళ్ళు పిలగాడా! మీ ఇంటి ముంగిలికేల్లే వచ్చినం. మీ సెల్లెమ్మ కల్లాపి జల్లుతుంది!” అంది.. ఏకరేఖలా సాగుతున్న వాళ్లందర్నీ చివరికంటా చూసి ఆకాశం వైపు దృస్తి సారించాడు.

మనిషి ప్రకృతి లో ఒక భాగం. వసంతం లా చిగురిస్తూనే ఉంటాడు.

సూరీడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. తూర్పు ఎరుపు శోభాయమానంగా ఉంది. క్షణానికో సౌందర్యం దర్శన మిస్తోంది తొలి కిరణాలు ఏటవాలుగా దూసుకొచ్చి వెలుగుల్ని విరజిమ్ముతున్నాయి. సంభ్రమంగా చుట్టూ చూశాడు. పచ్చని పైరు కళ్ళకి ఆహ్లాదాన్నిస్తోంది. చెరుకు చెట్లు నాటుతున్నట్టున్నారు. సన్నగా ‘హమ్’ప్రారంభమైంది. కనుచూపు మేరల్లో పొలాల్లో ఏదో ఒక పని చేసే రైతులూ, కూలీలు కనిపిస్తున్నారు.

చిన్నప్పటి సావాసగాడు చంద్రం భుజం మీద కర్రని ‘గద’లా ఊహించుకుని కాబోలు వీరుడిలా అడుగులు వేస్తున్నాడు. పొలాని కెళ్తున్నట్టున్నాడు. హుషారుగా –

“చందూ!” అని కేకేసాడు విరించి. ఒక్క పిలుపుకే గభాల్న వెనక్కి తిరిగి ‘ఓరినువ్వా?’ అని పరుగెట్టుకుంటూ వచ్చాడు. గట్టిగా ఉడుం పట్టులా కౌగలించుకున్నాడు.

“నీ ఎనక సూడు ఎవురున్నారో?” అన్నాడు ఉత్సాహంగా. విరించి వెనక్కి తిరిగేలోగా ఎవరో కళ్ళు నొప్పి పుట్టేలా మూసేశాడు. ఎవరబ్బా?

“రేయ్! నువ్వెవరో గానీ వదల్రా బాబూ!” గింజుకున్నాడు.

“ఓసోస్!  పట్నం నాజూకు!” పకాల్న నవ్వేస్తూ ముందుకి వచ్చాడు పంతులు గారి అబ్బాయి సత్యమూర్తి. ఒకర్ని చూసి మరొకరు నవ్వుకున్నారు.

“ఈ గాలీ...ఈ నేలా...ఈ ఊరు...సెలయేరూ... పాట అందుకున్నాడు చంద్రం. మంచి పాటగాడు అతడు.

“పట్నపోడ్రా వీడు!” అన్నాడు సత్యమూర్తి చంద్రం తో! తమాషాగా ఎత్తిపొడుస్తూ.

“పోరా! అట్టనకు. మనం ఈడే ఉండిపోయాం. ఈడు సదువుకునేందుకు పట్నం పోయిండు. కానొరే! ఏమాట కామాటే సేప్పుకోవాలి. ఈడే మాత్రం మార్నెదురా!” అన్నాడు చంద్రం.

“సీటికీ మాటికీ మారిపోయేటోళ్ళు ఉన్నోర్నిఎతుక్కుంటూ ఎందుకొస్తార్రా?” అన్నాడు సత్యమూర్తి.

“సర్నే గానీ సెరుకు నాటాల్రా! మా అయ్య సీకట్నేపోయిండు. సందేళ కలుద్దాం!” అంటూనే పొలం దారి పట్టాడు. ఆ క్రమశిక్షణ చాలా నచ్చుతుంది విరించికి. పనులు పూర్తయ్యాకే ఏదైనా. వెళ్తున్న చంద్రం వెనక్కి తిరిగి

“ఓరి విరించి! ఎల్లి సుబ్బరంగా పడుకో. శ్రీధర్ గాడు వచ్చాడు నిన్న. కలవమాక! నా మాటినుకో! ఇనకంట కలిసినావో... అయిపోనావే! మనోడు కయిత్వం రాస్తాన్నాడంట! ఒకటే పలవరింతలు. సెప్పిందే మళ్ళీ మళ్ళీ సెప్తుండు. సెలీ సెలీ అంటున్నాడు తెగ. పెమజొరం వచ్చేసినాది బుడ్డొడికి. ఎల్లమాక. దొరికిపోతావ్!” చేతిలో కర్ర కింద పడేసి పడీపడీ నవ్వాడు.

సత్యమూర్తి ఫక్కున నవ్వాడు చంద్రం చెప్పే తీరుకి. శృతి కలిపేశాడు విరించి.

“ఎంత సరదా మనుషులు? ఎక్కడా సీరీస్నెస్, జెలసీ, ఈర్ష్య, ఫోజు, తెంపరితనం మచ్చుకైనా ఉండవు. ఎలా ఉంటారిలా? ఇంతస్వచ్ఛంగా! అనుకున్నాడు.

మనసు చదివినట్టు నవ్వాడు సత్యమూర్తి.

“మనం! మన ఊరురా!” అన్నాడు. మిగతా సగం దూరం మౌనంగా నే సాగింది. సత్యమూర్తి పరాగ్గానే ఉండడం గమనించాడు విరించి. ఒకటికి రెండుసార్లు ఒక్కో మాటనే మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటుంటే –

“ఏంట్రా సంగతి?” అన్నాడు విరించి.

“అబ్బే! ఏముంటుంది? సరే! మా వీధి వచ్చేసింది. ఈవినింగ్ కలుస్తా!” అని వెళ్ళిపోయాడు. విరించి తమ వీధిలోకి అడుగుపెట్టాడు.

******

ఐదువందల గడప ఉన్న పల్లె అది. అంతా ఒకటే మాట మీద ఉండే అద్భుతమైన కట్టడి. కాలాలు మారుతూ ఎవరికి వారే యమునా తీరే అనే ఈ కాలంలో కూడా “ఒకే అందరం!” అనే నినాదంతో ‘ప్రగతిని’ సాధించి అవార్డు కొట్టేసిన “బంగారు పల్లె” అది!!

వీధి మొగలులో నిలబడి చూశాడు. ప్రతి ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి ఆకాశం పైన నక్షత్రాల్ని చుక్కలుగా చేసి ఒడుపుగా ఒకదానికొకటి కలిపేసిన ముగ్గులు! వరిపిండిని ముగ్గుతో జత చేయడం వల్ల మెరిసిపోతున్నాయి. మేఘాలు గుంపులు గుంపులు గా ప్రయాణిస్తున్నాయి. అవి అడ్డు వచ్చినప్పుడు వెలుగు నీడలు ఎండొచ్చి, పోయినప్పుడు దాగుడుమూతలు ఆడుతున్నట్టు ఉన్నాయి! తమ ఇంటికి నాలుగిళ్ళముందు అతడి కాళ్ళు ఆగిపోయాయి. అది ఆదిశేషు గారి ఇల్లు. అతనో మోతుబరి రైతు. అందాల రాశి లావణ్య అతని కూతురే. విరించి చిన్నప్పటి నెచ్చెలి. వారిద్దరికీ ఈ నాటికి చెక్కుచెదరని స్నేహం. లావణ్య బాంక్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడానికి ఒకసారి పట్నం వచ్చి, ఒక షాపింగ్ మాల్ లో కనపడి, చమక్కుమంటే అప్పటినుంచి గుండె ఎక్కువ కొట్టుకుంటున్నట్టు ఉంది విరించికి.

ఆ తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే మూడు నెలల క్రితం ఆ పిల్లని చూడకుండా ఉండలేక వచ్చినప్పుడు ఆమె లోనూ ఒక మార్పు. ఎప్పుడూ “విరించీ” అని తెగ వాగే లావణ్య - హటాత్తుగా మాట్లాడడం ఆపేసి ఓరచూపుల్తో, మత్తెక్కిన కళ్ళతో చూస్తుంటే తెలిసింది ఇద్దరూ ప్రేమలో పడ్డారని. ఆ తర్వాత తను వెళ్ళిపోతుంటే ఆ కళ్ళల్లో కనిపించిన బాధ ఇప్పటికీ వెంటాడుతోంది!

ఆ రోజు విరించి తను వస్తున్నాడని మెసేజ్ ఇచ్చాడు లావణ్యకీ. అప్పటి నుంచి క్షణం ఒక దగ్గర ఆగలేదు ఆమె. ఎప్పుడొచ్చేది తెలియదు. కానీ ఇప్పుడో, ఇంకొంత సేపటికో రానే వస్తాడు. కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి, వీధిలోకి తిరుగుతూనే ఉంది.

అప్పటికే ఇంటికీ, బయిటికీ గిరగిరా తిరిగిన లావణ్య ఈ సారి మూడు నిముషాలు అద్దం ముందు కూర్చుని బయటకు వచ్చి విరించిని చూసి తడబడి లోపలికి పారిపోయి మళ్ళీ మనసు ఆగక వెనక్కొచ్చి వెక్కిరించి పారిపోయింది. కళ్ళముందు ఒక్క మెరుపులా మెరిసిన ఆమె చూపు విరించి పెదవుల మీదకి చేరుకుంది!

ఆ హాయిలోనే ఇల్లు  చేరుకున్నాడు.

ఇంట్లో అడుగు పెట్టగానే ఏదో కొత్త సందడి కనిపించింది. ఇల్లంతా పూల అలంకరణతో అలంకరించబడి ఉంది. ముందుగా పంచెకట్టుతో తండ్రి కనపడ్డాడు.

“రారా!” అని ఆనందం తో అంటూ.

“ఇదుగో!  వీడొచ్చాడు!” అని తల్లిని పిలిచాడు.

“ఎవర్నీ మీరు పిలిచింది? గోడనా? నన్నా? నాకోపేరుంది కదా?” అంటూ వచ్చింది తల్లి. ఆమె కొత్త చీరలో కళకళలాడుతోంది. మొహం లో ఆనందపు పొంగు. లోపల్నుంచి చెంగున లేడిపిల్ల ఒకటి దూకి అన్న విరించి సూట్కేసు ని లోపలికి తీసుకువెళ్తునప్పుడు గమనించాడు చెల్లి సౌమ్యని. కెంపురంగు పావడా, తెల్లని ఒణీలో శ్రద్దతో తీర్చిదిద్దిన బొమ్మలా తీరుగా ఉంది. అందరూ ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఈలోగా తండ్రి అన్నాడు –

“స్నానంచేసి చప్పున వచ్చేయ్ రా! ముఖ్యమైన సంగతి చెప్పాలి. ముఖాముఖీ చెబ్దామని అప్పటికప్పుడు రమ్మన్నా. త్వరగా రా. గుడికెళ్తూ మాట్లాడుకుందాం!” అని తొందర పెట్టాడు.

ఫ్రెష్ అయ్యాక తెలిసింది తన ఫ్రెండ్ శ్రీధర్ కి సౌమ్యని ఇస్తున్నారని. మర్నాడే నిశ్చయ తాంబూలాలని. చందు గాడి నవ్వు గుర్తొచ్చి తన ఆప్తమిత్రుడే తనకి కాబోయే బావ! అని తెగ సంతోష పడిపోయాడు విరించి. వాడు ఈ ఇంటి అల్లుడా?

“ముందే చెప్తే ఈ సంతోషం మాకు కనిపించేదా?” అని వినిపించిన వైపు చూశాడు.

‘సౌమ్య!’. దాని మొహం వెలిగిపోతోంది.

“ఎందుకే నాకు చెప్పకుండా ఇప్పటిదాకా ఎందుకు దాచారు?” అన్నాడు ఉక్రోషంగా.

“నీ ఫ్రెండ్ ని అడుగు!” అంది తిక్కగా.

“నువ్వే చెప్పొచ్చుగా?” బతిమాలినట్టు అడిగాడు.

“ఏముంది? నీ ఫ్రెండ్ రోజుకో ఉత్తరం రాసి దాన్ని రాకెట్ లా చేసి పెరట్లోకి విసిరేవాడు. ఓ సారి ఆ టైమ్ కి నాన్న శంభుగాణ్ణి పెరట్లోకి పంపాడు ఏదో పనిమీద. రామబంటు కదా? వాడు చాలా శ్రద్దగా ఆ రాకెట్ ని నాన్నచేతిలో పెట్టాడు. ఇదుగో! ఈ మొత్తం బైండు బుక్కూ రాకెట్లదే!” అని ఓ పుస్తకం చూపించింది.

“బాబోయ్! నాకొద్దు!” అన్నాడు భయం నటిస్తూ.

“పోనీ ఇది కావాలా?” అంది ఒక యెల్లో కవర్ చూపిస్తూ.

“ఏంటవి?” అన్నాడు సందేహంగా చూస్తూ.

“లావణ్య అని నా ఫ్రెండ్ ఉందిలే. ఆ పిల్ల కొచ్చిన ప్రేమలేఖలు!” అంది అటూయిటూ ఊపుతూ. చాలా గాభరాగా _

“ఇవెక్కడివే నీకు?” అడిగాడు.

‘అబ్బా చెప్తారు... అని, నాన్నా నాన్నా! అని అరిచింది చేత్తో కవర్ని ఊపుతూ.

‘నీకు మంచి గిఫ్ట్ తెచ్చానే లంఖిణీ!’ అన్నాడు. అంతే!

“అలా దారికి రా!” అంది సౌమ్య అన్న చేతిలో ఆ కవర్ ఉంచుతూ.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu-Sarojini-Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in October 2023, కథలు

3 Comments

  1. Sudha chitta

    చాలా బాగుంది కథ..పల్లెటూరి ప్రకృతి వర్ణన అత్యంత రమణీయంగా వుంది. ముందు ముందు కథ ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాను.

  2. విజయశ్రీముఖి .

    సరోజినీదేవి గారు!
    మీ *గాలి* కొత్తగా బావుంది.
    అభినందనలు!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!