Menu Close
Lalitha-Sahasranamam-PR page title

చతుర్దశ అధ్యాయం (చతుష్షష్టి యోగినీ వివరములు)

శ్లోకాలు: 110/2-120, సహస్రనామాలు: 535-600

559. ఓం తాంబూలపూరిత ముఖ్యై నమః

సుగంధ పరిమళోపేతమైన పచ్చకర్పూర మిశ్రిత తాంబూల పూరిత ముఖము కల మాతకు వందనాలు.


560. ఓం దాడిమీకుసుమప్రభాయై నమః

దానిమ్మ పూవువంటి అరుణారుణ శోభలతో భాసిల్లు లలితా మాతకు ప్రణామాలు.


561. ఓం మృగాక్ష్యై నమః

లేడి కన్నులవంటి సుందర విశాల నేత్రాలుకల మాతకు వందనాలు.


562. ఓం మోహిన్యై నమః

యావద్విశ్వాన్నీ మోహింపజేయునట్టి మోహినీమూర్తికి ప్రణామాలు.


563. ఓం ముఖ్యాయై నమః

మానవమాత్రుని కననేల ప్రాణి మాతృకలకు జననికన్న ముఖ్యులెవరుంటారు? అట్టి ‘ముఖ్య’కు వందనాలు.


564. ఓం మృడాన్యై నమః

మృడుడనగా శివుడు. అట్టి మృడుని ప్రియసతియైన మృడానీ దేవికి వందనాలు.


565. ఓం మిత్రరూపిణ్యై నమః

ద్వాదశాదిత్యులలో మిత్రనామమొకటి ఉంది. జీవకోటికి భాస్కరునికన్న మిత్రులులేరు. అట్టి మిత్ర స్వరూపిణికి వందనాలు.


566. ఓం నిత్యతృప్తాయై నమః

సర్వకాల సర్వావస్థలయందు తృప్తి కలిగియుండు మాతకు వందనాలు.


567. ఓం భక్తనిధయే నమః

భక్తజనులందరికీ ‘నిధి’వంటి మాతకు ప్రణామాలు.


568. ఓం నియంత్ర్యై నమః

సర్వులనూ నియంత్రణలో--అంటే అధీనంలో ఉంచుకొని శాసించునట్టి మాతకు ప్రణామాలు.


569. ఓం నిఖిలేశ్వర్యై నమః

నిఖిలమైన-అంటే సమస్తమైన విశ్వాలకూ అధీశ్వరియైన దేవికి వందనాలు.


570. ఓం మైత్ర్యాదివాసనాలభ్యాయై నమః

వాసనలు చతుర్విధాలు. 1.మైత్రి 2.కరుణ 3.ముదిత 4.ఉపేక్ష - వీటిచే ప్రసన్నురాలగునట్టి.. లభించునట్టి మాతకు ప్రణామాలు.


571. ఓం మహాప్రళయ సాక్షిణ్యై నమః

మహాప్రళయ వేళలో కూడ సాక్షిణిగా ఉండునట్టి మహాశక్తికి వందనాలు.


572. ఓం పరాశక్త్యై నమః

పరాశక్తి స్వరూపిణికి వందనాలు.


573. ఓం పరానిష్ఠాయై నమః

బ్రహ్మజ్ఞాననిష్ఠా స్వరూపిణికి వందనాలు.


574. ఓం ప్రజ్ఞాన ఘనరూపిణ్యై నమః

భిన్న వృత్తిలేనిబుద్ధికి ప్రజ్ఞానఘనమని నామము. అట్టి స్వరూపముగా దేవికి వందనాలు.


575. ఓం మాధ్వీపానాలసాయై నమః

పుష్పా ద్రాక్షాసవాదిమధువును పానంచేసి అలసయైయున్న దేవికి వందనాలు.


576. ఓం మత్తాయై నమః

మదమత్త స్వరూపిణియైన శక్తికి ప్రణామాలు.


577. ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః

‘అ’ కారాదని ‘క్ష’ కారాంతంగాగల మాతృకావర్ణాలే స్వరూపంగాగల లలితాపరమేశ్వరికి వందనాలు.


578. ఓం మహాకైలాస నిలయాయై నమః

మహోన్నతమైన, మహోత్కృష్టమైన కైలాసపర్వత శిఖరమే నిలయస్థానంగా కల దేవికి వందనాలు.


579. ఓం మృణాళమృదుదోర్లతాయై నమః

మృదువైన లత, తామరతూడులవంటి కోమలభుజాలు కల తల్లికి వందనాలు.


580. ఓం మహనీయాయై నమః

మహాత్ములుచే సైతం పూజింపబడునట్టి మహనీయమూర్తికి నమోవాకాలు.


581. ఓం దయామూర్త్యై నమః

దయయే స్వరూపంగా గల కరుణా స్వరూపిణికి వందనాలు.


582. ఓం మహాసామ్రాజ్యశాలిన్యై నమః

కైలాసాధిపత్యానికి ‘మహాసామ్రాజ్య’మని అర్ధముంది. అట్టి మహాసామ్రాజ్యంతో తేజరిల్లునట్టి మహాదేవికి వందనాలు.

----సశేషం----

Posted in October 2023, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!