Menu Close
C-Vasundhara Photo
తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు
డా.సి.వసుంధర

శ్రీనాథుని రచనలు-అనువాద విధానం, శైలి, భాషాదులు

శ్రీనాథుని కి అష్ట భాషా పాండిత్యం, అపారమైన కవితా శక్తి రెండూ కలిసి ఆయన రచనలను కొందరు మెచ్చుకొన్నా, సాటి కవులు, పండితులు సామాన్య ప్రజలు విమర్శించడం, ఆయనను తెలుగు అనువాదకుడుగా గుర్తించక రాజమహేంద్రవరంలో శ్రీనాథునికి సరియైన ఆదరణ లభించలేదు. కానీ శ్రీనాథుడు చక్కని తెలుగులో వ్రాయగలడని ఈ క్రింది విషయాలు వెల్లడిస్తున్నాయి అని ఆరుద్ర ఈ సందర్భంగా కొన్ని అనువాద పద్యాలను శృంగార నైషధం లో నుండి చూపించారు. అవి-

నీ కంటికి పేలగింజయుం బెద్దదయ్యనే (1-110), ముదిసి ముప్పున పెళ్లి (4-129), ఆవగింజలు తాటికాయలుగా వాడి దొడ్డ సేయుడు మొదలైనవి. శ్రీనాథుని అనువాద సంపదకు గీటురాళ్ళు. పద్యానువాదంలో తెలుగు భాష (శ్రీనాథునిది) కవిత్రయాన్ని తలపిస్తున్నది.

నలుడు హంసను పట్టుకొంటాడు. అప్పుడు హంస నలునితో తన బాధను, అవస్థను విన్నవించుకునే మూల శ్లోకాన్ని శ్రీనాథుడు ఎంత చక్కని నుడికారంతో భావప్రకటనతో అనువదించాడో గమనించి యుంటే ఆ కవులు, పండితులు నోరెత్తవలసిన పనిలేదు. కేవలం అది వారి అసూయ మాత్రమే.

ఇంతటి తెలుగు భాషలోకి అనువాదం చెయ్యగలిగిన శ్రీనాథుడు తెలుగువారి అదృష్టఫలం. భట్టుమూర్తి చెప్పినట్లు “ఏరీతిన రచియించిన సమకాలికులు మెచ్చరు గదా!” ఈ విషయాన్ని గూర్చి చెబుతూ ఆరుద్ర అన్న మాటలు గమనించదగ్గవి. –

“ఇంత చక్కటి తెనుగులో అనువదించగల నేర్పున్నా శ్రీనాథుడు ఆరభటీ వృత్తిలో చెప్పిన సమాస భూయిష్టమైన రచనలే నాటికీ నేటికీ పేరుకెక్కడం తప్పనిసరి అయింది. నిజానికి ఆరభటీ వృత్తి అతనికి, ఆంధ్రులకు ఇష్టమేమో! శ్రీనాథుని ఒరవడి దిద్దని అనంతర కవి అరుదు. శ్రీనాథుని సీసాలు చరిత్ర ప్రసిద్ధములు. (స.ఆం.సా. పేజీ 714).

శృంగార నైషధ అనువాద విధానాన్ని, దాని అవస్థలను వివరించిన ఆరుద్ర, నైషధ కథా విధాన వివరణ జోలికి పోలేదు. అది నలదమయంతుల కథ. శ్రీనాథుని రచన చదివి (అనువాదాన్ని) ఆనందించాల్సిందే. కావ్యాన్ని గూర్చి గాని, శృంగార నైషధ కథా విశేషాలు గాని ఆరుద్ర పెద్దగా చర్చించలేదు. అది ఇక్కడ అసాధ్యమని భావించి ఉండవచ్చు.

క్రీడాభిరామం

రాజమహేంద్రవరంలో పండితుల హేళనలు, ఎత్తి పొడుపులు తట్టుకోలేని శ్రీనాథుడు ఈ విధంగా నిశ్చయించుకొన్నాడు.

నికటమున నుండి శ్రుతిపుట నిష్టురముగ
నడరి కాకులు బిట్టు పెద్ద రచినప్పు
డుడిగి రాయంచ యూరకయుంట లెస్స
సైపరాదేని నెందైన జనుట యొప్పు  (భీమ -1-14)

ఈ విధంగా నిశ్చయించుకొన్న శ్రీనాథుడు విజయనగరానికి బయలుదేరి మధ్యలో మోపూరులో వినుకొండ వల్లభరాయుని కలుసుకొన్నాడు. ఈ రాయడు విజయనగర రాజులకు ఆప్తుడు. అందుకే శ్రీనాథుడు అతనితో స్నేహం చేశాడు.

అప్పటికే వల్లభరాయుడు “క్రీడాభిరామం” అనే నాటకాన్ని వ్రాస్తున్నాడు. క్రీడాభిరామం సంస్కృతంలో రావిపాటి తిప్పన వ్రాసిన ప్రేమాభిరామం అన్న కావ్యానుసరణము.

క్రీడాభిరామం నిజానికి రచించింది వల్లభరాయుడా లేక శ్రీనాథుడా అని అటు తర్వాత వచ్చిన ప్రశ్న. శ్రీనాథుడు కొన్ని పద్యాలలో వల్లభరాయుని మెప్పించి ఆయన అండ చేరాడు. ఇక ఈ క్రీడాభిరామం కర్తృత్వ విషయం గూర్చి ఆరుద్ర వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తీర్పును గూర్చి తన గ్రంథంలో వివరించారు. అది –

గద్యలో కవి పేరు ఎలా ఉన్నా ఈ కావ్యాన్ని శ్రీనాథుడు వ్రాసాడని అందులోని బోలెడు పద్యాలను, పదబంధాలను అతని ఇతర కావ్యాలలోని పద్యాలతో పదాలతో తైపారు వేసి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఋజువు చేశారు. (స.ఆం.సా. పేజీ 716)

గద్యలో “ఇది శ్రీమన్మహామంత్రి తిప్పయామాత్య నందన....వల్లభరాయాకృతం.” అని ఉంది. కాబట్టి క్రీడాభిరామం వ్రాసింది శ్రీనాథుడేనని అందరూ అంగీకరించారు.

మోపూరులో భైరవస్వామి తిరునాళ్ళలో ఈ నాటకం ప్రదర్శింప బడిందని మహాకవి శ్రీనాథుడు అద్భుతంగా పద్యాలు రాయడం వల్ల జనాకర్షణ, జనాదరణ కలిగిందని చెప్తూ ఆరుద్ర ఈ గ్రంథం ప్రతి సాహితీపరుని ఇంట గ్రంథాలయంలో చోటు సంపాదించుకొన్నదని చెప్పారు. అంతేగాక ఆరుద్ర ఇలా అన్నారు.

“శ్రీకృష్ణ దేవరాయల వారు దీనిని చక్కగా చదువుకొన్నారు. దేశ భాషలందు తెలుసు లెస్స అనే వాక్యాన్ని రాయలవారు క్రీడాభిరామం నుండే గ్రహించారు” అని వివరించారు. (స.ఆం.సా. పేజీ 717)

అప్పకవి మొ|| వారు క్రీడాభిరామం నుండి ఉదాహరణలు తీసుకొన్నారు. ఈ కావ్యం లాక్షణీకులకే గాక సాంఘీక చరిత్రకారులకు కూడా ఎంతో ఉపయోగకరం. ఓరుగల్లు ఆ రోజులలో ఎలా ఉండేదో ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణింపబడినది. మాచల్దేవి కొత్తగా కట్టించుకొన్న చిత్రశాల, మిద్దెలు ప్రతీదీ ఇది చరిత్రను భద్రపరిచింది. ప్రతి పుట లోనూ శ్రీనాథుని ముద్ర స్పష్టంగా కనపడుతుందన్నారు ఆరుద్ర. మొత్తం మీద క్రీడాభిరామం వల్ల ఆనాటి సాంఘీక విషయాలు, స్త్రీల వేషధారణ, మొదలైనవి ఎన్నో భద్రపరచబడ్డాయి.

శ్రీనాథుడు తానూ వ్రాసిన గ్రంథమైనా వల్లభరాయని పేర చలామణి కావడం వల్ల ఏమీ బాధపడలేదు. శ్రీనాథునికి విజయనగర రాజుల ఆస్థానంలో చోటు దొరకడానికి వల్లభరాయని పరిచయమే ప్రధానమైన విషయం. అది నెరవేరింది. కనకాభిషేకం, కవి సార్వభౌముడనే బిరుదు శ్రీనాథుని వరించాయి. ఈ విజయనగర సామ్రాజ్యంలో ఈ విధంగా క్రీడాభిరామం రచన శ్రీనాథుని చేత రచింప బడింది.

కాశీఖండం

విజయనగరంలో విజయ దుందుభి మ్రోగించి అక్కడినుండి పద్మనాయక రాజ్యాలు రాచకొండ, దేవరకొండ లకు వెళ్లి వారిని మెప్పించి వారి వద్ద నున్న రెడ్డిరాజుల కఠారిని (వీర ఖడ్గం) తీసుకొని అక్కడినుండి రెడ్డిరాజులు పాలిస్తున్న రాజమహేంద్రవరం చేరి వారి ఖడ్గం వారికి సమర్పించి వారి మన్ననలు పొందాడు శ్రీనాథుడు. అప్పుడు అల్లాడ వేమారెడ్డి శ్రీనాథుని సాదరంగా ఆహ్వానించి తన తమ్ముడైన అల్లాడ వీరభద్రా రెడ్డి పేర కాశీఖండాన్ని రచింపుడని శ్రీనాథుణ్ణి కోరాడు. ఆయన కోరికపై శ్రీనాథుడు గౌతమీ తటంలో రాజమహేంద్రవరంలో కాశీఖండాన్ని జయప్రదంగా పూర్తి చేశాడు.

ఈ కాశీఖండం ఏడు ఆశ్వాసాల మహా గ్రంథం. ఈ కథలో అగస్త్యుల వారు, వ్యాసుల వారు కాశీని వదలి వెళ్ళడం కావ్యం ఆద్యంతాలలో ఉంది. మధ్యలో వివిధ లోకాల వృత్తాంతాలు, కాశీ వర్ణన, సాముద్రికం, యోగశాస్త్రం, మంత్ర శాస్త్రం కూడా ఉన్నాయి.

**** సశేషం ****

Posted in October 2023, సమీక్షలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!