Menu Close
Abhiram Adoni
భళా సదాశివా..
అభిరామ్ ఆదోని (సదాశివ)

నేనంటే ఎంత ప్రేమో
కష్టాలను ఇచ్చి మరి...
నన్ను తీర్చిదిద్దుతున్నావు
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నువ్వంటే ఎంత ప్రేమో...
సంతోషాలు సమస్యలు ఎన్ని  ఉన్న సరే
నిన్నే అన్నింటిలో చూసుకొని పులకించిపోతున్నా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

శివయ్యా...
నువ్వు ఎవరయ్యా...
నేను ఎవరయ్యా...
నువ్వు నేను ఏమైనా ఒకే తల్లికి పుట్టామా...
లేదు శివయ్యా ఒకే ప్రకృతిలో కలిశాం...
పేగుబంధం కన్నా బలంగా కౌగిలించుకున్నాం...
మరణం కూడా మనల్ని వేరుచేయని బూడిదయ్యా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

లోకులు కాకులు
నువ్వు ఉండేది కాట్లో అనుకుంటున్నారు
నువ్వు ఉండేది నా గుండె గూట్లో...
నేను ఉండేది నీ తత్వజ్ఞాన ఏట్లో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నీకెన్ని పేర్లో...
నీకెన్ని రూపాలో...
నీకెన్ని క్షేత్రాలో...
నీకెన్ని పూజలో...
నీకెన్ని ఉంటే ఏమయ్యా...
అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని అన్నట్లు...
నువ్వు ఉండేది కాట్లో...
నేనుండేది నీ తపనా గూట్లో...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

శివా...
నేను సోది...
నువ్వు రాసేది బూది...
ఇక్కడ శాశ్వతం ఏది...
నీ ఆటే అది...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నేను కనిపించే అబద్ధం...
నువ్వు కనిపించని నిజం...
కదిలే కాలంలో కనిపించేది కనిపించనిది నీ ఆటకు అంకితం...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

నేనో మట్టిబొమ్మను
వందేళ్ళకే కరిగిపోతాను...
నువ్వు ఏ బొమ్మవో
యుగాలుగా జగాలను ఏలుతున్నవు...
దేనికి కరగని కఠినుడవై...
అన్నింటికి కరిగిపోయి అరిగిపోయే గొప్పదనం నాకిస్తివా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

శివా...
నీవే నా బంధువు...
నేనే నిన్ను అర్థం చేసుకోలేని రాబంధువు...
బ్రతుకు బడిలో బంధువులను..,రాబంధువులను..,
అందరినీ చావు విందుతో చల్లబరుస్తావా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

బ్రతుకే పెద్ద పరీక్ష...
బ్రతకడమే పెద్ద శిక్ష...
భక్తి నువ్వు పెట్టిన భిక్ష...
నీ స్మరణే సంస్కారం నేర్పే పెద్దబాల శిక్ష...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...

... సశేషం ....

Posted in October 2023, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!